సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం వెనుక స్ఫూర్తిగా నిలిచిన అర్థక్రాంతి వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ బ్లాక్ మనీ నిర్మూలించడానికి ఏం చేయాలో వివరించారు. నోట్ల రద్దు చేపడుతూ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్నా నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రస్తుత పన్ను వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను సూచించిన ఇతర చర్యలు చేపట్టకుండా నోట్ల రద్దు ఒక్కదానితోనే ఆశించిన లక్ష్యాలు చేకూరవన్నారు. ఇతర పన్నుల స్థానంలో బ్యాంకింగ్ లావాదేవీల పన్ను విధించడం వంటి తన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన బొకిల్ ఈటీ ఆన్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వూ‍్యలో పలు విషయాలు వెల్లడించారు. తన దృష్టిలో ఇది డిమానెటైజేషన్ కాదని, కేవలం నోట్ల రద్దు మాత్రమేనన్నారు. ప్రభుత్వం చెలామణిలో ఉన్న నగదునే ఈ నిర్ణయం ప్రభావితం చేస్తున్న క్రమంలో డిమానెటైజేషన్ పదం సరికాదని, ఇది కేవలం నోట్ల రద్దు మాత్రమేనన్నారు.
నోట్ల రద్దుతో దశాబ్ధాలుగా ప్రజల వద్ద పేరుకుపోయిన పెద్దనోట్లన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడంతో డిపాజిట్లు పెరిగి రుణాలు ఇచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు.మరోవైపు డిజిటల్ లావాదేవీలు పెరగడం ఇవన్నీ నోట్ల రద్దుతో సానుకూల పరిణామాలన్నారు.
ఆశించిన మేలు జరిగిందా..?
ఆర్‌బీఐ వెల్లడించిన కొన్ని గణాంకాలు పరిశీలిస్తే... గతంలో మొత్తం కరెన్సీలో పెద్దనోట్లైన రూ 500,రూ 1000 నోట్లు 85 శాతంగా ఉంటే ప్రస్తుతం మొత్తం కరెన్సీలో పెద్దనోట్లు రూ 500, రూ 2000 నోట్లు కేవలం 72 శాతమే ఉన్నాయని బొకిల్ గుర్తుచేశారు. నోట్లరద్దుకు ముందు చెలామణిలో ఉన్న నగదు 16.6 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం అది రూ 13.3 లక్షల కోట్లకు తగ్గిందన్నారు. వ్యవస్థాగత మార్పుకు నోట్ల రద్దు కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. చెలామణిలో ఉన్న నగదులో బ్లాక్‌మనీని ఇది తగ్గించగలిగిందన్నారు.
ఆర్థిక వ్యవస్థ సమతూకానికి నోట్ల రద్దు అవసరమని బొకిల్ స్పష్టం చేశారు. నకిలీ నోట్లకు చెక్ పడటంతో ఉగ్రకార్యకలాపాలకు నిధులు తగ్గిపోయాయని, పన్ను రాబడి పెరిగిందని విశ్లేషించారు.వడ్డీ రేట్లు తగ్గి, నిధుల సమీకరణ వ్యయం దిగివస్తుందన్నారు. కంపెనీలకు రుణ వితరణ పెరగడంతో ఉపాథి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.
అర్థక్రాంతి సూచనలన్నీ అమలవలేదు...
తాము ప్రభుత్వానికి ప్రతిపాదించిన ఐదు అంశాల ఫార్ములాను మొత్తంగా ప్రభుత్వం ఆమోదించలేదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం తమ ప్రతిపాదనలన్నింటికీ అంగీకరించలేదని భావిస్తున్నామన్నారు. తాము ‘పన్ను రహిత-తక్కువ నగదు’ ఆర్థిక వ్యవస్థను తాము ప్రతిపాదించామన్నారు.
పన్నుల స్థానంలో బీటీటీ
బ్లాక్‌మనీ పోగుపడటానికి ప్రస్తుత పన్ను వ్యవస్థే కారణమని తాము బలంగా నమ్ముతున్నామని అనిల్ బొకిల్ చెబుతూ ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి కేవలం ఒకే ఒక పన్ను బ్యాంకింగ్ లావాదేవీల పన్ను (బీటీటీ) విధించాలని చెప్పారు. దీనికి తోడు క్రమంగా పెద్ద నోట్లను రద్దు చేసి కేవలం రూ 100, రూ 50 నోట్లనే చెలామణిలో ఉంచాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment