అదే మధనం | One year of demonetisation | Sakshi
Sakshi News home page

అదే మధనం

Published Wed, Nov 8 2017 10:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

One year of demonetisation - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌): నోట్ల కష్టాలు మొదలై ఏడాదైంది. 2016 నవంబర్‌ 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రూ.ఐదొందలు, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన వెలువడిన విషయం విదితమే. దాంతో ప్రజల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆ రోజు రాత్రి నుంచి ఏటీఎంలు మూతపడ్డాయి. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అన్నపానీ యాలు మానేసి పడిగాపులు పడాల్సిన దుస్థితి దాపురించింది. కష్టం ఫలించి రూ.2 వేల నోట్లు చేతికందినా చిల్లర దొరక్క అవస్థలు పడ్డారు. జీతం సొమ్ము బ్యాంక్‌ ఖాతాలో ఉన్నా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పింఛను సొమ్ముల కోసం వృద్ధులు అష్టకష్టాలు పడ్డారు. రూ.500 కొత్త నోట్ల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలా మొదలైన కష్టాలు కనీసం 50 రోజులపాటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. 

ఆ తరువాత క్రమంగా ఇబ్బందులు తగ్గుతూ వచ్చినా.. పూర్తిగా వీడలేదు. నేటికీ చిల్లర నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.  చాలా ఏటీఎంలు నేటికీ దిష్టి బొమ్మల్లానే కనిపిస్తున్నాయి. నలధనం నిర్మూలన, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించడంతో ప్రజలు కష్టనష్టాలను భరిస్తూ వచ్చారు. కానీ.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం చేసిన గాయం ఇంకా మానలేదు. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇప్పటికీ కోలుకోలేదు. ఆస్తులు అమ్మేవారు ఉన్నా కొనేవారు ముందుకు రాకపోవడంతో ఈ వ్యాపారం కుప్పకూలింది. రూ.2 వేలు, రూ.500 నోట్లు మార్చుకునేందుకు కూలీలు, సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిల్లర నోట్ల సమస్య తీర్చేం దుకు రూ.200, రూ.50 కొత్త నోట్లను విడుదల చేసినా ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం పాత 100 నోట్లు, పాత 50 నోట్లు మాత్రమే దిక్కయ్యాయి.

లక్ష్యం ఏమైంది!
నగదు రహిత లావాదేవీలు నిర్వహిం చడం ద్వారా ప్రజల కష్టాలు తీరుస్తామని.. కరెన్సీ నోట్ల నుంచి విముక్తి కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం చేపట్టాయి. నెల్లూరు జిల్లాలో డిజిధన్‌ లాంటి మేళాలు సైతం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు జరిపిన వారికి పెద్దఎత్తున బహుమతులు ఇస్తామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు కూడా. కొన్ని రోజులకే అందరూ ఆ విషయాన్ని గాలికొదిలేశారు. 90 శాతం ఆర్థిక లావాదేవీలు కరెన్సీ నోట్ల ఆధారంగానే సాగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులంతా స్వైపింగ్‌ యంత్రాల ఆధారంగా లావాదేవీలు జరపాలని ఆదేశాలొచ్చాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లంటూ ఆర్బాటం చేశారు. అయితే, స్వైపింగ్‌ మెషిన్ల పంపిణీలో వెనుకబడ్డారు. జిల్లాలో సుమారు 6 వేల మంది వ్యాపారుల నుంచి స్వైపింగ్‌ మెషిన్ల కోసం దరఖాస్తులు అందగా.. కేవలం 2,804 మెషిన్లను అందుబాటులోకి తెచ్చి చేతులెత్తేశారు. 

నగదు రహిత గ్రామాలపై దృష్టి ఏదీ
జిల్లాలో కొన్ని గ్రామాలను నగదు రహితంగా మారుస్తామని ప్రకటిం చారు. ఇప్పటికీ ఒక్క గ్రామాన్ని కూడా అలా తీర్చిదిద్దలేకపోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన రైల్వేలోనూ 10 శాతం కూడా నగదు రహిత లావాదేవీలు అమలు కావడం లేదు. టికెట్‌ కొన్నవారు  స్వైపింగ్‌ మెషిన్‌ ద్వారా నగదు చెల్లించేందుకు దాదాపు 2 నుంచి 5 నిమిషాలు పడుతోంది. ఆ లోపు ఆన్‌లైన్‌లో ఉన్న టికెట్లు అయిపోతున్నాయి. దీంతో చాలామంది రిజర్వేషన్‌ చేసుకునే సందర్భంలోనూ నగదు చెల్లిస్తున్నారు. 

స్వైపింగ్‌ మెషిన్లు అందుబాటులో లేవు
జిల్లాకు స్వైపింగ్‌ మెషిన్లు కావా లని ఉన్నతాధికారులకు నివేదిం చాం. అవసరానికి తగినన్ని మెషిన్లు అందుబాటులో లేవు. స్వైపింగ్‌పై పన్ను వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ కారణంగా చాలామంది నగదు రహితంపై మొగ్గు చూపడం లేదు. నగదుతోనే లావాదేవీలు చేస్తున్నారు. జిల్లాలోని పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించాం.
–బి.వెంకట్రావ్, 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement