మాధవ్ శింగరాజు
డాడ్ నాపై చాలా కోపంగా ఉన్నారు! ఆయనలో నా పట్ల అంత నిజమైన కోపాన్ని నేను నా చిన్నప్పుడు కూడా చూడలేదు.
‘‘ఎలాన్, ఆఫ్ట్రాల్ నువ్వొక ప్రపంచ కుబేరుడివి మాత్రమేనన్న సంగతి మర్చిపోకు...’’ అన్నారు డాడ్ ఫోన్ చేసి!
‘‘కానీ డాడ్, మీ కుమారుడిగా ఉండటం కంటే ఎక్కువా నేను ప్రపంచ కుబేరుడిగా ఉండటం?! ఎక్కువ అని నేను అనుకుంటున్నప్పుడు కదా మీరు నన్ను ‘ఆఫ్ట్రాల్ నువ్వొక కుబేరుడివి మాత్రమే’ అని అనాలి...’’ అన్నాను.
‘‘సోది ఆపు’’ అన్నారాయన! ఏడేళ్ల తర్వాత, ఏడాది క్రితమే ఇద్దరం ఒకర్నొకరం చూసుకున్నాం. ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన ఫోన్ చేయటం.
‘‘విను ఎలాన్, నీ దగ్గర 500 బిలియన్ డాలర్ల సంపద ఉండొచ్చు. నీ టెస్లా కార్లు ఈ భూగోళమంతటా తిరుగుతుండొచ్చు. నీ స్పేస్‌ఎక్స్ రాకెట్లు భూకక్ష్యను దాటి చంద్రుడి పైకి, మార్స్ మీదకు, ఇంకా అవతలికి కూడా పోతే పోతుండొచ్చు. నువ్వు మాత్రం మనిషివే. చేతిలో ఐ–ఫోన్ ఉన్న ఒక మామూలు మనిషివి. బ్రిటన్ ప్రధానిలా నువ్వేమీ ఒక దేశాన్ని,లేదంటే బ్రిటన్ రాజులా ఓ 14 దేశాలను పరి పాలించటం లేదు...’’ అన్నారు డాడ్!
‘‘కానీ డాడ్, అభిప్రాయాలను ట్వీట్ చెయ్యటం తప్పెలా అవుతుంది?!’’ అన్నాను. ‘‘చెయ్, ట్వీట్ చెయ్. కానీ ట్విట్టర్ మాత్రమే నీది. బ్రిటన్ నీది కాదు. ఫ్రాన్స్ నీది కాదు. జర్మనీ నీది కాదు. నార్వే నీది కాదు. అసలు ఐరోపాలోనే ఏదీ నీది కాదు. నీదంటూ ఉంటే అమెరికా ఒక్కటే. అది కూడా అమెరికా మొత్తం కాదు, అమెరికాలో ఉండే ట్రంప్ మాత్రమే...’’ అన్నారు డాడ్ చాలా నెమ్మదిగా!
కోపాన్ని ఎంతగా అణచుకుంటేనో తప్ప ఆయన ఇంత నెమ్మదిగా మాట్లాడరు. స్కూల్‌కు వెళ్లనని నేను స్కూల్ బ్యాగ్‌ను విసిరికొట్టినప్పుడు కూడా ఆయన ఇంతగా కోపాన్ని అణచుకోలేదు. నా చెంప పగల గొట్టారు. కాలేజ్ నుండి నేను నేరుగా ఇంటికి రావటం లేదని తెలిసినప్పుడు కూడా ఇంతగా కోపాన్ని అణచుకోలేదు. లాగిపెట్టి చెంప చెళ్లుమనిపించారు. చెయ్యి చేసుకోలేనంత కోపం వచ్చినప్పుడే... ఆయనిలా నిశ్శబ్దంగా మాట్లాడతారు.
‘‘ఎలాన్, నీకు గుర్తుందా? నీ ఆరేళ్ల వయసులో నిన్ను మొదటిసారి బ్రిటన్ తీసుకెళ్లాను. ఆ దేశం నీకెంతో నచ్చింది. కేరింతలు కొట్టావు. నీ 30వ బర్త్‌డేని అక్కడే ఒక రాజభవంతిలో వారం రోజుల పాటు నీకై నువ్వే జరుపుకున్నావ్! నీకూ నాకూ మధ్య కూడా లేనంత అనుబంధం నీకు బ్రిటన్‌తో ఉంది. డాడ్ ‘దుష్టుడు’ అని లోకానికి నువ్వు చాటినప్పుడు కూడా నేను పట్టించుకోలేదు. కానీ, నాతో సమానంగా బ్రిటన్‌కు నువ్వు దుష్టత్వాన్ని ఆపాదిస్తుంటే పట్టనట్లు ఉండలేక పోతున్నాను..’’ అన్నారాయన!
‘‘అందుకేనా డాడ్, ‘ఎలాన్ ఒక పిచ్చివాడు, అతడిని తరిమికొట్టండి’ అని మీరు బ్రిటన్‌కు చెబుతున్నారు!’’ అన్నాను నవ్వుతూ. డాడ్ నవ్వలేదు. ‘‘లోపలేం జరిగిందో తెలియకుండా బయటి నుంచి ఎలా మాట్లాడతావ్? తెలిసినా అసలు మనమెందుకు మాట్లాడటం?’’ అన్నారు.
ఆశ్చర్యపోయాన్నేను! ఏళ్ల తర్వాత ‘మన’ అన్నారు డాడ్!! ఆయనకెప్పుడూ ‘నేను’, ‘నువ్వు’ అనటమే అలవాటు. మామ్‌తో కూడా అలానే అనేవారు. ‘‘ఎలాన్, బీ లైక్ ఎ బిజినెస్‌మేన్. దేశాలతో బిజినెస్ చెయ్యి. బిజినెస్ పోగొట్టుకునే పనులు చెయ్యకు. నీకు యాభై దాటి ఉండొచ్చు.
నాకింకా నువ్వు చిన్న పిల్లాడివే. నేను, మీ మామ్, నువ్వు, నీ తమ్ముడు, నీ చెల్లెలు కలిసి అమెజాన్ రెయిన్‌ఫారెస్టు టూర్‌కి వెళ్లిప్పుడు నీ వయసెంతో ఇప్పుడూ అంతే నా దృష్టిలో...’’ అన్నారు డాడ్! చప్పున చెంపను తడుముకున్నాను!
ఆయన చెయ్యి తాకితే ఎంతగా చుర్రు మంటుందో నాకు తెలుసు. అది ఎన్ని రెయిన్ ఫారెస్టుల వర్షానికైనా చల్లారని మంట!
Comments
Please login to add a commentAdd a comment