ధర్మార్జనతోనే ఇహపర సాఫల్యం
ధర్మాధర్మాలను పట్టించుకోకుండా, బాగా సంపాదించేవారిని, తమకు నచ్చిన విధంగా ఇచ్ఛానుసారంగా గడిపేవారిని సాధారణంగా ప్రజలు తెలివైనవారిగా, వివేకవంతులుగా భావిస్తారు. ఎంత సంపాదిస్తే, ఎంత కూడబెడితే అంత గొప్పవాడుగా, దూరదృష్టిగలవారుగా పరిగణిస్తారు. న్యాయం, ధర్మం అంటూ కాస్త నీతిగా, పరలోకచింతన, దైవం ముందు జవాబుదారీ భావనగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ, అవినీతి, అధర్మాలకు, అక్రమ సంపాదనకు, ఇష్టానుసార జీవితానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న వారిని ప్రజలు తెలివితక్కువారని, అమాయకులని, మరో విధంగా చెప్పాలంటే పాతతరం మనుషులని అంటూ ఉంటారు.
కాని ముహమ్మద్ ప్రవక్త (స) ‘మనోవాంఛల్ని అదుపులో ఉంచుకుని, మరణానంతరం పరలోక జీవితానికి పనికొచ్చే కర్మలు ఆచరించినవాడే వివేకి అని, మనోవాంఛల బానిసగా మారినవాడు అవివేకి, బుద్ధిహీనుడు, పైగా దైవంపై మిధ్యాభావం పెట్టుకున్న వంచకుడని సెలవిచ్చారు. అంతేకాదు, ‘అవినీతికి పాల్పడి, అక్రమంగా సంపాదించిన డబ్బుతో పోషించబడిన శరీరం నరకానికి మాత్రమే తగినది’ అని పేర్కొన్నారు.
అంటే... నీతికి పాతరేసి, ధర్మానికి నీళ్లొదిలి దొడ్డిదారిన అధర్మంగా, అన్యాయంగా ఎంత సంపాదించినా, అది వివేకంతో, బుద్ధిబలంతో సమకూర్చుకున్న ధర్మసంపాదన ఎంతమాత్రం కాదు. సాధారణ ప్రజలు ఇలాంటి సంపన్నులను ఎంతో తెలివైనవారుగా, వివేకవంతులుగా భావిస్తూ భావించవచ్చు. కాని వారి మోసాలు. అవినీతి, వారి ఇష్టానుసారంగా విలాసవంతమైన జీవితవిధానం వారి నిజస్వరూపాన్ని ఎల్లకాలం కాపాడలేవు. ఏదో ఒకరోజు వారి అవినీతి, పాపాలపుట్ట బద్దలవుతుంది. అసలు స్వరూపం ప్రజలముందు బహిర్గతమవుతుంది. అప్పుడు తెలిైవె నవారు, వివేకసంపన్నులు... అని కొనియాడిన జనమే ఈసడించుకుంటారు. ఇది ఇక్కడే. ఇహలోకంలోనైతే ఇంతకంటే ఎక్కువ పరాభవాన్ని చవిచూడవలసి ఉంటుంది.
అందుకే ఇలాంటివారిని, ప్రవక్త మహనీయులు అవివేకులని, బుద్ధిహీనులని, పైగా దైవంపై మిధ్యానమ్మకం పెట్టుకున్న నయవంచకులని శపించారు. అంతేకాదు, ప్రజల హక్కుల్ని కొల్లగొట్టి, వంచనతో, మోసంతో, అవినీతికి, అక్రమాలకు పాల్పడి సంపాదించిన సొమ్ముతో పోషించబడిన దేహం నరకానికి మాత్రమే పోతుందని హెచ్చరించారు. ఇలాంటి అవినీతి సొమ్ముతో ఎన్ని సత్కార్యాలు చేసినా, స్వీకార భాగ్యానికి నోచుకోవు. ఎన్ని దానధర్మాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ చేకూరదు. అధర్మంగా సంపాదించింది కాక, ఆ అక్రమ సొమ్ముతో దైవకార్యాలు (సత్కార్యాలు) చేసి పుణ్యం పొందాలనుకోవడం కేవలం అవివేకం మాత్రమే కాదు, దుస్సాహసం కూడా!
కనుక, ధర్మసమ్మతమైన సంపాదనతో మాత్రమే జీవనం సాగించాలి. అవసరంమేరకే ప్రపంచాన్ని వినియోగించుకుంటూ, పరలోక జీవితంపై దృష్టిపెట్టాలి. పరలోక విశ్వాసం, దైవం ముందు జవాబు చెప్పుకోవాలన్న భావన ఉంటే మానవుల్లో ధర్మాధర్మాల విచక్షణ తప్పక పాటిస్తారు. అంతా ఇహలోకమే, అంతా ఇక్కడే అనుభవించాలనుకున్నప్పుడే ఈ సమస్యలన్నీ. అందుకని దైవాన్ని, పరలోకాన్ని నమ్మి, జీవితం గడిపితే ఇహపర సాఫల్యాలు సొంతమవుతాయి.
- యండి. ఉస్మాన్‌ఖాన్