గార్షియా మార్క్వెజ్ కన్నుమూత
* సాహిత్యంలో మేజికల్ రియలిజం ప్రక్రియకు ఆద్యుడు
* 1982లో నోబెల్ అవార్డు విజేత
* లాటిన్ అమెరికా గొంతుకగా ప్రఖ్యాతి
మెక్సికో సిటీ: ప్రఖ్యాత లాటిన్ అమెరికన్ రచయిత, నోబెల్ అవార్డు గ్రహీత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్(87) గురువారం కన్నుమూశారు. గత నెల 31న న్యూమోనియాతో అస్వస్థతకు గురైన మార్క్వెజ్ ఆసుపత్రిలో వారం రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. మెక్సికో సిటీలోని ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచేటప్పుడు భార్య మెర్సిడెస్ బర్కా, ఇద్దరు కుమారులు గార్షియా పక్కనే ఉన్నారు. మార్క్వెజ్ 1927, మార్చి 6న కొలంబియాలో జన్మించారు. ప్రేమ, కుటుంబం, నియంతృత్వం వంటి అంశాల నేపథ్యంగా మార్క్వెజ్ చేసిన అనేక రచనలు లాటిన్ అమెరికా పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తన రచనల్లో మేజికల్ రియలిజం పద్ధతిని ప్రవేశపెట్టిన మార్క్వెజ్ ఆ ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచారు. ప్రపంచ సాహిత్య రంగంలో ‘గాబో’గా సుపరిచితులైన ఆయన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్(వందేళ్ల ఏకాంతం-1967)’, ‘ఇన్ ఈవిల్ అవర్’(1962), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’(1985) వంటి నవలలు, ‘లీఫ్ స్టార్మ్’(1955), ‘నో వన్ రైట్స్ టు ది కల్నల్’(1961) వంటి నవలికలతో ఖ్యాతిని పొందారు. సాహిత్యరంగంలో కృషికి గుర్తింపుగా 1982లో నోబెల్ అందుకున్నారు. మార్క్వెజ్ మృతి పట్ల కొలంబియన్ అధ్యక్షుడు జువాన్ మానుయెల్ శాంటోస్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఇది వెయ్యేళ్ల ఒంటరితనం, పెను విషాదం అని పేర్కొన్నారు. మూడురోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
మార్క్వెజ్ మృతి నేపథ్యంలో కొలంబియన్లు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. గొప్ప దార్శనికత కలిగిన ఓ రచయితను ప్రపంచం కోల్పోయిందం టూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబా మా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తీవ్ర సంతాపం ప్రకటించారు. ‘లాటిన్ అమెరికా గొం తు అయిన మార్క్వెజ్ ప్రపంచం గొంతుకగా కూడా నిలిచారు. ఆయన ఊహ మనల్ని సంపన్నులను చేసింది. ఆయన మరణం మనల్ని పేదల్ని చేసింది’ అని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు జోస్ మానుయెల్ బరాసో పేర్కొన్నారు. మార్క్వెజ్ భౌతిక కాయాన్ని సోమవారం ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మార్మిక లోక విహారి!
‘మిత్రుడంటే నీ చేతిని అందుకోవాలి. నీ గుండెను మీటాలి’ అంటాడు మార్క్వెజ్. ఆయ న తన కలంతో లాటిన్ అమెరికా ప్రజలందరి గుండెలనూ తాకాడు. మార్క్వెజ్ రచనల్లో సౌందర్యం, రాజకీయ, సామాజిక స్పృహ సమతూకంలో కనిపిస్తాయి. అదంతా ఆయన లాటిన్ అమెరికా ఐక్యత కోసం పడిన తపనకు ప్రతిబింబమే. ఆ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని ఆయన సదా వ్యతిరేకించాడు. అందుకే అమెరికా ఆయన రాకపై పదేళ్లు నిషేధం విధించింది. ‘మంత్ర వాస్తవికత’(మేజిక్ రియలిజమ్)తో ప్రపంచ సాహితీ లోకాన్ని మైమరపించిన మార్క్వెజ్ స్పానిష్ భాషకు అసాధారణ గౌరవం తెచ్చి పెట్టాడు.
17వ శతాబ్ది రచయిత సెర్వాంటెస్ తర్వాత ఆ భాషకు విశ్వసాహిత్యంలో గుర్తింపు తెచ్చిన వాడిగా లాటిన్ అమెరికా ఆయనను గుర్తు పెట్టుకుంది. కొలంబియాలోని అరాకటాక గ్రామంలో(ఆయన రచనలలోని అద్భుత కాల్పనిక గ్రామం మకుండో ఇదే) పెరిగిన మార్క్వెజ్‌ను స్థానిక అంశాలు ప్రభావితం చేశాయి. కొలంబియా అంతర్యుద్ధం, లిబరల్ పార్టీ, మాఫియా, కన్నీళ్లు, కడలి అందాలు- అన్నీ ప్రభావం చూపాయి. 3 కోట్ల ప్రతులు అమ్ముడుపోయి, మార్క్వెజ్ కీర్తిని విశ్వవీధుల్లో ఎగరరేసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూ డ్ ’(నూరేళ్ల ఏకాంతం, 1967) నవలానాయకుడి పాత్రకు ప్రేరణ.. కొలంబియా అంతర్యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆయన తాతే. అందుకే ఆ నవలలో లాటిన్ అమెరికన్ల ఆత్మ కనిపిస్తుంది. 18వ ఏట రచనా వ్యాసంగం ఆరంభించిన మార్క్వెజ్ విశేష సాహిత్య సంపదను ఇచ్చిపోయాడు.