
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్‌డేగా పాటించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ, గతేడాది నవంబరు 8న నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ఆరోపించారు.
యూపీఏ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నిర్ణయాలతో బలోపేతమైన ఆర్థిక వ్యవస్థను మోదీ విచ్ఛిన్నం చేశారని విమర్శించారు. దీని వల్ల అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. 50 రోజులు ఓపికపడితే నల్లధనం బయటకు తెస్తానన్న మోదీ ఇప్పుడు దేశ ప్రజలకు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కొత్త నోట్ల ముద్రణకు, బ్యాంకులో జమ అయిన మొత్తానికి వడ్డీల పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment