ప్రవక్త పలుకులు... సాఫల్యానికి సోపానాలు
ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి.
ఈ భూప్రపంచంలో మానవ జీవితం ఎలాంటి ఆటుపోట్లు, సమస్యలు లేకుండా సాగిపోవాలంటే కొన్ని సిద్ధాంతాలను, నియమాలను పాటించాలి. అయితే అవి స్వయంకల్పితాలు కాకుండా సృష్టికర్త అయిన అల్లాహ్, ఆయన చెప్పిన ధర్మాన్ని ఆయన తరఫున మానవాళికి బోధించిన దైవప్రవక్త ముహమ్మద్ (స) వంటివారు చెప్పినవై ఉండాలి. ఈ సందర్భంలో ముహమ్మద్ (స) ప్రవచించిన కొన్ని ధార్మిక విషయాలను తెలుసుకుందాం.
1. హరాం (నిషిద్ధాలకు దూరంగా ఉండటం) 2.అల్లాహ్ మీ అదృష్టంలో రాసిన దానిపట్ల సంతృప్తితో ఉండటం 3. ఇరుగుపొరుగులతో సత్ప్రవర్తన కలిగి ఉండటం, 4. ఇతరులు మీ పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలని మీరు కోరుకుంటారో, మీరూ ఇతరుల పట్ల అలాంటి వైఖరినే ప్రదర్శించడం. 5.సాటివారిని ఎగతాళి చేయకుండా ఉండడం, వారిని చూసి నవ్వుకోకుండా ఉండటం.
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచించిన ఈ ధర్మాలను పాటిస్తే మన సమాజం అన్నిరకాల రుగ్మతల నుంచి బయట పడగలుగుతుంది. నిషిద్ధాలకు దూరంగా ఉంటే గొప్ప దైవభక్తి పరులవుతారన్నారు ప్రవక్త మహనీయులు. అంటే ధర్మసమ్మతం కాని ప్రతిదీ అధర్మమే, నిషిద్ధమే. సృష్టికర్తను వదిలి సృష్టిరాశుల్ని పూజించడం, తల్లిదండ్రులకు సేవచేయకుండా, వారి ఆదేశాలను ధిక్కరించడం, హింసాదౌర్జన్యాలు, రక్తపాతం, జూదం, మద్యపానం, వ్యభిచారం, అవినీతి, అక్రమాలు, అనాథల ఆస్తిని అపహరించడం, ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీయడం వంటి అనేక విషయాలన్నీ హరాం. అంటే అధర్మం, నిషిద్ధం. వీటికి దూరంగా ఉండటం నిజంగా గొప్ప ఆరాధన. అందుకే వీటికి దూరంగా ఉన్న వారు గొప్ప దైవభక్తిపరులు అన్నారు ప్రవక్త మహనీయులు.
ఇక రెండవ విషయానికి వస్తే, అల్లాహ్ మన అదృష్టంలో ఎంత రాస్తే అంత తప్పక లభించి తీరుతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని పెంచడం కాని, తగ్గించడం కాని చెయ్యలేరు అన్న విషయాన్ని విశ్వసించి, ఉన్నదానిలోనే తృప్తిపడే వారి మనసులో ఒక విధమైన మనశ్శాంతి, ప్రశాంతత ఉంటాయి. లేనిదానికోసం వెంపర్లాట ఉండదు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలాంటి వారిని ఎవరి అవసరం లేని సంపన్నులు అన్నారు.
మిగతా రెండు విషయాలను తీసుకుంటే ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి. ఎవరి దుర్నడత కారణంగా అతడి పొరుగువారు సురక్షిత ంగా ఉండరో, అతడు ముస్లిం కాదు అన్నారు ముహమ్మద్ ప్రవక్త ఒక ప్రవచనంలో. ఒకరి గౌరవ మర్యాదలపై, ధనప్రాణాలపై నోటి ద్వారాగాని, చేతిద్వారా గాని ఎలాంటి దాడీ చేసే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకని మనం మనకోసం ఎలాంటి స్థితిని కోరుకుంటామో, పరులకోసం కూడా అలాంటి స్థితినే కోరుకోవాలి. దీనికి భిన్నంగా పరుల కీడు కోరేవారు ముస్లింలు కాలేరు అని ప్రవక్త మహనీయులు స్పష్టం చేశారు.
అలాగే అధికంగా నవ్వడం కూడా మంచిది కాదు. నవ్వు దివ్య ఔషధం ఐనప్పటికీ మితిమీరితే అనర్థమే. అల్లాహ్ నామస్మరణలో హృదయం సజీవంగా ఉంటుంది.
అల్లాహ్‌ను విస్మరించి, ప్రాపంచిక వినోదంలో మునిగి తేలడం వల్ల హృదయం నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మితిమీరి నవ్వడం, ఇతరులను గేలిచేయడం మంచిది కాదన్నది ప్రవక్త ప్రవచన సారం. చిరునవ్వు సదా అభిలషణీయమే. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచించిన ఈ విషయాలను గమనంలో ఉంచుకుని ఆచరించగలిగితే సమాజం నిజంగానే శాంతి సామరస్యాలతో తులతూగుతుంది. పరలోక సాఫల్యం ప్రాప్తిస్తుంది.
- యండీ ఉస్మాన్‌ఖాన్