
మాధవ్ శింగరాజు
ఆత్మవిశ్వాసం మీదకెక్కి కూర్చున్నప్పుడు వినూత్నమైన ఆలోచనలు మదిలో మెదులుతుంటాయి. మంచి ఉద్యోగంలో ఉన్న వారు ఆ ఉద్యోగం మానేసి, సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటారు! గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీని వదిలేసి, సొంతంగా ఒక పార్టీ పెట్టాలనుకుంటారు.
జమ్మూ–కశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలోని పరమ ఆత్మవిశ్వాసపు కథ ఏదైనా ఉందీ అంటే అది నాదే! నా సొంత పార్టీ ‘డీపీఏపీ’ పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ. డీపీ అంటే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్, ఏపీ అంటే ఆజాద్ పార్టీ. పాత పార్టీ లోంచి బయటికి వచ్చాక నేను కొత్తగా డీపీఏపీని స్థాపించినట్లు లేదు, కొత్తగా డీపీఏపీని స్థాపించటం కోసం పాత పార్టీ నుంచి నేను బయటికి వచ్చినట్లు ఉంది. మీదకెక్కి కూర్చున్న వారి మహిమ అనుకుంటాను!
పాత పార్టీలో యాభై ఏళ్లు ఉన్నాక; పార్టీ సీఎంగా, పార్టీ ఎంపీగా, పార్టీ కేంద్రమంత్రిగా, రాజ్యసభలో పార్టీ అపోజిషన్ లీడర్‌గా నన్ను కూర్చోబెట్టి గౌరవించిన పాత పార్టీని అమర్యాదగా వదిలి వచ్చేశాను నేను. అప్పుడే నా ఫెయిల్యూర్ స్టోరీ మొదలైందా?!
కాదు, ఇంకొకరి ఫెయిల్యూర్స్‌ని ఎప్పుడైతే వేలెత్తి చూపుతామో అప్పుడే మన స్టోరీ మొదల వుతుంది! పార్టీ నుండి బయటికి వచ్చేటప్పుడు నేను మౌనంగా వచ్చేయలేదు. ‘‘పార్టీ పనైపోయింది’’ అంటూ అడుగు బయటికి వేశాను. బయటికి వచ్చాక, ‘‘రాహుల్ అన్‌ఫిట్’’ అని, ‘‘రాహుల్ చైల్డిష్’’ అని సోనియాజీకి లెటర్ రాశాను.
‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్‌కు తోడుగా ఉండకుండా; గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో ఖర్గేజీకి చేదోడుగా లేకుండా పార్టీ నుంచి వచ్చేసి, సొంతంగా పార్టీ పెట్టుకున్నాను.
నన్ను తన సొంత మనిషి అనుకున్న పార్టీని నేను దెబ్బకొట్టి వచ్చేస్తే, నేను పెట్టుకున్న నా సొంత పార్టీ నన్ను దెబ్బకొట్టేసింది!
పార్టీ పెట్టాక, తొలిసారి పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాల్లోనూ నా పార్టీ గెలవ లేకపోయింది! పార్టీ పెట్టాక, తొలిసారి పోటీ చేసిన 23 అసెంబ్లీ స్థానాల్లోనూ నా పార్టీ ఓడిపోయింది. కొన్నిచోట్ల ‘నోటా’కు పడినన్ని ఓట్లు కూడా నా పార్టీకి రాలేదు!
ఓటమి మనిషినే కాదు, పార్టీని కూడా ఒంటరిని చేస్తుంది. నాతో పాటు పాత పార్టీని వదిలి వచ్చిన వారంతా తిరిగి ఆ పార్టీలోకే వెళ్లిపోయారు! రెండున్నరేళ్ల నా కొత్త పార్టీలో 76 ఏళ్ల వయసున్న పార్టీ చైర్మన్‌గా నేను, నా సెక్రెటరీ బషీర్ ఆరిఫ్ మాత్రమే ఇప్పుడు మిగిలాం.
‘‘పని పూర్తయింది ఆజాద్‌జీ...’’ అంటూ వచ్చారు బషీర్ ఆరిఫ్.
‘‘రండి బషీర్‌జీ! మొత్తం డిజాల్వ్ చేసేశారు కదా?!’’అని అడిగాను.
‘‘ఒక్క యూనిట్‌ను కూడా మిగల్చలేదు ఆజాద్‌జీ. స్టేట్, ప్రావిన్షియల్, జోనల్, డిస్ట్రిక్ట్ యూనిట్‌లతో పాటు... పార్టీ బ్లాక్ లెవల్ కమిటీలను కూడా రద్దు చేసేశాం, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తాం అని ఉత్తినే ప్రెస్ నోట్ కూడా పంపించాం...’’ అన్నారు బషీర్. ప్రాణం కాస్త తేలిక పడింది. మీదకెక్కిన వారెవరో దిగిపోయినట్లుగా ఉంది.
‘‘నాకిప్పుడు ఫ్రీ బర్డ్‌నన్న ఫీలింగ్ కలుగుతోంది బషీర్‌జీ. మీక్కూడానా?’’ అని అడిగాను. ఆయన నవ్వారు.
‘‘ఎక్కడికి వెళుతున్నాం అనే దాని కంటే, ఎక్కడి నుంచి వెళుతున్నాం అన్నదే ఒక్కోసారి ఫ్రీడమ్ అనే మాటను చక్కగా డిఫైన్ చేస్తుంది ఆజాద్‌జీ. నాకు సెలవిప్పించండి...’’ అన్నారు నమస్కరిస్తూ!!
చదవండి: మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
సాయంత్రం బాల్కనీలో ఒంటరిగా నిలుచుని లోయలోకి చూస్తూ ఉన్నప్పుడు తులిప్స్, కుంకుమ పూలు, కశ్మీరీ గులాబీలు, బంతిపూలు... గాలికి ఊగుతూ కనిపించాయి. ఒక్క కమలం పూలు మాత్రమే స్థిరంగా ఉన్నాయి. ఆ కమలం పూల వైపే నేనూ స్థిరంగా చాలాసేపు చూస్తూ ఉండిపోయాను.