రియల్టర్ ఇంట్లో చోరీ
రియల్టర్ ఇంట్లో చోరీ
Published Wed, Dec 21 2016 1:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన యజమాని బావమరిది ఇంట్లోకి వచ్చేసరికి దుండగులు గోడ దూకి పరారైన ఘటన మంగళవారం రాత్రి చైతన్యపురిలోని ఎల్‌ఎల్‌ఎఫ్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. చైతన్యపురి కాలనీలో రియల్టర్ మనోజ్‌కుమార్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి మనోజ్‌కుమార్ పనిపై ఇంట్లోనుంచి బయటకు వెళ్లగా, భార్య మాధవి పక్కవీధిలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలను పగలగొట్టారు. మనోజ్‌కుమార్ బావమరిది చంద్రమోహన్ తన అక్క కోసం ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లిచూడగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. గుర్తుతెలియని దుండగులు పడకగదిలోని బీరువాలను సోదాచేస్తూ కనిపించారు. దీంతో చంద్రమోహన్ గట్టిగా అరిచేసేరికి దుండగులు ఇంటి వెనుక ఉన్న గోడదూకి పరారయ్యారు. వారిని వెంబడించి పట్టుకునేందుకు యత్నించినా ప్రయోజనం లభించలేదు. దీంతో చంద్రమోహన్ జరిగిన ఘటనపై తన బావ మనోజ్‌కుమార్‌కు ఫోన్లో సమాచారం అందించారు. మనోజ్‌కుమార్ హుటాహుటిన ఇంటికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలోని లాకర్‌ను తెరచి చూడగా అందులో ఉన్న రూ.రెండు లక్షలు, బంగారు ఆభరణాలు అలానే ఉన్నాయి. అల్మరాలో ఉన్న రూ.50 వేల విలువజేసే రెండు సవర్ల బంగారు కమ్మలు, రూ.10 వేల నగదు కనిపించలేదు. బాధితుడు ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ మంగారావు, ఎస్సై నాగభూషణం ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై నాగభూషణం కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలో నిందితులు వదిలివెళ్లిన కట్టర్లు, ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Advertisement