సహనశీలితో దేవుడు స్నేహం చేస్తాడు
దైవికం
మానవుడికి ఉండవలసిన లక్షణాల్లో ‘సహనం’ ఒక అమూల్యమైన సుగుణం. సహన సంపద కలిగిన మనిషి ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా సునాయాసంగా అధిగమించగలుగుతాడు. కనుక ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వీడకూడదు. మానవులకు తమ దైనందిన జీవితంలో అనేక సమస్యలు చుట్టు ముట్టడం సహజం. దీనికి ఎవరూ మినహాయింపుకాదు.
ఇలాంటి సందర్భాల్లో మనిషి వివేకం ప్రదర్శించాలి. సమస్యలకు తలొగ్గి పలాయనవాదం అవలంబించకూడదు. మనిషిలో సహన గుణం కనుక ఉన్నట్లయితే ఎన్ని గడ్డు పరిస్థితులెదురైనా మేరు పర్వతంలా నిలిచి పోరాడతాడు.
అసహనం, ఆగ్రహం ఓటమికి నాంది. ఇహలోక పరాభవానికి, పరలోక వైఫల్యానికి అసహనం కారణమవుతుంది. దీనికి భిన్నంగా సహనవంతుడు సమాజంలో భూషణంలా ప్రకాశిస్తాడు. తలపెట్టిన ప్రతి కార్యాన్నీ ఫలవంతంగా నిర్వహించగలుగుతాడు. అందుకే పవిత్రఖురాన్ సహనం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని అర్థించమని, సహనవంతులతో దైవం చెలిమి చేస్తాడని చెప్పింది.
- యండి. ఉస్మాన్‌ఖాన్