దానధర్మాలు... అల్లాహ్ ఆదేశాలు
అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు. కనుక పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు.
దైవం మానవుడికి ప్రసాదించిన సంపద అతనొక్కడికే పరిమితం కాదు. అందులో పశుపక్ష్యాదులక్కూడా వాటా ఉంది. బంధువులు, బాటసారులు, పేదలు, అనాథలు అందరికీ ఎంతోకొంత హక్కుంది. వీటన్నిటినీ నెరవేరిస్తేనే దైవం అనుగ్రహిస్తాడు. సంపదలో వృద్ధిని ప్రసాదిస్తాడు. అలా కాకుండా ఏ సత్కార్యానికీ పైసా ఖర్చు పెట్టకుండా, ఏ నిరుపేదకూ, పట్టెడన్నం పెట్టకుండా పైసా పైసా కూడబెట్టి అనుభవిస్తాడో, లేక దాచి పెడతాడో అలాంటి వారిని అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు. ఏదో ఒకరోజు ఆ సంపదనంతా లాక్కొని బిచ్చగాడిగా మారుస్తాడు.
పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద పళ్లతోట ఉండేది. పంటకాలంలో అతను చాలా ఉదారంగా వ్యవహరించేవాడు. తోటలో పనికి వచ్చే కూలీల పట్ల దయతో మసలుకుంటూ కాస్త అదనంగానే కూలి ఇచ్చేవాడు. బాటసారులకు, పేదసాదలకు పళ్లు పంచిపెట్టేవాడు. ఇంకా వివిధ రకాలుగా నిరుపేదలను ఆదుకునేవాడు. ఆ వ్యక్తికి ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురిలో ఇద్దరికి మాత్రం తండ్రి ైవె ఖరి నచ్చేది కాదు, ఒక కొడుకుది మాత్రం తండ్రి గుణమే. అయితే మిగతా ఇద్దరూ ‘నాన్నా! మీరిలా పేదసాదలు, ఆర్తులు, అనాథలంటూ దానధర్మాలు చేస్తూ పోతే చివరికి మనకేమీ మిగలదు.’ అనేవారు. తండ్రి వారికి నచ్చచెబుతూ ‘బిడ్డలారా! మీ ఆలోచన తప్పు.
పరులకు సహాయం చేయడం వల్ల సంపద వృద్ధి అవుతుందే తప్ప తరిగిపోదు. అయినా, మన దగ్గర ఉన్న సంపద అంతా నిజానికి మనది కాదు. మనం కేవలం దాని పర్యవేక్షకులం, అమానతుదారులం మాత్రమే. ఈ సంపదకు అసలు యజమాని అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన ఆదేశాలు, హితవుల ప్రకారమే మనమీ సంపదను వినియోగించాలి. మన అవసరాలకు మించి, మిగిలి ఉన్న సంపదలో పేదసాదలు, బంధువులు, బాటసారులు, అనాథలు, అన్నార్తులు అందరికీ వాటా ఉంది.
అందరి హక్కులు మనం నెరవేర్చవలసి ఉంది. అంతే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాదులకూ ఈ సంపదపై హక్కు ఉంది. ఎందుకంటే అవి కూడా దేవుని సృష్టిలోనివే కదా! ఈ అందరి హక్కులు పోగా మిగిలినదే మనది. అందులోనే అల్లాహ్ సమృద్ధిని ప్రసాదిస్తాడు. ఈవిధంగానే మనం మనం సంపదను పరిశుద్ధం చేసుకోగలం. నా తదనంతరం మీరు కూడా ఇదే విధానాన్ని అవలంబించండి.’’ అంటూ హితోపదేశాలు చేశాడు.
కాని తండ్రి మరణానంతరం పంట సమయంలో కూలీలకు చేదు అనుభవం ఎదురైంది. తోట యజమానులైన ఆ కుమారులు పేదసాదలెవరినీ ఆ దరిదాపులకు రానివ్వలేదు. కూలీల పట్ల కూడా క్రూరంగా ప్రవర్తించారు. అయితే మూడవ కొడుకు మాత్రం మిగతా ఇద్దరి వైఖరిని వ్యతిరేకిస్తూ ‘ఇప్పుడు మనం ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. నాన్నగారు ఉన్నప్పుడు వీరందరిలో ఎలా వ్యవహరించేవారో మనం కూడా వీరితో అలాగే వ్యవహరిద్దాం. అందులోనే మన శ్రేయస్సు ఉంది’ అన్నాడు. కాని ఇద్దరు సోదరులు అతని మాటలను ఖాతరు చేయలేదు. ఎంతో ఆశతో వచ్చిన పేదసాదలకు, అనాథలను ఛీత్కరించి రిక్తహస్తాలతో వెనక్కి పంపించి వేశారు.
మరునాడు తోటలోని పంటనంతా తామే కోసి పంచుకోవాలనే ఉద్దేశ్యంతో సోదరునికి కూడా చెప్పకుండా తెల్లవారుజామునే తోటకి వెళ్లారు. కాని అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. నిండు పంటతో కళకళలాడుతూ ఉన్న ఆ తోట నామరూపాల్లేకుండా నాశనమై పోయి ఉంది. అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు.
కనుక పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు. లేకపోతే ఏదో ఒకరోజు దాన్ని మన నుండి దూరం చేసి కఠినంగా శిక్షిస్తాడు. ఈ వృత్తాంతానికి సంబంధించి పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది: ‘‘ఆ సోదరులు నిద్రిస్తుండగానే అల్లాహ్ తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టింది. అంతే! తెల్లవారేసరికల్లా ఆ తోట కోత కోసిన చేనులా అయిపోయింది (ఖురాన్ 68:19,20).
- యండీ ఉస్మాన్‌ఖాన్