కృతజ్ఞత ఉండాలి!
మానవుడి మనస్సు చాలా సంకుచితమైనది, చంచలమైనది. ఎంత ఉన్నా ఇంకా ఏదో ఒకటి లేదన్న వెలితి అతడి మనస్సు నిండా కెలుకుతూనే ఉంటుంది. ఒక్కసారి మనం సమాజం వైపు దృష్టి సారిస్తే, కళ్లు లేనివాళ్లు, కాళ్లు లేనివాళ్లు రకరకాల అంగవైకల్యం ఉన్నవారు, మానసిక స్థితి బాగా లేనివాళ్లు, కనీసం ఒక్కపూట తిండికీ నోచుకోనివాళ్లు, ఒంటినిండా బట్టలేనివాళ్లు, తలదాచుకోవడానికి గూడులేనివాళ్లు ఎంత దీనస్థితిలో బతుకులీడుస్తున్నారో మనకు అర్థమవుతుంది.
వారితో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది. బుద్ధిజీవులమైన మనం ఈ విషయాలను గురించి ఆలోచించగలిగితే ఇలాంటి వారిపట్ల మన బాధ్యత ఏమిటో కూడా తెలుస్తుంది. అప్పుడే ప్రేమ, దయ, త్యాగం, పరోపకారం వంటి సద్గుణాల విలువ బాగా అర్థమవుతుంది.
నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనకంటే పై వారిని, ప్రాపంచిక విషయాల్లో మనకంటే కిందిస్థాయిని చూడాలన్న దైవప్రవక్త ప్రవచనాన్ని గమనంలో ఉంచుకుంటే ఇహలోక జీవితం ప్రశాతంగా, పరలోక జీవితం ఫలవంతంగా సాగుతుంది.
- యండి. ఉస్మాన్‌ఖాన్