చైన్నెలోని ఆర్‌బీఐ కేంద్రంలో ఖాతాదారులు
సాక్షి, చైన్నె : రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెలవెల బోయాయి. రిజర్వు బ్యాంక్ వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. వివరాలు.. రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోట్లను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.
దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంక్‌ల ద్వారా మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ప్రజలకు ఊరట కలిగింది. ఇందు కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి అన్ని బ్యాంక్‌లలో రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం చర్యలు తీసుకున్నారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెల వెలబోయాయి. పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతారని భావించి ఏర్పాట్లు చేసినా, ఆ మేరకు ఖాతాదారులు రాకపోవడం గమనార్హం.
ఇక, రాష్ట్రంలో అనేక ప్రైవేటు బ్యాంక్‌లు నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారికి దరఖాస్తుల ఫాంలు ఇచ్చి పూర్తి చేయాలని సూచరించడం గమనార్హం. అయితే, ఎలాంటి వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంక్ పేర్కొన్నా, ప్రైవేటు బ్యాంక్‌లు వివరాలను సేకరించడం వివాదానికి దారి తీసింది. ఇక, చైన్నెలోని రిజర్వు బ్యాంక్ వద్ద ఉదయాన్నే జనం బారులు తీరి, తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. ఒకొక్కరు రూ. 20 వేల వరకు తమ వద్ద ఉన్న రూ 2 వేల నోట్లను అందజేసి రూ. 500 నోట్లను తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment