ఉన్నట్లా? లేనట్లా?
దైవికం
దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత.
గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ కొలంబియా రచయిత. 87 ఏళ్ల వయసులో అనారోగ్యం వల్ల ఇటీవలే చనిపోయారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖులైన రచయితలలో ఒకరిగా ఆయనకు పేరు. నోబెల్ గ్రహీత. గట్టి అభిప్రాయాలు ఉన్న మనిషి. ధైర్యం కూడా ఎక్కువే. ఎంత ధైర్యం అంటే... తన దేశ రాజకీయ విధానాలను సైతం అయన బహిరంగంగానే విమర్శించేవారు. అంతటి మనిషి కూడా దేవుడి ఉనికి విషయంలో చివరి వరకు సంశయంగానే ఉండిపోయారు! ‘‘దేవుణ్ణి నమ్మను. కానీ దేవుడంటే భయపడతాను’’ అంటారు గార్షియా. బహుశా ఉన్నాడు అని నమ్మి ఉంటే, ఆయనకా భయం ఉండకపోయేదేమో.
ఇంతకూ గార్షియాకు దేవుడంటే భయం దేనికి? రాజకీయ విధానాలను విమర్శించినట్లుగా... ఆ విధాత తలపుల గురించి కూడా తాను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడతానేమోనన్న భయమా? చెప్పలేం. అయితే ఆయన రాసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’, ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రియార్క్’ నవలల్ని గమనిస్తే దేవుడి ఉనికి పట్ల సందేహాలున్న వ్యక్తికి అంతటి ఊహాశక్తి (సృజన) ఎలా సాధ్యం అని కూడా అనిపిస్తుంది. మొత్తానికి గార్షియా అలా అనడం (దేవుణ్ణి నమ్మను. కానీ భయపడతాను అని)... మానవ స్వభావాలపై ఆయన పరిశీలనకు ఒక వ్యక్తీకరణ కావచ్చు.
ఇదంతా కాదు, గార్షియాకు దేవుడు ఉన్నట్టా? లేనట్టా? ఏమో ఆయనే బతికొచ్చి చెప్పాలి. దేవుడిపై గార్షియాకు ఉన్న సంశయం లాంటిదే, గార్షియా లోని ‘యాగ్నాస్టిసిజం’పై మన సంశయం. యాగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ విశ్వసించేవాడు కాదు. ఉన్నాడో లేదోనన్న సంశయంలో ఉన్నవాడు.
దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత. దేవుణ్ని నమ్ముకున్న వారు సుఖంగా నిద్రపోతారు... ఆయన ఉన్నాడన్న నిశ్చింతతో. దేవుడు లేడనుకున్నవారు సుఖనిద్రకు ఏర్పాట్లు చేసుకుంటారు... ఎవరూ లేరన్న నిశ్చయంతో. ఇక మిగిలింది సంశయశీలురు. దేవుడు ఉన్నాడో లేడో తెలీక పక్కపై అటు ఇటు కదులుతుంటారు. తెల్లారుతుంది కానీ ఏదీ తేలదు. ‘తెల్లారడం’ దైవికం అని తెలుసుకునే వరకు సంశయం తొలగిపోదు.
తెల్లారడం అంటే చీకటి చెదిరిపోయి, వెలుగు వ్యాపించడం ఒక్కటేనా? మౌనంగా, మాటమాత్రం లేకుండా జరిగిపోయేవి చాలా ఉంటాయి. చల్లని గాలికి నెమ్మదిగా ఊగే పచ్చటి చెట్లు, పరిమళాలు వెదజల్లే పూలు, మంచుతో తడిసిన గడ్డి.. అన్నీ తెల్లారడంలో భాగమే. అన్నీ చల్లని, స్వచ్ఛమైన దేవుడి రూపాలే. ప్రకృతిలోని ఈ దివ్యత్వాన్ని వీక్షించగలిగితే సంశయాలన్నీ వేకువ పిట్టల్లా ఎగిరిపోతాయి.
సాయం సంధ్యలోకి మౌనంగా ఒరిగిపోయి చీకటిని వెలిగించే నక్షత్రాల నిశ్శబ్దం కూడా దైవమే నంటారు మదర్ థెరిస్సా. దైవాత్మను స్పృశించడానికి అలాంటి నిశ్శబ్దంలోకి, అలాంటి మౌనంలోకి మనసు లీనం అవ్వాలట. అప్పుడు ఎటు చూసినా దేవుడే దర్శనమిస్తాడని అంటారు మదర్. ఈ మాటనే మార్టిన్ లూథర్ కింగ్ ఇంకోలా చెప్పారు. ‘‘దేవుడు తన సువార్తను బైబిల్‌లో మాత్రమే రాయలేదు. చెట్లు, పూలు, మేఘాలు, నక్ష త్రాలన్నిట్లోనూ రాశారు’’ అని. అయినా సరే, మనకింకా సంశయం ఎందుకంటే దేవుడి ని మనం మనిషి రూపంలో మాత్రమే చూడాలనుకుంటున్నాం!
- మాధవ్ శింగరాజు