భారీగా పడిపోయిన ఇంధన డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన డిమాండ్ భారీగా పడిపోయింది. 14 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయిలకు ఈ డిమాండ్ క్షీణించి, ఆగస్టు నెలలో 6.1 శాతాన్ని నమోదుచేసింది. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించడంతతో, డీజిల్, గ్యాసోలిన్ డిమాండ్ భారీగా క్షీణించింది. దేశంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆయిల్ కన్జ్యూమర్‌గా పేరున్న భారత్ ఈ ఆగస్టు నెలలో 15.75 మిలియన్ టన్నులను మాత్రమే వినియోగించుకుంది. గతేడాది ఇదే నెలలో 16.78 మిలియన్ టన్నులుగా ఉందని ఆయిల్ మంత్రిత్వశాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పేర్కొంది. 2003 ఏప్రిల్ నుంచి ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు.
ఈ ఏడాదిలో ఇంధన డిమాండ్ పడిపోవడం ఇది రెండో సారి. జనవరిలో కూడా వినియోగం 5.9 శాతానికి క్షీణించింది. డీజిల్ డిమాండ్ కూడా 3.7 శాతం పడిపోయి, 5.9 మిలియన్ టన్నులుగా ఉంది. అదేవిధంగా పెట్రోల్ విక్రయం కూడా 0.8 శాతం తక్కువగా 2.19 మిలియన్ టన్నులుగా నమోదైంది. అయితే ఎల్‌పీజీ అమ్మకాలు మాత్రం 11.8 శాతం పెరిగి 2.06 మిలియన్ టన్నులుగా రికార్డయ్యాయి. కిరోసిన్ వాడకం 41 శాతం పైగా తగ్గింది.