Anil bokil
-
‘ఇలా చేస్తే బ్లాక్ మనీ కనుమరుగు’
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం వెనుక స్ఫూర్తిగా నిలిచిన అర్థక్రాంతి వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ బ్లాక్ మనీ నిర్మూలించడానికి ఏం చేయాలో వివరించారు. నోట్ల రద్దు చేపడుతూ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్నా నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రస్తుత పన్ను వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను సూచించిన ఇతర చర్యలు చేపట్టకుండా నోట్ల రద్దు ఒక్కదానితోనే ఆశించిన లక్ష్యాలు చేకూరవన్నారు. ఇతర పన్నుల స్థానంలో బ్యాంకింగ్ లావాదేవీల పన్ను విధించడం వంటి తన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన బొకిల్ ఈటీ ఆన్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో పలు విషయాలు వెల్లడించారు. తన దృష్టిలో ఇది డిమానెటైజేషన్ కాదని, కేవలం నోట్ల రద్దు మాత్రమేనన్నారు. ప్రభుత్వం చెలామణిలో ఉన్న నగదునే ఈ నిర్ణయం ప్రభావితం చేస్తున్న క్రమంలో డిమానెటైజేషన్ పదం సరికాదని, ఇది కేవలం నోట్ల రద్దు మాత్రమేనన్నారు. నోట్ల రద్దుతో దశాబ్ధాలుగా ప్రజల వద్ద పేరుకుపోయిన పెద్దనోట్లన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడంతో డిపాజిట్లు పెరిగి రుణాలు ఇచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు.మరోవైపు డిజిటల్ లావాదేవీలు పెరగడం ఇవన్నీ నోట్ల రద్దుతో సానుకూల పరిణామాలన్నారు. ఆశించిన మేలు జరిగిందా..? ఆర్బీఐ వెల్లడించిన కొన్ని గణాంకాలు పరిశీలిస్తే... గతంలో మొత్తం కరెన్సీలో పెద్దనోట్లైన రూ 500,రూ 1000 నోట్లు 85 శాతంగా ఉంటే ప్రస్తుతం మొత్తం కరెన్సీలో పెద్దనోట్లు రూ 500, రూ 2000 నోట్లు కేవలం 72 శాతమే ఉన్నాయని బొకిల్ గుర్తుచేశారు. నోట్లరద్దుకు ముందు చెలామణిలో ఉన్న నగదు 16.6 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం అది రూ 13.3 లక్షల కోట్లకు తగ్గిందన్నారు. వ్యవస్థాగత మార్పుకు నోట్ల రద్దు కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. చెలామణిలో ఉన్న నగదులో బ్లాక్‌మనీని ఇది తగ్గించగలిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థ సమతూకానికి నోట్ల రద్దు అవసరమని బొకిల్ స్పష్టం చేశారు. నకిలీ నోట్లకు చెక్ పడటంతో ఉగ్రకార్యకలాపాలకు నిధులు తగ్గిపోయాయని, పన్ను రాబడి పెరిగిందని విశ్లేషించారు.వడ్డీ రేట్లు తగ్గి, నిధుల సమీకరణ వ్యయం దిగివస్తుందన్నారు. కంపెనీలకు రుణ వితరణ పెరగడంతో ఉపాథి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. అర్థక్రాంతి సూచనలన్నీ అమలవలేదు... తాము ప్రభుత్వానికి ప్రతిపాదించిన ఐదు అంశాల ఫార్ములాను మొత్తంగా ప్రభుత్వం ఆమోదించలేదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం తమ ప్రతిపాదనలన్నింటికీ అంగీకరించలేదని భావిస్తున్నామన్నారు. తాము ‘పన్ను రహిత-తక్కువ నగదు’ ఆర్థిక వ్యవస్థను తాము ప్రతిపాదించామన్నారు. పన్నుల స్థానంలో బీటీటీ బ్లాక్‌మనీ పోగుపడటానికి ప్రస్తుత పన్ను వ్యవస్థే కారణమని తాము బలంగా నమ్ముతున్నామని అనిల్ బొకిల్ చెబుతూ ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి కేవలం ఒకే ఒక పన్ను బ్యాంకింగ్ లావాదేవీల పన్ను (బీటీటీ) విధించాలని చెప్పారు. దీనికి తోడు క్రమంగా పెద్ద నోట్లను రద్దు చేసి కేవలం రూ 100, రూ 50 నోట్లనే చెలామణిలో ఉంచాలని సూచించారు. -
లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే...
