మాధవ్ శింగరాజు
కంపెనీలు వర్కర్‌ల మీద ఆధారపడి పనిచేయవు. ఇంఛార్జిల మీద వర్కర్‌లు ఆధారపడేలా చేసి చక్కటి ఫలితాలను సాధిస్తుంటాయి. ఎక్కడైనా చూడండి... ఇంఛార్జిలే, వర్కర్‌ల కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు. వర్కర్‌లలో పని చేయనిదెవరో కనిపెట్టడానికి సెలవులు కూడా వాడుకోకుండా శ్రమిస్తూ ఉంటారు. అయితే అంత శ్రమ అవసరం లేదంటాన్నేను!
దేనికైనా టెక్నిక్ ఉండాలి. పని చేయని వారెవరో వెతకటం మాని, పని చేస్తున్న వారెవరో నిఘా పెట్టి చూస్తే ఇంచార్జిల పనికి ప్రయోజనం చేకూరుతుంది, మరింత మెరుగైన ఫలితాలను తొలి త్రైమాసికంలోనే సాధించి యాజమాన్యానికి చూపించగలుగుతారు!
సభాపర్వంలో ధర్మరాజుకు నారదుడు పని ఎలా చేయించుకోవాలో బోధిస్తుంటాడు. నేర్పరులనే సేవకులుగా పెట్టుకున్నావా? వారిలో పని చేస్తున్న వారిని గమనిస్తున్నావా? వారి పట్ల ఉదారంగా ఉంటున్నావా? అని అడుగుతాడు.
పని చేయని వారిని కనిపెట్టటం వల్ల ఒరిగే ప్రయోజనం కన్నా, పని చేసే వారిని కనిపెట్టుకుని ఉండకపోవటం వల్ల జరిగే నష్టమే ఎక్కువని నారద ప్రబోధం.
పని చేయని వారి వల్ల సంస్థలకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ల పని కూడా మీద వేసుకుని చేయగల పనివాళ్లు పక్కనే అందు బాటులో ఉంటారు. వారానికి 70 గంటలైనా సరే, వాళ్లు అలా పని చేసుకుంటూ పోగలరు... ఇంఛార్జిలు కనుక వాళ్లకు అందరిముందూ చిన్న కాంప్లిమెంట్ ఇవ్వగలిగితే.
పని చేసే వాళ్లకు అందరిముందూ కాంప్లిమెంట్ ఇస్తే, పని చేయని వాళ్లు హర్ట్ అవుతారని చెప్పి, చాటుగా పిలిచి భుజం తట్టడం వల్ల ముందు తరాల సంస్థలకు మంచి ఇంఛార్జిలు తయారు అయితే అవొచ్చు. మంచి వర్కర్లు తయారుగా ఉండరు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేవారు మాత్రమే ఫైళ్లు పట్టుకుని ఇంటర్వ్యూలకొస్తారు.
అనుపమ్ మిట్టల్ ట్వీట్ ఒకటి చూశాను. షాదీ డాట్ కామ్ ఫౌండర్ అతడు. ‘‘70 గంటల పనికి భయపడుతున్న వారంతా 2025లో రిలాక్స్‌డ్ గా ఉండొచ్చు. ఏఐ మన ఉద్యోగాలన్నిటినీ ఊడబెరుక్కోబోతోంది. హ్యాపీ న్యూ ఇయర్’’ అని విష్ చేశాడు. శాడిస్ట్. మిట్టల్ ఫౌండర్ అయిపోయాడు కానీ... గొప్ప ఇంచార్జి కావలసినవాడు.
ఇంఛార్జి... ఫౌండర్‌లా ఉండాలి. ఇంకా చెప్పాలంటే గౌతమ్ అదానీలా ఉండాలి. ‘‘చేసే శక్తి, ఆసక్తి ఉన్న వాళ్లు... వద్దన్నా 70 గంటలు పని చేస్తారు. చేయనివ్వండి. ఒకటైతే నిజం. ఫ్యామిలీతో 8 గంటలు గడిపితే ఆ ఉక్కపోత భరించలేక జీవిత భాగస్వామి ఇంట్లోంచి పారిపోతుంది’’ అని పెద్దగా నవ్వుతారాయన.
భార్యాభర్తలిద్దరూ వాళ్ల వాళ్ల ఆఫీస్‌లలో 70 గంటలు పని చేసి వస్తే ఇద్దరిలో ఎవరూ ఇల్లొదిలి పారిపోయే సమస్యే ఉండదు. అయితే వాళ్లు ఆఫీస్ వదిలి పారిపోకుండా ఇంచార్జిలు చూసుకోవాలి.
మహా భారతంలో కర్ణుడు నాకు ఇష్టమైన క్యారెక్టర్. గొప్ప దాతృత్వం అతడిది. ఇంచార్జిలు కూడా ఎప్పుడైనా ఒకరోజు సెలవు ఇవ్వటానికి, హాఫ్ డే లీవు శాంక్షన్ చెయ్యటానికి కర్ణుడిలా గొప్ప దాతృత్వం ప్రదర్శిస్తే ఆఫీసంటే పడి చచ్చిపోని వర్కర్‌లు ఉంటారా?
వర్కర్‌లు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ‘వర్క్’ అంటే ఆఫీసు మరియు ఇంచార్జి. ‘లైఫ్’ అంటే భార్య మరియు పిల్లలు. (ఉద్యోగినులకైతే భర్త మరియు పిల్లలు). వర్క్‌ను లైఫ్, లైఫ్‌ను వర్క్ వాటికవే బ్యాలెన్స్ చేసుకుంటాయి కనుక వర్కర్‌లు పని కట్టుకుని లైఫ్‌ని, వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోనక్కర్లేదు. పనిలో మునిగి వుంటే చాలు.
ఎండ్ ఆఫ్ ది డే... ఇంచార్జిలు కంపెనీకి మంచి ఫలితాలను సాధించి చూపేలా పని చేయటం వర్కర్‌ల కనీస బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment