Gabriel Garcia Marquez
-
ఉన్నట్లా? లేనట్లా?
దైవికం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ కొలంబియా రచయిత. 87 ఏళ్ల వయసులో అనారోగ్యం వల్ల ఇటీవలే చనిపోయారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖులైన రచయితలలో ఒకరిగా ఆయనకు పేరు. నోబెల్ గ్రహీత. గట్టి అభిప్రాయాలు ఉన్న మనిషి. ధైర్యం కూడా ఎక్కువే. ఎంత ధైర్యం అంటే... తన దేశ రాజకీయ విధానాలను సైతం అయన బహిరంగంగానే విమర్శించేవారు. అంతటి మనిషి కూడా దేవుడి ఉనికి విషయంలో చివరి వరకు సంశయంగానే ఉండిపోయారు! ‘‘దేవుణ్ణి నమ్మను. కానీ దేవుడంటే భయపడతాను’’ అంటారు గార్షియా. బహుశా ఉన్నాడు అని నమ్మి ఉంటే, ఆయనకా భయం ఉండకపోయేదేమో. ఇంతకూ గార్షియాకు దేవుడంటే భయం దేనికి? రాజకీయ విధానాలను విమర్శించినట్లుగా... ఆ విధాత తలపుల గురించి కూడా తాను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడతానేమోనన్న భయమా? చెప్పలేం. అయితే ఆయన రాసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’, ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రియార్క్’ నవలల్ని గమనిస్తే దేవుడి ఉనికి పట్ల సందేహాలున్న వ్యక్తికి అంతటి ఊహాశక్తి (సృజన) ఎలా సాధ్యం అని కూడా అనిపిస్తుంది. మొత్తానికి గార్షియా అలా అనడం (దేవుణ్ణి నమ్మను. కానీ భయపడతాను అని)... మానవ స్వభావాలపై ఆయన పరిశీలనకు ఒక వ్యక్తీకరణ కావచ్చు. ఇదంతా కాదు, గార్షియాకు దేవుడు ఉన్నట్టా? లేనట్టా? ఏమో ఆయనే బతికొచ్చి చెప్పాలి. దేవుడిపై గార్షియాకు ఉన్న సంశయం లాంటిదే, గార్షియా లోని ‘యాగ్నాస్టిసిజం’పై మన సంశయం. యాగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ విశ్వసించేవాడు కాదు. ఉన్నాడో లేదోనన్న సంశయంలో ఉన్నవాడు. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత. దేవుణ్ని నమ్ముకున్న వారు సుఖంగా నిద్రపోతారు... ఆయన ఉన్నాడన్న నిశ్చింతతో. దేవుడు లేడనుకున్నవారు సుఖనిద్రకు ఏర్పాట్లు చేసుకుంటారు... ఎవరూ లేరన్న నిశ్చయంతో. ఇక మిగిలింది సంశయశీలురు. దేవుడు ఉన్నాడో లేడో తెలీక పక్కపై అటు ఇటు కదులుతుంటారు. తెల్లారుతుంది కానీ ఏదీ తేలదు. ‘తెల్లారడం’ దైవికం అని తెలుసుకునే వరకు సంశయం తొలగిపోదు. తెల్లారడం అంటే చీకటి చెదిరిపోయి, వెలుగు వ్యాపించడం ఒక్కటేనా? మౌనంగా, మాటమాత్రం లేకుండా జరిగిపోయేవి చాలా ఉంటాయి. చల్లని గాలికి నెమ్మదిగా ఊగే పచ్చటి చెట్లు, పరిమళాలు వెదజల్లే పూలు, మంచుతో తడిసిన గడ్డి.. అన్నీ తెల్లారడంలో భాగమే. అన్నీ చల్లని, స్వచ్ఛమైన దేవుడి రూపాలే. ప్రకృతిలోని ఈ దివ్యత్వాన్ని వీక్షించగలిగితే సంశయాలన్నీ వేకువ పిట్టల్లా ఎగిరిపోతాయి. సాయం సంధ్యలోకి మౌనంగా ఒరిగిపోయి చీకటిని వెలిగించే నక్షత్రాల నిశ్శబ్దం కూడా దైవమే నంటారు మదర్ థెరిస్సా. దైవాత్మను స్పృశించడానికి అలాంటి నిశ్శబ్దంలోకి, అలాంటి మౌనంలోకి మనసు లీనం అవ్వాలట. అప్పుడు ఎటు చూసినా దేవుడే దర్శనమిస్తాడని అంటారు మదర్. ఈ మాటనే మార్టిన్ లూథర్ కింగ్ ఇంకోలా చెప్పారు. ‘‘దేవుడు తన సువార్తను బైబిల్లో మాత్రమే రాయలేదు. చెట్లు, పూలు, మేఘాలు, నక్ష త్రాలన్నిట్లోనూ రాశారు’’ అని. అయినా సరే, మనకింకా సంశయం ఎందుకంటే దేవుడి ని మనం మనిషి రూపంలో మాత్రమే చూడాలనుకుంటున్నాం! - మాధవ్ శింగరాజు -
