పట్ట పగలే ఇంట్లో చోరీ
-
38 గ్రాముల బంగారు నగల అపహరణ
మనుబోలు : పట్టపగలు..కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మనుబోలు గమళ్లపాళెంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గమళ్లపాళెంకు చెందిన షేక్ బషీర్ లారీడ్రైవర్‌గా పనిచేస్తాడు. ఆయన భార్య జమీలా గూడూరు సమీపంలోని ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పని చేస్తుంది. కుమార్తె ఫైరజ్ క్యూబా కళాశాలలో బీటెక్ చదువుతుంది. కుమారుడు సమీర్ బుజబుజ నెల్లూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. మంగళవారం ఉదయమే ఎవరి పనులకు వారు వెళ్లి పోయారు. సాయంత్రం ఫైరజ్ కళాశాల నుంచి ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగలగొట్టి తెరిచి ఉన్నాయి. అందులోని దుస్తులు, వస్తువులు చిందవందరగా పడేసి ఉండటంతో అనుమానంతో బీరువా లోపలి అరల్లో పరిశీలించగా అందులో ఉండాల్సి రెండున్నర సవర్ల లాకెట్, ఒక సవర దండ, 6 గ్రాముల కమ్మలు, 4 గ్రాముల 2 ఉంగరాలు కనబడ లేదు. దొంగలు బీరువాలో ఉన్న ఏటీఎం కార్డును కూడా తీసుకెళ్లారు. వెంటనే ఆమె స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ గంగాధర్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అపహరించిన ఏటీఎం కార్డు ద్వారా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన సెల్‌కు రూ.100 డ్రా చేసినట్లుగా మెసేజ్ వచ్చిందని బషీర్ కుమారుడు సమీర్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.