Money accounts
-
ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే
కర్ణాటక: ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించడంతో ప్రజలు తమ వద్దనున్న నోట్లను ఖర్చు చేయడం, లేదా బ్యాంకుల్లో మార్పిడి చేస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను ఇస్తుంటే కండక్టర్లు తీసుకోవడం లేదు. దీంతో అనేకచోట్ల వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను తీసుకోవాలని ఆ కండక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. బస్సుల్లో ఈ నోట్లను తీసుకుంటారని ఆదివారం స్పష్టం చేశారు. 2 వేల నోట్లను తీసుకోరాదని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. హోసకోటేలో మాత్రమే ఇటువంటి తప్పుడు ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఆందోళన వద్దని అన్నారు. -
వెలవెలబోతున్న బ్యాంక్‌లు
సాక్షి, చైన్నె : రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెలవెల బోయాయి. రిజర్వు బ్యాంక్ వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. వివరాలు.. రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోట్లను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంక్‌ల ద్వారా మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ప్రజలకు ఊరట కలిగింది. ఇందు కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి అన్ని బ్యాంక్‌లలో రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం చర్యలు తీసుకున్నారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెల వెలబోయాయి. పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతారని భావించి ఏర్పాట్లు చేసినా, ఆ మేరకు ఖాతాదారులు రాకపోవడం గమనార్హం. ఇక, రాష్ట్రంలో అనేక ప్రైవేటు బ్యాంక్‌లు నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారికి దరఖాస్తుల ఫాంలు ఇచ్చి పూర్తి చేయాలని సూచరించడం గమనార్హం. అయితే, ఎలాంటి వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంక్ పేర్కొన్నా, ప్రైవేటు బ్యాంక్‌లు వివరాలను సేకరించడం వివాదానికి దారి తీసింది. ఇక, చైన్నెలోని రిజర్వు బ్యాంక్ వద్ద ఉదయాన్నే జనం బారులు తీరి, తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. ఒకొక్కరు రూ. 20 వేల వరకు తమ వద్ద ఉన్న రూ 2 వేల నోట్లను అందజేసి రూ. 500 నోట్లను తీసుకెళ్లారు. -
ఈనాడు నీతులు ఎదుటివారికే పరిమితం.. సొమ్ము మళ్లించి మార్గదర్శి ఎదురుదాడి!
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం కంపెనీలు నడుపుతున్న మార్గదర్శి యాజమాన్యం తప్పులను కప్పిపుచ్చేందుకు మీడియా ముసుగులో ఎదురుదాడి చేస్తోంది. మార్గదర్శిలో జరిగిన ఉల్లంఘనలు, మోసాల గురించి స్పందించకుండా ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని గగ్గోలు పెడుతోంది. తనిఖీ అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి దందాలు చేస్తాం.. అడగడానికి మీరెవరంటూ ఎదురు దాడికి దిగుతోంది. మార్గదర్శి సహాయ నిరాకరణ తనిఖీల సందర్భంగా మార్గదర్శి సిబ్బంది అధికారులకు సహకరించలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారు. కనీసం చిట్లు ఎవరు కడుతున్నారో కూడా వెల్లడించలేదు. రికార్డులు చూపించకపోవడం, అడిగిన సమాచారం ఇవ్వకపోవడాన్ని బట్టి ఆ సంస్థలో ఇంకెన్ని మోసాలు జరిగాయోననే అనుమానాలు తనిఖీ అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శిలో చిట్టీలు ఎవరు కడుతున్నారనే జాబితాను కూడా అధికారులకు ఇవ్వలేదు. మాకు తెలియదు.. హైదరాబాద్ నుంచే సాధారణంగా ఏ చిట్‌ఫండ్ కంపెనీలోనైనా ఫోర్‌మెన్ ప్రధానం. ప్రతి బ్రాంచికి ఒక ఫోర్‌మెన్‌ను ఆయా కంపెనీలు నియమించుకుంటాయి. అక్కడ నిర్వహించే చిట్టీలన్నింటికీ అతడే జవాబుదారీ. ప్రతి చిట్టీ, చందాదారులు, లావాదేవీల సమాచారం అంతా అతడు చిట్స్ రిజిస్ట్రార్‌కి సమర్పించాలి. మార్గదర్శి బ్రాంచిల్లో ఫోర్మెన్లు మాత్రం తనిఖీ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఏ ప్రశ్న అడిగినా తమకు తెలియదని చెప్పారు. కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోని హెడ్ క్వార్టర్ నుంచే నడుస్తాయని తెలిపారు. బ్రాంచీల అకౌంట్లన్నీ అక్కడే ఉన్నాయని, చందాదారులు కట్టిన సొమ్మంతా అక్కడికే పంపిస్తున్నామని, తమకు చెక్ పవర్ కూడా లేదని ఫోర్మెన్లు చెప్పారు. అధికారులు అడిగిన చట్టబద్ధమైన సమాచారం ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. చిట్స్ రిజిస్ట్రార్ చట్టబద్ధంగా అడిగిన సమాచారాన్ని ఫోర్‌మెన్ ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధం. హెడ్‌క్వార్టర్ ఆదేశాలు లేకుండా తాము ఏమీ చేయలేమని, ఏ సమాచారాన్ని వెల్లడించలేమంటూ ఫోర్మెన్లు తప్పించుకున్నారు. సోదాల్లో దొరికిన డాక్యుమెంట్ల గురించి వివరణ కోరినా సాయంత్రం వరకూ రకరకాల సాకులు చెప్పి ఆ తర్వాత తమకు తెలియదని జారుకున్నారు. పలు కంపెనీల్లో తనిఖీలు మార్గదర్శితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్‌ఫండ్ కంపెనీల్లో మూడు విడతలుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), జీఎస్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అక్టోబర్ 21, 31, నవంబర్ 15వతేదీల్లో ఈ తనిఖీలు జరిగాయి. 15వ తేదీన తనిఖీల సందర్భంగా మార్గదర్శి సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో వివరాల సేకరణ కోసం మూడు రోజులు ఆ సంస్థల్లో తనిఖీలు చేయాల్సి వచ్చింది. వారు సహకరించి ఉంటే మిగిలిన సంస్థల మాదిరిగానే ఒక్క రోజులో తనిఖీలు పూర్తయ్యేవి. మార్గదర్శితోపాటు కపిల్ చిట్స్, ఉషాబాల, క్యాపిటల్, బల్చియా, ఎస్టీఆర్, సూర్యచంద్ర, జగత్ జనని, చలపతి, చిరంజీవ, వజ్రాంకుర లాంటి పలు చిట్‌ఫండ్ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈనాడు మాత్రం తమకు చెందిన మార్గదర్శి సంస్థల్లోనే తనిఖీలు జరుగుతున్నాయని, తమపై కక్ష సాధిస్తున్నారని బుకాయిస్తోంది. బలపడుతున్న అనుమానాలు ఫోర్మెన్లు సమాచారం ఇవ్వకపోవడాన్ని బట్టి చిట్టీల నిర్వహణలో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయి. చిట్టీల సొమ్మును హైదరాబాద్‌లోని అకౌంట్లలోకి మళ్లించినట్లు ఇప్పటికే గుర్తించారు. మళ్లించిన డబ్బు ఏం చేస్తున్నారు? ఎక్కడ పెట్టుబడి పెట్టారనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అకౌంట్లను బ్రాంచీల వారీగా నిర్వహించకుండా హెడ్‌క్వార్టర్ నుంచే నడిపిస్తుండడంతో చందాదారుల్లో బినామీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చందాదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసి హెడ్‌క్వార్టర్‌కి బదిలీ చేస్తున్నట్లు వీటన్నింటిపై తనిఖీ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈనాడు నీతులు ఎదుటివారికే పరిమితం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, చిట్‌ఫండ్ కంపెనీలు ప్రజల నుంచి డబ్బులు తీసుకుని ఇష్టానుసారంగా ఇతర కంపెనీలకు, సొంత అవసరాలకు మళ్లిస్తుంటే చట్టం ఒప్పుకుంటుందా? ఉల్లంఘనలు జరగకుండా చూడడమే ప్రభుత్వ ఏజెన్సీల బాధ్యత అనే విషయం చిట్ నిర్వాహకులకు తెలియదా? ఖాతాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షించడమే ఆ ఏజెన్సీల ప్రధాన బాధ్యత. తప్పులు జరిగితే వాటిని గుర్తించడం తప్పు ఎలా అవుతుందో ఈనాడు యాజమాన్యమే చెప్పాలి. ప్రజాస్వామ్యం గురించి పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తూ అదంతా ఎదుటి వారికే పరిమితం.. తమకు వర్తించదనే రీతిలో ఈనాడు వ్యవహరిస్తోంది. -
డిపాజిట్ సొమ్ము ఎక్కడ?
సాక్షి, రేగోడ్(మెదక్) : పోస్టల్ డిపార్ట్మెంట్ అంటేనే నమ్మకం. ఎన్నో ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అలాంటి సంస్థలో వినియోగారుల సొమ్ము స్వాహా చేసిన సంఘటన రేగోడ్ పోస్టాఫీస్‌లో చోటు చేసుకుంది. ఓ అధికారి వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగంపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా కనీసం విచారణకు నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. డబ్బు ఇవ్వకుండా మోసం.. మండల కేంద్రమైన రేగోడ్‌లో పోస్ట్‌ఆఫీస్‌లో ఓ అధికారి సబ్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి జమ కోసం ఇచ్చిన డబ్బులు, విత్‌డ్రా కోసం ఓచర్లపై సంతకాలు చేసినా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పదిహేను రోజులు దాటినా.. డబ్బులు రాకపోవడంతో సంబంధిత స్థానిక పోస్ట్ ఆఫీస్ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేసి పదిహేను రోజులు దాటినా స్పందించడం లేదని తెలుస్తోంది. కష్టపడి జమచేసుకున్న డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులకోసం ఫోన్‌చేస్తే ఇష్టానుసారంగా అధికారి మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. పన్నెండు మంది వినియోగదారుల సొమ్ము.. 7 గ్రామాలు, 12 మంది వినియోగదారులకు సంబంధించిన రూ.3లక్షల 79వేల 300లను అధికారి స్వాహా చేసినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతరెండు నెలలుగా తమ డబ్బులు తమకు ఇవ్వాలని పోస్ట్ఆఫీస్కు తిరుగుతున్నా పోస్ట్‌ఆఫీస్‌లో కనిపించడం లేదు. అక్కడ సిబ్బందిని అడిగినా అధికారి ఈ రోజు, రేపు వస్తాడని చెబుతున్నాడని పేర్కొన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు ఈ విషయమై స్థానిక సబ్ పోస్ట్‌మాస్టర్ కృష్ణను సోమవారం వివరణ కోరగా.. ఆరోగ్యం బాగాలేక సెలవులో ఉన్నానని, అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదని తెలిపారు. కొందరు కావాలని నాపై లేనిపోనివి చెబుతున్నారని. ఆధారాలు ఉంటే చూపించాలని తెలిపారు. ఓచర్‌పై సంతకం తీసుకుని ఇవ్వడం లేదు సుమారు 2000 సంవత్సరంలో రేగోడ్ పోస్ట్ ఆఫీస్‌లో జీవిత బీమాలో డబ్బులను జమ చేశాను. గత 19 ఏళ్లుగా జమ చేస్తూనే ఉన్నా. ఇటీవల పాలసీ పూర్తయింది. దీంతో గతనెలలో డబ్బులు తీసుకునికి పోస్ట్ఆఫీస్కు వెళ్తే ఓచర్‌పై సంతకం తీసుకుని డబ్బులు లేవని, పైనుంచి రాగానే ఇస్తానని తెలిపారు. డబ్బుల కోసం మళ్లీ పోస్ట్‌ఫీస్‌కు వెళ్తే అధికారి లేరు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం. – భారతమ్మ, పోచారం విచారణకు ఆదేశించాం.. రేగోడ్ సబ్ పోస్ట్‌మాస్టర్ కృష్ణ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.అయితే కృష్ణ నిజంగా అవకతవకలకు పాల్పడ్డారా? లేదా? అనే విషయమై వాస్తవాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – బీవీ రమణ, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ (ఎస్పీ) -
ధాన్యం డబ్బులేవి..!
వీణవంక(హుజూరాబాద్): కరువు పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు మొండి చేయి చూపాయి. సీడ్(ఆడ, మగ)ను తీసుకెళ్లి.. పది రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి 40రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చేతిలో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గత్యంతరం లేక ప్రైవేటు అప్పును ఆశ్రయిస్తున్నారు. రబీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48వేల ఎకరాల్లో హైబ్రీడ్ వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 8వేల ఎకరాలలో పంట ఎండిపోయింది. సుమారు 2.52లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ లెక్కన రూ.100కోట్లు రైతులకు కంపెనీలు బకాయి పడ్డట్లు సమాచారం. రాష్ట్రంలోనే హైబ్రీడ్(ఆడ, మగ)సీడ్ వరి సాగులో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విత్తనోత్పత్తికి ఇక్కడి నేలలు అనువుగా ఉన్నాయి. అందుకే జిల్లాలో సాగు చేయడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. 30 ఏళ్లుగా ఇక్కడి రైతులు హైబ్రీడ్ వరిని సాగు చేస్తున్నారు. ప్రతీ కంపెనీ రైతుల పేరున బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించడం లేదు. రెండు మూడు కంపెనీలు మాత్రమే రైతులకు చెక్కు రూపంలో ఇస్తున్నాయి. మిగిలిన కంపెనీలు తమ ఏజెంట్ల ఖాతాలో జమ చేస్తున్నాయి. దీంతో ఏజెంట్లు డబ్బులను తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలే కరువుతో గత మూడేళ్లుగా ఆశించిన దిగుబడి లేక రైతులు కుదేలయ్యారు. ఇప్పుడు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా కంపెనీలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం లేక.. శ్రమకు తగిన ఫలితం లేక రైతులు కుదేలవుతున్నారు. క్వింటాల్‌కు రూ.4వేల నుంచి 8వేల వరకు చెల్లిస్తుండడంతో సీడ్ వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఒప్పందం ప్రకారం చెల్లిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు సాగు చేశారు. కానీ ఖరీఫ్ ప్రారంభమైనా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు. సీడ్ కంపెనీలు మరో మాయాజాలానికి తెరలేపాయి. క్వింటాల్‌కు 10కిలోల చొప్పున తరుగు పేరుతో నిలువు దోపిడీకి దిగుతున్నారు. ఈ లెక్కన అదనంగా రూ.800 నష్టపోతున్నారు. అదేవిధంగా కాంటాలలో 4నుంచి 5కిలోల వ్యత్యాసం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఆర్గనైజర్ల చేతివాటం.. సీడ్ కంపెనీలు నేరుగా రైతుకు విత్తనం ఇవ్వకుండా ఆయా గ్రామాల్లో డీలర్లు(ఆర్గనైజర్లు)ను నియమిస్తుంది. వారి ద్వారా విత్తనం సాగు చేయిస్తుంటారు. ఇక్కడ డీలర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ మల్టినేషన్ కంపెనీ క్వింటాల్ రూ.7వేలు చెల్లిస్తుండగా సదరు డీలర్లు రూ.6వేలకే రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన క్వింటాల్‌కు వెయ్యి అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఇలా కొద్ది రోజుల్లోనే రైతులను నిలువున ముంచుతూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కొన్ని కంపెనీలు నాలుగు రోజుల క్రితం ఏజెంట్లకు డబ్బులు ఇచ్చారని తెలిసింది. కానీ ఏజెంట్లు తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులకు మొండి చెయ్యి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.100కోట్లు పెండింగ్.. హైబ్రీడ్ వరిని శంకరపట్నం, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడుతోపాటు జగిత్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు 15క్వింటాల దిగుబడి వస్తుందని కంపెనీలు చెప్పినా 6 నుంచి 8క్వింటాలలోపు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. ఈ లెక్కన 2.52లక్షల క్వింటాల దిగుబడి వచ్చిందని అంచనా. సుమారు రూ.100కోట్ల పైగా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగజేసుకొని సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి.. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వని కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్ ప్రారంభమైనా ఇంత వరకు చిల్లిగవ్వ రైతులకు అందలేదు. పది రోజుల్లో ఇస్తామని రైతులకు చెప్పి నెలల కొద్ది తిప్పుతున్నారు. గతంలో కంపెనీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. తరుగు, తేమ పేరుతో క్వింటాల్‌కు 10కిలోలు తీసేస్తున్నారు. కొన్ని కంపెనీలు బహిరంగ దోపిడీకి దిగుతున్నాయి. పద్ధతి మార్చుకోకపోతే రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తాం.– మడుగూరి సమ్మిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి -
చర్చించుకుందాం రండి!
నల్లధనంపై భారత అధికారులకు స్విస్ ఆహ్వానం న్యూఢిల్లీ/బెర్న్: నల్లధనం ఖాతాల విషయంలో చర్చలు జరపడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత అధికారులను తమ దేశానికి ఆహ్వానించింది. అయితే దీనిపై తదుపరి వివరాలను తెలపడానికి స్విస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల ద్వారా బయటకు వచ్చిన భారత ఖాతాదారుల జాబితా విషయంలో ఎలాంటి చర్చలూ ఉండవని తెలుస్తోంది. ఆయా బ్యాంకుల్లో పనిచేసిన మాజీ ఉద్యోగుల ద్వారా ఈ జాబితాలు బయటకు వచ్చాయని సమాచారం. అక్రమపద్ధతుల్లో బయటకు వచ్చిన వివరాలపై తాము మాట్లాడబోమని స్విస్ అధికారులు అంటున్నారు. ‘నల్ల’ నోట్లలో నకిలీలు భారత్‌కు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు స్విట్జర్లాండ్‌లో దాచుకున్న నల్లధనం గురించి ఓ వైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతుంటే మరో పక్క ఈ నల్లధనంలో నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ అధికారులు గుర్తించారు. యూరోలు, డాలర్ల తర్వాత భారత కరెన్సీలోనే ఎక్కువగా నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ పోలీసులు తెలిపారు. 2013 సంవత్సరంలో 2,394 నకిలీ యూరోనోట్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 1,101 నకిలీ అమెరికా డాలర్లు వచ్చినట్లు కనుగొన్నారు. ఇక భారత కరెన్సీ విషయానికి వస్తే 2013లో 403 నకిలీనోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయంలో భారత్ మూడోస్థానంలో ఉందని స్విస్ పోలీసులు విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో రూ. 500 నోట్లు 380, 23 వెయ్యిరూపాయల నోట్లు ఉన్నట్టు గుర్తించారు.