ఆ గారడీ నిండా గుండె తడి
మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడాయన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్రలతో, మార్మికమైన తీరులో మార్క్వెజ్ అక్షరబద్ధం చేశాడు. లాటిన్ అమెరికా కరీబియన్ సాగర తీరా ల సొగసులనీ, ఆ జాతి ప్రజల పగలనీ, ఉద్వేగాలనీ రంగరించి ఆ ప్రాంతం గాథని అక్షరబద్ధం చేసినవాడు గాబ్రియెల్ గార్షి యా మార్క్వెజ్ (మార్చి 6, 1927-ఏప్రిల్ 17, 2014). మేజిక్ రియలిజమ్తో ప్రపంచ సాహితీ లోకాన్ని మైమరపించిన మార్క్వెజ్ స్పానిష్ భాషకు అసాధారణ గౌరవం తెచ్చి పెట్టాడు. పుక్కిట పురాణగాథలూ, అసాధా రణ ఊహాచిత్రాలూ, వీటితో చేసే గారడీనే మేజిక్ రియలిజమ్ అంటాడాయన. కానీ ఈ అసాధారణ శైలిని లాటిన్ అమెరికా చరి త్ర పుటల నుంచి జారే విషాదాన్ని చెప్పడా నికి ఆ మహా రచయిత ఉపయోగించుకు న్నాడు. అందుకే, లాటిన్ అమెరికా వర్షించే ఉత్తేజంలో మార్క్వెజ్ నిరంతరం తడిసిపో తూనే ఉంటాడు అని క్యూబా విప్లవ నేత ఫైడల్ కాస్ట్రో వ్యాఖ్యానించాడు.కొలంబియాలోని అరాకటాక అనే గ్రామంలో (ఆయన రచనలలోని అద్భుత కల్పిత గ్రామం మకుండో ఇదే) పెరిగిన మార్క్వెజ్ను ప్రభావితం చేసిన స్థానిక అంశాలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. కొలంబియా అంతర్యుద్ధం, అక్కడి ఉద్వేగా లు, విశ్వాసాలు, ఘర్షణలు, లిబరల్ పార్టీ ప్రభావం, తరువాత పెరిగిపోయిన మాఫి యాలు, వారి హింసతో కరీబియన్ తీరాన్ని తడిపేసిన కన్నీళ్లు - అన్నీ ప్రభావితం చేసి నవే. అరాకటాకలో అమ్మమ్మ, తాతయ్యల పెంపకం, తరువాత పత్రికా రచయితగా గడించిన అనుభవాలూ మార్క్వెజ్ సాహి త్యానికి పునాదులయ్యాయి. ‘నేను ఏనాటికీ పత్రికా రచయితనే. ఇన్ని రచనలు చేయగలి గానంటే అదే కారణం. ఆ రచనలలోని ఇతి వృత్తాలు. జర్నలిజం ఇచ్చిన వాస్తవ సమా చారమే’ అంటాడాయన. 30 మిలియన్ ప్రతులు అమ్ముడుపోయి, మార్క్వెజ్ కీర్తిని విశ్వ వీధులలో ఎగురవేసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ (నూరేళ్ల ఏకాం తం, 1967)నవల కథానాయ కుడి పాత్రను తన ఇంటిలోనే వెతికి పట్టుకున్నాడు. ఆ పాత్రకు ప్రేరణ తన తాతగారే. కొలంబి యా అంతర్గత పోరులో ఆయనది కీలక పాత్ర. ఈ నవలలోని ఏడు తరాల బ్యుండి యా కుటుంబ గాథ ఆవిష్కరణకు ఎన్నుకు న్న మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడా యన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్ర లతో, మార్మికమైన తీరులో ఆయన అక్షర బద్ధం చేశాడు. అందుకే ఈ నవలలో లాటిన్ అమెరికా జాతీయులు తమ ఆత్మను దర్శించుకోగలిగారన్న ఖ్యాతి వచ్చింది.