sanmargam
-
వెదజల్లితే వృద్ధి...బిగబడితే లేమి..!
సన్మార్గం నిరుపేదలతో పోల్చితే ధనవంతులమైన తమ బతుకెంత గొప్పదో తెలిపేందుకు ఒక ధనికుడు తన కొడుకును ఒక కుగ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడి పేదప్రజల జీవితాల్ని పరిశీలించిన కొడుకు తన తండ్రితో ‘‘మనకు ఒక కుక్క ఉంది. వారికి వీధినిండా కుక్కలే. మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. వారికి చెరువులు, నది ఉన్నాయి. మనింట్లో దీపాలున్నాయి. వారికి ఆకాశం నిండా నక్షత్రాలున్నాయి. మనం ఆహారం కొనుక్కుంటాం. వాళ్లు పండించుకుంటారు. కాపాడేందుకు మన చుట్టూ గోడలున్నాయి. వారి చుట్టూ మిత్రులున్నారు. మనింట్లో గొప్ప గ్రంథాలున్నాయి. వారి వద్ద ఒక బైబిల్ ఉంది. వారికన్నా మనం ఎంత పేదవాళ్లమో తెలిపినందుకు థాంక్యూ డాడీ!’’అన్నాడు. ధనార్జనే ధ్యేయంగా పేదలనీసడించుకుంటూ బతికేవాళ్లనుద్దేశించి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుడు ఎంతో వైభవంగా, విలాసవంతంగా బతుకుతున్నాడు. అతని వాకిట్లోనే లాజరు అనే భిక్షగాడు ఒంటినిండా కురుపులతో, ఆ ధనికుడు పారేసే ఎంగిలి రొట్టెముక్కలతో అత్యంత దయనీయంగా జీవిస్తున్నాడు. ఇద్దరూ మరణించారు. అయితే లాజరు అబ్రహాము ఉండే నిత్యానంద స్థలానికి వెళ్లగా, ధనికుడు నేరుగా నరకానికి వెళ్లి అక్కడి నిత్యాగ్నిలో పడ్డాడు. చివరికి దాహానికి తాళలేక ఆ ధనికుడు లాజరును అతని వేలికొనను నీళ్లతో తడిపి తన వద్దకు పంపమంటూ అబ్రహామును ప్రాధేయపడ్డా ఫలితం లేకపోయిందని యేసుక్రీస్తు వివరించాడు (లూకా 16:14-31) పేదరికం శాపం కాదని, సంపన్నత వరం కాదని ప్రభువు వివరించిన ఉదంతమిది. ధనికులు పేదలూ అంతా ఒకనాడు మరణించాల్సిందేనని, మరణానంతర జీవితంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని వెల్లడించే ఉపమానమిది. కరెన్నీ కట్టల మైకంలో ఉన్న ఆ ధనికునికి తన వాకిట్లోనే పడి ఉన్న ఒక నిరుపేద దుస్థితి కనిపించలేదు. అయితే నరకాన్ని తప్పించుకునే మార్గాన్ని దేవుడు ప్రతి ఒక్కరికీ చూపించాడు. నిత్యాగ్నిలో రగులుతూ లాజరు వేలికొనకున్న నీటిబొట్టుతో దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించే బదులు, బతికున్నప్పుడే ఆ ధనికుడు తనకున్నదాంట్లో ఆ దీనుడికి తన కొనగోటితో విదిల్చినా, ఈ లోకంలో ఆ దీనుడు బాగుపడేవాడు, పరలోకంలో ధనికుడి పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది కదా! డబ్బు కట్టలతో మనిషి గౌరవాన్ని లెక్కగట్టే నాటి నీచసంస్కృతిని ఏవగించుకుంటూ కొందరి కళ్లు తెరిపించడానికి ప్రభువు చెప్పిన ఈ ఉపమానం అర్థమైతే లోకం తీరే మారిపోతుంది. రేపు పరలోకంలో నా స్థానమేమిటి? అన్న అవగాహనతో విశ్వాసి తన జీవితంలో నిర్ణయాలు అత్యంత దైవికంగా తీసుకోగలుగుతున్నాడు. ఒక వ్యక్తి దేవునికి, సిరికి ఏకకాలంలో దాసుడుగా ఉండలేడన్నాడే తప్ప ప్రభువు డబ్బు సంపాదించడం తప్పనలేదు. దేవుని స్థానంలో డబ్బుండకూడదన్నాడంతే! ఎంతో సంపాదించగలిగిన సామర్థ్యాన్ని దేవుడివ్వగా బోలెడు సంపాదిస్తూ, పైసా ఖర్చయితే ప్రాణం పోయినట్టు ప్రవర్తించేవాడి జీవితంలో దేవుని స్థానంలో డబ్బున్నట్టే! బీరువాలు, లాకర్లు, రహస్య స్థలాల్లో పేర్చిపెట్టే కరెన్సీ కట్టలకు చిత్తుకాగితాలకున్నంత విలువ కూడా ఉండదు. డబ్బంతా స్వార్థంతో కూడబెట్టి చివరికి నరకానికి వెళ్లేబదులు దాన్ని పేదలకోసం ఖర్చు చేసి పరలోకానికి పూలబాట వేసుకోవడం విశ్వాసి చేతుల్లోనే ఉంది. అందుకే దేవుడు ‘వెదజల్లితే అభివృద్ధి, బిగబట్టితే కల్లబొల్లి’అన్నాడు (సామె 11:24, 26). మనస్సాక్షిని చ ంపుకుంటే, కల్లబొల్లి కబుర్లు చెప్పగలిగితే, దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే బోలెడు డబ్బు పోగేయవచ్చు. కాని డబ్బును ఇలా సంపాదించినంత తేలిక కాదు, దేవుని రాజ్యాన్ని కట్టడం. అందుకే డబ్బు కట్టలు పేర్చుకునే పనిని పెద్దగా తెలివితేటలు లేనివారు ఎన్నుకుంటే, తన రాజ్యాన్ని కట్టే విశిష్ట కార్యాన్ని దేవుడు ఎంతో తెలివైనవారికిచ్చాడు. వెదజల్లడంలోని ఆశీర్వాదం వారికి మాత్రమే తెలుసు. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రవక్త పలుకులు... సాఫల్యానికి సోపానాలు
ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి. ఈ భూప్రపంచంలో మానవ జీవితం ఎలాంటి ఆటుపోట్లు, సమస్యలు లేకుండా సాగిపోవాలంటే కొన్ని సిద్ధాంతాలను, నియమాలను పాటించాలి. అయితే అవి స్వయంకల్పితాలు కాకుండా సృష్టికర్త అయిన అల్లాహ్, ఆయన చెప్పిన ధర్మాన్ని ఆయన తరఫున మానవాళికి బోధించిన దైవప్రవక్త ముహమ్మద్ (స) వంటివారు చెప్పినవై ఉండాలి. ఈ సందర్భంలో ముహమ్మద్ (స) ప్రవచించిన కొన్ని ధార్మిక విషయాలను తెలుసుకుందాం. 1. హరాం (నిషిద్ధాలకు దూరంగా ఉండటం) 2.అల్లాహ్ మీ అదృష్టంలో రాసిన దానిపట్ల సంతృప్తితో ఉండటం 3. ఇరుగుపొరుగులతో సత్ప్రవర్తన కలిగి ఉండటం, 4. ఇతరులు మీ పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలని మీరు కోరుకుంటారో, మీరూ ఇతరుల పట్ల అలాంటి వైఖరినే ప్రదర్శించడం. 5.సాటివారిని ఎగతాళి చేయకుండా ఉండడం, వారిని చూసి నవ్వుకోకుండా ఉండటం. దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచించిన ఈ ధర్మాలను పాటిస్తే మన సమాజం అన్నిరకాల రుగ్మతల నుంచి బయట పడగలుగుతుంది. నిషిద్ధాలకు దూరంగా ఉంటే గొప్ప దైవభక్తి పరులవుతారన్నారు ప్రవక్త మహనీయులు. అంటే ధర్మసమ్మతం కాని ప్రతిదీ అధర్మమే, నిషిద్ధమే. సృష్టికర్తను వదిలి సృష్టిరాశుల్ని పూజించడం, తల్లిదండ్రులకు సేవచేయకుండా, వారి ఆదేశాలను ధిక్కరించడం, హింసాదౌర్జన్యాలు, రక్తపాతం, జూదం, మద్యపానం, వ్యభిచారం, అవినీతి, అక్రమాలు, అనాథల ఆస్తిని అపహరించడం, ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీయడం వంటి అనేక విషయాలన్నీ హరాం. అంటే అధర్మం, నిషిద్ధం. వీటికి దూరంగా ఉండటం నిజంగా గొప్ప ఆరాధన. అందుకే వీటికి దూరంగా ఉన్న వారు గొప్ప దైవభక్తిపరులు అన్నారు ప్రవక్త మహనీయులు. ఇక రెండవ విషయానికి వస్తే, అల్లాహ్ మన అదృష్టంలో ఎంత రాస్తే అంత తప్పక లభించి తీరుతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని పెంచడం కాని, తగ్గించడం కాని చెయ్యలేరు అన్న విషయాన్ని విశ్వసించి, ఉన్నదానిలోనే తృప్తిపడే వారి మనసులో ఒక విధమైన మనశ్శాంతి, ప్రశాంతత ఉంటాయి. లేనిదానికోసం వెంపర్లాట ఉండదు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలాంటి వారిని ఎవరి అవసరం లేని సంపన్నులు అన్నారు. మిగతా రెండు విషయాలను తీసుకుంటే ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి. ఎవరి దుర్నడత కారణంగా అతడి పొరుగువారు సురక్షిత ంగా ఉండరో, అతడు ముస్లిం కాదు అన్నారు ముహమ్మద్ ప్రవక్త ఒక ప్రవచనంలో. ఒకరి గౌరవ మర్యాదలపై, ధనప్రాణాలపై నోటి ద్వారాగాని, చేతిద్వారా గాని ఎలాంటి దాడీ చేసే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకని మనం మనకోసం ఎలాంటి స్థితిని కోరుకుంటామో, పరులకోసం కూడా అలాంటి స్థితినే కోరుకోవాలి. దీనికి భిన్నంగా పరుల కీడు కోరేవారు ముస్లింలు కాలేరు అని ప్రవక్త మహనీయులు స్పష్టం చేశారు. అలాగే అధికంగా నవ్వడం కూడా మంచిది కాదు. నవ్వు దివ్య ఔషధం ఐనప్పటికీ మితిమీరితే అనర్థమే. అల్లాహ్ నామస్మరణలో హృదయం సజీవంగా ఉంటుంది. అల్లాహ్‌ను విస్మరించి, ప్రాపంచిక వినోదంలో మునిగి తేలడం వల్ల హృదయం నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మితిమీరి నవ్వడం, ఇతరులను గేలిచేయడం మంచిది కాదన్నది ప్రవక్త ప్రవచన సారం. చిరునవ్వు సదా అభిలషణీయమే. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచించిన ఈ విషయాలను గమనంలో ఉంచుకుని ఆచరించగలిగితే సమాజం నిజంగానే శాంతి సామరస్యాలతో తులతూగుతుంది. పరలోక సాఫల్యం ప్రాప్తిస్తుంది. - యండీ ఉస్మాన్‌ఖాన్ -
సన్మార్గం : ధన్యజీవి... నరసీ మెహతా
‘‘నన్ను నమ్మి సేవించువారి బరువు బాధ్యతలు నేనే చూసుకుంటాను’’అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటకు నరసీమెహతా జీవిత చరిత్ర చక్కని ఉదాహరణ. అడుగడుగునా తన భక్తుని మానమర్యాదలు కాపాడుతూ భక్తజన రక్షకుడన్న తన బిరుదును సార్థకం చేసుకున్నాడు. నరసీమెహతా జున్యాగడ( నేటి జునాగడ్) అనే నగరంలో జన్మించాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ పరమపదించారు. అందువల్ల అతని పోషణభారం అన్నావదినల మీద పడింది. వదినకు ఈ పిల్లాడిని పెంచటం సుతరామూ ఇష్టం లేదు. తన అయిష్టాన్ని అనేక రకాలుగా నరసీమెహతా మీద చూపిస్తుండేది. వయసుకు మించిన పనులు పురమాయిస్తూ వేళకు అన్నం పెట్టకుండా ఎంత చిన్న పొరపాటు జరిగినా తిట్టి, కొట్టి హింసిస్తూ ఉండేది. తన బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తనే దుఃఖిస్తూ ఉండేవాడు నరసీ మెహతా. ఆమె పెట్టే బాధలు అంతకంతకూ ఎక్కువకాగా విరక్తిచెందిన నరసీమెహతా ఒకరోజు ఇల్లు విడిచి అడవిలోకి పారిపోయాడు. ఎక్కడకు వెళ్లాలో, ఏమిచేయాలో దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతున్న నరసీమెహతాకు ఒక శిథిలాలయం, అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు కనిపించారు. నిర్జనమైన అడవిలో సాధువు కనిపించగానే నరసీ మెహతాకు భయం తీరి ఆయన దగ్గరకు వెళ్లాడు. ఆయన నరసీమెహతా కథ విని జాలిపడి అన్నపానీయాలనిచ్చి ఆదరించాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత నీకు ఇష్టమైన చోటుకు వెళ్లవచ్చునని చెప్పి అక్కడే పడుకోమన్నాడు. ఆదమరచి నిద్రపోతున్న నరసీమెహతాకు అర్ధరాత్రివేళ దివ్యమైన వేణుగానం వినిపించగా లేచి కూర్చున్నాడు. ఆలయం ఎదుట ఉన్న ప్రదేశంలో దివ్యమంగళ స్వరూపుడైన శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తుండగా గోపికలు ఆనందంతో ఒళ్లుమరచి నాట్యం చేయసాగారు. అదంతా తాను విన్న భాగవతంలోని శ్రీకృష్ణ రాసలీలా వైభవంగా తోచింది. ఆ అద్భుత దృశ్యం చూసి ఒళ్లు పులకరించగా నరసీ మెహతా కూడా నృత్యం చేయసాగాడు. ఆ చప్పుడుకు సాధువు లేచి ‘‘అర్ధరాత్రి వేళ నృత్యం ఏమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు నరసీమెహతా ‘‘అయ్యా! శ్రీకృష్ణుడు గోపికలతో కలసి రాసలీల చేస్తుంటే నాకు కూడా వారితోపాటు నృత్యం చేయాలనిపించింది’’ అంటూ తాను చూసిన సన్నివేశాన్ని వర్ణించి చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా తాను అక్కడ ఉంటున్నా ఎప్పుడూ తనకు కనిపించని దృశ్యం ఏ పూర్వపుణ్యం వలన అతనికి కనిపించింది? అని దివ్యదృష్టితో చూసి సాధువు విషయమంతా తెలుసుకున్నాడు. ‘‘నీవు పూర్వజన్మలో క్రూరమైన పెద్దపులివి. ఒకసారి శ్రీకృష్ణుని భక్తుడైన పిపాజీ రాజును చంపబోగా అతను తన ఇష్టదైవమైన శ్రీకృష్ణ నామమంత్రం జపించాడు. ఆ మంత్రం విన్న పుణ్యం వలన ఇప్పుడు ఉత్తమమైన నరజన్మ ఎత్తగలిగావు. అప్పుడు నీవు చేసిన దుష్కర్మల ఫలితమే ఇప్పుడు నీవు అనుభవించిన బాధలు’’ అని చెప్పి ‘‘నీవు చూసిన రాసలీలలను వర్ణిస్తూ ఒక ప్రబంధ కావ్యాన్ని రాయి. ఆయన ఆశీస్సులు నీపై సమృద్ధిగా ఉన్నాయి కనుకనే మహాపురుషులకు సైతం కనిపించని దృశ్యాన్ని నీవు కన్నులారా చూడగలిగావు’’ అని అన్నాడు. సాధువు ఆదేశం మేరకు నరసీ మెహతా అక్కడే ప్రబంధ కావ్యరచన ప్రారంభించాడు. శ్రీకృష్ణుని లీలలు అతని కన్నులముందు కనిపిస్తుండగా నరసీ మెహతా నిమిత్తమాత్రుడై రాశాడు. గుజరాతీ భాషలో అతడు వర్ణించిన రాసక్రీడా వైభవాన్ని ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా పాడుకోసాగారు. లోహానికి స్పర్శవేది (పరశువేది) తగిలితే బంగారమైనట్లు భగవంతుని కృపకు పాత్రుడైన నరసీమెహతా కీర్తిమంతుడయ్యాడు. అతనికి సద్గుణవతి అయిన కన్యతో వివాహం జరిగింది. - జక్కా విజయకుమారి -
దానధర్మాలు... అల్లాహ్ ఆదేశాలు
అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు. కనుక పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు. దైవం మానవుడికి ప్రసాదించిన సంపద అతనొక్కడికే పరిమితం కాదు. అందులో పశుపక్ష్యాదులక్కూడా వాటా ఉంది. బంధువులు, బాటసారులు, పేదలు, అనాథలు అందరికీ ఎంతోకొంత హక్కుంది. వీటన్నిటినీ నెరవేరిస్తేనే దైవం అనుగ్రహిస్తాడు. సంపదలో వృద్ధిని ప్రసాదిస్తాడు. అలా కాకుండా ఏ సత్కార్యానికీ పైసా ఖర్చు పెట్టకుండా, ఏ నిరుపేదకూ, పట్టెడన్నం పెట్టకుండా పైసా పైసా కూడబెట్టి అనుభవిస్తాడో, లేక దాచి పెడతాడో అలాంటి వారిని అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు. ఏదో ఒకరోజు ఆ సంపదనంతా లాక్కొని బిచ్చగాడిగా మారుస్తాడు. పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద పళ్లతోట ఉండేది. పంటకాలంలో అతను చాలా ఉదారంగా వ్యవహరించేవాడు. తోటలో పనికి వచ్చే కూలీల పట్ల దయతో మసలుకుంటూ కాస్త అదనంగానే కూలి ఇచ్చేవాడు. బాటసారులకు, పేదసాదలకు పళ్లు పంచిపెట్టేవాడు. ఇంకా వివిధ రకాలుగా నిరుపేదలను ఆదుకునేవాడు. ఆ వ్యక్తికి ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురిలో ఇద్దరికి మాత్రం తండ్రి ైవె ఖరి నచ్చేది కాదు, ఒక కొడుకుది మాత్రం తండ్రి గుణమే. అయితే మిగతా ఇద్దరూ ‘నాన్నా! మీరిలా పేదసాదలు, ఆర్తులు, అనాథలంటూ దానధర్మాలు చేస్తూ పోతే చివరికి మనకేమీ మిగలదు.’ అనేవారు. తండ్రి వారికి నచ్చచెబుతూ ‘బిడ్డలారా! మీ ఆలోచన తప్పు. పరులకు సహాయం చేయడం వల్ల సంపద వృద్ధి అవుతుందే తప్ప తరిగిపోదు. అయినా, మన దగ్గర ఉన్న సంపద అంతా నిజానికి మనది కాదు. మనం కేవలం దాని పర్యవేక్షకులం, అమానతుదారులం మాత్రమే. ఈ సంపదకు అసలు యజమాని అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన ఆదేశాలు, హితవుల ప్రకారమే మనమీ సంపదను వినియోగించాలి. మన అవసరాలకు మించి, మిగిలి ఉన్న సంపదలో పేదసాదలు, బంధువులు, బాటసారులు, అనాథలు, అన్నార్తులు అందరికీ వాటా ఉంది. అందరి హక్కులు మనం నెరవేర్చవలసి ఉంది. అంతే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాదులకూ ఈ సంపదపై హక్కు ఉంది. ఎందుకంటే అవి కూడా దేవుని సృష్టిలోనివే కదా! ఈ అందరి హక్కులు పోగా మిగిలినదే మనది. అందులోనే అల్లాహ్ సమృద్ధిని ప్రసాదిస్తాడు. ఈవిధంగానే మనం మనం సంపదను పరిశుద్ధం చేసుకోగలం. నా తదనంతరం మీరు కూడా ఇదే విధానాన్ని అవలంబించండి.’’ అంటూ హితోపదేశాలు చేశాడు. కాని తండ్రి మరణానంతరం పంట సమయంలో కూలీలకు చేదు అనుభవం ఎదురైంది. తోట యజమానులైన ఆ కుమారులు పేదసాదలెవరినీ ఆ దరిదాపులకు రానివ్వలేదు. కూలీల పట్ల కూడా క్రూరంగా ప్రవర్తించారు. అయితే మూడవ కొడుకు మాత్రం మిగతా ఇద్దరి వైఖరిని వ్యతిరేకిస్తూ ‘ఇప్పుడు మనం ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. నాన్నగారు ఉన్నప్పుడు వీరందరిలో ఎలా వ్యవహరించేవారో మనం కూడా వీరితో అలాగే వ్యవహరిద్దాం. అందులోనే మన శ్రేయస్సు ఉంది’ అన్నాడు. కాని ఇద్దరు సోదరులు అతని మాటలను ఖాతరు చేయలేదు. ఎంతో ఆశతో వచ్చిన పేదసాదలకు, అనాథలను ఛీత్కరించి రిక్తహస్తాలతో వెనక్కి పంపించి వేశారు. మరునాడు తోటలోని పంటనంతా తామే కోసి పంచుకోవాలనే ఉద్దేశ్యంతో సోదరునికి కూడా చెప్పకుండా తెల్లవారుజామునే తోటకి వెళ్లారు. కాని అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. నిండు పంటతో కళకళలాడుతూ ఉన్న ఆ తోట నామరూపాల్లేకుండా నాశనమై పోయి ఉంది. అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు. కనుక పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు. లేకపోతే ఏదో ఒకరోజు దాన్ని మన నుండి దూరం చేసి కఠినంగా శిక్షిస్తాడు. ఈ వృత్తాంతానికి సంబంధించి పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది: ‘‘ఆ సోదరులు నిద్రిస్తుండగానే అల్లాహ్ తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టింది. అంతే! తెల్లవారేసరికల్లా ఆ తోట కోత కోసిన చేనులా అయిపోయింది (ఖురాన్ 68:19,20). - యండీ ఉస్మాన్‌ఖాన్