అంతరాత్మ ప్రబోధం -ఆచరణీయ మార్గం
మానవులు ఆచరించే సమస్త కర్మలకు, కార్యకలాపాలకు మనసే కేంద్రబిందువు. దేనికైనా బీజం అక్కడే పడుతుంది. అది పాదరసం కన్నా పవర్‌ఫుల్. అంతేకాదు చిత్రవిచిత్రమైంది కూడా. ఒక పట్టాన అది మన పరిధిలోకి రాదు. ఎప్పుడూ తన పరిమితిని దాటి పోడానికే పరిపరివిధాల ప్రయత్నిస్తుంది. దాన్ని నియంత్రించడం, దాన్ని అదుపులో ఉంచుకోవడం గొప్ప విషయమే. మనసును నియంత్రణలో ఉంచుకోవడం స్థిరచిత్తానికి నిదర్శనమైతే, అదుపు సాధించలేకపోవడం చపల చిత్తానికీ, చంచల స్వభావానికీ ప్రతీక. మానవుల స్వభావం, ప్రవర్తన రీత్యా పవిత్ర ఖురాన్ దీన్ని మూడువిధాలుగా విభజించింది. ఒకటి: ‘నఫ్సె అమ్మారా’ రెండు: ‘నఫ్సెల వ్వామా’.
మూడు ‘నఫ్సె ముత్మయిన్న. నఫ్సె అమ్మారా అంటే దుష్ట మనసు లేక దుష్టబుద్ధి. ఇది మనిషిని మాటిమాటికీ మార్గం తప్పిస్తూ ఉంటుంది. రకరకాల చెడుల వైపు ఉసిగొల్పుతుంది. రకరకాల భావోద్రేకాలను రేకెత్తిస్తూ, పాపాలవైపు ఆకర్షిస్తూ, మంచి పనులు చేయకుండా నిరోధిస్తుంది. చిత్రమైన భ్రమలు కల్పించి దుష్కార్యాలకు ప్రేరేపిస్తుంది. ప్రలోభాల ఊబిలోకి నెట్టి, నిలువునా ముంచుతుంది. ఈ దుష్టబుద్ధి (నఫ్సె అమ్మారా) గురించి పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది...
‘నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవడం లేదు. నా ప్రభువు (దైవం) కారుణ్యభాగ్యం ప్రాప్తమైతే తప్ప, మనసైతే ఎప్పడూ చెడువైపుకే లాగుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి. అమిత దయాసాగరుడు’’ (12-53).
ఇక నఫ్సెల వ్వామా. దీని విధి నిర్వహణను బట్టి దీన్ని ‘మనస్సాక్షి’ లేక అంతరాత్మ అనవచ్చు. అంతరాత్మ ప్రబోధం అన్న మాటను తరచు వింటూ ఉంటాం కదా. అదే ఇది. దుష్కార్యాలకు పాల్పడుతున్నప్పుడు ఇది అభ్యంతర పెడుతుంది. మందలిస్తుంది. నాశనమైపోతావని హెచ్చరిస్తుంది. అప్పుడు దాని మాట వింటే సురక్షితంగా ఉంటాం. లేకపోతే ప్రమాదంలో పడతాం. అంతరాత్మ సజీవంగా ఉంటే మానవులు ఎలాంటి చెడుల జోలికీ పోరు.
దురదృష్టవశాత్తూ ఎప్పుడైనా కాలుజారే ప్రమాదం ఏర్పడినా మనస్సాక్షి వారిని హెచ్చరిస్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించే వారు ఇహ పరలోకాల్లో సాఫల్య శిఖరాలను అధిరోహించగలుగుతారు. మనస్సాక్షిని పక్కన పెట్టి, అంతరాత్మ ప్రబోధాన్ని తుంగలో తొక్కిన వారు అథఃపాతాళానికి దిగజారిపోతారు. సతతం కంటికి రెప్పలా కాపాడే మనస్సాక్షి లేక అంతరాత్మ (నఫ్సెల వ్వామా)ను ఆణచి వేయడమంటే మన గోతిని మనమే తవ్వుకుంటున్నట్లు, మన వేలితో మనకంటినే పొడుచుకుంటున్నట్లు లెక్క.
దైవప్రవక్త ముహమ్మద్ (స) ‘నఫ్సెలవ్వామా’ను నిర్వచిస్తూ, ఏ విషయం మీ మనసులో ఆక్షేపణను జనింపచేస్తుందో అదే చెడు. అని ప్రవచించారు. కాబట్టి, మనసు దుష్కార్యాలకు దూరంగా, నైతికంగా, మానవీయంగా, ఆధ్యాత్మికంగా ఉత్తమ స్థితిలో ఉంటే, అది నఫ్సెలవ్వామా అవుతుంది. ‘నఫ్సె ముత్మయిన్న’ అంటే సంతృప్త మనసు. లేక ఆత్మ సంతృప్తి. అంటే ఒక మనిషి దుష్ట మనసుకు (నఫ్సె అమ్మారా) వ్యతిరేకంగా ఆత్మసాక్షి, అంతరాత్మ ప్రబోధానుసారం (నఫ్సెలవ్వామా) నడచుకున్నట్లయితే, క్రమేపీ అతడు ‘నఫ్సె ముత్మయిన్న’ కు చేరువ అవుతాడు. అంటే ఎలాటి చెడు తలంపులూ లేని, పరిశుద్ధ సుగుణ సంపత్తితో కూడిన నిర్మలమైన, జ్యోతిర్మయ మనస్సు, లేక హృదయం ప్రాప్తిస్తుందన్నమాట. ఎవరికైనా, ఆత్మసంతృప్తికి మించిన సంపద మరేముంటుంది ఈ ప్రపంచంలో!
అంతేకాదు ‘తృప్తి చెందిన మనస్సా! పద నీ ప్రభువు సన్నిధికి. నీవు ఆయన పట్ల సంతోషించావు. ఆయనా నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. ఇక నా పుణ్యదాసులలో చేరి, నా స్వర్గంలో ప్రవేశించు’’ (89-30). అని అల్లాహ్ శుభవార్త కూడా వినిపిస్తున్నాడు. కనుక ఆత్మసాక్షిని చంపుకోకుండా, అంతరాత్మ ప్రబోధానుసారం, ఆత్మ పరిశుద్ధతతో సత్కార్యాలు ఆచరిస్తే ఇహపరలోకాల్లో శాంతి, సంతృప్తి, సాపల్యం సంప్రాప్తమవుతాయి. దైవప్రసన్నత భాగ్యమూ లభిస్తుంది.
- యండీ ఉస్మాన్‌ఖాన్