అర్థక్రాంతి సంస్థాన్ వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ సూచన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నల్లధనం కట్టడికి దేశంలో ప్రతి లావాదేవీ బ్యాంకు ద్వారానే జరగాలని అర్థక్రాంతి సంస్థాన్ వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ అన్నారు. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) ఆహ్వానం మేరకు హైదరాబాద్ విచ్చేసిన ఆయన ఆదివారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు. బ్యాంకు ద్వారా మాత్రమే లావాదేవీలు పూర్తి అయితే ట్రాక్ చేయడానికి వీలవుతుందని చెప్పారు. బ్యాంకింగు వ్యవస్థలోకి డిపాజిట్లు రావడంతో ద్రవ్య సరఫరా పెరిగి ఎకానమీ గాడిన పడుతుందని తెలిపారు. ‘లెక్కచూపని నగదు లావాదేవీలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పారదర్శకంగా ఉండే బ్యాంకు లావాదేవీలే ఇందుకు పరి ష్కారం. దేశంలో కస్టమ్స్ సుంకాలు మినహా మిగిలిన అన్ని పన్నులను రద్దు చేయాలి. బ్యాంకు వద్ద మా త్రమే పన్ను వసూలవ్వాలి. సొమ్ము స్వీకర్త మాత్రమే పన్ను చెల్లించాలి. రూ.100, ఆపైన ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేయాల్సిందే. చిన్న నోట్లు అంటే రూ.50 వరకు మాత్రమే సరఫరాలో ఉండాలి. పన్నులు లేని, తక్కువ నగదు లావాదేవీలు జరిగే ఎకానమీ ఉండాలని ప్రధానికి అర్థక్రాంతి సంస్థాన్ ప్రతిపాదించింది. మా ప్రతిపాదనలు అమలైతే జీఎస్టీ అవసరమే లేదు’ అని వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. -
నోట్ల రద్దు సలహా ఇచ్చిన వ్యక్తే.. గరంగరం!
న్యూఢిల్లీ: నల్లధనాన్ని నిరోధించేందుకు పెద్దనోట్లను రద్దు చేయాలంటూ కేంద్రప్రభుత్వానికి సలహా ఇచ్చిన అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ తాజాగా దేశంలోని నెలకొన్న గందరగోళంపై స్పందించారు. పెద్దనోట్ల రద్దు అమలువిషయంలో ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తన సలహాలను ప్రభుత్వం సెలక్టివ్‌గా తీసుకున్నదని, తన సలహాలన్నింటినీ సమగ్రంగా అమలుచేయలేదని, అందువల్లే దేశంలో ఈ గందరగోళ పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. తాను మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నట్టు అనిల్ బోకిల్ చెప్పినప్పటికీ, ప్రధాని కార్యాలయం దీనిని ధ్రువీకరించలేదు. తాజాగా అనిల్ బోకిల్ ‘ముంబై మిర్రర్’ వార్తాపత్రికతో మాట్లాడారు. గత జూలైలో ప్రధాని మోదీతో సమావేశమై.. పెద్దనోట్ల రద్దు పథకానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను తాను అందజేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పథకాన్ని ఎలా అమలుచేయాలో కూడా తాను సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయంలో తాను ఐదు సలహాలు ఇవ్వగా, ప్రభుత్వం రెండు సలహాలను మాత్రమే పాటించిందని చెప్పారు. దీంతో పెద్దనోట్ల రద్దు పథకాన్ని స్వాగతించాలా? తిరస్కరించాలా? అన్నది తెలియని పరిస్థితిలా ఉందని చెప్పారు. తమ సంస్థ కేంద్రానికి అందజేసిన ‘రోడ్‌మ్యాప్’ను అనుసరించి ఉంటే.. పెద్దనోట్ల రద్దుపై ఇంత గందరగోళం చెలరేగేది కాదని అన్నారు. -
మోదీకి ఈ సూచన చేసింది ఈయనేనా?
