నెల్లూరు (క్రైమ్): నగదు నిర్వహణ కస్టోడియన్లుగా పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులు నెల్లూరులోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో రూ.57,10,400 మాయం చేసినట్లు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల సమాచారం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సీఎంఎస్ (క్యాష్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ) సంస్థ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే కాంట్రాక్టు తీసుకుంది. ఆ సంస్థలో నెల్లూరు సంతపేట తూకుమానుమిట్టకు చెందిన కె.రోహిత్‌కుమార్, బోగోలుకు చెందిన కె.మహేంద్ర నగదు కస్టోడియన్లుగా పనిచేస్తున్నారు. వారు నెల్లూరులో ఐవోబీ, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు తదితర బ్యాంకులకు చెందిన 20 ఏటీఎంలలో రోజూ నగదు డిపాజిట్ చేసేవారు.
ఆ ఏటీఎంలకు సంబంధించిన పాస్‌వర్డులు తెలిసిన నిందితులు కొంతకాలంగా 13 ఏటీఎంలలో నగదు కాజేయడం ప్రారంభించారు. ఉండాల్సిన నగదు లేకపోవడాన్ని గమనించిన మరో కస్టోడియన్ కిరణ్‌కుమార్ ఈనెల తొమ్మిదిన సంస్థ ఏరియా మేనేజర్ జె.రంజిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో నగదు లావాదేవీలను పరిశీలించి రూ.57,10,400 అపహరణకు గురైనట్లు గుర్తించిన రంజిత్‌కుమార్ ఆదివారం ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదోనగర ఇన్‌స్పెక్టర్ పి.సుబ్బారావు నిందితులపై ఆదివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారైనట్లు తెలిసింది.
ఏటీఎంలలో రూ.57.1 లక్షల చోరీ
Published Mon, Jul 13 2015 9:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement