మోదీకి ఈ సూచన చేసింది ఈయనేనా?
మోదీకి ఈ సూచన చేసింది ఈయనేనా?
Published Thu, Nov 10 2016 9:32 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
దేశంలో ఇప్పటివరకు చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా ప్రకటించారో లేదో.. ఫోన్లలో వాట్సప్ సందేశాలు వరుసపెట్టి మోగుతూనే ఉన్నాయి. రాత్రంతా దానికి సంబంధించిన విషయాలతో పాటు పలు రకాల జోకులు కూడా పేలిపోయాయి. కానీ, అసలు ఈ నోట్లను రద్దుచేయాలని ప్రధానమంత్రికి సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు? దీన్ని అమలుచేయడంలో సాధ్యాసాధ్యాలతో సహా వివరించింది ఎవరు? ఈ నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదు.. ఔరంగాబాద్‌కు చెందిన ఆర్కిటెక్టు, చార్టర్డ్ అకౌంటెంటు అనిల్ బొకిల్ ముందుగా ఈ ఐడియాను ప్రధానికి ఇచ్చారు. ఆయన ప్రారంభించిన 'అర్థక్రాంతి' సిద్ధాంతాలలో ఈ సూచన కూడా ఒకటి. ఈ సంవత్సరం జూలై నెలలో అనిల్ బొకిల్ ప్రధానమంత్రిని కలిసి, నల్లధనాన్ని అరికట్టడానికి తనవద్ద ఉన్న ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. మోదీ ఆయనకు తొలుత కేవలం 8 నిమిషాల అపాయింట్‌మెంట్ మాత్రమే ఇచ్చినా, వాళ్లిద్దరి భేటీ దాదాపు రెండు గంటలకు పైగా గడిచిందని సమాచారం. (బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగాలి)
లెక్కల్లో చూపించకుండా నగదు రూపంలో పెద్దమొత్తంలో దాచుకున్న డబ్బు వల్లే రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దానివల్ల క్రమంగా డబ్బు తన విలువ కోల్పోతోందని, ఈ వ్యవహారానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని ఇంతకుముందు అనిల్ బొకిల్ ఒక వీడియోలో చెప్పారు. దీనివల్ల నకిలీనోట్ల వ్యవహారానికి కూడా చెక్ పడుతుందని ఆయన చెప్పారు. ఆయన కేవలం పెద్ద నోట్ల రద్దు మాత్రమే కాకుండా ఇంకా పలు విషయాలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానాన్ని గణనీయంగా మార్చాలని, ఒక్క దిగుమతి సుంకాలు తప్ప మిగిలిన అన్నింటికీ ఒకే చోట లావాదేవీల పన్ను విధించాలని చెప్పారు. నగదు రూపంలో రూ. 2వేలకు మించి లావాదేవీలు జరగకుండా చూడాలని సూచించారు.
అర్థక్రాంతి బృందం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు పలువురు ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులను కలిసి తమ ఆలోచనలను వారితో పంచుకుంటూనే ఉంది. 2007 మార్చిలో నాటి రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న ప్రతిభా పాటిల్ నాటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి ఒక లేఖ రాశారు. అర్థక్రాంతి బృందం తమ ఆలోచనలను పార్లమెంటు సభ్యులకు వివరించడానికి అవకాశం కల్పించాలని ఆమె కోరారు. అప్పటి నుంచి ప్రయత్నిస్తుంటే.. ఇప్పటికి వాళ్లు కొంతవరకు విజయం సాధించినట్లయింది.
అర్థక్రాంతి చేసిన ప్రతిపాదనలు ఇవీ...
అర్థక్రాంతి ప్రధానంగా ఐదు ప్రతిపాదనలు చేసింది. అవి..
1) దిగుమతి సుంకం మినహా ఆదాయపన్ను సహా మొత్తం 56 పన్నులను రద్దుచేయాలి
2) 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలి
3) ఎక్కువ మొత్తంలో చేసే లావాదేవీలన్నీ బ్యాంకు మార్గంలోనే అంటే, చెక్కు, డీడీ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా జరగాలి
4) నగదు లావాదేవీలకు ఒక పరిమితి విధించి, దానిపై పన్ను లేకుండా చూడాలి
5) బ్యాంకు లావాదేవీల పన్ను (2% వరకు) కేవలం క్రెడిట్ మొత్తం మీద మాత్రమే విధించి.. దాని ద్వారానే ప్రభుత్వం ఆదాయం పొందాలి.
Advertisement