సాక్షి, హైదరాబాద్ : చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రి వెంగళప్ప అట. మీరెప్పుడైనా ఐదు వేల నోటు చూశారా. అలాటింది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం... ఐదు వేల నోటును రద్దు చేయమని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారట. వినేందుకు నమ్మకశ్యం కాకపోయినా... ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ మొదలు నోబెల్ పురస్కారాల వరకూ ప్రతిదానిలో ‘నేనే’ అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటే. మరి అలాంటిది చంద్రబాబు చెబితే నమ్మాల్సిందే కదా. (గాంధీలా బతుకుతున్న నన్నంటాడా?)
అంతెందుకు అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడంతో పాటు, దేవేగౌడను ప్రధాని మంత్రిని చేయడం, పీవీ సింధుకు బ్యాడ్మింటన్ నేర్పించడం, సత్యా నాదెళ్లకు కంప్యూటర్ కోర్సు చేయమని తానే చెప్పానంటూ మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ అభాసుపాలయ్యారు కూడా. చేసిందేమీ లేకపోయినా... వాటి క్రెడిట్‌ను తన ఖాతాలోకి వేసుకుని, మీడియాలో గప్పాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు... పెద్దనోట్లు రద్దు అంశంపై మీడియా సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. అప్పట్లో నోట్ల రద్దు సూపర్, శెభాష్... అదంతా నా క్రెడిట్ అన్న బాబుగారూ... తాజాగా పెద్దనోట్ల రద్దు చెత్త నిర్ణయం అంటూ మాట మార్చారు.
కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ ఘనకీర్తీ అంతా తనదేనని, తాను చెబితేనే ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేశారంటూ అవకాశం దొరికిప్పుడల్లా ఊదరగొట్టారు చంద్రబాబు. గత ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీతో జతకట్టి గద్దెనెక్కిన చంద్రబాబు... మోదీ సర్కార్ ఏం చేసినా... తానా, తందానా అంటూ ఒత్తాసు పలికారు. నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు నాయుడు మాత్రం.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని తానే స్వయంగా నరేంద్ర మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు. అంతేకాకుండా పెద్ద నోట్లరద్దు చేయగానే మోదీకి ఫోన్ చేసి అభినందించానని మీడియా సాక్షిగా చిరునవ్వులు చిందిస్తూ చెప్పుకొచ్చారు.
గతంలో మోదీ సర్కార్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన చంద్రబాబు... తాజాగా ప్రధాని గుంటూరు పర్యటన అనంతరం తన ద్వంద్వ వైఖరిని మరోసారి బయట పెట్టారు. బుద్ధి ఉన్నవాడు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటాడా అంటూ మండిపడ్డారు. ఇది పిచ్చి తుగ్లక్ చర్య అని, వెయ్యి నోటు రద్దు చేసి, రెండువేల నోటు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదండోయ్... ఏకంగా అయిదువేల రూపాయల నోటును రద్దు చేయాలని కూడా అప్పట్లో చెప్పారట. అసలు ఐదువేల నోటు చెలామణిలో ఉందా? ఆ విషయం చంద్రబాబుకు తెలిసే మాట్లాడారా లేక, తన అజ్ఞానాన్ని మరోసారి బయట పెట్టుకున్నారా? అనేది పాపం ఆయనకే తెలియాలి మరి. ఇక్కడ చంద్రబాబుకు అర్థం కానిది ఒక్కటే. మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. చేసిన గొప్పలు ఇంకెవరైనా చెబితేనే... జనాలు నమ్ముతారనే విషయం చంద్రబాబుకు ఎప్పుడు అర్థం అవుతుందో?
Comments
Please login to add a commentAdd a comment