Daivikam
-
ఖగోళ అవిశ్వాసి
దైవికం కేసీఆర్‌కి, కేజే యేసుదాస్కీ, స్టీఫెన్ హాకింగ్కీ ఏం సంబంధం లేదు. లేదా మనకు తెలియకుండా ఏదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు. కేసీఆర్ ఎప్పుడైనా ఏకాంతంలో యేసుదాస్ పాటలు విని ఉండొచ్చు. యేసుదాస్ ఏ ఎయిర్‌పోర్ట్‌లోనో సమయం దొరికినప్పుడు స్టీఫెన్ హాకింగ్ రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ పుస్తకం పేజీలు తిప్పి ఉండొచ్చు. స్టీఫెన్కైతే అలాంటి సంబంధం కూడా ఉండే అవకాశం లేదు. కేసీఆర్ మాటలు, యేసుదాస్ పాటలు వినే సందర్భం స్టీఫెన్ జీవితంలో ఎప్పుడైనా ఏర్పడి ఉంటుందని అనుకోలేం. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. యేసుదాస్ దివ్య గాయకుడు. స్టీఫెన్ హాకింగ్ విశ్వరహస్యాలు ఛేదిస్తున్న ఖగోళ శాస్త్రవేత్త. అయితే ఒకదానితో ఒకటి ఏ మాత్రం సంబంధం లేని ఈ మూడు రంగాల వారు ఇటీవల తమ మాటల కారణంగా అంతెత్తునుంచి కిందపడి మామూలు మనుషులుగా అవతరించారు! ‘కిందపడడం’ అనే విషయంలో ఒకరితో ఒకరు సంబంధం ఉన్నవారయ్యారు. ‘‘ఆడపిల్లలను వేధిస్తే కళ్లు పీకేయిస్తా’’ అన్నారు కేసీఆర్! మంచిమాటే.. ఆకతాయిల్ని భయపెట్టడానికి. కానీ అంతకంటే (మాటలకంటే) మంచివైన చట్టాలు ఉన్నాయి కదా మనకు. వాటిని కచ్చితంగా అమలు చేస్తాం అనో, మరింత కఠినమైన చట్టాల్ని తెస్తాం అనో అనాలి నిజానికైతే. చట్టాలు ఉన్నప్పుడు, ఆ చట్టాల్లో లేని శిక్షలు విధిస్తాం అనడంలోని అంతర్యం ఏమిటి? ఏమీ లేకపోవచ్చు. కేసీఆర్ మాటలు వినబుద్ధేస్తాయి. ఆ సంగతి ఆయనకూ తెలుసు కాబట్టే అలా మాట్లాడారేమో! ఇక యేసుదాస్. ‘‘ఆడపిల్లలు జీన్స్ వేసుకోవడం తగదు’’ అని ఇటీవల ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంగీతాన్ని వదిలేసి సంప్రదాయాల గొడవల్లోకి వచ్చి పడ్డారు పాపం ఆయన. దేవరాగాన్ని ఒలికించే ఆ స్వరంలో దెయ్యపు పలుకులేమిటని దక్షిణ భారతదేశం నివ్వెరపోయింది. ‘‘కళ్లు పీకేయిస్తా’’ అని కేసీఆర్ అన్న మాటలాంటిదే ఇది కూడా. ‘మన సంస్కృతీ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తే కళ్లుపోతాయి’ అన్నంతగా యేసుదాస్ మాటల్లో ఆందోళన వ్యక్తమయింది! యేసుదాస్ అనగానే ఇప్పుడు స్వరాలకు బదులు వస్త్రాలు గుర్తొచ్చేస్తున్నాయందుకే. స్టీఫెన్ హాకింగ్ పరిధి వేరు. అది విస్తృతమైనది. విశ్వవ్యాప్తమైనది. కేసీఆర్‌లా, యేసుదాస్లా కాదు. ఆయన మరింత బాధ్యతగా మాట్లాడాలి. గతంలో చాలాసార్లు ఆయన ‘‘నాకు దేవుడు లేడు’’ అన్నాడు కానీ, ‘‘దేవుడు లేడు’’ అనలేదు. కానీ ఇటీవల ఆ మాట కూడా అనేశారు! ‘‘సైన్స్ అర్థమయ్యే దాకా దేవుడిపై మనిషికి నమ్మకం ఉండడం సహజమే’’ అని కానరీ ఐలండ్స్ (స్పెయిన్)లో ఈమధ్య జరిగిన అంతర్జాతీయ ఖగోళశాస్త్ర ఉత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ స్టీఫెన్ అన్నారని అమెరికా నుంచి వెలువడే ‘హఫింగ్టన్ పోస్ట్’ అనే ఆన్లైన్ వార్తా కూడలి ప్రచురించగానే ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ పని చేయలేని వారు సున్నితమైన మాటలతో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేవుడితో పోల్చిచూస్తే, విశ్వానికి సంబంధించిన సందేహాలకు సైన్స్ ఎంతో నమ్మశక్యమైన సమాధానాలను ఇస్తోంది’’ అని స్టీఫెన్ అనడం కూడా భక్తిపరులను బాధించింది. అంటే దేవుడు లేడనా, ఉన్నా సమాధానాలు ఇవ్వలేడనా అని వారి ప్రశ్న. స్టీఫెన్ అక్కడితో ఆగలేదు. 1988నాటి తన పుస్తకం ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’లోని ‘వియ్ వుడ్ నో ద మైండ్ ఆఫ్ గాడ్’ అనే వాక్యం ఉన్న భాగానికి అర్థ వివరణ ఇస్తూ, ‘‘దేవుడు గనుక ఉన్నట్లయితే, దేవుడికి తెలిసిన ప్రతిదీ మనుషులకు తెలిసి తీరుతుంది. అయితే దేవుడు లేడు’’ అన్నారు. ‘‘దేవుణ్ణి నమ్మను’’అని ఎప్పటిలా ఒక్క మాటతో సరిపెట్టి ఉంటే స్టీఫెన్ గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. విశ్వం గురించి ఇంత తెలుసుకున్న ఈ థియరిటికల్ ఫిజిసిస్టు, దేవుడిపై మనిషి విశ్వాసాన్ని ఆ విశ్వంలో ఒక భాగంగా ఎందుకు చూడలేకపోయారో? బహుశా విశ్వాసం కూడా ఒక గోళంగా కనిపించాలేమో ఈయనకు ఆకాశంలో. ‘‘మైండ్‌తో కాదు మై డియర్ భౌతిక శాస్త్రవేత్తా... హృదయంతో ఆలోచించు. అప్పుడు దేవుడు కనిపిస్తాడు’’ అని ఎవరో సలహా ఇచ్చారు స్టీఫెన్ హాకింగ్కి. కళ్లు పీకేయిస్తానని కేసీఆర్, జీన్స్ తొడుక్కోవద్దని యేసుదాస్ అన్నందు వల్ల పెద్ద నష్టం లేదు. కానీ స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్లు అలా మాట్లాడకూడదు. మనిషి మేధస్సుకు దీర్ఘకాలిక విలువ లేదేమోనని ఒకప్పుడు అనుమానంలో పడిన స్టీఫెన్, ఐక్య క్షేత్రీయ సిద్ధాంతం (యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ) తో దేవుడి ఉనికిని, ఉద్దేశాలను కనిపెట్టేందుకు ప్రయత్నించిన స్టీఫెన్... చివరికొచ్చేసరికి మనుషుల నమ్మకాలను, విశ్వాసాలను తేలికపరిచే వ్యాఖ్యలు చేయడమంటే ‘సైన్సును నమ్మకుంటే దేవుడు క్షమించడు’ అని బెదిరించడమే! - మాధవ్ శింగరాజు -
దేవుని మన్నింపు
దైవికం మిజోరామ్‌లో కొంతకాలంగా దైవానికీ, దుష్టశక్తికీ మధ్య పోరు సాగుతోంది. పద్దెనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో ఉన్న మద్య నిషేధాన్ని రద్దు చేయాలని కొందరు, నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ రెండు వర్గాలలో ఎవరు దైవం వైపున, ఎవరు దుష్టశక్తి తరఫున ఉన్నట్లు? సాధారణంగా మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది కనుక నిషేధాన్ని రద్దు చేయొద్దని కోరుతున్న వారిని దైవం వైపు ఉన్నట్లు అనుకోవాలి. నిషేధం రద్దు చేసి మద్యం అమ్మకాలను ప్రారంభించాలని కోరుతున్న వారిని దుష్టశక్తి ప్రేరేపిస్తుందని భావించాలి. ఎంచేతంటే దుష్టశక్తి పూర్తిగా దైవానికి వ్యతిరేకం కనుక మానవుల్ని కూడా దేవుడికి ఇష్టం లేని వాటి వైపు అది నడిపిస్తుంది కాబట్టి. అయితే మిజోరామ్‌లో వాదులాడుకుంటున్నవారు మామూలు ప్రజలు కాదు. మిజోరామ్ రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష శాసనసభ్యులు. మంత్రులన్నాక ప్రజా సంక్షేమం కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది. అందుకు డబ్బు కావలసి ఉంటుంది. అంత డబ్బును రాబడిగా పొందడానికి వాళ్లకు కనిపించింది ఎక్సైజ్ శాఖ ఒక్కటే! అందుకే వృత్తి ధర్మంగా (లేదా సేవా ధర్మంగా) ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్యంపై నిషేధాన్ని ఎత్తివేయడమే ఉత్తమ మార్గంగా కనిపించింది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో వృత్తి ధర్మం, లేదా సేవాధర్మం దేవుని అభీష్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడికి ఇష్టం లేదు. కానీ ప్రజల కోసం తప్పడం లేదు. ఏం చేయాలి? మంచైనా, చెడైనా ముఖ్యమంత్రి చెప్పినట్లు చెయ్యాలి. సరిగ్గా అదే పని చేశారు లాల్జిర్లియానా. లాల్జిర్లియానా మిజోరామ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి. అసెంబ్లీలో ఆయన సీటు ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా సీటు పక్కనే ఉంటుంది. లాల్జిర్లియానాకు వ్యక్తిగతంగా మద్యనిషేధాన్ని రద్దు చేయడం ఇష్టం లేనప్పటికీ, వాదోపవాదాల అనంతరం అయన ‘మిజోరామ్ లిక్కర్ (ప్రొహిబిషన్ అండ్ కంట్రోల్) బిల్లు’ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మద్య నిషేధాన్ని తొలగించడం దేవునికి ఇష్టం లేని కార్యమని తను నమ్మినప్పటికీ ఒక రాజకీయ అనివార్యత ఆయన్ని అటువైపుగా నడిపించింది. బలహీనమైన గొంతుతో ఆయన బిల్లుపై ప్రకటన చేసినప్పుడు నలభైమంది సభ్యులు గల మిజోరామ్ అసెంబ్లీలో కనీసం సగంమంది ఆయనకు మద్దతు పలికారు. నిషేధం కారణంగా కల్తీ మద్యం తాగి ఎంతోమంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కనుక, నిఖార్సయిన మద్యాన్ని అందుబాటులోకి తెస్తే కల్తీ మద్యం మరణాలు తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు. విపక్షానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ, ‘‘మద్యం అందుబాటులోకి వస్తే యువత నైతికంగా పాడైపోతుంది. అది మరణం కంటే ఘోరం. ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నందుకు దేవుడు మనల్ని క్షమించడు’’ అన్నారు. దేవుడి మాట రాగానే మంత్రి జోడింత్లువంగ పైకి లేచారు. ఒకప్పుడు ఆయనదీ లిక్కర్ బిజినెస్సే. మద్యనిషేధాన్ని రద్దు చేసే బిల్లును సమర్థిస్తూ ఆయన, ప్రధాన ప్రతిపక్షం ‘మిజో నేషనల్ ఫ్రంట్’ వ్యవస్థాపకులు లాల్డెంగా గతంలో ఎప్పుడో చేసిన ప్రసంగంలోని రెండు మాటలను సభకు గుర్తు చేశారు. ‘‘మీ నాయకుడే అలా అన్నాక ఇంకా దేవుడి ప్రస్తావన ఎందుకు?’’ అన్నారు. ఇంతకీ ఏమిటీ రెండు మాటలు అంటే : ‘‘మద్యపానం మంచిదని చెప్పలేం, చెడ్డదని చెప్పలేం. అదొక కృత్యం. దీని గురించి మనం వెళ్లి ఏ మతాన్నీ సంప్రదించనవసరం లేదు. ఎందుకంటే మనది లౌకిక ప్రభుత్వం’’ అన్నారట లాల్డెంగా. చివరికి బిల్లు పాస్ అయింది. స్వయానా ఎక్సైజ్ మంత్రికే ఇష్టం లేకున్నా మద్యం బిల్లు మిజోరామ్‌లో మద్యపానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కోసం, లేదా రాబడి కోసం, లేదా ప్రజాసంక్షేమం కోసం బల్ల మీద బిల్లు పెట్టిన మంత్రి లాల్జిర్లియానా బిల్లు పెట్టే ముందరి ఆదివారం ఏం చేశారో తెలుసా? అక్కడికి సమీపంలోని ఆర్మ్డ్వెంగ్ ప్రాంతంలోని చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల ముగింపులో లేచి నిలబడి, అందరికీ వినబడేలా గద్గద స్వరంతో దేవుడిని మన్నించమని కోరారు! ‘‘సర్వశక్తి సంపన్నుడివైన ప్రభువా... ఈవారం నేను మద్యపాన నిషేధాన్ని రద్దుచేసే బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నాను. అది నీ అభీష్టానికి విరుద్ధమైనట్లయితే, అది నాకు అసాధ్యం అయ్యేలా నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఏదైనా అవాంతరం తెప్పించు’’ అని ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన దేవుడు ఆయనకు ఏ అవాంతరమూ సృష్టించకపోవచ్చు. కానీ దేవునికి ఇష్టం లేదన్న ఆయనలోని స్పృహ చాలు ఆయనను దేవుని మన్నింపునకు అర్హుడిని చేసేందుకు. - మాధవ్ శింగరాజు -
ఇద్దరు దేవుళ్లు!
దైవికం కష్టాల్లో దేవుడు గుర్తొస్తాడు. లేదంటే, దేవుడిలాంటి మనిషైనా గుర్తొస్తారు. అయితే దేవుడి లాంటి మనిషికన్నా కూడా, దేవుడే ఎక్కువగా మనిషికి అందుబాటులో ఉంటాడు! దేవుడు.. గుడిలో ఉంటాడని మనకు నమ్మకంగా తెలుసు. పరుగున వెళ్లి ‘దేవుడా నువ్వే దిక్కు’ అని వేడుకోవచ్చు. బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో, తక్కిన పవిత్ర గ్రంథాలలో అక్షరాల రూపంలో దేవుడి స్వరూపం సాక్షాత్కరిస్తుంది కనుక దైవవాక్యాలను గుండెకు హత్తుకుని మనసుకు మరమ్మతులు చేసుకోవచ్చు. ఆకాశం దేవుడి నివాసం అని కూడా మనకో నమ్మకం కనుక కన్నీళ్లతోనో, నీళ్లింకిన కళ్లతోనో నింగి వంక చూస్తూ దేవుడిని ప్రార్థించవచ్చు. అయితే దేవుళ్లా వచ్చి గట్టెక్కించే వరకు దేవుడిలాంటి మనిషి ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడుంటారో తెలీదు. ఏ రూపంలో వస్తారో తెలీదు. అమ్మ, నాన్న, తోబుట్టువు, స్నేహితుడు, బంధువు... ఎవరైనా కావచ్చు. ఆఖరికి శత్రువు కూడా దేవుడు పంపిస్తే వచ్చినట్లు రావచ్చు. ఒకటే తేడా. దేవుడిని మనం వెతుక్కుంటూ పోతాం. దేవుడి లాంటి మనిషి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు ఎంతో కరుణిస్తే తప్ప దేవుడి లాంటి మనిషి దొరకరు. సాధారణంగా కష్టాలు, కన్నీళ్లు మామూలు వ్యక్తులకే వస్తాయని, వాళ్లకే తరచు దేవుడి అవసరం కలుగుతుంటుందని అనుకుంటాం. అయితే దేశంలోనే అత్యున్నత హోదాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఈ మధ్య దేవుడు గుర్తొచ్చాడు. వాళ్లలో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోథా! ఇంకొకరు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ! ‘‘ఫర్ గాడ్స్ సేక్, న్యాయవ్యవస్థ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని చెక్కు చెదరనియ్యకండి. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తూ పోతుంటే జాతికి తీరని హాని జరుగుతుంది’’ అని లోథా ఆగ్రహంతో అభ్యర్థించారు. ‘న్యాయమూర్తుల నియామకాల్లోని గుట్టుమట్లను బహిర్గత పరచి, ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టండి’ అని ఒక పౌరుడు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంలో లోథా పై విధంగా స్పందించారు. ‘ఫర్ గాడ్స్ సేక్’ అని ఆయన అనడంలో ‘భగవంతుడా ఏమిటీ విపరీతం’ అన్న నిస్పృహ ఉంది. ఇలాంటి నిస్పృహకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా లోనయ్యారు. ఇటీవల ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ప్రదానం చేస్తున్న ఉమ్మడి సభలో తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు ‘చోటు’ కోసం గొడవ పడడం చూసి ఆయన ఎంతో ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యానికి ఆలయం లాంటి పార్లమెంటు భవనంలో సభ్యులు కనీస గౌరవ మర్యాదలు కూడా విస్మరించి సభ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం ఆయనను బాధించింది. ‘‘ప్లీజ్.. ఫర్ గాడ్స్ సేక్, హుందాగా వ్యవహరించండి. మీరంతా ప్రజాప్రతినిధులన్న సంగతి మర్చిపోయి, సభలో గందరగోళం సృష్టిస్తే పవిత్రమైన పార్లమెంటు అపహాస్యం పాలవుతుంది’’ అని ఆక్రోశించారు. ఆ ఆక్రోశంలో ‘దేవుడా, వీళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు’ అన్న వేడుకోలు ఉంది. అదే సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టేముందు, అక్కడి మెట్లకు శిరస్సుతో నమస్కరించడాన్ని గుర్తు చేస్తూ.. మోడీని కొనియాడారు కూడా. లోథాకు, ప్రణబ్‌కి వచ్చిన కష్టం.. పెద్ద కష్టంగా మనకు అనిపించకపోవచ్చు. అసలవి కష్టాలే కాదని కూడా అనిపించవచ్చు. అయితే ఏ మనిషి కష్టాన్నయినా మనం అనుకునే హెచ్చుతగ్గులను బట్టి అంచనా వెయ్యకూడదు. కష్టం తీవ్రత దేవుడిని తలచుకోవడంలో ఉంటుంది. ఎవరైనా బాధగా ‘దేవుడా’ అనుకున్నారంటే అది కష్టం అవుతుంది తప్ప, చిన్నకష్టమో, పెద్ద కష్టమో కాదు. కష్టాల్లో.. దేవుడు గానీ, దేవుడి లాంటి మనిషిగానీ గుర్తొస్తారని కదా అనుకున్నాం. అంటే ప్రతి మనిషికి ఇద్దరు దేవుళ్లు. ఒకరు దేవుళ్లలో దేవుడు. ఇంకొకరు మనుషుల్లో దేవుడు. మనకిక భయం ఏమిటి? దేవుడు తప్పక మన కష్టం తీరుస్తాడు. లేదా కష్టం తీర్చి రమ్మని తన తరఫున మనిషినైనా పంపిస్తాడు. అలా కూడా జరగలేదంటే.. ఎవరి వల్ల కష్టం వచ్చిపడిందో వారిలో పరివర్తన తెచ్చి, వారినే కష్టం తీర్చే మనిషిగా మన ముందుకు పంపే ఆలోచనలో ఆయన ఉన్నాడని. అప్పటి వరకు కష్టాన్ని ఓర్చుకోవడమే దేవుడికి మనం చెల్లించగల స్తుతి. - మాధవ్ శింగరాజు -
దేవుడికి దగ్గరవడం ఎలా?!
దైవికం క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్టు గాడ్లీనెస్. పరిశుభ్రత అనేది దాదాపుగా దైవత్వమేనట! అంటే నిర్మాలిన్యం మనిషిని దేవుడికి చేరువ చేస్తుందని అర్థం. ఎవరన్నారు ఈ మాట? మదర్ థెరిస్సానా? అనే ఉంటారు. రోగులను ఆమె శుభ్రం చేశారు. రోగగ్రస్థ హృదయాలను శుభ్రం చేయడానికి ప్రయత్నించారు. పరిశుద్ధ గ్రంథాలలో కూడా ఈ మాట ఉండే ఉంటుంది. సరిగ్గా ఇవే మాటలతో కాకున్నా, ఇదే అర్థం వచ్చేలా. జాన్ వెస్లీ అనే మత బోధకుడు తొలిసారి 1778లో ఒకానొక తన ప్రసంగంలో ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్’ అన్నట్లు అక్కడక్కడ రిఫరెన్సులు ఉన్నాయి. అలాగే ఈ మాట అతి ప్రాచీనమైన బాబిలోనియా, హీబ్రూ మత సంప్రదాయాలలోనిదని సూచించే ఉటంకింపులూ కనిపిస్తుంటాయి. నిజానికి ఈ మాట పుట్టవలసింది ఇప్పుడు! చెత్తను చుట్టూ కొండలా పేర్చుకుని మనిషి ‘హాయిగా’ జీవిస్తున్న ఈ ఆధునిక కాలానికి చెందవలసిన సామెత ఇది. చేతులకో, చెవులకో, కళ్లకో కాస్తయినా చెత్త అంటుకోనిదే మనిషిని మనిషిగా పోల్చుకోలేనంతగా రోజులు చెత్త దిబ్బలై కదిలిపోతున్నాయి. చుట్టూ సెల్ఫోన్లు.. మధ్యలో మనిషి! చుట్టూ టీవీ ఛానళ్లు.. మధ్యలో మనిషి. చుట్టూ యాప్‌లు, ఆన్లైన్ షాపులు, ఈఎమ్మయ్ సదుపాయాలు... వీటన్నిటి మధ్యా మనిషి! వస్తు వ్యామోహం ఇంటిని, ఒంటినీ చెత్తతో నింపేస్తోంది. ఇక దేవుడికి చోటెక్కడ? మనతో పాటు వచ్చి టీవీ ముందు కూర్చుంటానంటేనే భగవంతుడికైనా ఇంత ప్లేస్ దొరుకుతుందేమో! దేవుణ్ణి కూడా కలుపుకుపోయేంత ఉదారత్వాన్ని మనలో కలిగించే ప్రోగ్రామ్‌లే అన్నీ! అసుర సంధ్య వేళ దాటాక మొదలయ్యే దయ్యపు సీరియళ్లు, క్రైమ్ కహానీలైతే మన బుర్రకు కావలసినంత చెత్త. దేవుడు వచ్చిందీ, పోయిందీ కూడా తెలియనంత ఎంటర్టైన్మెంట్! మనిషి కారణంగా భూమి నిండా ఇంత చెత్త పేరుకుపోతుందని ఏ యుగంలోని దైవమూ ఊహించి ఉండకపోవచ్చు. మనిషిని నడిపిస్తున్నది ఇప్పుడు ప్రాణం కాదు, పరిసరాల్లోని చిందరవందర! బట్టలతో, అవి పాతబడిపోకుండానే వచ్చి చేరే కొత్త బట్టలతో, బజార్ నుంచి కట్టుకొచ్చిన పాలిథీన్ కవర్లతో, ఎలక్ట్రానిక్ భూతాలను ఇంటికి చేర్చిన కార్టన్ బాక్సులతో సహజీవనం చేస్తుంటే తప్ప ఊపిరి ఆడని స్థితిలోకి మనిషి వెళ్లిపోయాడు. షెల్ఫులో చిన్న కాగితం ముక్క లాగితే మొత్తం అక్కడున్న వస్తువులన్నీ పడిపోవాలి. వంటింట్లో చక్కెర డబ్బా మూత తెరుస్తుంటే, మోచేయి తగిలి మిక్సీ పైకప్పు ఎగిరిపడి వంటింట్లో అడుగుతీసి అడుగు వేసే దారే లేకుండా పోవాలి. అటకల మీద ఎన్నటికీ అవసరం పడని అమూల్యమైన మూటలుండాలి. స్టోర్ రూమ్ తలుపులను తోసుకుని విరిగిన కుర్చీలు, దూది రేగుతుండే పరుపులు వచ్చిపడుతుండాలి. అప్పుడే జీవితం నిండుగా ఉన్నట్లు! పందొమ్మిదో శతాబ్దపు అమెరికన్ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో ఇలా అంటారు. దేవునికి ధన్యవాదాలు. మనిషికి గనుక రెక్కలు ఉండి ఉంటే ఈ భూమిని చెత్తతో నింపిన విధంగా, ఆకాశంలోనూ తన అమూల్యమైన చెత్తను పోగేసుకునేవాడు-అని. మనిషి పైన, మనిషి కింద, మనిషి పక్కన ఉన్న చెత్త గురించి మాత్రమే థోరో మాట్లాడారు. మనిషి లోపల ఉండే చెత్త గురించి ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించినట్లు లేకున్నా, ఫిలాసఫర్ కాబట్టి తప్పకుండా ఆలోచించే ఉంటారు. మనిషి లోపలి చెత్త.. మనిషి చుట్టుపక్కల చెత్త కన్నా దుర్గంధభూయిష్టమైనది. అసలు బయటి చెత్తకు.. లోపలి చెత్తే కదా మూల పదార్థం. లోపల, బయట ఇంత చెత్త ఉంటే దేవుడిని స్వచ్ఛమైన మనసుతో ఆరాధించడం అయ్యే పనేనా? ‘‘ఎక్కడ చెత్త ఉంటే అక్కడ శుభ్రం చేసే ప్రయత్నాన్ని ఇవాళే మొదలు పెట్టి చూడండి. మీరు శుభ్రం చేసిన చోటుకు మీ ప్రయత్నం లేకుండానే దివ్యత్వం వచ్చి చేరుతుంది’’ అంటారు జాన్ వెస్లీ. ఇది బయటి చెత్తకు. మరి లోపలి చెత్త ఎలా పోవాలి? గాంధీజీని ఆదర్శంగా తీసుకోవచ్చు. ‘‘మురికి పాదాలతో నా మనసును తొక్కుకుంటూ వెళ్లే అవకాశాన్ని నేనెవరికీ ఇవ్వను’’ అన్నారాయన. చెత్త మాటలను వినకపోవడం కూడా దేవుడికి దగ్గరయ్యేందుకు ఒక మార్గమే. - మాధవ్ శింగరాజు -
దేవుని మాట వినబడనివ్వని సైరన్లు!
దైవికం మాల్థస్ అనుకున్నట్లు మనిషినిక్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే. బిల్ వాటర్సన్ అమెరికన్ చిత్రకారుడు, కార్టూనిస్ట్. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘కాల్విన్ అండ్ హాబ్స్’ 1985 నుంచి 1995 వరకు పదేళ్ల పాటు ప్రతిరోజూ ప్రపంచ పత్రికల్ని అలరించింది. సున్నితమైన హాస్యం, సునిశితమైన సామాజిక స్పృహ కలగలిసిన సెటైర్లు అవి. రాజకీయాలు, ఒపీనియన్ పోల్స్, పర్యావరణం, ప్రజావిద్య, ఫిలాసఫీ... దేన్నీ వదిలిపెట్టకుండా అన్ని అంశాలపైనా కాల్విన్ (ఆరేళ్ల బాలుడు), హాబ్స్ (ఒళ్లంతా వెటకారం నిండిన పులి) అనే రెండు పాత్రలను అడ్డుపెట్టుకుని కార్టూన్లు గీశారాయన. వాటిల్లోని ఓ కార్టూన్లో ఒక పిల్లవాడు తన తండ్రిని ఇలా అడుగుతాడు: ‘‘డాడ్, సోల్జర్లు ఒకళ్లనొకళ్లని చంపుకోవడం ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఎలా అవుతుంది?’’ అని! యుద్ధం మీద వాటర్సన్ ప్రయోగించిన క్షిపణి అది. ప్రస్తుతం ప్రపంచమంతా రెండు యుద్ధాల గురించి మాట్లాడుకుంటోంది. మొదటిది: పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న ఏకపక్ష యుద్ధం. రెండోది: నూరేళ్లు నిండిన మొదటి ప్రపంచ యుద్ధం. మొ.ప్ర. యుద్ధంలో ముప్పై దేశాలు పాల్గొన్నాయి. దాదాపు కోటి మంది మరణించారు. అయినా ఆ యుద్ధం నుంచిగానీ, ఇంకే యుద్ధం నుంచి కానీ మనిషి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే, తర్వాతి యుద్ధానికి (నాలుగో ప్రపంచ యుద్ధానికి) మనుషుల దగ్గర కర్రలు, రాళ్లు తప్ప వేరేమీ ఉండవు’’ అని ఐన్‌స్టీన్ అన్నారు. మనిషి మళ్లీ ఆదిమ కాలానికి వెళ్లిపోతాడని దీని అర్థం. అసలు మనుషులు యుద్ధాలు ఎందుకు చేసుకుంటారు? పొరపాటు. మనుషులు యుద్ధాలు చేసుకోరు. దేశాలు చేసుకుంటాయి. అమెరికన్లకు భౌగోళిక శాస్త్రాన్ని నేర్పించడానికి దేవుడు యుద్ధాన్ని సృష్టించాడని మార్క్ టై్వన్ అంటారు, సరదాగా. నేర్పించడానికి దేవుడి దగ్గర చిన్న చిన్నవి చాలానే ఉంటాయి. అంత పెద్ద యుద్ధమే అక్కర్లేదు. అయినా అన్ని మతాలూ శాంతినే ప్రవచించాయి కనుక దేవుడు యుద్ధ వ్యతిరేకి అనుకోవాలి. అయినప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయంటే దైవభీతిని మించిన దేశభక్తి ఏదో సోల్జర్ తలపైన కూర్చుని ఉండాలి. బ్రిటన్ తత్వరచయిత జి.కె.ఛెస్టర్టన్ ఏమంటారంటే, నిజమైన సిపాయి తన కళ్లెదుట కనిపించే వాటిపై ద్వేషం కారణంగా పోరాడడట, తన వెనుక ఉన్నదానిపై (దేశం) ప్రేమతో కదనరంగంలోకి దూకుతాడట! బహుశా ఇప్పుడు పాలస్తీనాపై కురుస్తున్న బాంబుల వర్షంలో చిన్నారులు, స్త్రీలు, అమాయకులు మరణించడం వెనుక అలాంటి దేశభక్త సైనికులే ఉండి ఉండాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిందీ ఈ దేశభక్తులే కావచ్చు. ఏమైనా నాడు జరిగిన ఘోరాలు కానీ, నేడు జరుగుతున్న దారుణాలు గానీ దేవుడికి ప్రియమైనవని, దేవుని సంకల్పానుసారం జరుగుతున్నవనీ అనుకోలేం. అసలు దుష్టశక్తి అంశ ఉన్నది ఏదైనా దేవుడికి ఆమోదయోగ్యం ఎలా అవుతుంది? ప్రముఖ ఆర్థికవేత్త, జనాభా సిద్ధాంతకర్త థామస్ రాబర్ట్ మాల్థస్ ఒకచోట ఆలోచనలో పడతాడు. లోకంలోని ఈ పేదరికం, క్షుద్బాధ.. భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయా? అన్న సందేహం ఆయనకు కలుగుతుంది. కష్టం తెలియడానికి, కష్టపడి బతకడం ఎలాగో నేర్పించడానికి దేవుడు ఇంతమందిని పుట్టించి, ఆహారాన్ని అతి ప్రయాస మీద మాత్రమే సంపాదించుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాడా అనీ సందేహపడతాడు. కానీ... సర్వ శక్తి సంపన్నుడైన కారుణ్యమూర్తిలో ఇంతటి క్రౌర్యం ఉంటుందా? అనుకుంటాడు. అయినా క్రౌర్యమని, కాఠిన్యం అని ఎందుకనుకోవాలి? జీవన పోరాటంలో మానవజాతిని రాటు తేల్చడానికి అయివుండొచ్చు కదా అని తనకు తనే సమాధానం చెప్పుకుంటాడు. మాల్థస్ అనుకున్నట్లు మనిషిని క్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే. 1995లో ‘కాల్విన్ అండ్ హాబ్స్’ని ఆపేసే ముందు దాని సృష్టికర్త బిల్ వాటర్సన్, వార్తాపత్రికల సంపాదకులకు, పాఠకులు చిన్న ప్రకటన విడుదల చేశారు ‘‘ఈ కార్టూన్ స్ట్రిప్’ని ఆపవలసిన తరుణం వచ్చేసింది. దీని ద్వారా నేను చెప్పదలచుకుంది చెప్పేశాను’’ అని. ఎక్కడ ఆపాలన్న స్పృహ మనుషులకు ఉంటుంది తప్ప ఎక్కడ ఆగిపోవాలన్న స్పృహ యుద్ధాలకు ఉండదు. స్పృహలేని యుద్ధాలు దేవుని మాట వినబడనివ్వని సైరన్లు. - మాధవ్ శింగరాజు -
ఇమ్మని దేవుణ్ణి అడగొచ్చా?
దైవికం ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైనపార్థన అంటారు బాపూజీ. ప్రపంచంలో నిత్యం కోట్ల మంది దేనికో ఒకదాని కోసం భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. ‘విన్నపాలు వినవలె వింత వింతలూ’ అని అన్నమయ్య పాడారు కదా, అలా ఆ వేడుకోళ్లలో కొన్ని ప్రార్థనలు ఉంటాయి. కొన్ని బెదిరింపులు ఉంటాయి. కొన్ని బ్లాక్‌మెయిల్స్ ఉంటాయి. కొన్ని అలకలు ఉంటాయి! ఇలా ఒక మనిషి ఇంకో మనిషితో ఎన్ని రకాలైన భావోద్వేగాలతో ఉండగలరో అన్ని రకాల భావోద్వేగాలనూ దేవుడి ముందు ప్రదర్శిస్తుంటారు మానవులు. కొందరు కేవలం ధన్యవాదాలు అర్పిస్తుంటారు. కొందరు కృతజ్ఞతలు చెల్లించి ఊరుకుంటారు... దేవుణ్ని అసలేమీ అడక్కుండా. అలాంటి వాళ్లు తక్కువ. శివలాల్ యాదవ్ అనే ఆయన ఈమధ్య దేవుణ్ణి ప్రార్థించాడు. ఎక్కడా? తన పూజగదిలో కాదు. బి.సి.సి.ఐ. (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తనని సన్మానిస్తుంటే... ఆ సభలో ప్రార్థించాడు. ఏమని? తన నుంచి ఈ పదవి మళ్లీ పూర్వపు అధ్యక్షుడైన ఎన్.శ్రీనివాసన్‌కి వెళ్లిపోవాలని! క్రికెటర్లకు శ్రీనివాసన్ చేసినన్ని మేళ్లు మరే ఇతర అధ్యక్షుడూ చేయలేదు కాబట్టి తిరిగి ఆయనకే ఈ పదవి వచ్చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు శివలాల్ యాదవ్ ప్రకటించారు! ఇంకొకాయన ప్రహ్లాద్ శర్మ. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటాడు. సామూహిక ప్రార్థనలు జరిపి, యజ్ఞాలు నిర్వహించి, రెండు జర్మన్ షెప్పర్డ్ శునకాలకు పెళ్లి చేసినప్పటికీ, చుక్క వర్షమైనా పడకపోవడంతో ఆయనకు వరుణ దేవుడి మీద కోపం వచ్చింది. దేవుడికి అంత్యసందేశం (అల్టిమేటమ్) ఇచ్చేశాడు. వారంలోపు వర్షం కురిసిందా సరి, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని పోస్టర్లు వేయించి మరీ గోడలకు అంటించాడు! ‘‘భూమ్మీది జీవుల్ని కాపాడడం దేవుడి బాధ్యత. ప్రాణాధారమైన నీటిని లేకుండా చేస్తే ఎలా? రైతులు అల్లాడిపోతున్నారు. ఆ మాత్రం తెలియదా? దేవుడే తలచుకుంటే ఈ క్షణంలో కుంభవృష్టి కురియదా?’’ అని శర్మగారి వాదన. ప్రార్థన స్థాయిని కూడా దాటిపోయి, దేవుడి తరఫున దైవదూతగా మాట్లాడే మామూలు మానవులు కూడా కొందరు ఉన్నారు! బెన్నీ పున్నతర నే తీసుకోండి. కేరళలోని కోళికోడ్ నుంచి వెలువడే ‘సండే షాలొమ్’ పత్రికకు ఆయన సంపాదకులు. ‘మోడీ ప్రధానిగా గెలవడం అన్నది దైవనిర్ణయం’ అని బెన్నీ తన తాజా సంపాదకీయంలో రాశారు! రాసి, అక్కడితో ఊరుకోలేదు. ‘‘ఈ ప్రపంచంలో జరిగేవేవీ దేవుడికి తెలియకుండా జరగవు. దేవుడే మోడీని తన సేవకునిగా ఎన్నుకున్నాడు కాబట్టి భక్తిపరులైన ప్రతి ఒక్కరూ మోడీని సమర్థించాలి. అలా చేయకపోతే దైవ సంకల్పాన్ని ధిక్కరించినట్లవుతుంది. ఎన్నికలకు ముందు బహుశా భారతీయులంతా మోడీని ప్రధానిని చేయమని దేవుణ్ని ప్రార్థించినట్లున్నారు. ఆ ప్రార్థన ఫలించి, దేవుడు ప్రజలను కనికరించి, కాంగ్రెస్‌ను ఓడించి, మోడీని అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టాడు’’ అని విశ్లేషించారు. నువ్వే దేవుడివైతే ఎన్.శ్రీనివాసన్ని మళ్లీ బి.సి.సి.ఐ. అధ్యక్షుడిని చెయ్యమని దేవుణ్ని అడగడం, నువ్వు దేవుడివి కాకపోబట్టే కదా ఇండోర్‌లోని పొలాలన్నీ ఎండిపోతున్నాయని దేవుణ్ని అనడం, నువ్వు దేవుడివి కాబట్టే మోడీని గెలిపించావని అనుకోవడం... ఇవన్నీ దేవుణ్ని ప్రార్థించడం కాదు. దేవుణ్ని క్రికెట్లోకి, రుతుపవనాల్లోకి, రాజకీయాల్లోకి లాగడం. అంటే దేవుణ్ని మానవమాత్రులలోకి లాగేయడం! ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైన ప్రార్థన అంటారు బాపూజీ. మరి దేవుణ్ని అడక్కుంటే కష్టాలు తీరేదెలా? అడుగుదాం. కానీ కష్టాలు తీర్చమని కాదు. కష్టాలను ఓర్చుకునే శక్తిని ఇమ్మని అడుగుదాం. - మాధవ్ శింగరాజు -
దేవుడిని నవ్వించేవాళ్లు!
దైవికం మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా? ఇఫ్ యు వాంట్ మేక్ గాడ్ లాఫ్, టెల్ హిమ్ అబౌట్ యువర్ ప్లాన్స్ - అంటాడు ఊడీ ఆలెన్. దేవుణ్ణి నవ్వించాలనుకుంటే, మన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయనకు చెబితే సరిపోతుందట. ఊడీ అమెరికన్ దర్శకుడు. నాలుగు ఆస్కార్ల విజేత. ఇదొక్కటే ఊడీ ప్రతిభ కాదు. మంచి రచయిత, న టుడు, జాస్ సంగీతకారుడు, కమెడియన్, నాటక కర్త, గొప్ప సెటైరిస్టు. మనిషికి 78 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నారు. ఇంతా చేసి ఆయన అఫీయిస్ట్ (నాస్తికుడు). దేవుడి మీద కూడా సెటైర్లు వేస్తుంటాడు. కానీ అవి దేవుడికి కోపం తెప్పించేవి కాదు. దేవుణ్ని, మనిషినీ ఇద్దర్నీ నవ్వించేవి. మన దగ్గర కూడా కొందరు అప్పుడప్పుడు తమకు తెలియకుండానే దేవుణ్ణి నవ్విస్తుంటారు... ‘మా దేవుడు గ్రేట్’ అంటే, ‘మా దేవుడు గ్రేట్’ అని. ఈ మధ్య అలా దేవుణ్ణి నవ్వించిన పెద్ద మనిషి ద్వారకపీఠం శంకరాచార్యులు స్వామీ స్వరూపానంద. షిర్డీ సాయిబాబా ముస్లిం అని, ఆయన్ని హిందువులు ఆరాధించకూడదని; బాబా ఏనాడూ పవిత్ర గంగా నదిలో స్నానమాచరించలేదు కనుక ఆయన్ని ఆరాధించేవారికి గంగలో మునిగే యోగ్యత ఉండదని ఇటీవలి ప్రసంగంలో స్వరూపానంద సెలవిచ్చారు. ఈ మాటలన్నీ ఆయన కేంద్ర మంత్రి ఉమాభారతిని ఉద్దేశించి అన్నవి. ‘సాధ్వి’ ఉమాభారతి కూడా సాయిబాబాను ఆరాధించడమేమిటన్నది ఆయన ప్రశ్న. లేదా ప్రశ్నార్థకంతో కూడిన ఆశ్చర్యం. ఇదే మాటను ఆయన గతంలో ఉమాభారతిని దృష్టిలో పెట్టుకుని అన్నప్పుడు ‘‘ఆరాధన అన్నది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది’’ అని ఒక్క మాటతో ఆమె సరిపుచ్చారు. ఇప్పుడు కూడా స్వరూపానంద వ్యాఖ్యలపై ఆమె ఏమీ మాట్లాడలేదు. అలా మాట్లాడక పోవడం కూడా ఆయనకు కోపం తెప్పించినట్లుంది. ‘‘ఉమాభారతి రంగులు మార్చి సాయిబాబాను కొలుస్తున్నారు. బాబా ముస్లిం. ఆ సంగతి తెలిసీ ఆయన్ని కొలుస్తున్నారంటే, ఇక ఆమెపై ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎలా కురుస్తాయి’’ అని అన్నారు. ఈ మాటలు ఆ భగవానుడికి నవ్వు తెప్పించకుండా ఎలా ఉంటాయి?! మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా? ఒకరిని వరం కోరుకుంటే, మనకెందుకులే అని ఇంకొకరు పట్టనట్లు ఉండిపోతారా? బాబా అంటే శ్రీరామచంద్రుడు పలక్కండా పోతాడా? రామా అంటే జీసెస్ రాకుండా ఉంటాడా? అల్లా అంటే ఆ పరమాత్ముడికి వినిపించకుండా ఉంటుందా?! మనుషుల్లోనే దేవుడు ఉంటాడంటారు కదా రమణ మహర్షి, అలాంటప్పుడు సృష్టికర్త ఎక్కడ ఉంటేనేం? ఏ పేరుతో ఉంటేనేం? ఏ రూపంలో ఉంటేనేం? అసలు ఏ రూపంలోనూ లేకపోతేనేం? దేవుడి గురించి పొసెసివ్‌గా (‘అమ్మా...నా దేవుడు’ అన్నట్లు) గొడవ పడడం అన్నది ‘మా ఇంట్లో దేవుడి పటానికి నువ్వెందుకు దండం పెడుతున్నావ్?’ అని అడగడం లాంటిది. లేదా ‘మా వీధిలో గుడికి నువ్వెందుకొచ్చావ్’ అని తగాదా పడడం లాంటిది. స్వామీ స్వరూపానందకు ఇవన్నీ తెలీదనుకోవాలా? లేక సచిన్‌ని దేవుడిలా భావించే ఒక సాధారణ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఆయన చేత ఈ మాటలన్నీ అనిపించిందా? రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నప్పుడు సచిన్ అభిమానులు తీవ్రంగా కలత చెందారు! ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ గురించి తెలీదా అని విస్తుపోయారు. కొందరైతే ‘‘పోనీయండి పాపం, దేవుడి గురించి తెలీదంటే ఆమె నాస్తికురాలు అయ్యుండాలి’’ అని పెద్దమనసు చేసుకున్నారు. కనీసం అలాగైనా పెద్దమనసు చేసుకోలేకపోయారా స్వరూపానంద!! - మాధవ్ శింగరాజు -
పిల్లల మతంలోకి మారిపోదాం
దైవికం ద్వేషం కన్నా భయంకరమైనది దురభిమానం. ఈ రెండిటికన్నా భయంకరమైనవాడు అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ ద్వేషం యూదుల మీద. హిట్లర్ దురభిమానం తన సొంత జాతి మీద. సొంత జాతి అంటే మళ్లీ క్రిస్టియానిటీ అని కాదు. యూదులు కాని వారెవరైనా తన సొంత జాతే అన్నట్లు ఉండేవారాయన. పైగా యూదులు అల్పులని, తక్కినవారు ఎంతో ఉత్కృష్టమైన ఆర్యసంతతి మూలాల నుంచి వచ్చినవారని హిట్లర్‌కి ఓ నమ్మకం. మనుషుల పోలికల మీద కూడా దీర్ఘమైన ఆయన పరిశీలన ఒకటి ఉండేది. ఆర్యులంటే ఇలా ఉంటారని, యూదులంటే అలా ఉంటారని ఏవో పిచ్చి అభిప్రాయాలు ఉండేవి. 1935లో ఆయన ప్రచార బృందం... ‘ఇదిగో మన ఆర్యజాతి ఇంత పరిపూర్ణంగా, ఇంత సర్వోత్కృష్టంగా ఉంటుంది’ అంటూ జాబిల్లి వంటి ముఖం, బూరెల్లాంటి బుగ్గలు ఉన్న ఆరు నెలల చిన్నారి ఫొటోను పోస్టర్ల మీద, చిన్న చిన్న కార్డుల మీద ప్రింట్ చేయించి జర్మనీ అంతటా పంచి పెట్టింది. దీన్ని బట్టి మనుషులలోని ద్వేషభావం, దురభిమానం ఏ స్థాయిలో ఉంటాయో అర్థమౌతుంది. హిట్లర్ చనిపోయాడు. యుద్ధం ఆగిపోయింది. ఏళ్లు గడిచిపోయాయి. తాజాగా ఇప్పుడు బయట పడిన నిజం ఏమిటంటే, ఆ పాప.. హిట్లర్ అనుకున్నట్లుగా ‘ఆర్యన్ బేబీ’ కాదనీ, యూదుల బిడ్డ అని! హిట్లర్ బతికి ఉండగా ఈ సంగతి తెలిస్తే ఎలా ఉండేదో కానీ, ప్రొఫెసర్ హెస్సీ టఫ్ట్ మాత్రం ‘‘బాబోయ్, నాజీలు నన్ను బతకనిచ్చేవారు కాదు’’ అంటున్నారు చిరునవ్వుతో. ప్రస్తుతం ఎనభై ఏళ్ల వయసులో ఉన్న హెస్సీ ఎవరో కాదు, ఆనాటి ఆర్యన్ బేబీనే! ఇంతకీ ఆ పాప ఫొటో నాజీలకు ఎక్కడిది? హెస్సీ తండ్రి జాకబ్. తల్లి పాలైన్ లెవిన్సన్స్. ఇద్దరికీ మ్యూజిక్ తెలుసు. ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదా అని 1928లో లాట్వియా నుంచి బెర్లిన్ వె ళ్లారు. ఒక అపేరా కంపెనీలో జాకబ్‌కి ఉద్యోగం వచ్చింది కానీ, అతడు యూదుడు అని తెలిసిన వెంటనే ఉద్యోగంలోంచి తొలగించారు. తర్వాత ఆయన సేల్స్‌మేన్‌గా చేరారు. 1935 నాటికి యూదులపై నాజీల ద్వేషం, దౌర్జన్యం మితిమీరిపోయాయి. అప్పటికి హెస్సీకి ఆరు నెలలు. బొద్దుగా, అందంగా ఉండేది. ఓ రోజు తన ముద్దుల బిడ్డను చంకనేసుకుని బెర్లిన్‌లో పేరున్న ఫొటోగ్రాఫర్ హాన్స్ బాలిన్ దగ్గరకు తీసుకెళ్లి ఫోటో తీయించుకొచ్చారు పాలైన్. తర్వాత కొన్నాళ్లకు అదే ఫొటో నాజీల పత్రిక ‘సనీ ఇన్స్ హవుజ్’ ముఖచిత్రంగా వచ్చింది. అది చూసి పాలైన్ విపరీతంగా భయపడిపోయారు. నాజీలకు తెలిస్తే తమ చిరునామా వెతుక్కుంటూ వచ్చి మరీ ముప్పు తిప్పలు పెడతారన్న ఆలోచన రాగానే ఆమె గొంతు తడారిపోయింది. పరుగున ఆ ఫొటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి ‘‘ఇదెలా జరిగింది?’’ అని అడిగారామె. ‘‘ఓ అదా...’’ అంటూ నవ్వారాయన. ‘‘ఆ పత్రిక ఆర్యన్ బేబీల అందాల పోటీలు పెడితే మీ పాప ఫొటో పంపాను. నాజీల దురభిమానాన్ని దెబ్బతియ్యాలనే అలా చేశాను. పసికందుల్లో కూడా వీళ్లు జాతి భేదాలను చూడ్డం ఘోరం కదా’’ అన్నారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు పాలైన్ దంపతులు నాజీల కంటపడకుండా తమ బిడ్డను కాపాడుకున్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు హెస్సీ వల్ల వెలుగులోకి వచ్చాయి. ఎనభయ్యేళ్ల క్రితం తన ముఖచిత్రంతో వచ్చిన పత్రికను ఆమె ఇజ్రాయిల్‌లోని మారణహోమ స్మారక పురావస్తుశాలకు విరాళంగా ఇస్తూ నాటి సంగతులను మీడియాకు వెల్లడించారు. ద్వేషానికి కారణాలు ఉంటే ఉండొచ్చు. కానీ ప్రేమకు కార ణాలు ఉండకూడదు. ఉంటే అది దురభిమానమో, స్వార్థాభిమానమో అవుతుంది. అంతకన్నా అకారణమైన ద్వేషమే నయం. ఏ కారణమూ లేకుండా మొలకెత్తని ప్రేమ కన్నా అది హీనమైనదేం కాదు. పిల్లలు, దేవుడు ఒకటే నంటారు. హిట్లర్ పసిపిల్లల్లోనూ తన జాతినే వెతుక్కున్నాడు తప్ప దేవుణ్ని గానీ, దైవాంశ ఉండే పసితనాన్ని కానీ చూడలేకపోయాడు. పిల్లలందరిదీ ఒకే మతం. అది దైవమతం. అందుకే పిల్లలు పెద్దవాళ్లయ్యాక కట్టే గుడులు, చర్చిలు, మసీదుల కంటే కూడా చిన్నప్పుడు ఇసుకలో వాళ్లు కట్టే గుజ్జనగూళ్లే అసలైన దేవాలయాలు అనిపిస్తాయి ఒకోసారి. వాటిల్లోనూ దేవుడు సాక్షాత్కరిస్తాడు. మనం చూడగలిగితే! - మాధవ్ శింగరాజు -
ఉన్నట్లా? లేనట్లా?
