నోట్ల రద్దు: ఆర్బీఐకి మన్మోహన్ కీలక ప్రశ్నలు!
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ సమావేశం సందర్భంగా గురువారం పెద్దనోట్ల విషయంలో ఆర్బీఐకి మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్‌సింగ్ కీలక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. పెద్దనోట్ల రద్దు విషయంలో చర్చించుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి తగినంత సమయం ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్లమెంటరీ కమిటీ ముందుకు ప్రభుత్వ, ఆర్బీఐ అధికారులను హాజరుపరుచాలని, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వాదనను కూడా కమిటీ వినాలని మన్మోహన్ సూచించినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పూర్వాపరాలను చర్చించడానికి, దీనిపై తగిన సలహాలు ఇవ్వడానికి ఏర్పాటైన ఈ పార్లమెంటరీ కమిటీ భేటీకి స్వతంత్ర ఆర్థిక నిపుణులను కూడా ఆహ్వానించారు. ప్రముఖ ఆర్థికవేత్తలు రాజీవ్‌కుమార్, మహేశ్ వ్యాస్, కేంద్ర గణాంకశాఖ మాజీ చీఫ్ ప్రోణబ్ సేన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన కవితారావు తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పలువురు ఆర్థిక నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
‘ఆర్బీఐ గవర్నర్‌ను ఎప్పుడు కమిటీ ముందుకు పిలువాలనే దానిపై మేం చర్చిస్తున్నాం. అధికారిక నోటు ప్రకారం నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం నవంబర్ 7న తీసుకోగా, నవంబర్ 8న దీనిపై ఆర్బీఐ బోర్డు చర్చించిందని మన్మోహన్ పేర్కొన్నారు. కాబట్టి స్థాయీ సంఘం మొదట ప్రభుత్వం వాదన విని.. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ వాదన వింటే బాగుంటుందని మన్మోహన్ సూచించారు. ఆర్బీఐ స్వతంత్రత గురించి ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించాలని ఆయన కమిటీకి సూచించారు’ అని కమిటీ సభ్యుడొకరు మీడియాకు తెలిపారు.