Prison sentence
-
అమెరికా విలేఖరికి 16 ఏళ్ల జైలు శిక్ష
యెకటేరిన్‌బర్గ్ (రష్యా): అమెరికా కోసం రహస్య పత్రాలు సేకరిస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన 32 ఏళ్ల రిపోర్టర్ ఇవాన్ గెర్‡్షకోవిచ్కు రష్యా న్యాయస్థానం 16 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని పూర్తిగా కల్పిత సాక్ష్యాలతో సృష్టించిన తప్పుడు కేసుగా అమెరికా అభివర్ణించింది. శుక్రవారం రష్యాలోని సెవెర్డ్లోవోస్క్ ప్రాంతీయ కోర్టు జడ్జి ఆండ్రీ మినియేవ్ ఈ తీర్పు చెప్పారు. తీర్పుకు ముందు నీవేమైనా చెప్పేది ఉందా? అని జడ్జి ప్రశ్నించగా లేదు అని ఇవాన్ సమాధానమిచ్చారు. ఇవాన్‌కు 18 ఏళ్ల శిక్ష విధించాలని ప్రభుత్వ లాయర్లువాదించగా జడ్జి 16 ఏళ్ల శిక్ష వేశారు. శిక్ష ఖరారుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘ జర్నలిస్ట్, అమెరికన్ పౌరుడు అయినందుకే ఇవాన్‌ను బంధించి జైలుపాలుచేశారు. ఐరాస కూడా ఇదే మాట చెప్పింది. అతడిని విడిపించేందుకు అమెరికా తన ప్రయత్నాలు ఇకమీదటా కొనసాగిస్తుంది. పాత్రికేయ వృత్తి నేరం కాబోదు’ అని అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా జర్నలిస్ట్‌ను రష్యా అరెస్ట్చేయడం ఇదే తొలిసారి. యురాల్వగోన్జవోడ్ సిటీలో రష్యా యుద్ధట్యాంకుల తయారీ, రిపేర్ల రహస్య సమాచారాన్ని ఇవాన్ సేకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడని ఆరోపిస్తూ 2023 మార్చి 29న ఇవాన్‌ను అరెస్ట్చేయడం తెల్సిందే. -
Glynn Simmons: 48 ఏళ్ల తర్వాత నిర్దోషిగా..
చేయని తప్పునకు శిక్ష అనుభవించడం, నిందలు మోయడం నిజంగా బాధాకరమే. అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన 70 సంవత్సరాల గ్లిన్ సైమన్స్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏ నేరమూ చేయకపోయినా ఏకంగా 48 సంవత్సరాల ఒక నెల 18 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచి్చంది. జీవితంలో విలువైన సమయం జైలుపాలయ్యింది. న్యాయం అతడి పక్షాన ఉండడంతో ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. అమెరికాలో చేయని తప్పునకు అత్యధిక కాలం శిక్ష అనుభవించింది గ్లిన్ సైమన్స్ అని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఎగ్జోజనరేషన్స్ అధికారులు చెప్పారు. 1974 డిసెంబర్లో ఒక్లహోమాలోని ఓ లిక్కర్ స్టోర్‌లో హత్య జరిగింది. ఇద్దరు దుండగులు లిక్కర్ స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. అప్పుడు గ్లిన్ సైమన్స్ వయసు 22 ఏళ్లు. సైమన్స్తోపాటు డాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ హత్య చేశారని పోలీసులు తేల్చారు. వారిద్దరికీ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. తాము ఈ నేరం చేయలేదని మొత్తుకున్నా అప్పట్లో ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు వారిని జైలుకు పంపించారు. డాన్ రాబర్ట్స్ 2008లో పెరోల్‌పై విడుదలయ్యాడు. కేసును మళ్లీ విచారించాలని సైమన్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును మళ్లీ విచారించారు. సైమన్స్ హత్య చేయలేదని గుర్తించారు. అతడిని జైలు నుంచి విడుదల చేస్తూ ఒక్లహోమా కంట్రీ జిల్లా కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. అంతేకాదు అతడికి 1.75 లక్షల డాలర్ల (రూ.1.45 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైమన్స్ మంగళవారం కారాగారం నుంచి బయటకు వచ్చాడు. తాను నేరం చేయలేదు కాబట్టి శిక్షను ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఎప్పటికైనా నిర్దోషిగా విడుదలవుతానన్న నమ్మకంతో ఉన్నానని సైమన్స్ చెప్పాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూకీకి మరో ఏడేళ్ల జైలు
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్ సాన్ సూకీ(77)కి మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో, వివిధ అభియోగాలపై ఇప్పటి వరకు ఆమెకు కోర్టులు విధించిన జైలు శిక్షల మొత్తం సమయం 33 ఏళ్లకు పెరిగింది. ఆమెపై మోపిన ఐదు అభియోగాలపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ హెలికాప్టర్‌ను మంత్రి ఒకరికి అద్దెకు ఇవ్వడంలో ఆమె నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఫిబ్రవరిలో సూకీ సారథ్యంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి, సూకీ సహా వేలాది మందిని మిలటరీ పాలకులు దిగ్బంధించిన విషయం తెలిసిందే. కోర్టులు ఆమెపై మోపిన ఆరోపణలపై రహ స్యంగా విచారణలు జరిపి, శిక్షలు ప్రకటిస్తున్నా యి. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ వట్టివేనంటూ సూకీ కొట్టిపారేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని వెంటనే విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత వారం సైనిక పాలకులను కోరింది. -
విప్లవారాధనకు వినాయకుడు
‘యాభై సంవత్సరాల కారాగార శిక్ష.... ఏకాంతవాసం... యాభై ఏళ్లు ఈ చీకటికొట్లోనే గడిచిపోతాయా! ఇలాంటి నరకం ఈ భూమ్మీద ఉంటుందా? అయితేనేం, బతకాలి...’ ఇవి ఒక యోధుడు రాసుకున్న తన కారాగార జ్ఞాపకాలలోని మాటలు.భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (1857) ఆయనకు ఆదర్శం. ఇటలీ ఏకీకరణ యోధుడు, విప్లవ విధాత గ్లుసెప్పె మేజనీ అంటే ఆరాధన. ఫ్రెంచ్ విప్లవం అంటే గురి. అమెరికన్ స్వాతంత్య్ర పోరాటమంటే గౌరవం. ఇంగ్లండ్ మీద కత్తికట్టిన ఐర్లాండ్ విప్లవకారులంటే ప్రేమ. ఇవన్నీ చిన్నతనంలోనే ఆయనను విప్లవ పంథాలోకి నడిపించాయి. ఆయనే వినాయక్ దామోదర్ సావర్కర్. ఆయన మీద ఒక్కటే ఆరోపణ. అయినప్పటికీ భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పంథాకీ, సంస్కరణోద్యమానికీ, అంటరాని తనం మీద పోరాటానికీ ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యమైనవి. ఇవన్నీ ఒక ఎత్తయితే చరిత్ర రచనలో సావర్కర్ కృషి మహోన్నతమైనది. ఆయన యోధుడు. సంస్కర్త. వక్త, రచయిత. వినాయక్ దామోదర్ సావర్కర్ (మే 28, 1883–ఫిబ్రవరి 26, 1966) భాగూర్‌లో పుట్టారు. ఇది నాటి బొంబాయి ప్రెసిడెన్సీలోని నాసిక్ సమీపంలో ఉంది. తండ్రి దామోదర్ పంత్. తల్లి రాధాబాయి. