నోట్ల రద్దు సలహా ఇచ్చిన వ్యక్తే.. గరంగరం!
న్యూఢిల్లీ: నల్లధనాన్ని నిరోధించేందుకు పెద్దనోట్లను రద్దు చేయాలంటూ కేంద్రప్రభుత్వానికి సలహా ఇచ్చిన అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ తాజాగా దేశంలోని నెలకొన్న గందరగోళంపై స్పందించారు. పెద్దనోట్ల రద్దు అమలువిషయంలో ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తన సలహాలను ప్రభుత్వం సెలక్టివ్‌గా తీసుకున్నదని, తన సలహాలన్నింటినీ సమగ్రంగా అమలుచేయలేదని, అందువల్లే దేశంలో ఈ గందరగోళ పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. తాను మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నట్టు అనిల్ బోకిల్ చెప్పినప్పటికీ, ప్రధాని కార్యాలయం దీనిని ధ్రువీకరించలేదు.
తాజాగా అనిల్ బోకిల్ ‘ముంబై మిర్రర్’ వార్తాపత్రికతో మాట్లాడారు. గత జూలైలో ప్రధాని మోదీతో సమావేశమై.. పెద్దనోట్ల రద్దు పథకానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను తాను అందజేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పథకాన్ని ఎలా అమలుచేయాలో కూడా తాను సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయంలో తాను ఐదు సలహాలు ఇవ్వగా, ప్రభుత్వం రెండు సలహాలను మాత్రమే పాటించిందని చెప్పారు. దీంతో పెద్దనోట్ల రద్దు పథకాన్ని స్వాగతించాలా? తిరస్కరించాలా? అన్నది తెలియని పరిస్థితిలా ఉందని చెప్పారు. తమ సంస్థ కేంద్రానికి అందజేసిన ‘రోడ్‌మ్యాప్’ను అనుసరించి ఉంటే.. పెద్దనోట్ల రద్దుపై ఇంత గందరగోళం చెలరేగేది కాదని అన్నారు.