దేవుని మన్నింపు
దైవికం
మిజోరామ్‌లో కొంతకాలంగా దైవానికీ, దుష్టశక్తికీ మధ్య పోరు సాగుతోంది. పద్దెనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో ఉన్న మద్య నిషేధాన్ని రద్దు చేయాలని కొందరు, నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ రెండు వర్గాలలో ఎవరు దైవం వైపున, ఎవరు దుష్టశక్తి తరఫున ఉన్నట్లు? సాధారణంగా మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది కనుక నిషేధాన్ని రద్దు చేయొద్దని కోరుతున్న వారిని దైవం వైపు ఉన్నట్లు అనుకోవాలి. నిషేధం రద్దు చేసి మద్యం అమ్మకాలను ప్రారంభించాలని కోరుతున్న వారిని దుష్టశక్తి ప్రేరేపిస్తుందని భావించాలి. ఎంచేతంటే దుష్టశక్తి పూర్తిగా దైవానికి వ్యతిరేకం కనుక మానవుల్ని కూడా దేవుడికి ఇష్టం లేని వాటి వైపు అది నడిపిస్తుంది కాబట్టి.
అయితే మిజోరామ్‌లో వాదులాడుకుంటున్నవారు మామూలు ప్రజలు కాదు. మిజోరామ్ రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష శాసనసభ్యులు. మంత్రులన్నాక ప్రజా సంక్షేమం కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది. అందుకు డబ్బు కావలసి ఉంటుంది. అంత డబ్బును రాబడిగా పొందడానికి వాళ్లకు కనిపించింది ఎక్సైజ్ శాఖ ఒక్కటే! అందుకే వృత్తి ధర్మంగా (లేదా సేవా ధర్మంగా) ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్యంపై నిషేధాన్ని ఎత్తివేయడమే ఉత్తమ మార్గంగా కనిపించింది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో వృత్తి ధర్మం, లేదా సేవాధర్మం దేవుని అభీష్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడికి ఇష్టం లేదు. కానీ ప్రజల కోసం తప్పడం లేదు. ఏం చేయాలి? మంచైనా, చెడైనా ముఖ్యమంత్రి చెప్పినట్లు చెయ్యాలి. సరిగ్గా అదే పని చేశారు లాల్జిర్లియానా.
లాల్జిర్లియానా మిజోరామ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి. అసెంబ్లీలో ఆయన సీటు ముఖ్యమంత్రి లాల్ థన్‌హావ్లా సీటు పక్కనే ఉంటుంది. లాల్జిర్లియానాకు వ్యక్తిగతంగా మద్యనిషేధాన్ని రద్దు చేయడం ఇష్టం లేనప్పటికీ, వాదోపవాదాల అనంతరం అయన ‘మిజోరామ్ లిక్కర్ (ప్రొహిబిషన్ అండ్ కంట్రోల్) బిల్లు’ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మద్య నిషేధాన్ని తొలగించడం దేవునికి ఇష్టం లేని కార్యమని తను నమ్మినప్పటికీ ఒక రాజకీయ అనివార్యత ఆయన్ని అటువైపుగా నడిపించింది. బలహీనమైన గొంతుతో ఆయన బిల్లుపై ప్రకటన చేసినప్పుడు నలభైమంది సభ్యులు గల మిజోరామ్ అసెంబ్లీలో కనీసం సగంమంది ఆయనకు మద్దతు పలికారు.
నిషేధం కారణంగా కల్తీ మద్యం తాగి ఎంతోమంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కనుక, నిఖార్సయిన మద్యాన్ని అందుబాటులోకి తెస్తే కల్తీ మద్యం మరణాలు తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు. విపక్షానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ, ‘‘మద్యం అందుబాటులోకి వస్తే యువత నైతికంగా పాడైపోతుంది. అది మరణం కంటే ఘోరం. ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నందుకు దేవుడు మనల్ని క్షమించడు’’ అన్నారు.
దేవుడి మాట రాగానే మంత్రి జోడింత్లువంగ పైకి లేచారు. ఒకప్పుడు ఆయనదీ లిక్కర్ బిజినెస్సే. మద్యనిషేధాన్ని రద్దు చేసే బిల్లును సమర్థిస్తూ ఆయన, ప్రధాన ప్రతిపక్షం ‘మిజో నేషనల్ ఫ్రంట్’ వ్యవస్థాపకులు లాల్‌డెంగా గతంలో ఎప్పుడో చేసిన ప్రసంగంలోని రెండు మాటలను సభకు గుర్తు చేశారు. ‘‘మీ నాయకుడే అలా అన్నాక ఇంకా దేవుడి ప్రస్తావన ఎందుకు?’’ అన్నారు. ఇంతకీ ఏమిటీ రెండు మాటలు అంటే : ‘‘మద్యపానం మంచిదని చెప్పలేం, చెడ్డదని చెప్పలేం. అదొక కృత్యం. దీని గురించి మనం వెళ్లి ఏ మతాన్నీ సంప్రదించనవసరం లేదు. ఎందుకంటే మనది లౌకిక ప్రభుత్వం’’ అన్నారట లాల్‌డెంగా.
చివరికి బిల్లు పాస్ అయింది. స్వయానా ఎక్సైజ్ మంత్రికే ఇష్టం లేకున్నా మద్యం బిల్లు మిజోరామ్‌లో మద్యపానానికి ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి కోసం, లేదా రాబడి కోసం, లేదా ప్రజాసంక్షేమం కోసం బల్ల మీద బిల్లు పెట్టిన మంత్రి లాల్జిర్లియానా బిల్లు పెట్టే ముందరి ఆదివారం ఏం చేశారో తెలుసా? అక్కడికి సమీపంలోని ఆర్మ్‌డ్‌వెంగ్ ప్రాంతంలోని చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల ముగింపులో లేచి నిలబడి, అందరికీ వినబడేలా గద్గద స్వరంతో దేవుడిని మన్నించమని కోరారు! ‘‘సర్వశక్తి సంపన్నుడివైన ప్రభువా... ఈవారం నేను మద్యపాన నిషేధాన్ని రద్దుచేసే బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నాను. అది నీ అభీష్టానికి విరుద్ధమైనట్లయితే, అది నాకు అసాధ్యం అయ్యేలా నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఏదైనా అవాంతరం తెప్పించు’’ అని ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన దేవుడు ఆయనకు ఏ అవాంతరమూ సృష్టించకపోవచ్చు. కానీ దేవునికి ఇష్టం లేదన్న ఆయనలోని స్పృహ చాలు ఆయనను దేవుని మన్నింపునకు అర్హుడిని చేసేందుకు.
- మాధవ్ శింగరాజు