దేవాలయాల్లో చోరీల ముఠా అరెస్ట్
-
12 సవర్ల బంగారు రికవరీ
వెంకటాచలం : దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఎస్‌ఐ వెంకటేశ్వరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరం రామకోటయ్యనగర్ ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్‌బాషా అలియాస్ మస్తాన్, సారాయి అంగడి ప్రాంతానికి చెందిన షేక్ రఫీ, కల్లూరుపల్లి కొత్తకాలనీకి చెందిన షేక్ మస్తాన్ బంధువులు. ఆటోడ్రైవర్ అయిన షేక్ మస్తాన్‌బాషా మిగతా ఇద్దరితో కలిసి రాత్రి వేళల్లో ఆటోలో వెళ్లి దేవాలయాల్లో చోరీలకు పాల్పడి జల్సాలు చేస్తున్నారు. ఇటీవల వెంకటాచలంలోని లక్ష్మీప్రసన్న వెంకటేశ్వరస్వామి, మనుబోలు, టీపీ గూడూరు, కోవూరు మండలాల్లో దేవాలయాల్లో చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెంకటాచలం, టీపీ గూడూరు, కృష్ణపట్నంపోర్టు ఎస్‌లు వెంకటేశ్వరరావు, శివకృష్ణారెడ్డి, విశ్వనాథరెడ్డిలను వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద నిత్యం నిఘా పెట్టి అనుమానిత వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా బుధవారం పోలీసులు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలో చేస్తుండగా ఆటోలో వెళ్తున్న షేక్ మస్తాన్‌బాషా, షేక్ రఫీ, షేక్ మస్తాన్‌ను విచారించారు. వారు పొంతన లేని సమాధానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. పరిశీలించగా 4 సవర్ల బంగారు నగలు లభించాయి. దీంతో పూర్తిస్థాయిలో విచారణ చేయగా ఆ బంగారును తిరుపతిలో అమ్మేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. మనుబోలులోని లక్ష్మీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, మనుబోలులోని ఆంజనేయస్వామి గుడి, కోవూరులో రెండు ఆలయాల్లో, టీపీ గూడూరులో నాలుగు ఆలయాల్లో చోరీలు చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 12 సవర్ల బంగారు నగలను రికవరీ చేసి, నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితులు నెల్లూరు నగరంలో చోరీ కేసుల్లో ఇప్పటికే నిందితులని, రఫి హత్యకేసులో నిందితుడని తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది వాసు, మోహన్‌కృష్ణ, రమేష్ పాల్గొన్నారు.