మిత్రులూ, అభిమానులూ ‘గాబో’అని ఆప్యాయంగా పిలుచుకునే మార్క్వెజ్ ప్రకృ తి సౌందర్యాలనూ, రాజకీయ సామాజిక స్పృహనూ కలిపి మార్మికంగా పెనవేస్తాడు. అదంతా ఆయన లాటిన్ అమెరికా ఐక్యత కోసం, శాంతి కోసం పడిన తపనకు ప్రతి బింబమే. ఆ ప్రాంతంలో అమెరికా జోక్యా న్ని సదా వ్యతిరేకించాడు. ఇదే క్యూబా వి ప్లవ పిత కాస్ట్రోతో మైత్రిని ప్రసాదించింది. తన రాత ప్రతులను ఆ విప్లవ ద్రష్టకు చూపించి అభిప్రాయం తెలుసుకు నేంతగా బంధం బలపడింది. మరో వైపు అమెరికా ఆయన రాక మీద పదేళ్లు నిషేధం విధించింది. తరువాత క్లింటన్ మార్క్వెజ్ మిత్రుడయ్యాడు. తన పద్దెనిమిదో ఏట రచనా వ్యాసం గం ఆరంభించిన మార్క్వెజ్ విశేషమైన సాహిత్య సంపదను ఇచ్చి వెళ్లాడు. ‘ఇన్ ఈవిల్ అవర్’ (1962), ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రి యార్చ్’ (1975), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’(1985), ‘ది జనరల్ ఇన్ హిజ్ లెబైరింత్’(1989), మార్క్వెజ్ నవలలు. నవలికలు కూడా ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చాయి. ‘ఐస్ ఆఫ్ ఏ బ్లూ డాగ్’(1947), ‘బిగ్ మామాస్ ఫ్యునరల్’(1962) వంటి పలు కథా సంకలనాలను ఆయన వెలువ రించారు. ‘భగవంతుడు నాకు ఒక్క సెకను అదనంగా జీవితాన్ని ప్రసాదించినా, నా శక్తిని మరింత గొప్పగా ఉపయోగించడా నికే వినియోగిస్తాను’ అని జబ్బు పడిన తరువాత మిత్రులకు రాసిన వీడ్కోలు లేఖ లో మార్క్వెజ్ రాశాడు. కానీ ఆ క్షణం వరకు సృజనాగ్నిలో ఆయన ఎంతగా కాగి పోయా డో రోజూ ఒక పసుపు గులాబీ గమనిం చింది. వేకువనే కొద్దిసేపు పుస్తకం చదువు కుని, తరువాత వార్తాపత్రికలు చదివి, ఆపై నాలుగు గంటలు ఏకబిగిన రచనలు చేసే వాడు మార్క్వెజ్. ఆ సమయానికి నిత్యం ఒక పసుపు గులాబీని తెచ్చి ఆయన రాత బల్ల మీద ఉంచేది ఆయన భార్య మెర్సిడెస్. అక్షరార్చనతో మార్క్వెజ్ గుండె ఎంత అలసిపోయిందో ఆ గులాబీకి తెలుసు. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
గార్షియా మార్క్వెజ్ కన్నుమూత
* సాహిత్యంలో మేజికల్ రియలిజం ప్రక్రియకు ఆద్యుడు * 1982లో నోబెల్ అవార్డు విజేత * లాటిన్ అమెరికా గొంతుకగా ప్రఖ్యాతి మెక్సికో సిటీ: ప్రఖ్యాత లాటిన్ అమెరికన్ రచయిత, నోబెల్ అవార్డు గ్రహీత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్(87) గురువారం కన్నుమూశారు. గత నెల 31న న్యూమోనియాతో అస్వస్థతకు గురైన మార్క్వెజ్ ఆసుపత్రిలో వారం రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. మెక్సికో సిటీలోని ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచేటప్పుడు భార్య మెర్సిడెస్ బర్కా, ఇద్దరు కుమారులు గార్షియా పక్కనే ఉన్నారు. మార్క్వెజ్ 1927, మార్చి 6న కొలంబియాలో జన్మించారు. ప్రేమ, కుటుంబం, నియంతృత్వం వంటి అంశాల నేపథ్యంగా మార్క్వెజ్ చేసిన అనేక రచనలు లాటిన్ అమెరికా పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన రచనల్లో మేజికల్ రియలిజం పద్ధతిని ప్రవేశపెట్టిన మార్క్వెజ్ ఆ ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచారు. ప్రపంచ సాహిత్య రంగంలో ‘గాబో’గా సుపరిచితులైన