నోట్లరద్దుతో ఉద్యోగాలు, చిన్నసంస్థలకు ముప్పేనట!
న్యూఢిల్లీ:ప్ రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన డీమానిటైజేషన్ ప్రభావం వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందట. పరిశ్రమ చాంబర్ అసోచామ్ నిర్వహించిన ఓ సర్వేలో ఈవిషయాలు వెలుగులో కి వచ్చాయి. చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) పై ప్రతికూల ప్రభావాన్ని పడేవేస్తుందని అంచనా వేసింది. అలాగే గ్రామీణ వినియోగం, ఉద్యోగాల కల్పనను కూడా పెద్దనోట్ల రద్దు భారీగా ప్రభావితం చేయనుందని తెలిపింది. అయితే పెద్ద వ్యవస్థీకృత రంగాల్లో దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరనున్నాయని అసోచామ్ ఆదివారం వెల్లడిచేసిన సర్వే ఫలితాల్లో ఈ విషయాలను ప్రకటించింది.
గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వ్యవసాయం, సిమెంట్, ఎరువులు, ఆటోమొబైల్, టెక్స్ టైల్స్, రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో చిన్న పరిశ్రమలు, సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని 81.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో త్రైమాసికంలో నష్టాలు తప్పవని చెప్పారు. పెట్టుబడుల ఆధారిత సమస్యలుంటాయని, ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం, డిమాండ్ పడిపోతుందని 66 శాతానికిపైగా అభిప్రాయపడ్డారు.
అయితే నగదు కొరత సంక్షోభం కారణంగా అమ్మకాలు లేక కూరగాయలు, ఇతర పంటలు ధరలు పడిపోయాయనీ, ద్రవ్యోల్బణం మీద అనుకూల ప్రభావాన్ని ఉంటుందని చెప్పారు. మరోవైపు దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ , ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు మేలు చేకూరనుందని సర్వే ద్వారా తేలింది.
కాగా సర్వేలో ఈ ఫలితాలు వెల్లడైనప్పటికీ ప్రస్తుతం వాస్తవ పరిస్థిని అంచనా వేయడం కష్టమనీ, కరెన్సీ కుదుపు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని పడనుందనే అంచనాలకు మరికొంత సమయం పడుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ చెప్పారు.