దైవికం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ కొలంబియా రచయిత. 87 ఏళ్ల వయసులో అనారోగ్యం వల్ల ఇటీవలే చనిపోయారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖులైన రచయితలలో ఒకరిగా ఆయనకు పేరు. నోబెల్ గ్రహీత. గట్టి అభిప్రాయాలు ఉన్న మనిషి. ధైర్యం కూడా ఎక్కువే. ఎంత ధైర్యం అంటే... తన దేశ రాజకీయ విధానాలను సైతం అయన బహిరంగంగానే విమర్శించేవారు. అంతటి మనిషి కూడా దేవుడి ఉనికి విషయంలో చివరి వరకు సంశయంగానే ఉండిపోయారు! ‘‘దేవుణ్ణి నమ్మను. కానీ దేవుడంటే భయపడతాను’’ అంటారు గార్షియా. బహుశా ఉన్నాడు అని నమ్మి ఉంటే, ఆయనకా భయం ఉండకపోయేదేమో. ఇంతకూ గార్షియాకు దేవుడంటే భయం దేనికి? రాజకీయ విధానాలను విమర్శించినట్లుగా... ఆ విధాత తలపుల గురించి కూడా తాను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడతానేమోనన్న భయమా? చెప్పలేం. అయితే ఆయన రాసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’, ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రియార్క్’ నవలల్ని గమనిస్తే దేవుడి ఉనికి పట్ల సందేహాలున్న వ్యక్తికి అంతటి ఊహాశక్తి (సృజన) ఎలా సాధ్యం అని కూడా అనిపిస్తుంది. మొత్తానికి గార్షియా అలా అనడం (దేవుణ్ణి నమ్మను. కానీ భయపడతాను అని)... మానవ స్వభావాలపై ఆయన పరిశీలనకు ఒక వ్యక్తీకరణ కావచ్చు. ఇదంతా కాదు, గార్షియాకు దేవుడు ఉన్నట్టా? లేనట్టా? ఏమో ఆయనే బతికొచ్చి చెప్పాలి. దేవుడిపై గార్షియాకు ఉన్న సంశయం లాంటిదే, గార్షియా లోని ‘యాగ్నాస్టిసిజం’పై మన సంశయం. యాగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ విశ్వసించేవాడు కాదు. ఉన్నాడో లేదోనన్న సంశయంలో ఉన్నవాడు. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత. దేవుణ్ని నమ్ముకున్న వారు సుఖంగా నిద్రపోతారు... ఆయన ఉన్నాడన్న నిశ్చింతతో. దేవుడు లేడనుకున్నవారు సుఖనిద్రకు ఏర్పాట్లు చేసుకుంటారు... ఎవరూ లేరన్న నిశ్చయంతో. ఇక మిగిలింది సంశయశీలురు. దేవుడు ఉన్నాడో లేడో తెలీక పక్కపై అటు ఇటు కదులుతుంటారు. తెల్లారుతుంది కానీ ఏదీ తేలదు. ‘తెల్లారడం’ దైవికం అని తెలుసుకునే వరకు సంశయం తొలగిపోదు. తెల్లారడం అంటే చీకటి చెదిరిపోయి, వెలుగు వ్యాపించడం ఒక్కటేనా? మౌనంగా, మాటమాత్రం లేకుండా జరిగిపోయేవి చాలా ఉంటాయి. చల్లని గాలికి నెమ్మదిగా ఊగే పచ్చటి చెట్లు, పరిమళాలు వెదజల్లే పూలు, మంచుతో తడిసిన గడ్డి.. అన్నీ తెల్లారడంలో భాగమే. అన్నీ చల్లని, స్వచ్ఛమైన దేవుడి రూపాలే. ప్రకృతిలోని ఈ దివ్యత్వాన్ని వీక్షించగలిగితే సంశయాలన్నీ వేకువ పిట్టల్లా ఎగిరిపోతాయి. సాయం సంధ్యలోకి మౌనంగా ఒరిగిపోయి చీకటిని వెలిగించే నక్షత్రాల నిశ్శబ్దం కూడా దైవమే నంటారు మదర్ థెరిస్సా. దైవాత్మను స్పృశించడానికి అలాంటి నిశ్శబ్దంలోకి, అలాంటి మౌనంలోకి మనసు లీనం అవ్వాలట. అప్పుడు ఎటు చూసినా దేవుడే దర్శనమిస్తాడని అంటారు మదర్. ఈ మాటనే మార్టిన్ లూథర్ కింగ్ ఇంకోలా చెప్పారు. ‘‘దేవుడు తన సువార్తను బైబిల్లో మాత్రమే రాయలేదు. చెట్లు, పూలు, మేఘాలు, నక్ష త్రాలన్నిట్లోనూ రాశారు’’ అని. అయినా సరే, మనకింకా సంశయం ఎందుకంటే దేవుడి ని మనం మనిషి రూపంలో మాత్రమే చూడాలనుకుంటున్నాం! - మాధవ్ శింగరాజు -
లోపల - బయట
దైవికం జీవితంలో ఎన్నో రంగులుంటాయి. రకరకాల కోణాలుంటాయి. మంచి మనుషులు ఉంటారు. మంచి మాటలు ఉంటాయి. అయినా జీవితం విసుగెత్తిపోతోందంటే?! జీవితం చిన్న మాట. అది విసుగెత్తడం పెద్ద మాట! అంత పెద్ద మాటని దుబారాగా అనేస్తుంటాం. జీవితం ఊరికే ఎందుకు విసుగెత్తుతుంది? జీవితంలో ఎన్నో రంగులుంటాయి. రకరకాల కోణాలుంటాయి. మంచి మనుషులు ఉంటారు. మంచి మాటలు ఉంటాయి. అయినా జీవితం విసుగెత్తిపోతోందంటే... జీవితం అని మనం అనుకుంటున్న దాంట్లో ఉండిపోయి, అందులోంచే జీవితాన్ని చూస్తుంటాం కనుక. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకో, పెళ్లయ్యాక కొన్నేళ్లకో జీవితంలో ఇంకేం లేదని మనకు తెలిసిపోతుంది! ఆ క్షణం నుంచి జీవించడం మానేస్తాం. జీవితానికి గౌరవం ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోతాం. గ్రాసు, నెట్టు తప్ప జీవితం అంటే మరేం లేదని; భర్త, పిల్లలు తప్ప జీవితానికి మరే పరమార్థం లేదనీ అనిపిస్తుంటే విసుగెత్తి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. పారిపోయాక అక్కడా విసుగెత్తితే! ఆ నిస్తేజం, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, నీరసం (అన్నీ కలిసిందే విసుగు) జీవితంలో లేవని, అవి మనలోనివి మాత్రమేనని అర్థం. ‘‘దేవుడు చేసే పనేమిటంటే... మనల్ని గమనిస్తూ ఉండడం, మనకు బోర్ కొట్టినప్పుడు మనల్ని చంపేస్తుండడం. అందుకే మనం ఎప్పుడూ బోర్ కొడుతున్నట్లు కనిపించకూడదు’’ అంటాడు ఛక్ పలనిక్ అనే అమెరికన్ రచయిత తన ‘ఇన్విజిబుల్ మాన్స్టర్’ పుస్తకంలో. సరదాగా మనల్ని భయపెట్టేందుకు అని ఉంటాడీమాట అతడు. దేవుడంటే భయం ఉండడం కూడా మంచిది. జీవితం బోర్ కొట్టదు. ఎందుకంటే పాపపుణ్యాల గురించి ఆలోచిస్తాం. క్రమం తప్పకుండా దేవుడి పటానికి దండం పెట్టుకుంటాం. గుడికి వెళ్లొస్తుంటాం. దానధర్మాలు చేస్తుంటాం. పండగలకి సిద్ధం అవుతుంటాం. దర్శన ప్రయాణాలు చేసొస్తుంటాం. భయంతోనే కాకుండా భక్తితో కూడా ఇవన్నీ చేస్తుంటాం. అయితే దేవుడి సమక్షంలో భయమూ భక్తీ రెండూ ఒకటే. ఈ రెండూ కూడా మనిషిని క్షణం కూడా తీరిగ్గా ఉంచవు, తీరిగ్గా లేనిపోనివి ఆలోచించనివ్వవు. చేతిలో పని ఉంటుంది, చెయ్యబోయే పనుల క్రమం ఉంటుంది. ఇక విసుగెత్తడానికి సమయం ఎక్కడ? మనిషి తనకైతాను జీవితం నుండి విడిపోయి విసుగ్గా ముఖం పెడతాడేమో కానీ, దైవత్వం ఎప్పుడూ జీవితంలో కలిసే ఉంటుంది. జీవితంలోని ప్రతి అంశంలో, ప్రతి అడుగులో, ప్రతి నిమిషం దైవత్వాన్ని వీక్షించాలి మనిషి. అప్పుడు మాత్రమే జీవితేచ్ఛ కలుగుతుంది. జీవితేచ్ఛ ఉన్నచోట ‘విసుగు’ అనే మాట ఉండదు. ఆంగ్ల రచయిత జి.కె.ఛెస్టర్టన్ అంటారు, అనాసక్తంగా ఉండే మనుషులు తప్ప, లోకంలో ఎక్కడా ఆసక్తి కలిగించని విషయాలు ఉండవని. ఈసారి జీవితంపైన నెపం వేసే ముందు మీరెక్కడుండి ఆ మాట అంటున్నారో ఆలోచించండి. జీవితం లోపల ఉండి అంటున్నారో, జీవితం బయట నిలబడి అంటున్నారో చూసుకోండి. జీవితం లోపల ఉన్నవారికి విసుగు అనేదే అనిపించదు. జీవితం బయట ఉన్నవారికి విసుగుతప్ప మరేదీ కనిపించదు. - భావిక -
అడగక ఇచ్చిన వరం
దైవికం దేవుడిని వరంఇమ్మని అడక్కుండానే ఆయన ఇచ్చిన వరమే చెట్లు. అలాంటి చెట్లను మనం నరికేస్తున్నాం! ‘‘ఆవులకు మేత లేదు. వెళ్లి గడ్డి కోసుకురా’’ అని భక్త కబీరు తన కొడుకును ఊరి చివరున్న పొలాలకు పంపించాడు. కానీ ఎంతసేపైనా కొడుకు రాలేదు. సాయంత్రం అవుతోంది. అయినా రాలేదు. సహనం కోల్పోయిన కబీరు కొడుకు ఎక్కడున్నాడో చూద్దామని బయలుదేరాడు. తనయుడు నిగనిగలాడుతున్న పచ్చికబయలుపై తదేకంగా నిల్చుని కనిపించాడు! పిల్లగాలులు వీస్తున్నాయి. పచ్చిగడ్డి గాలిని ఆస్వాదిస్తూ అటూ ఇటూ రమ్యంగా ఊగుతున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన కబీరు కుమారుడు పచ్చిక ఆనందంతో మమేకమైపోయాడు. ఆనందంలో మునిగితేలుతున్నాడు. తన తండ్రి వచ్చిన విషయాన్ని కూడా అతను గమనించలేదు. దాంతో క బీరుకు కోపం వచ్చింది. ‘‘నీకేమైనా పిచ్చా? నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు?’’ అని గట్టిగా కోప్పడ్డాడు. ‘‘నేనిక్కడికి వచ్చేసరికి ఈ పచ్చగడ్డి... గాలి స్పర్శకు పరవశించిపోయి ఆనందంతో నృత్యం చేస్తుండటం చూస్తూ నన్ను నేను మరచిపోయాను. నా మనసెంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మరచిపోయాను. ఇప్పుడు చెప్పండి నాన్నగారూ, నన్ను ఇక్కడికి ఎందుకు పంపారు?’’ అని నిదానంగా అడిగాడు కుమారుడు. దాంతో కబీరు కోపం రెట్టింపైంది. ‘‘నిన్ను ఇక్కడికి గడ్డి కోసుకు రమ్మని పంపాను’’ అన్నాడు. ‘‘మన్నించండి నాన్నగారూ... నేను ఎంతో సంతోషంగా నృత్యం చేస్తున్నట్లున్న ఈ పచ్చగడ్డిని నేను నా చేతులతో నరకలేను. మీరు నన్ను ఎంత తిట్టినా ఈ విషయంలో మాత్రం నేను ఏమీ చెయ్యలేను. నేనిప్పటి వరకు ఓ ఆనంద జగత్తులో ఉన్నాను. అది కాస్తా మీ రాకతో చెదరిపోయింది. ఆ ప్రపంచాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ సౌందర్య సన్నివేశం ఎవరికి వారు చూసి తరించాల్సిందే. ఒకరు చెప్తే పొందేది కాదు’’ అన్నాడు కబీరు పుత్రుడు. కబీరు అతని మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే ఆ క్షణంలోనే తన కుమారుడికి కమాల్ అని పేరు పెట్టాడు. అందరూ అతనిని ఆ క్ష ణం నుంచి కమాల్ అని పిలవడం మొదలుపెట్టారు. తన కొడుకు పచ్చికతో ఓ గాఢమైన బంధాన్ని ఊహించుకుని చెప్పడం కబీర్‌కు ఆనందమేసింది. తన సుపుత్రుడిలో ఒక గొప్ప వ్యక్తిని చూశాడు. నిజమాలోచిస్తే మనిషికీ, పచ్చగడ్డికీ అనుబంధముంది. పరిణామక్రమంలో తొలుత పచ్చికై, పురుగై, చెట్టై, పక్షై, జంతువై ఆ తర్వాత రకరకాల వాటి తర్వాత మనం పుట్టాం. ఈ పరిణామక్రమాన్ని మనం మరిస్తే మరచిపోవచ్చు కానీ చెట్లనూ, మనుషులనూ ఒకే దేవుడు సృష్టించాడన్న విషయాన్ని మరచిపోకూడదు. కనుక చెట్లకూ, మనుషులకూ మధ్య విడదీయరాని బంధముంది. దేవుడు మనకన్నా ముందు చెట్లను పుట్టించాడు. ఆ తర్వాత మనిషి పుట్టాడు. అంటే చెట్లు మనకన్నా పూర్వం నుంచే ఉన్నాయి. కానీ మనుషులు ఈ సంగతి మరచిపోతున్నారు. కమాల్‌కు పచ్చగడ్డితో అనుబంధం యాదృచ్ఛికంగా వచ్చిన గొప్ప జ్ఞాపకం. అది అద్భుత విషయం. చెట్లతో మనకున్న బంధాన్ని తెలుసుకోవడం జ్ఞానానికి సంకేతం. కనుక చెట్లను నరికే వ్యక్తి తన బంధాన్ని తానే తెంచుకుంటున్నాడని అర్థం. ఆదివాసీలను మనం చిన్న చూపు చూశాం. కానీ వాళ్లే మనకన్నా జ్ఞానవంతులు. వాళ్లు చెట్లను ప్రాణప్రదంగా చూసుకున్నారు. ఆస్ట్రేలియాలోని ఆదివాసీలు చెట్లను నరకరు, అవి చనిపోయిన తర్వాతే వాటిని ఉపయోగిస్తారు. నాగరికులమని తలచే మనం చెట్లను నరుకుతున్నాం. కనుక ఎవరు ఆటవికులో తెలుసుకోవాలి. చెట్ల కొమ్మలు మేఘాలను చూసి మనిషి కోసం వర్షాన్ని యాచిస్తాయి. అలాంటి చెట్లను మనం నరికేస్తుంటాం. చెట్లు శిశుప్రాయంలో ఉయ్యాలలవుతున్నాయి. నడిచే ప్రాయంలో వాహనాలవుతున్నాయి. విశ్రమించేటప్పుడు మంచాలవుతున్నాయి. వృద్ధాప్యమొచ్చినప్పుడు చేతికర్రలవుతున్నాయి. ఇలా చేదోడువాదోడుగా ఉన్న చెట్లను స్వార్థానికి నరకడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. దేవుణ్ణి వరమివ్వు అని అడక్కుండానే ఆయనిచ్చే వరమే చెట్లు. అలాంటి వరాన్ని నాశనం చేసే మనిషి నాగరికుడా? చెట్లను నరికే మనిషి నిజానికి వాటిని హత్య చేయడం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నాడని అర్థం. ఎందుకంటే చెట్లు నశిస్తే మనిషి మనుగడా క్రమేపీ క్షీణిస్తుంది. - అంబడిపూడి శర్వాణి -
మనలోనే మన ఎదుటే ఆనందం
దైవికం ప్రపంచంలోనే అతి విషాదకరమైనదేదో తెలుసా? మనిషి ఆనందంగా ఉండటానికి పుట్టాడు. కానీ అతను సంతోషంగా లేకపోవడం. మైఖేల్ ఆడమ్ దీనిని అందంగా చెప్పాడు ‘‘మనిషి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అందుకోసం అతను నానా పాట్లు పడతాడు. ఈ ప్రయత్నమే అతని విషాదానికి కారణమవుతోంది. నేను ఆనందంగా ఉండాలని ఆశించాను. ఆశ అనేది సామాన్యమైనది కాదు. అందుకోసం అర్రులు చాచిన క్రమంలో ఆనందమనే పక్షి నా దగ్గరకు రానే లేదు. నేను ఆనందాన్ని పొందడం కోసం చాలా కాలం శ్రమించాను. నేను ఆనందాన్ని ఎక్కడో బహుదూరాన వెతికాను. ఆనందం అనేది ఒక నది మధ్యలో ఉన్నటువంటి దీవి అని ఎప్పుడూ అనుకునే వాడిని. అదే నదిగా ఉండి ఉండవచ్చు. ఆనందమనేది రహదారి చివ ర్లో ఉండే సత్రం పేరే అనుకున్నాను. అదే రహదారిగా ఉండి ఉండవచ్చు. ఆనందమనేది రేపు అనే అనుకున్నాను. కానీ అది ఇప్పుడే ఇక్కడే ఉండి ఉండవచ్చు కదా? నేను దానిని ఎక్కడో వెతికాను’’ అంటాడు మైఖేల్ ఆడమ్. ఆయన చేసిన తప్పు ఆనందాన్ని వెతకడమే. ఆనందం బయటెక్కడో లేదు. అది మనలోపలే ఉంది. లోపల ఉన్నదానిని బయటెక్కడో వెతికితే ఎలా దొరుకుతుంది? ఉన్న చోటు విడిచిపెట్టి లేని చోట వెతికితే ఎలా దొరుకుతుంది? ముల్లా నసీరుద్దీన్ ఒకసారి వీధిలో దీపం వెలుగులో ఏదో వెతుకుతున్నాడు. మిత్రుడొకడు ఆయనను చూసి ‘‘ఏం వెతుకుతున్నావు?’’ అని అడిగాడు. నసీరుద్దీన్ ‘తాళాన్ని’ అని జవాబిచ్చాడు. మిత్రుడు కూడా ఆయనతో కలిసి వెతికాడు. కానీ తాళం ఎంతసేపటికీ దొరకలేదు. ఇక లాభం లేదనుకుని మిత్రుడు ‘‘ఇంతకీ తాళం ఎక్కడ పోగొట్టుకున్నావు?’’ అని అడిగాడు. నసీరుద్దీన్ ‘‘ఇంటిముందర’’ అని అన్నాడు. మిత్రుడు ‘‘మరి అక్కడ కాకుండా ఇక్కడ వెతుకుతున్నావేంటి?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు నసీరుద్దీన్ ‘‘ఇక్కడేగా వెలుగుంది’’ అని అన్నాడు. మనిషి కూడా ఆనందాన్ని ఇలాగే వెతుకుతున్నాడు. కోల్పోయిన చోట కాకుండా మరెక్కడో వెతుకుతున్నాడు. ‘‘నేను ఆనందం పొందడం కోసం పడరాని పాట్లు పడ్డాను. కానీ ఏం లాభం? బాధే మిగిలింది’’ అని ఆడమ్ చెప్పాడు. ఆడమ్ నది మధ్యలో ఉన్న దీవినే ఆనందం అనుకున్నాడు. ఇలా అనుకుంటే ఆ దీవిని చేరడానికి తీరం నుంచి దీవి వరకు మధ్య ఉన్న నదీజలాలను ఈదాలి. అది అంత సులభం కాదు. తీవ్రప్రయత్నం చేసే క్రమంలో ఆయనకు చివరకు మిగిలేది బాధే. నది కూడా ఆనందమే అని అనుకుంటే బాధపడాల్సి ఉండదు. ప్రయాణం అనేది కఠినతరమే. రహదారే ఆనందం అని అనుకుంటే నడవడమే ఆనందంగా ఉంటుంది. అలాగే ఆశ కూడా ఆనందాన్ని దెబ్బ తీస్తుంది. మనం ఏదో ఒక దానిపైనో లేక ఒక వ్యక్తిపైనో ఆశ పెట్టుకుంటాం. అనుకున్నది పొందితే ఆనందిస్తాం. లేకుంటే కలిగేది ఆవేదనే. మనం ఈ ఆవేదనను మనకు మనమే స్వాగతిస్తుంటాం. మితిమీరిన ఆశ కానివ్వండి ద్వేషం కానివ్వండి అవి ఆనందానికి శత్రువులే. అన్నింటినీ ఒకేలా ఇష్టంతో చూసుకుంటే ఆనందానికి లోటుండదు. అన్నింటినీ ఆస్వాదించాలి. అప్పుడు జీవితం ఓ పండగవుతుంది. ఉదయం లేవడానికి అలారం పెట్టుకుంటాం. తీరా అలారం మోగినప్పుడు చిరాకుపడతాం. దాని తలమీద ఓ దెబ్బ వేస్తాం. అలారాన్ని ఆస్వాదించండి. ఆనందానికి లోటుండదు. అన్నింటా ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవించవచ్చు. అలా అనుభవించకుండా మనకు మనమే అడ్డుపడుతుంటాం. దానితో బాధలు మొదలు. భగవంతుడిలా ఆనందమూ ఎక్కడో లేదు మన ముందే మనలోనే ఉంది. అంతటా ఉంది. మనం చెయ్యవలసినదల్లా కళ్లు తెరచి చూడాలి. - యామిజాల జగదీశ్ -
సహనశీలితో దేవుడు స్నేహం చేస్తాడు
దైవికం మానవుడికి ఉండవలసిన లక్షణాల్లో ‘సహనం’ ఒక అమూల్యమైన సుగుణం. సహన సంపద కలిగిన మనిషి ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా సునాయాసంగా అధిగమించగలుగుతాడు. కనుక ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వీడకూడదు. మానవులకు తమ దైనందిన జీవితంలో అనేక సమస్యలు చుట్టు ముట్టడం సహజం. దీనికి ఎవరూ మినహాయింపుకాదు. ఇలాంటి సందర్భాల్లో మనిషి వివేకం ప్రదర్శించాలి. సమస్యలకు తలొగ్గి పలాయనవాదం అవలంబించకూడదు. మనిషిలో సహన గుణం కనుక ఉన్నట్లయితే ఎన్ని గడ్డు పరిస్థితులెదురైనా మేరు పర్వతంలా నిలిచి పోరాడతాడు. అసహనం, ఆగ్రహం ఓటమికి నాంది. ఇహలోక పరాభవానికి, పరలోక వైఫల్యానికి అసహనం కారణమవుతుంది. దీనికి భిన్నంగా సహనవంతుడు సమాజంలో భూషణంలా ప్రకాశిస్తాడు. తలపెట్టిన ప్రతి కార్యాన్నీ ఫలవంతంగా నిర్వహించగలుగుతాడు. అందుకే పవిత్రఖురాన్ సహనం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని అర్థించమని, సహనవంతులతో దైవం చెలిమి చేస్తాడని చెప్పింది. - యండి. ఉస్మాన్‌ఖాన్ -
ఇవ్వడం కోసం చెయ్యి చాచండి
దైవికం ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ చిన్నారి లోతైన కాలువలోకి జారిపడ్డాడు. ‘‘కాపాడండీ... కాపాడండీ’’ అని అరుస్తూ ఏడుస్తున్నాడు. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి కాలువలోకి తొంగి చూసి, ‘‘ఇదిగో అబ్బాయ్ నీ చెయ్యి ఇవ్వు’’ అని తన చేతిని చాచాడు. ఆ చిన్నారి చెయ్యి అందివ్వకపోగా మళ్లీ ‘‘కాపాడండీ... కాపాడండీ’’ అని అరవడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తికి జాలి కలిగింది. పిల్లవాడికి అర్థం కావడం లేదని, ‘‘ఇదిగో నాయనా నా చెయ్యి కాస్త అందుకో’’ అని ఎంతో అనునయంగా తన చేతిని చాచాడు. వెంటనే ఆ చిన్నారి అతడి చెయ్యి అందుకుని పైకి వచ్చేశాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ‘‘ఇందాక నీ చెయ్యి అందిమ్మంటే ఇవ్వలేదు!’’ అన్నాడు. దానికా చిన్నారి- ‘‘నిన్నెవరైనా ఇమ్మని అడిగితే ఇవ్వొద్దు. తీస్కోమంటే మాత్రం ఆలస్యం చేయకు అని మా నాన్నగారు చెప్పారు’’ అని చెప్పాడు. మనుషులు ఎలా ఉంటారనేదానికి ఈ చిన్న కథను ఉదాహరణగా చెబుతూ ఫ్రాన్సిస్ గాన్సాల్వెస్ అనే ఆధ్యాత్మిక వేత్త ఇటీవల తనకు లాటిన్ అమెరికాలోని ఎల్‌సాల్వడార్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఎల్ సాల్వడార్ అంటే ‘రక్షకుడు’ అని అర్థం. ఇటీవల ఆ దేశం తమ రక్షకుడైన క్రైస్తవ మతపెద్ద ఆస్కార్ రొమెరో 34వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంది. 980 మార్చి 24న హత్యకు గురికావడానికి కొన్ని రోజుల ముందు రొమెరో నోటి వెంట ఒక మాట వెలువడింది. ‘‘ఒక క్రైస్తవుడిగా నేను మరణాన్ని విశ్వసించను. పునర్జన్మను మాత్రమే నమ్ముతాను. వాళ్లు గనుక నన్ను చంపితే ఎల్‌సాల్వడార్ ప్రజల మధ్య మళ్లీ జన్మిస్తాను’’ అన్నారాయన. పౌరహక్కుల కోసం పాలకపక్షాలతో జరిపిన పోరే ఆయన్ని పొట్టనపెట్టుకుంది. ‘‘సంస్మరణ వేడుకలలో ఎటువైపు చూసినా రొమెరో కటౌట్లు, పోస్టర్లే కనిపించాయి. యువతీయువకులు ఆయన ముఖచిత్రం ముద్రించి ఉన్న టీ షర్టులను ధరించారు’’ అని చెబుతూ, రొమెరోను నిజమైన రక్షకునిగా కీర్తించారు ఫ్రాన్సిస్ గాన్సాల్వెస్. 1970లలో రోమెరో వచనాలు, సేవాకార్యక్రమాలు ఎల్‌సాల్వడార్‌లో ఎందరిలోనో పరివర్తన తెచ్చాయి. దేవుని సేవ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అని ఆయన ప్రబోధించారు. నిరుపేదలకు, ‘అంటరాని వాళ్లు’ అని సంపన్నులు దూరంగా ఉంచినవాళ్లకు ఆయన ఆలయ ప్రవేశం కల్పించారు. దేవుడిని ప్రార్థించేందుకు అందరికీ హక్కు ఉందని నినదించారు. అలా రోమెరో దేవుడిని దివి నుండి భువికి దించారు. వాటన్నిటినీ గుర్తుచేస్తూ ఉత్సవాలను నిర్వహించిన రోమెరో సహాయకుడు, 87 ఏళ్ల వృద్ధుడు అయిన మాన్సైనర్ రికార్డో ఉరియోస్త్ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు ఫ్రాన్సిస్ గాన్సాల్వెస్. ‘‘దేవుడు మాపై తన దయనంతా కురిపించాడు. ఆయన మాకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రోమెరోను మాకు నాయకుడిగా ప్రసాదించడం’’ అని ఉరియోస్త్ అన్న మాటలను మననం చేసుకుంటుంటే ఫ్రాన్సిస్‌కు బైబిల్లోని ‘‘తీసుకున్నవారి కన్నా ఇచ్చినవారు ధన్యులు’’ అనే వాక్యం స్పురణకు వచ్చిందట. ధన్యత అంటే జీవితం సంతోషకరంగా సాగడం. తీసుకున్నప్పటి కన్నా, ఇచ్చినప్పుడు మీకు ఎక్కువ ఆనందం కలుగుతున్నట్లయితే మీరూ ధన్యజీవే! -
ప్రకృతికి మచ్చ తేకండి
దైవికం కొత్త చిగుర్లు, కొత్త వెలుగులు, కొత్త వర్ణాలు ఎన్ని తయారవుతుంటాయి మన కోసం! వాటన్నిటినీ వదులుకుని ఎక్కడికి వెళ్తాం? ముప్పై రెండు అంటే పెద్ద వయసేం కాదు. వైద్య వృత్తి అంటే చిన్న బాధ్యతేం కాదు. కానీ ఆ క్షణాన ఆ యువకుడికి ఇవేవీ గుర్తుకు రాలేదు. రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల నుంచి ఎటైనా పారిపోదాం అనుకున్నాడు. డాక్టర్ కదా, వెంటనే దారి కనిపించింది. చిన్న మిస్టేక్ ఏదైనా జరిగి మళ్లీ బతక్కుండా ఉండేందుకు గుప్పెడు మాత్రలు మింగేశాడు. అవి పని చేయవేమోనని, మెదడును దెబ్బతీసి ఖాయంగా చావును ప్రసాదించే ఇంజెక్షన్‌ను కూడా తనకు తాను ఇచ్చుకున్నాడు. మెల్లిగా మరణావస్థలోకి జారుకున్నాడు. అలా జారిపోతున్నప్పుడు... అప్పుడు అనిపించిందతడికి ఎలాగైనా బతకాలని! ఒళ్లూ, కళ్లూ తేలిపోతున్నాయి. ‘‘ప్లీజ్ నన్ను బతికించండి’’ అని ప్రాధేయపడినట్లుగా సంజ్ఞ చేశాడు. ఎవరో ఆసుపత్రికి చేర్చారు. ఎవరో అతడి బంధువులకు తెలియజేశారు. రెండు గంటలు గడిచాయి. సర్ గంగారామ్ ఆసుపత్రి (ఢిల్లీ) వైద్యులు శాయశక్తులా అతడిని బతికించడానికి కృషి చేస్తున్నారు. ఆ యువకుడు ఏదో తెలివితక్కువగా రెండు మూడు మాత్రలు మింగలేదు. ఇది కాకపోతే అది అన్నట్లు తనపై రెండు మూడు రకాల ప్రయోగాలు చేసుకున్నాడు... ఏ దారిలోనైనా చావక పోతానా అనే ఆశతో! కానీ ఆసుపత్రిలో అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి... ఏ దారిలోనైనా బతికిపోలేనా అని! వైద్యులకు ఆశ్చర్యపోవడానికి కూడా సమయం చిక్కలేదు. మొత్తానికి అతడి ఒంట్లోంచి విషాన్ని లాగేశారు. తిరిగి అతడికి ఆయువు పోశారు. ‘‘నా పాతికేళ్ల సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదు’’ అన్నారు వారిలో ఒక డాక్టర్. ‘‘విరుగుడుగా అసలు ఏ మందు ఇవ్వాలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాం’’ అన్నారు ఇంకో డాక్టర్. మొత్తానికైతే ఇచ్చారు. అది పని చేసింది. ఆ యువకుడికి ఇచ్చిన ‘విరుగుడు వైల్’ ఒక్కోటి 1600 డాలర్లు. రూపాయల్లో లక్ష! అలాంటి వైల్స్ 15 నుంచి 20 వరకు (అంటే 15-20 లక్షలు) ఇస్తే కానీ ఒక ప్రాణం నిలువలేదు. పైగా అది ఇండియాలో చాలా అరుదుగా దొరికే మందు. ఎలాగో సంపాదించారు. కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు... ఇంత మంది కలసి ఆ యువడాక్టర్ని కాపాడారు. ఆరు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. తర్వాత ఒక సైకాలజిస్టును కూడా అతడి ఇంటికి పంపారు. ఇదొక అరుదైన కేసుగా ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్’ మార్చి నెల సంచికలో అచ్చయింది. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యను సమస్యగా చూస్తే ఇదిగో ఈ కుర్రడాక్టర్లాగే ఎక్కడికో వెళ్లిపోవాలనిపిస్తుంది. సవాలుగా తీసుకుంటే సమస్యలోంచే పరిష్కారం తడుతుంది. జీవితం అన్నివిధాలా మోడువారిందీ అనుకుందాం. శూన్యం తప్ప ఇంకేమీ మిగల్లేదనుకుందాం. ఆ శూన్యాన్నే కొంతకాలం ఉండనివ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చూడకుండానే ‘వెళ్లిపోయి’ ఓడిపోవడం ఎందుకు? ఏమో గెలుస్తామేమో! మన గెలుపు అవకాశాలను మనమే కాలదన్నుకుని, కాదనుకుని తొందరపడడం ఎందుకు? శిశిరం తర్వాత వసంతం రాక తప్పదు. కొత్త చిగుర్లు, కొత్త వెలుగులు, కొత్త వర్ణాలు ఎన్ని తయారవుతుంటాయి మన కోసం! వాటన్నిటినీ వదులుకుని ఎక్కడికి వెళ్తాం? ప్రకృతి ఏనాడూ ఏ రుతువు కోసమూ తొందరపడదు. ఏ రుతువునూ కాదనుకోదు. కాలంతో పాటు కొన్ని వదిలించుకుని, కొన్ని తగిలించుకుని, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది. మనిషి ఆ కొత్తదనం నుంచి స్ఫూర్తి పొందాలి తప్ప... బతకలేని క్షణాల్లోంచి పారిపోయి, బతుకే లేదనుకుని భయపడిపోయి, బతకవలసిన అవసరాన్ని మర్చిపోయి మతిని గతి తప్పించకూడదు. ప్రకృతికి మచ్చ తేకూడదు.