ఆయన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్(వందేళ్ల ఏకాంతం-1967)’, ‘ఇన్ ఈవిల్ అవర్’(1962), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’(1985) వంటి నవలలు, ‘లీఫ్ స్టార్మ్’(1955), ‘నో వన్ రైట్స్ టు ది కల్నల్’(1961) వంటి నవలికలతో ఖ్యాతిని పొందారు. సాహిత్యరంగంలో కృషికి గుర్తింపుగా 1982లో నోబెల్ అందుకున్నారు. మార్క్వెజ్ మృతి పట్ల కొలంబియన్ అధ్యక్షుడు జువాన్ మానుయెల్ శాంటోస్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఇది వెయ్యేళ్ల ఒంటరితనం, పెను విషాదం అని పేర్కొన్నారు. మూడురోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. మార్క్వెజ్ మృతి నేపథ్యంలో కొలంబియన్లు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. గొప్ప దార్శనికత కలిగిన ఓ రచయితను ప్రపంచం కోల్పోయిందం టూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబా మా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తీవ్ర సంతాపం ప్రకటించారు. ‘లాటిన్ అమెరికా గొం తు అయిన మార్క్వెజ్ ప్రపంచం గొంతుకగా కూడా నిలిచారు. ఆయన ఊహ మనల్ని సంపన్నులను చేసింది. ఆయన మరణం మనల్ని పేదల్ని చేసింది’ అని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు జోస్ మానుయెల్ బరాసో పేర్కొన్నారు. మార్క్వెజ్ భౌతిక కాయాన్ని సోమవారం ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మార్మిక లోక విహారి! ‘మిత్రుడంటే నీ చేతిని అందుకోవాలి. నీ గుండెను మీటాలి’ అంటాడు మార్క్వెజ్. ఆయ న తన కలంతో లాటిన్ అమెరికా ప్రజలందరి గుండెలనూ తాకాడు. మార్క్వెజ్ రచనల్లో సౌందర్యం, రాజకీయ, సామాజిక స్పృహ సమతూకంలో కనిపిస్తాయి. అదంతా ఆయన లాటిన్ అమెరికా ఐక్యత కోసం పడిన తపనకు ప్రతిబింబమే. ఆ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని ఆయన సదా వ్యతిరేకించాడు. అందుకే అమెరికా ఆయన రాకపై పదేళ్లు నిషేధం విధించింది. ‘మంత్ర వాస్తవికత’(మేజిక్ రియలిజమ్)తో ప్రపంచ సాహితీ లోకాన్ని మైమరపించిన మార్క్వెజ్ స్పానిష్ భాషకు అసాధారణ గౌరవం తెచ్చి పెట్టాడు. 17వ శతాబ్ది రచయిత సెర్వాంటెస్ తర్వాత ఆ భాషకు విశ్వసాహిత్యంలో గుర్తింపు తెచ్చిన వాడిగా లాటిన్ అమెరికా ఆయనను గుర్తు పెట్టుకుంది. కొలంబియాలోని అరాకటాక గ్రామంలో(ఆయన రచనలలోని అద్భుత కాల్పనిక గ్రామం మకుండో ఇదే) పెరిగిన మార్క్వెజ్ను స్థానిక అంశాలు ప్రభావితం చేశాయి. కొలంబియా అంతర్యుద్ధం, లిబరల్ పార్టీ, మాఫియా, కన్నీళ్లు, కడలి అందాలు- అన్నీ ప్రభావం చూపాయి. 3 కోట్ల ప్రతులు అమ్ముడుపోయి, మార్క్వెజ్ కీర్తిని విశ్వవీధుల్లో ఎగరరేసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూ డ్ ’(నూరేళ్ల ఏకాంతం, 1967) నవలానాయకుడి పాత్రకు ప్రేరణ.. కొలంబియా అంతర్యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆయన తాతే. అందుకే ఆ నవలలో లాటిన్ అమెరికన్ల ఆత్మ కనిపిస్తుంది. 18వ ఏట రచనా వ్యాసంగం ఆరంభించిన మార్క్వెజ్ విశేష సాహిత్య సంపదను ఇచ్చిపోయాడు.