దేశ ప్రయోజనాల కోసమే ‘నోట్ల రద్దు’
రాజ్యాంగవిరుద్ధం కాదు
►హైకోర్టులో ఆర్‌బీఐ కౌంటర్
►నకిలీ నోట్లు, నల్లధనాన్ని రూపుమాపేందుకే నిర్ణయం
► ఆర్‌బీఐ విధానాల్లో జోక్యం తగదని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదిం చింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఆర్థిక సుస్థిరత నెలకొం టుందని వివరించింది. ‘‘వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే, నగదును ఎక్కువమంది డిపాజిట్‌దారులకు అందుబాటులో ఉంచేందుకే ఉపసంహ రణ విషయంలో పరిమితులు విధించాం. లెక్కల్లో చూపని డబ్బున్న వారికి మాత్రమే పెద్ద నోట్ల రద్దు ఇబ్బందిగా పరిణ మించింది. నిజాయితీపరులకు ఇది ఏమాత్రం ఇబ్బందిగా మారలేదు. పాత నోట్లను డిపాజిట్‌కు, మార్పిడికి తగిన ఏర్పాట్లు చేశాం. ఇక నోట్ల రద్దు నిర్ణయం ఎంత మాత్రం రాజ్యాంగ విరుద్ధం కాదు. చట్ట నిబంధనలకు లోబడి తీసుకున్నదే’’ అని పేర్కొంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు, న్యాయవాది కె.శ్రీనివాస్, నగదు ఉపసంహరణ పరిమితు లను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న హైకోర్టు, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్‌బీఐని, కేంద్రాన్ని ఆదేశించడం తెలిసిందే.
ఈ మేరకు ఆర్‌బీఐ ఇష్యూ డిపార్ట్‌మెంట్ ఏజీఎం మనభంజన్ మిశ్రా కౌంటర్ దాఖలు చేశారు. ఆర్‌బీఐ చట్ట నిబంధనలను అనుసరించి, ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫారసుల మేరకే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిం దని అందులో పేర్కొన్నారు. ‘‘ఇటీవలి కాలంలో నకిలీ నోట్ల చలామణి అధికమైంది. ఆర్థిక వ్యవస్థకు, దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన ఈ బెడదను అడ్డుకునే చర్యలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు సిఫార్సు జరిగింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు, ఉగ్రవాదానికి దేశ ఆర్థిక భద్రతను దెబ్బ తీసేందుకు నకిలీ నోట్లను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నోట్ల రద్దుపై ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సిఫారసులను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నిర్ణయం వల్ల దేశ ద్రవ్యవ్యవస్థ గాడిన పడుతుంది. ఆర్థిక విధానాలకు సంబంధించి ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించింది. నోట్ల రద్దుపై ముందస్తు సమాచారమిస్తే అసలు లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర చోట్ల నోట్ల మార్పిడికి, డిపాజిట్‌కు అవకాశం కల్పించాం. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వ్యక్తుల హక్కులకు, ప్రయోజనాలకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోరాదు. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే తద్వారా ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కౌంటర్‌లో వివరించారు. ఈ దృష్ట్యా వ్యాజ్యాలన్నింటినీ భారీ జరిమానాలతో కొట్టేయాలని కోర్టును కోరారు. శుక్రవారం తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.