సాక్షి, చిత్తూరు : ఆర్బీఐ, ఎన్నికల కమిషన్, సీబీఐ వంటి సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీ కబంధ హస్తాల్లో నలిగి పోతున్నాయని సీసీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యాభై రోజుల్లో నోట్ల రద్దు ప్రయోజనాలు లేకుంటే తనని కాల్చి చంపాలని మోదీ చెప్పారని, ఈ లెక్కన ఆయనను 24 సార్లు కాల్చి చంపాలంటూ మండిపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ పరిస్థితి డోలాయమానంలో పడిందన్నారు.
ఎన్డీయే పాలనను అంతం చేసేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని నారాయణ పేర్కొన్నారు. రఫేల్ కుంభకోణంతో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందన్నారు. ఎన్నికల కమిషన్ సైతం మోదీ అడుగుజాడల్లో నడుస్తోందని ఆరోపించారు. సీబీఐ ప్రస్తుతం ముక్కలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్షణ పేరుతో దళితులపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు.
ఇక.. పొత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ప్రస్తావిస్తూ, ఆయన ఎప్పుడు ఎవరితో కాపురం చేస్తారో తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ సవ్యంగా సాగడం లేదని, సిట్ నివేదికపై తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయని నారాయణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment