నోట్ల రద్దు అనంతరం విమానశ్రయాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్ చేసిన తనిఖీల్లో డిమానిటైజేషన్ కాలం నుంచి ఇప్పటి వరకు రూ.87 కోట్లకు పైగా నగదు, రూ.2600 కేజీల బంగారం, ఇతర విలువైన మెటల్స్ పట్టుబడినట్టు తాజా డేటాలో వెల్లడైంది. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద ఎత్తున్న నగదు, బంగారం తరలిపోవచ్చని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో దేశంలో నగదు, బంగారం ఎక్కడికీ తరలిపోకుండా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీఐఎస్‌ఎఫ్‌ను ఆదేశించింది. ఎలాంటి అనుమానిత నగదు, ఇతర విలువైన వస్తువులున్న వెంటనే స్వాధీనంలోకి తీసుకోవాలని అలర్ట్ చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 56 సివిల్ ఎయిర్‌పోర్టుల్లో సీఐఎస్‌ఎఫ్ డేగా కన్ను మాదిరి తనిఖీలు నిర్వహించింది.
ఈ క్రమంలో 2016 నవంబర్ 8 నుంచి 2017 నవంబర్ 7 వరకు రూ.87.17 కోట్ల అనుమానిత నగదును, రూ.1,419.5 కేజీల బంగారాన్ని, 572.63 కేజీల వెండిని గుర్తించినట్టు సీఐఎస్‌ఎఫ్ డేటా తెలిపింది. దీనిలో ఎక్కువగా ముంబై ఎయిర్‌పోర్టులో రూ.33 కోట్లకు పైగా అనుమానిత నగదును గుర్తించినట్టు పేర్కొంది. ఎక్కువ మొత్తంలో బంగారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిరపోర్టులో దొరికినట్టు డేటా వెల్లడించింది. 266 కేజీలకు పైగా వెండిని జైపూర్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్‌ఎఫ్ అధికారులు చెప్పారు. చట్టం ప్రకారం తదుపరి విచారణ కోసం ఈ మొత్తాలన్నింటిన్నీ ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని సీఐఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి చెప్పారు. సీఐఎస్‌ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్. ఎయిర్‌పోర్టుల్లో వీరు తమ సేవలను అందిస్తూ ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment