ఇమ్మని దేవుణ్ణి అడగొచ్చా?
దైవికం
ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైనపార్థన అంటారు బాపూజీ.
ప్రపంచంలో నిత్యం కోట్ల మంది దేనికో ఒకదాని కోసం భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. ‘విన్నపాలు వినవలె వింత వింతలూ’ అని అన్నమయ్య పాడారు కదా, అలా ఆ వేడుకోళ్లలో కొన్ని ప్రార్థనలు ఉంటాయి. కొన్ని బెదిరింపులు ఉంటాయి. కొన్ని బ్లాక్‌మెయిల్స్ ఉంటాయి. కొన్ని అలకలు ఉంటాయి! ఇలా ఒక మనిషి ఇంకో మనిషితో ఎన్ని రకాలైన భావోద్వేగాలతో ఉండగలరో అన్ని రకాల భావోద్వేగాలనూ దేవుడి ముందు ప్రదర్శిస్తుంటారు మానవులు. కొందరు కేవలం ధన్యవాదాలు అర్పిస్తుంటారు. కొందరు కృతజ్ఞతలు చెల్లించి ఊరుకుంటారు... దేవుణ్ని అసలేమీ అడక్కుండా. అలాంటి వాళ్లు తక్కువ.
శివలాల్ యాదవ్ అనే ఆయన ఈమధ్య దేవుణ్ణి ప్రార్థించాడు. ఎక్కడా? తన పూజగదిలో కాదు. బి.సి.సి.ఐ. (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తనని సన్మానిస్తుంటే... ఆ సభలో ప్రార్థించాడు. ఏమని? తన నుంచి ఈ పదవి మళ్లీ పూర్వపు అధ్యక్షుడైన ఎన్.శ్రీనివాసన్‌కి వెళ్లిపోవాలని! క్రికెటర్‌లకు శ్రీనివాసన్ చేసినన్ని మేళ్లు మరే ఇతర అధ్యక్షుడూ చేయలేదు కాబట్టి తిరిగి ఆయనకే ఈ పదవి వచ్చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు శివలాల్ యాదవ్ ప్రకటించారు!
ఇంకొకాయన ప్రహ్లాద్ శర్మ. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటాడు. సామూహిక ప్రార్థనలు జరిపి, యజ్ఞాలు నిర్వహించి, రెండు జర్మన్ షెప్పర్డ్ శునకాలకు పెళ్లి చేసినప్పటికీ, చుక్క వర్షమైనా పడకపోవడంతో ఆయనకు వరుణ దేవుడి మీద కోపం వచ్చింది. దేవుడికి అంత్యసందేశం (అల్టిమేటమ్) ఇచ్చేశాడు. వారంలోపు వర్షం కురిసిందా సరి, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని పోస్టర్లు వేయించి మరీ గోడలకు అంటించాడు! ‘‘భూమ్మీది జీవుల్ని కాపాడడం దేవుడి బాధ్యత. ప్రాణాధారమైన నీటిని లేకుండా చేస్తే ఎలా? రైతులు అల్లాడిపోతున్నారు. ఆ మాత్రం తెలియదా? దేవుడే తలచుకుంటే ఈ క్షణంలో కుంభవృష్టి కురియదా?’’ అని శర్మగారి వాదన.
ప్రార్థన స్థాయిని కూడా దాటిపోయి, దేవుడి తరఫున దైవదూతగా మాట్లాడే మామూలు మానవులు కూడా కొందరు ఉన్నారు! బెన్నీ పున్నతర నే తీసుకోండి. కేరళలోని కోళికోడ్ నుంచి వెలువడే ‘సండే షాలొమ్’ పత్రికకు ఆయన సంపాదకులు. ‘మోడీ ప్రధానిగా గెలవడం అన్నది దైవనిర్ణయం’ అని బెన్నీ తన తాజా సంపాదకీయంలో రాశారు! రాసి, అక్కడితో ఊరుకోలేదు. ‘‘ఈ ప్రపంచంలో జరిగేవేవీ దేవుడికి తెలియకుండా జరగవు. దేవుడే మోడీని తన సేవకునిగా ఎన్నుకున్నాడు కాబట్టి భక్తిపరులైన ప్రతి ఒక్కరూ మోడీని సమర్థించాలి. అలా చేయకపోతే దైవ సంకల్పాన్ని ధిక్కరించినట్లవుతుంది. ఎన్నికలకు ముందు బహుశా భారతీయులంతా మోడీని ప్రధానిని చేయమని దేవుణ్ని ప్రార్థించినట్లున్నారు. ఆ ప్రార్థన ఫలించి, దేవుడు ప్రజలను కనికరించి, కాంగ్రెస్‌ను ఓడించి, మోడీని అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టాడు’’ అని విశ్లేషించారు.
నువ్వే దేవుడివైతే ఎన్.శ్రీనివాసన్‌ని మళ్లీ బి.సి.సి.ఐ. అధ్యక్షుడిని చెయ్యమని దేవుణ్ని అడగడం, నువ్వు దేవుడివి కాకపోబట్టే కదా ఇండోర్‌లోని పొలాలన్నీ ఎండిపోతున్నాయని దేవుణ్ని అనడం, నువ్వు దేవుడివి కాబట్టే మోడీని గెలిపించావని అనుకోవడం... ఇవన్నీ దేవుణ్ని ప్రార్థించడం కాదు. దేవుణ్ని క్రికెట్‌లోకి, రుతుపవనాల్లోకి, రాజకీయాల్లోకి లాగడం. అంటే దేవుణ్ని మానవమాత్రులలోకి లాగేయడం!
ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైన ప్రార్థన అంటారు బాపూజీ. మరి దేవుణ్ని అడక్కుంటే కష్టాలు తీరేదెలా? అడుగుదాం. కానీ కష్టాలు తీర్చమని కాదు. కష్టాలను ఓర్చుకునే శక్తిని ఇమ్మని అడుగుదాం.
- మాధవ్ శింగరాజు