వెదజల్లితే వృద్ధి...బిగబడితే లేమి..!
సన్మార్గం
నిరుపేదలతో పోల్చితే ధనవంతులమైన తమ బతుకెంత గొప్పదో తెలిపేందుకు ఒక ధనికుడు తన కొడుకును ఒక కుగ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడి పేదప్రజల జీవితాల్ని పరిశీలించిన కొడుకు తన తండ్రితో ‘‘మనకు ఒక కుక్క ఉంది. వారికి వీధినిండా కుక్కలే. మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. వారికి చెరువులు, నది ఉన్నాయి. మనింట్లో దీపాలున్నాయి. వారికి ఆకాశం నిండా నక్షత్రాలున్నాయి. మనం ఆహారం కొనుక్కుంటాం. వాళ్లు పండించుకుంటారు. కాపాడేందుకు మన చుట్టూ గోడలున్నాయి. వారి చుట్టూ మిత్రులున్నారు. మనింట్లో గొప్ప గ్రంథాలున్నాయి. వారి వద్ద ఒక బైబిల్ ఉంది. వారికన్నా మనం ఎంత పేదవాళ్లమో తెలిపినందుకు థాంక్యూ డాడీ!’’అన్నాడు.
ధనార్జనే ధ్యేయంగా పేదలనీసడించుకుంటూ బతికేవాళ్లనుద్దేశించి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుడు ఎంతో వైభవంగా, విలాసవంతంగా బతుకుతున్నాడు. అతని వాకిట్లోనే లాజరు అనే భిక్షగాడు ఒంటినిండా కురుపులతో, ఆ ధనికుడు పారేసే ఎంగిలి రొట్టెముక్కలతో అత్యంత దయనీయంగా జీవిస్తున్నాడు. ఇద్దరూ మరణించారు. అయితే లాజరు అబ్రహాము ఉండే నిత్యానంద స్థలానికి వెళ్లగా, ధనికుడు నేరుగా నరకానికి వెళ్లి అక్కడి నిత్యాగ్నిలో పడ్డాడు. చివరికి దాహానికి తాళలేక ఆ ధనికుడు లాజరును అతని వేలికొనను నీళ్లతో తడిపి తన వద్దకు పంపమంటూ అబ్రహామును ప్రాధేయపడ్డా ఫలితం లేకపోయిందని యేసుక్రీస్తు వివరించాడు (లూకా 16:14-31)
పేదరికం శాపం కాదని, సంపన్నత వరం కాదని ప్రభువు వివరించిన ఉదంతమిది. ధనికులు పేదలూ అంతా ఒకనాడు మరణించాల్సిందేనని, మరణానంతర జీవితంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని వెల్లడించే ఉపమానమిది. కరెన్నీ కట్టల మైకంలో ఉన్న ఆ ధనికునికి తన వాకిట్లోనే పడి ఉన్న ఒక నిరుపేద దుస్థితి కనిపించలేదు. అయితే నరకాన్ని తప్పించుకునే మార్గాన్ని దేవుడు ప్రతి ఒక్కరికీ చూపించాడు. నిత్యాగ్నిలో రగులుతూ లాజరు వేలికొనకున్న నీటిబొట్టుతో దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించే బదులు, బతికున్నప్పుడే ఆ ధనికుడు తనకున్నదాంట్లో ఆ దీనుడికి తన కొనగోటితో విదిల్చినా, ఈ లోకంలో ఆ దీనుడు బాగుపడేవాడు, పరలోకంలో ధనికుడి పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది కదా! డబ్బు కట్టలతో మనిషి గౌరవాన్ని లెక్కగట్టే నాటి నీచసంస్కృతిని ఏవగించుకుంటూ కొందరి కళ్లు తెరిపించడానికి ప్రభువు చెప్పిన ఈ ఉపమానం అర్థమైతే లోకం తీరే మారిపోతుంది.
రేపు పరలోకంలో నా స్థానమేమిటి? అన్న అవగాహనతో విశ్వాసి తన జీవితంలో నిర్ణయాలు అత్యంత దైవికంగా తీసుకోగలుగుతున్నాడు. ఒక వ్యక్తి దేవునికి, సిరికి ఏకకాలంలో దాసుడుగా ఉండలేడన్నాడే తప్ప ప్రభువు డబ్బు సంపాదించడం తప్పనలేదు. దేవుని స్థానంలో డబ్బుండకూడదన్నాడంతే! ఎంతో సంపాదించగలిగిన సామర్థ్యాన్ని దేవుడివ్వగా బోలెడు సంపాదిస్తూ, పైసా ఖర్చయితే ప్రాణం పోయినట్టు ప్రవర్తించేవాడి జీవితంలో దేవుని స్థానంలో డబ్బున్నట్టే!
బీరువాలు, లాకర్లు, రహస్య స్థలాల్లో పేర్చిపెట్టే కరెన్సీ కట్టలకు చిత్తుకాగితాలకున్నంత విలువ కూడా ఉండదు. డబ్బంతా స్వార్థంతో కూడబెట్టి చివరికి నరకానికి వెళ్లేబదులు దాన్ని పేదలకోసం ఖర్చు చేసి పరలోకానికి పూలబాట వేసుకోవడం విశ్వాసి చేతుల్లోనే ఉంది. అందుకే దేవుడు ‘వెదజల్లితే అభివృద్ధి, బిగబట్టితే కల్లబొల్లి’అన్నాడు (సామె 11:24, 26). మనస్సాక్షిని చ ంపుకుంటే, కల్లబొల్లి కబుర్లు చెప్పగలిగితే, దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే బోలెడు డబ్బు పోగేయవచ్చు. కాని డబ్బును ఇలా సంపాదించినంత తేలిక కాదు, దేవుని రాజ్యాన్ని కట్టడం. అందుకే డబ్బు కట్టలు పేర్చుకునే పనిని పెద్దగా తెలివితేటలు లేనివారు ఎన్నుకుంటే, తన రాజ్యాన్ని కట్టే విశిష్ట కార్యాన్ని దేవుడు ఎంతో తెలివైనవారికిచ్చాడు. వెదజల్లడంలోని ఆశీర్వాదం వారికి మాత్రమే తెలుసు.
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్