దేశంలో ఇప్పటివరకు చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా ప్రకటించారో లేదో.. ఫోన్లలో వాట్సప్ సందేశాలు వరుసపెట్టి మోగుతూనే ఉన్నాయి. రాత్రంతా దానికి సంబంధించిన విషయాలతో పాటు పలు రకాల జోకులు కూడా పేలిపోయాయి. కానీ, అసలు ఈ నోట్లను రద్దుచేయాలని ప్రధానమంత్రికి సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు? దీన్ని అమలుచేయడంలో సాధ్యాసాధ్యాలతో సహా వివరించింది ఎవరు? ఈ నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదు.. ఔరంగాబాద్‌కు చెందిన ఆర్కిటెక్టు, చార్టర్డ్ అకౌంటెంటు అనిల్ బొకిల్ ముందుగా ఈ ఐడియాను ప్రధానికి ఇచ్చారు. ఆయన ప్రారంభించిన 'అర్థక్రాంతి' సిద్ధాంతాలలో ఈ సూచన కూడా ఒకటి. ఈ సంవత్సరం జూలై నెలలో అనిల్ బొకిల్ ప్రధానమంత్రిని కలిసి, నల్లధనాన్ని అరికట్టడానికి తనవద్ద ఉన్న ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. మోదీ ఆయనకు తొలుత కేవలం 8 నిమిషాల అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చినా, వాళ్లిద్దరి భేటీ దాదాపు రెండు గంటలకు పైగా గడిచిందని సమాచారం. (బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగాలి) లెక్కల్లో చూపించకుండా నగదు రూపంలో పెద్దమొత్తంలో దాచుకున్న డబ్బు వల్లే రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దానివల్ల క్రమంగా డబ్బు తన విలువ కోల్పోతోందని, ఈ వ్యవహారానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని ఇంతకుముందు అనిల్ బొకిల్ ఒక వీడియోలో చెప్పారు. దీనివల్ల నకిలీనోట్ల వ్యవహారానికి కూడా చెక్ పడుతుందని ఆయన చెప్పారు. ఆయన కేవలం పెద్ద నోట్ల రద్దు మాత్రమే కాకుండా ఇంకా పలు విషయాలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానాన్ని గణనీయంగా మార్చాలని, ఒక్క దిగుమతి సుంకాలు తప్ప మిగిలిన అన్నింటికీ ఒకే చోట లావాదేవీల పన్ను విధించాలని చెప్పారు. నగదు రూపంలో రూ. 2వేలకు మించి లావాదేవీలు జరగకుండా చూడాలని సూచించారు. అర్థక్రాంతి బృందం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు పలువురు ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులను కలిసి తమ ఆలోచనలను వారితో పంచుకుంటూనే ఉంది. 2007 మార్చిలో నాటి రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న ప్రతిభా పాటిల్ నాటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి ఒక లేఖ రాశారు. అర్థక్రాంతి బృందం తమ ఆలోచనలను పార్లమెంటు సభ్యులకు వివరించడానికి అవకాశం కల్పించాలని ఆమె కోరారు. అప్పటి నుంచి ప్రయత్నిస్తుంటే.. ఇప్పటికి వాళ్లు కొంతవరకు విజయం సాధించినట్లయింది. అర్థక్రాంతి చేసిన ప్రతిపాదనలు ఇవీ... అర్థక్రాంతి ప్రధానంగా ఐదు ప్రతిపాదనలు చేసింది. అవి.. 1) దిగుమతి సుంకం మినహా ఆదాయపన్ను సహా మొత్తం 56 పన్నులను రద్దుచేయాలి 2) 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలి 3) ఎక్కువ మొత్తంలో చేసే లావాదేవీలన్నీ బ్యాంకు మార్గంలోనే అంటే, చెక్కు, డీడీ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా జరగాలి 4) నగదు లావాదేవీలకు ఒక పరిమితి విధించి, దానిపై పన్ను లేకుండా చూడాలి 5) బ్యాంకు లావాదేవీల పన్ను (2% వరకు) కేవలం క్రెడిట్ మొత్తం మీద మాత్రమే విధించి.. దాని ద్వారానే ప్రభుత్వం ఆదాయం పొందాలి. -
లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలి
హన్మకొండ: బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరగాలని అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ అన్నారు. హన్మకొండ కిషన్‌పురలోని వాగ్దేవి కాలేజీలో ఫోరం ఫర్ బెటర్, వరంగల్ మహిళ పతాంజలి యోగా సమితి, వరంగల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘అర్థక్రాంతి’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరపడం వల్ల బ్యాంకులే 2 శాతం లావాదేవీ పన్ను వసూలు చేస్తాయన్నారు. దేశం మొత్తమ్మీద ప్రజలు కట్టే పన్ను ఇదొక్కటే కాబట్టి వినియోగదారుని ఖాతా నుంచి బ్యాంకులు ఈ పన్నును మినహాయించి ప్రభుత్వానికి కట్టేస్తాయన్నారు. ఎగుమతి, దిగుమతి పన్నులు మినహాయించి అన్ని రకాల పన్నులను పూర్తిగా రద్దు చేయడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. అంతేకాకుండా రూ.2 వేల లోపు లావాదేవీలు మాత్రమే నగదు రూపంలో జరగాలని, అంతకుమించిన లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిగేలా ప్రభుత్వం నియంత్రించాలని అన్నారు. దీనిద్వారా దేశంలోని అవినీతినికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ భారతదేశం వంటి ప్రజాస్వామికవ్యవస్థలో అర్థక్రాంతి అమలు చేయడం సాధ్యమేనన్నారు. సదస్సులో ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షుడు సుధాకర్, వరంగల్ మహిళా పతంజలి యోగా సమితి అధ్యక్షురాలు సునీత, వరంగల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జోషి పాల్గొన్నారు.