సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ప్రకటించి రేపటికి (నవంబరు 8) ఏడాది కావస్తోంది. అటు అధికార పక్షం ఈ విజయోత్సవానికి సిద్ధమవుతుండగా, ఇటు ప్రతిపక్షాలు నవంబర్ 8ని బ్లాక్ డేగా ప్రకటించి, నిరసన కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో భారీగా రద్దయిన కరెన్సీని పట్టుకోవడం కలకలం రేపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) రూ. 36.3 కోట్ల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకుంది.
జమ్మూ, కాశ్మీర్లో ఉగ్రవాదంపై నిధుల సేకరణకు సంబంధించిన కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం వెల్లడించింది. రూ. 36,34,78,500 విలువైన నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ప్రదీప్ చౌహాన్, భాగ్వాన్ సింగ్, వినోద్ శెట్టి, షానవాజ్ మీర్, దీపక్ తోఫ్రాన్ని, మజీద్ సోఫి, ఎజాజుల్ హసన్, జస్విందర్ సింగ్, ఉమయిర్ దార్ లను అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ వివరించింది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. జమ్ము కశ్మీర్‌లో ఏ ప్రాంతంలో దాడులు చేసిందీ వివరాలను ఎన్ఐఎ ఇంకా విడుదల చేయలేదు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
కాగా గత కొన్ని నెలలుగా జమ్మూ, కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లోఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు అలజడిని సృష్టిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment