మాధవ్ శింగరాజు
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోదు. అవసరం పడిందని వెతకటానికి కనిపించకుండా పోయేదేమీ ఉండదు.
ఇల్లు అలాక్కాదు! అవసరమైనవి లేకున్నా పూట గడిచిపోతుంది కానీ, అనవసరమైనవి ఇంట్లో చేరిపోతుంటే చివరికి నడవటానికి కూడా దారి లేకుండా పోతుంది.
ప్రధానిగా ఉన్నప్పుడు నేను, బుష్రా బీబీ ఉన్న మా నివాస భవనం నిరంతరం గిఫ్టుల రూపంలో వచ్చి పడుతుండే విలువైన చెత్తతో నిండిపోతూ ఉండేది. డైమండ్ జ్యూయలరీ, రోలెక్స్ వాచీలు, షాండ్లియర్లు, చెయిర్‌లు, సోఫాలు, ఆర్ట్ పీస్‌లు... వాటిని ఉంచుకోలేం, పడేయలేం. జ్యూయలరీకి ఒక మెడ, వాచీకి ఒక చెయ్యే కదా ఉంటాయి. అన్నన్ని ఏం చేస్కోను?! ఆరు రోలెక్స్ లు, కిలోల కొద్దీ జ్యూయలరీ, లివింగ్ రూమ్‌ని అమాంతం మింగేసే భారీ కలప ఫర్నిచర్!
బుష్రా బీబీతో అన్నానొక రోజు, ‘‘బీబీ... మనింట్లో మనం వాడకుండా ఉండిపోయిన వస్తువులన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ ఏ మాయ వల్లనో కరెన్సీగా మారిపోతే ఎలా ఉంటుంది?!’’ అని.
ఆ మాటకు బుష్రా బీబీ ఎంతో ఆహ్లాదకరంగా నవ్వారు.
‘‘వాడని వస్తువులు కూడా ఉంటేనే కదా అది ఇల్లవుతుంది ఇమ్రాన్‌జీ...’’ అన్నారు.
ఆమె అలా నవ్వినప్పుడు బాబా ఫరీద్ దర్గాలోని ప్రశాంతత నన్నావరించినట్లౌతుంది. మేము తొలిసారి కలుసుకున్నది ఆ దర్గా ప్రాంగణంలోనే!
‘‘పోనీ ఇమ్రాన్‌జీ! మీరన్నట్లు ఇంట్లో వాడనివన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ కరెన్సీగా మారిపోతే మాత్రం... ‘ఇంతింత కరెన్సీ ఏంటి చెత్తలా కాలికీ చేతికీ తగులుతూ...’ అని అనకుండా ఉంటారా మీరు...’’ అన్నారు బుష్రా బీబీ నవ్వుతూ!
జైలు గదికి ఉన్నట్లే బుష్రా బీబీ నవ్వుకు ఇరుకును అలవాటు చేయించే ‘గతి తాత్విక’ గుణం ఏదో ఉన్నట్లుంది!
‘‘ఇమ్రాన్ జీ! మీకు బెయిల్ వచ్చిందట!
మీ లాయర్ వచ్చారు రండి...’’ అని నా సెల్ దగ్గరకు వచ్చి మరీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు అసద్ జావేద్. నేనున్న రావల్పిండి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆయన.
విజిటర్స్ రూమ్‌లో సల్మాన్ సఫ్దర్ నాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆయన చేతుల్లో బెయిలు పత్రాలు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని సఫ్దర్‌కి, నాకు, బుష్రాకు, జైలు సూపరింటెండెంట్‌కి, పాక్ ప్రధానికి, నా పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, ఇంకా... యావత్ ప్రపంచానికీ తెలుసు. గిఫ్టుగా వచ్చిన జ్యూయలరీ, రోలెక్స్ వాచీలను అమ్మేయగా జమ అయిన అమౌంట్‌కి సరిగా లెక్కలు చూపించలేదన్న కేసులో మాత్రమే నాకు వచ్చిన బెయిల్ అది.
నాపై ఇంకా 149 కేసులు ఉన్నాయి. మూడేళ్ల శిక్ష, ఏడేళ్ల శిక్ష, పదేళ్ల శిక్ష, పద్నాలుగేళ్ల శిక్ష పడిన కేసులు కూడా వాటిల్లో ఉన్నాయి. కేసులన్నిటినీ కలిపి ఒకేసారి బెయిల్ ఇస్తేనే నేను బయటికి వచ్చినట్లు!
గిఫ్టుల కేసులో నా భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది! బుష్రాను జనవరి 31న అరెస్టు చేసి, తొమ్మిది నెలల తర్వాత, నెల క్రితమే అక్టోబర్ 24న బెయిల్ మీద విడుదల చేశారు. ఇద్దరం ఉన్నది ఒకే జైలు. ఏడాది పైగా నేను జైల్లోనే ఉంటున్నా... నేను కఠిన కారాగార శిక్ష అనుభవించింది మాత్రం ఆ తొమ్మిది నెలలే. ఒక నిశ్శబ్దపు నిట్టూర్పుతో సఫ్దర్ వైపు చూశాను.
‘‘తనెలా ఉన్నారు సఫ్దర్‌జీ?’’ అని అడిగాను... బుష్రాను ఉద్దేశించి.
‘‘మీరెలా ఉన్నారని తను అడుగుతున్నారు ఇమ్రాన్‌జీ...’’ అన్నారు సఫ్దర్!!
Comments
Please login to add a commentAdd a comment