మొన్నటి లేఖ.. నిన్నటి మాట.. తూచ్ బాబూ తూచ్
- నోట్ల రద్దుపై మాట మార్చిన చంద్రబాబు
- ఎన్నో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నా..
- నోట్ల రద్దు సమస్యకు మాత్రం పరిష్కారం కన్పించడం లేదు
- ప్రజల కష్టాలు చూస్తుంటే బాధేస్తోందన్న ముఖ్యమంత్రి
- ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని వ్యాఖ్య
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దుపై చంద్ర బాబు మాట మార్చారు. నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదని అన్నారు. ‘కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దీని వలన ఒక కష్టం.. నష్టం కాదు. లెక్క లేనన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. హుద్ హుద్ తుపాను వల్ల విశాఖకు తీవ్ర నష్టం జరిగితే 8 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేశా. ఆగస్టు సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించాను. నోట్ల రద్దు వలన కలుగుతున్న కష్టాలను మాత్రం అధిగమిం చలేకపోతున్నా. రోజుకు రెండు మూడు గం టలు బ్యాంకర్లతో సమీక్షలు జరుపుతున్నా ఉపయోగం ఉండటం లేదు. దీని వలన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. డిసెంబర్ నెలలో వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందచే యలేకపోయాను. ఎంతోమంది వృద్ధులు నోట్ల మార్పిడి సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది. రిజర్వు బ్యాంకు కొద్దికొద్దిగా నోట్లు విడుదల చేస్తుండటంతో వాటి కోసం ప్రజలు ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద గంటల తరబడి బారులు తీరి నిల్చుంటున్నారు..’ అని సీఎం అన్నారు.
పనిచేయని వారిని పక్కన పెట్టేస్తా
‘పార్టీలో ఇటీవల క్రమ శిక్షణ తగ్గింది. ఏం జరిగినా పర్వాలేదులే అనే అభిప్రాయంలో నాయకులు ఉన్నారు. గతంలో ప్రతీ నాయకుడు, కార్యకర్త పచ్చ చొక్కా వేసుకుని పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు’ అని (కొందరు నాయకులు తెల్ల చొక్కాలు వేసుకుని రావడంతో) టీడీపీ నేతలతో నిర్వహించిన కార్యగోష్టిలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నేతలు తప్పులు చేసి పార్టీని పణంగా పెట్టమంటే అంగీకరించేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నేతలు చేసిన తప్పుల వల్ల పార్టీ నష్టపోకుండా వ్యవహరించాలని సూచిం చారు. నేతలందరి పనితీరుపై సర్వేలు చేస్తున్నామని, ఎవరి జాతకం ఏమిటో తన వద్ద ఉందని, దాని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు వారి పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌లు ఇచ్చిన చంద్రబాబు వాటిని సీల్డ్ కవర్‌లో అందచేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రకటించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
చంద్రబాబు కప్పదాటు వైఖరికి, ఏదైనా మంచి జరుగుతుందనుకుంటే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు, బెడిసికొట్టేలా ఉంటే గతాన్ని మరిచి వెంటనే ఎలా మాటలు మార్చేస్తారో చెప్పడానికి నిదర్శనాలు ఇవిగో...
సీన్ 1
పెద్ద నోట్ల రద్దు గురించి లీక్ అందిన నేపథ్యంలో.. ఆ క్రెడిట్ కొట్టేయాలనే ఉద్దేశంతో అక్టోబర్ 12న ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు. నల్లధనం దేశ ఆర్థిక మూలాలను శాసిస్తోందని, రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయాలని విజ్ఞప్తి. నగదు రహిత లావాదేవీలే నల్లధనానికి మందు అని పేర్కొన్న వైనం.
సీన్ 2
నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించగానే అర్ధరాత్రి హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు. పెద్ద నోట్ల రద్దు చారిత్రాత్మక నిర్ణయమంటూ హర్షం. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థగా నల్లధనం విస్తరించడానికి రూ.500, రూ.1,000 నోట్లు ఉపకరిస్తాయని పేర్కొన్న చంద్రబాబు. ఈ నోట్ల రద్దు కోసం తాను చాలాకాలంగా పోరాడుతున్నానని వెల్లడి. తాను డిమాండ్ చేయడం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య.
సీన్ 3
ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరడం, నగదు కొరత నేపథ్యంలో.. నవంబర్ 28న సమీక్ష సందర్భంగా బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. నోట్ల రద్దు మంచిదే కానీ అమలే సరిగ్గా కావడం లేదని, ఇందుకు బ్యాంకర్ల వైఫల్యమే కారణమని, వారిని సమన్వయ పరచాల్సిన ఆర్బీఐ ప్రధాన భూమిక పోషించడం లేదని మండిపాటు. నోట్ల కష్టాలు తాత్కాలికమేనని వ్యాఖ్య.
సీన్ 4
పెద్ద నోట్లు రద్దై 40 రోజులు దాటుతున్నా ప్రజల కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. మంగళవారం టీడీపీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘పెద్ద నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదు..దీనివల్ల కనుచూపు మేరలో పరిష్కారం కన్పించని ఎన్నో సమస్యలు ఉన్నాయి..’ అంటూ తప్పును ప్రధాని మోదీపై నెట్టివేసేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి.