MD. Usmankhan
-
సహనశీలితో దేవుడు స్నేహం చేస్తాడు
దైవికం మానవుడికి ఉండవలసిన లక్షణాల్లో ‘సహనం’ ఒక అమూల్యమైన సుగుణం. సహన సంపద కలిగిన మనిషి ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా సునాయాసంగా అధిగమించగలుగుతాడు. కనుక ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వీడకూడదు. మానవులకు తమ దైనందిన జీవితంలో అనేక సమస్యలు చుట్టు ముట్టడం సహజం. దీనికి ఎవరూ మినహాయింపుకాదు. ఇలాంటి సందర్భాల్లో మనిషి వివేకం ప్రదర్శించాలి. సమస్యలకు తలొగ్గి పలాయనవాదం అవలంబించకూడదు. మనిషిలో సహన గుణం కనుక ఉన్నట్లయితే ఎన్ని గడ్డు పరిస్థితులెదురైనా మేరు పర్వతంలా నిలిచి పోరాడతాడు. అసహనం, ఆగ్రహం ఓటమికి నాంది. ఇహలోక పరాభవానికి, పరలోక వైఫల్యానికి అసహనం కారణమవుతుంది. దీనికి భిన్నంగా సహనవంతుడు సమాజంలో భూషణంలా ప్రకాశిస్తాడు. తలపెట్టిన ప్రతి కార్యాన్నీ ఫలవంతంగా నిర్వహించగలుగుతాడు. అందుకే పవిత్రఖురాన్ సహనం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని అర్థించమని, సహనవంతులతో దైవం చెలిమి చేస్తాడని చెప్పింది. - యండి. ఉస్మాన్‌ఖాన్ -
కృతజ్ఞత ఉండాలి!
మానవుడి మనస్సు చాలా సంకుచితమైనది, చంచలమైనది. ఎంత ఉన్నా ఇంకా ఏదో ఒకటి లేదన్న వెలితి అతడి మనస్సు నిండా కెలుకుతూనే ఉంటుంది. ఒక్కసారి మనం సమాజం వైపు దృష్టి సారిస్తే, కళ్లు లేనివాళ్లు, కాళ్లు లేనివాళ్లు రకరకాల అంగవైకల్యం ఉన్నవారు, మానసిక స్థితి బాగా లేనివాళ్లు, కనీసం ఒక్కపూట తిండికీ నోచుకోనివాళ్లు, ఒంటినిండా బట్టలేనివాళ్లు, తలదాచుకోవడానికి గూడులేనివాళ్లు ఎంత దీనస్థితిలో బతుకులీడుస్తున్నారో మనకు అర్థమవుతుంది. వారితో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది. బుద్ధిజీవులమైన మనం ఈ విషయాలను గురించి ఆలోచించగలిగితే ఇలాంటి వారిపట్ల మన బాధ్యత ఏమిటో కూడా తెలుస్తుంది. అప్పుడే ప్రేమ, దయ, త్యాగం, పరోపకారం వంటి సద్గుణాల విలువ బాగా అర్థమవుతుంది. నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనకంటే పై వారిని, ప్రాపంచిక విషయాల్లో మనకంటే కిందిస్థాయిని చూడాలన్న దైవప్రవక్త ప్రవచనాన్ని గమనంలో ఉంచుకుంటే ఇహలోక జీవితం ప్రశాతంగా, పరలోక జీవితం ఫలవంతంగా సాగుతుంది. - యండి. ఉస్మాన్‌ఖాన్ -
ప్రవక్త పలుకులు... సాఫల్యానికి సోపానాలు
ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి. ఈ భూప్రపంచంలో మానవ జీవితం ఎలాంటి ఆటుపోట్లు, సమస్యలు లేకుండా సాగిపోవాలంటే కొన్ని సిద్ధాంతాలను, నియమాలను పాటించాలి. అయితే అవి స్వయంకల్పితాలు కాకుండా సృష్టికర్త అయిన అల్లాహ్, ఆయన చెప్పిన ధర్మాన్ని ఆయన తరఫున మానవాళికి బోధించిన దైవప్రవక్త ముహమ్మద్ (స) వంటివారు చెప్పినవై ఉండాలి. ఈ సందర్భంలో ముహమ్మద్ (స) ప్రవచించిన కొన్ని ధార్మిక విషయాలను తెలుసుకుందాం. 1. హరాం (నిషిద్ధాలకు దూరంగా ఉండటం) 2.అల్లాహ్ మీ అదృష్టంలో రాసిన దానిపట్ల సంతృప్తితో ఉండటం 3. ఇరుగుపొరుగులతో సత్ప్రవర్తన కలిగి ఉండటం, 4. ఇతరులు మీ పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలని మీరు కోరుకుంటారో, మీరూ ఇతరుల పట్ల అలాంటి వైఖరినే ప్రదర్శించడం. 5.సాటివారిని ఎగతాళి చేయకుండా ఉండడం, వారిని చూసి నవ్వుకోకుండా ఉండటం. దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచించిన ఈ ధర్మాలను పాటిస్తే మన సమాజం అన్నిరకాల రుగ్మతల నుంచి బయట పడగలుగుతుంది. నిషిద్ధాలకు దూరంగా ఉంటే గొప్ప దైవభక్తి పరులవుతారన్నారు ప్రవక్త మహనీయులు. అంటే ధర్మసమ్మతం కాని ప్రతిదీ అధర్మమే, నిషిద్ధమే. సృష్టికర్తను వదిలి సృష్టిరాశుల్ని పూజించడం, తల్లిదండ్రులకు సేవచేయకుండా, వారి ఆదేశాలను ధిక్కరించడం, హింసాదౌర్జన్యాలు, రక్తపాతం, జూదం, మద్యపానం, వ్యభిచారం, అవినీతి, అక్రమాలు, అనాథల ఆస్తిని అపహరించడం, ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీయడం వంటి అనేక విషయాలన్నీ హరాం. అంటే అధర్మం, నిషిద్ధం. వీటికి దూరంగా ఉండటం నిజంగా గొప్ప ఆరాధన. అందుకే వీటికి దూరంగా ఉన్న వారు గొప్ప దైవభక్తిపరులు అన్నారు ప్రవక్త మహనీయులు. ఇక రెండవ విషయానికి వస్తే, అల్లాహ్ మన అదృష్టంలో ఎంత రాస్తే అంత తప్పక లభించి తీరుతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని పెంచడం కాని, తగ్గించడం కాని చెయ్యలేరు అన్న విషయాన్ని విశ్వసించి, ఉన్నదానిలోనే తృప్తిపడే వారి మనసులో ఒక విధమైన మనశ్శాంతి, ప్రశాంతత ఉంటాయి. లేనిదానికోసం వెంపర్లాట ఉండదు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలాంటి వారిని ఎవరి అవసరం లేని సంపన్నులు అన్నారు. మిగతా రెండు విషయాలను తీసుకుంటే ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి. ఎవరి దుర్నడత కారణంగా అతడి పొరుగువారు సురక్షిత ంగా ఉండరో, అతడు ముస్లిం కాదు అన్నారు ముహమ్మద్ ప్రవక్త ఒక ప్రవచనంలో. ఒకరి గౌరవ మర్యాదలపై, ధనప్రాణాలపై నోటి ద్వారాగాని, చేతిద్వారా గాని ఎలాంటి దాడీ చేసే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకని మనం మనకోసం ఎలాంటి స్థితిని కోరుకుంటామో, పరులకోసం కూడా అలాంటి స్థితినే కోరుకోవాలి. దీనికి భిన్నంగా పరుల కీడు కోరేవారు ముస్లింలు కాలేరు అని ప్రవక్త మహనీయులు స్పష్టం చేశారు. అలాగే అధికంగా నవ్వడం కూడా మంచిది కాదు. నవ్వు దివ్య ఔషధం ఐనప్పటికీ మితిమీరితే అనర్థమే. అల్లాహ్ నామస్మరణలో హృదయం సజీవంగా ఉంటుంది. అల్లాహ్‌ను విస్మరించి, ప్రాపంచిక వినోదంలో మునిగి తేలడం వల్ల హృదయం నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మితిమీరి నవ్వడం, ఇతరులను గేలిచేయడం మంచిది కాదన్నది ప్రవక్త ప్రవచన సారం. చిరునవ్వు సదా అభిలషణీయమే. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచించిన ఈ విషయాలను గమనంలో ఉంచుకుని ఆచరించగలిగితే సమాజం నిజంగానే శాంతి సామరస్యాలతో తులతూగుతుంది. పరలోక సాఫల్యం ప్రాప్తిస్తుంది. - యండీ ఉస్మాన్‌ఖాన్ -
అంతరాత్మ ప్రబోధం -ఆచరణీయ మార్గం
మానవులు ఆచరించే సమస్త కర్మలకు, కార్యకలాపాలకు మనసే కేంద్రబిందువు. దేనికైనా బీజం అక్కడే పడుతుంది. అది పాదరసం కన్నా పవర్ఫుల్. అంతేకాదు చిత్రవిచిత్రమైంది కూడా. ఒక పట్టాన అది మన పరిధిలోకి రాదు. ఎప్పుడూ తన పరిమితిని దాటి పోడానికే పరిపరివిధాల ప్రయత్నిస్తుంది. దాన్ని నియంత్రించడం, దాన్ని అదుపులో ఉంచుకోవడం గొప్ప విషయమే. మనసును నియంత్రణలో ఉంచుకోవడం స్థిరచిత్తానికి నిదర్శనమైతే, అదుపు సాధించలేకపోవడం చపల చిత్తానికీ, చంచల స్వభావానికీ ప్రతీక. మానవుల స్వభావం, ప్రవర్తన రీత్యా పవిత్ర ఖురాన్ దీన్ని మూడువిధాలుగా విభజించింది. ఒకటి: ‘నఫ్సె అమ్మారా’ రెండు: ‘నఫ్సెల వ్వామా’. మూడు ‘నఫ్సె ముత్మయిన్న. నఫ్సె అమ్మారా అంటే దుష్ట మనసు లేక దుష్టబుద్ధి. ఇది మనిషిని మాటిమాటికీ మార్గం తప్పిస్తూ ఉంటుంది. రకరకాల చెడుల వైపు ఉసిగొల్పుతుంది. రకరకాల భావోద్రేకాలను రేకెత్తిస్తూ, పాపాలవైపు ఆకర్షిస్తూ, మంచి పనులు చేయకుండా నిరోధిస్తుంది. చిత్రమైన భ్రమలు కల్పించి దుష్కార్యాలకు ప్రేరేపిస్తుంది. ప్రలోభాల ఊబిలోకి నెట్టి, నిలువునా ముంచుతుంది. ఈ దుష్టబుద్ధి (నఫ్సె అమ్మారా) గురించి పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది... ‘నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవడం లేదు. నా ప్రభువు (దైవం) కారుణ్యభాగ్యం ప్రాప్తమైతే తప్ప, మనసైతే ఎప్పడూ చెడువైపుకే లాగుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి. అమిత దయాసాగరుడు’’ (12-53). ఇక నఫ్సెల వ్వామా. దీని విధి నిర్వహణను బట్టి దీన్ని ‘మనస్సాక్షి’ లేక అంతరాత్మ అనవచ్చు. అంతరాత్మ ప్రబోధం అన్న మాటను తరచు వింటూ ఉంటాం కదా. అదే ఇది. దుష్కార్యాలకు పాల్పడుతున్నప్పుడు ఇది అభ్యంతర పెడుతుంది. మందలిస్తుంది. నాశనమైపోతావని హెచ్చరిస్తుంది. అప్పుడు దాని మాట వింటే సురక్షితంగా ఉంటాం. లేకపోతే ప్రమాదంలో పడతాం. అంతరాత్మ సజీవంగా ఉంటే మానవులు ఎలాంటి చెడుల జోలికీ పోరు. దురదృష్టవశాత్తూ ఎప్పుడైనా కాలుజారే ప్రమాదం ఏర్పడినా మనస్సాక్షి వారిని హెచ్చరిస్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించే వారు ఇహ పరలోకాల్లో సాఫల్య శిఖరాలను అధిరోహించగలుగుతారు. మనస్సాక్షిని పక్కన పెట్టి, అంతరాత్మ ప్రబోధాన్ని తుంగలో తొక్కిన వారు అథఃపాతాళానికి దిగజారిపోతారు. సతతం కంటికి రెప్పలా కాపాడే మనస్సాక్షి లేక అంతరాత్మ (నఫ్సెల వ్వామా)ను ఆణచి వేయడమంటే మన గోతిని మనమే తవ్వుకుంటున్నట్లు, మన వేలితో మనకంటినే పొడుచుకుంటున్నట్లు లెక్క. దైవప్రవక్త ముహమ్మద్ (స) ‘నఫ్సెలవ్వామా’ను నిర్వచిస్తూ, ఏ విషయం మీ మనసులో ఆక్షేపణను జనింపచేస్తుందో అదే చెడు. అని ప్రవచించారు. కాబట్టి, మనసు దుష్కార్యాలకు దూరంగా, నైతికంగా, మానవీయంగా, ఆధ్యాత్మికంగా ఉత్తమ స్థితిలో ఉంటే, అది నఫ్సెలవ్వామా అవుతుంది. ‘నఫ్సె ముత్మయిన్న’ అంటే సంతృప్త మనసు. లేక ఆత్మ సంతృప్తి. అంటే ఒక మనిషి దుష్ట మనసుకు (నఫ్సె అమ్మారా) వ్యతిరేకంగా ఆత్మసాక్షి, అంతరాత్మ ప్రబోధానుసారం (నఫ్సెలవ్వామా) నడచుకున్నట్లయితే, క్రమేపీ అతడు ‘నఫ్సె ముత్మయిన్న’ కు చేరువ అవుతాడు. అంటే ఎలాటి చెడు తలంపులూ లేని, పరిశుద్ధ సుగుణ సంపత్తితో కూడిన నిర్మలమైన, జ్యోతిర్మయ మనస్సు, లేక హృదయం ప్రాప్తిస్తుందన్నమాట. ఎవరికైనా, ఆత్మసంతృప్తికి మించిన సంపద మరేముంటుంది ఈ ప్రపంచంలో! అంతేకాదు ‘తృప్తి చెందిన మనస్సా! పద నీ ప్రభువు సన్నిధికి. నీవు ఆయన పట్ల సంతోషించావు. ఆయనా నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. ఇక నా పుణ్యదాసులలో చేరి, నా స్వర్గంలో ప్రవేశించు’’ (89-30). అని అల్లాహ్ శుభవార్త కూడా వినిపిస్తున్నాడు. కనుక ఆత్మసాక్షిని చంపుకోకుండా, అంతరాత్మ ప్రబోధానుసారం, ఆత్మ పరిశుద్ధతతో సత్కార్యాలు ఆచరిస్తే ఇహపరలోకాల్లో శాంతి, సంతృప్తి, సాపల్యం సంప్రాప్తమవుతాయి. దైవప్రసన్నత భాగ్యమూ లభిస్తుంది. - యండీ ఉస్మాన్‌ఖాన్ -
మానవీయతే సర్వమత సారాంశం
అందాలు జాలువారే మన భారతదేశం ఎన్నో కులాలకు, మతాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఉన్నన్ని కులాలు గాని, మతధర్మాలు గాని ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. అందమైన నందనవనంలో వివిధ రకాల పుష్పాలు వికసించి, పరిమళిస్తున్నట్లుగా ఈ దేశంలో వివిధ మతవర్గాల ప్రజలు అనాదిగా సహజీవనం చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా కలసిమెలసి సామరస్యంతో సాగిపోవడమే ఇక్కడి ప్రత్యేకత. ఈ దేశ ప్రజలకు వారి మతధర్మాలు బోధిస్తున్న సహజీవన సామరస్య సూత్రం కూడా ఇదే. అన్ని మతాలు... మంచిని, మానవత్వాన్నే బోధిస్తాయి. ద్వేషభావాన్ని నూరిపోసే మతాలు అసలు మతాలే కావు. ఇతరులను, ఇతర మతధర్మాలను ద్వేషించేవి, దూషించేవి మతం అని పిలిపించుకునే అర్హతను కలిగి ఉండవు. నాస్తికుల మాటల్లో చెప్పాలంటే అలాంటి మతాలు నిజంగా మత్తుమందుతో సమానం... కాదు..! ఇంకా అంతకన్నా ఎక్కువ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నారు ఏసుక్రీస్తు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అంటుంది హిందూమతం. ‘నువ్వునీకోసం ఏ స్థితిని కోరుకుంటావో, నీతోటివారికోసం కూడా అలాంటిస్థితినే కోరుకో’మన్నారు ముహమ్మద్ ప్రవక్త (స). ‘సమస్త మానవాళి పరస్పరం సోదరులే. అందరినీ ప్రేమించండి. పరుల ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం, అది పాపం, అది నరకం’ అంటోంది ఇస్లాం ధర్మం. కనుక పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందరూ నిష్పక్షపాతంగా ఒకరి మతధర్మాలను ఒకరు అధ్యయనం చెయ్యాలి. అవగాహన పెంచుకోవాలి. మతధర్మాల్లో చెడుకు అవకాశమే ఉండదు కాబట్టి, అందులోని మంచిని గ్రహించాలి. దాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఎందులోనైనా వైర, విద్వేష బోధనలున్నట్లయితే అది మతం కాదని గ్రహించాలి. వెంటనే దాన్ని విసర్జించాలి. అంతేకాని మతం పేరుతో దాన్ని అనుసరించకూడదు. స్వార్థ, మత ఛాందస బోధకుల మాయమాటలకు లొంగకుండా ఉండేందుకు సైతం అధ్యయనం అవసరమవుతుంది. గుడ్డిగా ఎవరి మాటలూ వినకూడదు. దైవం మనకు ప్రసాదించిన వివేకం, విచక్షణ జ్ఞానాన్ని వినియోగించి ఆలోచించాలి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రగల్చడానికి, సామరస్య వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి, సమాజాన్ని అల్లకల్లోలానికి గురి చేసి, అశాంతిని సృష్టించడానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. అలాంటి మతోన్మాద శక్తుల ఉచ్చులో పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అన్ని సత్కార్యాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలి. ఈ విషయాన్ని పవిత్రఖురాన్కూడా ఇలా చెబుతోంది... ‘మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనుల్లో అందరితోనూ సహకరించండి. పాపకార్యాల్లో, అత్యాచారాల్లో ఎవరికీ సహకరించకండి. దైవానికి భయపడండి. దైవభక్తి పరాయణతకు ఇది నిదర్శనం’ సాటివారి బాధను సహించే వ్యక్తి విశ్వాసి కాజాలడు. ఇతరుల మనోభావాలను గాయపరచడం అత్యంత ఘోరమైన పాపం. మనం ఏ స్థితిలో ఉన్నా పరుల క్షేమాన్ని, శ్రేయాన్ని కాంక్షిస్తూ ఉండాలి. ఏ విషయంలో అయినా హింసాదౌర్జన్యాలు పరిష్కారమార్గాలు కానే కావు. అవి ప్రగతికి, మన ఉనికికి ప్రమాదాలు, అవరోధాలు. కరుణామయుడైన అల్లాహ్ మనకు ఉనికినిచ్చాడు. చక్కటిరూపాన్నిచ్చాడు. అద్భుతమైనటువంటి జ్ఞానసంపత్తిని ప్రసాదించాడు. మంచిచెడుల విచక్షణ తెలిపాడు. మంచి మార్గమేదో, చెడు మార్గమేదో ఎరుకపరిచాడు. శారీరక శక్తిని, బుద్ధిబలాన్ని అనుగ్రహించాడు. సృష్టిలోని ఏ జీవరాశికీ ఇలాంటి సుగుణాలు లేవు. మనం వీటన్నింటినీ సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలి. లేకపోతే మనకూ, జంతుజాలానికీ తేడా ఉండదు. ఏ జంతువూ మరోజంతువుపై అకారణంగా దాడి చేయదు. గాయపరచదు. మరి విచక్షణ సంపన్నులమైన మనం అకారణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకోగలమా? ఒకరి మనసునొకరు గాయపరచుకోగలమా? మనం మన బుద్ధిని ఉపయోగించాలి. విచక్షణాజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. మానవత్వం కలిగిన మానవులుగా మసలుకోవాలి. అనాదిగా వస్తున్న ఈ సామరస్య వారసత్వాన్ని అప్రతిహతంగా కొనసాగించాలి. తులసివనంలో గ ంజాయి మొక్కల్లా ఉన్న మతోన్మాదులను కూకటివేళ్లతో పెకిలించి, మన అందాల నందనవనాన్ని కాపాడుకోవాలి. అల్లాహ్ సమస్త మానవాళికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక! - యండి. ఉస్మాన్‌ఖాన్ -
ధర్మార్జనతోనే ఇహపర సాఫల్యం
ధర్మాధర్మాలను పట్టించుకోకుండా, బాగా సంపాదించేవారిని, తమకు నచ్చిన విధంగా ఇచ్ఛానుసారంగా గడిపేవారిని సాధారణంగా ప్రజలు తెలివైనవారిగా, వివేకవంతులుగా భావిస్తారు. ఎంత సంపాదిస్తే, ఎంత కూడబెడితే అంత గొప్పవాడుగా, దూరదృష్టిగలవారుగా పరిగణిస్తారు. న్యాయం, ధర్మం అంటూ కాస్త నీతిగా, పరలోకచింతన, దైవం ముందు జవాబుదారీ భావనగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ, అవినీతి, అధర్మాలకు, అక్రమ సంపాదనకు, ఇష్టానుసార జీవితానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న వారిని ప్రజలు తెలివితక్కువారని, అమాయకులని, మరో విధంగా చెప్పాలంటే పాతతరం మనుషులని అంటూ ఉంటారు. కాని ముహమ్మద్ ప్రవక్త (స) ‘మనోవాంఛల్ని అదుపులో ఉంచుకుని, మరణానంతరం పరలోక జీవితానికి పనికొచ్చే కర్మలు ఆచరించినవాడే వివేకి అని, మనోవాంఛల బానిసగా మారినవాడు అవివేకి, బుద్ధిహీనుడు, పైగా దైవంపై మిధ్యాభావం పెట్టుకున్న వంచకుడని సెలవిచ్చారు. అంతేకాదు, ‘అవినీతికి పాల్పడి, అక్రమంగా సంపాదించిన డబ్బుతో పోషించబడిన శరీరం నరకానికి మాత్రమే తగినది’ అని పేర్కొన్నారు. అంటే... నీతికి పాతరేసి, ధర్మానికి నీళ్లొదిలి దొడ్డిదారిన అధర్మంగా, అన్యాయంగా ఎంత సంపాదించినా, అది వివేకంతో, బుద్ధిబలంతో సమకూర్చుకున్న ధర్మసంపాదన ఎంతమాత్రం కాదు. సాధారణ ప్రజలు ఇలాంటి సంపన్నులను ఎంతో తెలివైనవారుగా, వివేకవంతులుగా భావిస్తూ భావించవచ్చు. కాని వారి మోసాలు. అవినీతి, వారి ఇష్టానుసారంగా విలాసవంతమైన జీవితవిధానం వారి నిజస్వరూపాన్ని ఎల్లకాలం కాపాడలేవు. ఏదో ఒకరోజు వారి అవినీతి, పాపాలపుట్ట బద్దలవుతుంది. అసలు స్వరూపం ప్రజలముందు బహిర్గతమవుతుంది. అప్పుడు తెలిైవె నవారు, వివేకసంపన్నులు... అని కొనియాడిన జనమే ఈసడించుకుంటారు. ఇది ఇక్కడే. ఇహలోకంలోనైతే ఇంతకంటే ఎక్కువ పరాభవాన్ని చవిచూడవలసి ఉంటుంది. అందుకే ఇలాంటివారిని, ప్రవక్త మహనీయులు అవివేకులని, బుద్ధిహీనులని, పైగా దైవంపై మిధ్యానమ్మకం పెట్టుకున్న నయవంచకులని శపించారు. అంతేకాదు, ప్రజల హక్కుల్ని కొల్లగొట్టి, వంచనతో, మోసంతో, అవినీతికి, అక్రమాలకు పాల్పడి సంపాదించిన సొమ్ముతో పోషించబడిన దేహం నరకానికి మాత్రమే పోతుందని హెచ్చరించారు. ఇలాంటి అవినీతి సొమ్ముతో ఎన్ని సత్కార్యాలు చేసినా, స్వీకార భాగ్యానికి నోచుకోవు. ఎన్ని దానధర్మాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ చేకూరదు. అధర్మంగా సంపాదించింది కాక, ఆ అక్రమ సొమ్ముతో దైవకార్యాలు (సత్కార్యాలు) చేసి పుణ్యం పొందాలనుకోవడం కేవలం అవివేకం మాత్రమే కాదు, దుస్సాహసం కూడా! కనుక, ధర్మసమ్మతమైన సంపాదనతో మాత్రమే జీవనం సాగించాలి. అవసరంమేరకే ప్రపంచాన్ని వినియోగించుకుంటూ, పరలోక జీవితంపై దృష్టిపెట్టాలి. పరలోక విశ్వాసం, దైవం ముందు జవాబు చెప్పుకోవాలన్న భావన ఉంటే మానవుల్లో ధర్మాధర్మాల విచక్షణ తప్పక పాటిస్తారు. అంతా ఇహలోకమే, అంతా ఇక్కడే అనుభవించాలనుకున్నప్పుడే ఈ సమస్యలన్నీ. అందుకని దైవాన్ని, పరలోకాన్ని నమ్మి, జీవితం గడిపితే ఇహపర సాఫల్యాలు సొంతమవుతాయి. - యండి. ఉస్మాన్‌ఖాన్