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అన్నగారి పేరు గణేశ్, తమ్ముడు నారాయణ్. సోదరి మెయినిబాయి. తల్లి ఆయన పదో ఏటనే కలరాతో కన్నుమూశారు. తల్లి కన్నుమూసిన ఆరేళ్లకే ప్లేగు సోకి తండ్రి తుదిశ్వాస విడిచారు. అన్నగారు గణేశ్ (బాబారావ్) సంరక్షణలోనే వినాయక్ దామోదర్, నారాయణ్ పెరిగారు. ఆ ఇద్దరు కూడా స్వాతంత్య్ర సమరయోధులే. అన్నదమ్ములు ముగ్గురు కూడా సాయుధ సమరంతోనే దేశానికి స్వాతంత్య్రం వస్తుందని నమ్మినవారే. సావర్కర్ ప్రాథమిక విద్య స్థానికంగానే శివాజీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆరో ఏటనే ఆయన వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నారు. గ్రంథపఠనం కూడా మొదలుపెట్టారు. ఆ వయసులోనే అంటే 1899లోనే సావర్కర్ ‘మిత్ర మేళా’ అన్న సంఘాన్ని స్థాపించారు. తరువాత పూనాలో ఉన్న ఫెర్గూసన్ కళాశాలలో1902లో చేరారు. అక్కడే ఆయన జాతీయ భావాలకు, ఆ భావాలతో నడిచే ఉద్యమాలకు దగ్గరయ్యారు. 1904లో రెండు వందల మంది సభ్యులతో మిత్రమేళా సమావేశం ఏర్పాటు చేశారాయన. ఆ సమావేశంలోనే మిత్ర మేళా పేరును అభినవ భారత్ అని మార్చారు. ఈ సంస్థ ఉద్దేశం సాయుధ విప్లవం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమివేయడమే. ఇంతలోనే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం పెల్లుబుకింది. అక్టోబర్ 7, 1905న సావర్కర్ పూనాలో విదేశీ వస్తు సముదాయాన్ని దగ్ధం చేశాడు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ దేశమంతటా రాజకీయ చైతన్యాన్ని నింపిన లాల్ పాల్ బాల్ అంటే సావర్కర్‌కు వీరాభిమానం. విదేశీ వస్తు దగ్ధకాండ దేశంలో తొలిసారి సావర్కర్ నిర్వహించారన్న వాదన ఉంది. నిజానికి అప్పటికే ఆయన విదేశీ వస్తువులను బహిష్కరించాలనీ, మన దేశంలో మన నేతకారులు నేసిన బట్టలే ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసి కళాశాల నుంచి బహిష్కరించారు. కొన్ని ఇబ్బందులు పెట్టిన తరువాత మొత్తానికి బిఎ డిగ్రీ ఇచ్చారు. అప్పుడే ఇంగ్లండ్‌లో బారెట్లా చదవాలనుకునే వారికి విద్యార్థి వేతనాల కోసం దరఖాస్తులు కోరారు శ్యామ్‌జీ కృష్ణవర్మ. ఆయన లండన్‌లో ఉన్న ప్రముఖ భారతీయుడు. ధనవంతుడు. భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతుగా, నిలిచి విప్లవయోధులకు ఆశ్రయం ఇస్తున్నారు. సావర్కర్ దరఖాస్తు చేశారు. అందులో, ‘స్వేచ్ఛాస్వాతంత్య్రాలే ఒక జాతికి ఉచ్ఛ్వాసనిశ్వాసాలని నేను భావిస్తాను. నా కౌమారం నుంచి యౌవనం వరకు నా దేశం కోల్పోయిన స్వాతంత్య్రం గురించి, ఆ స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించుకోవడం గురించే రేయింబవళ్లు యోచిస్తున్నాను’ అని రాశారని సావర్కర్ జీవితచరిత్ర (వీర్‌సావర్కర్)లో ధనంజయ్కీర్ నమోదు చేశారు. శ్యామ్‌జీ సాయంతోనే లండన్ చేరుకుని బారెట్లా కోసం గ్రేస్ ఇన్ లా కళాశాలలో 1906లో చేరారు. నివాసం ఇండియా హౌస్. ఇది పేరుకు భారతదేశం నుంచి చదువు కోసం ఇంగ్లండ్ వచ్చిన విద్యార్థులకు వసతిగృహం. వాస్తవంæ– భారత స్వాతంత్య్రమే లక్ష్యంగా సాగే విప్లవ కార్యకలాపాలకు ఇది కేంద్రం. దీనిని స్థాపించినవారే శ్యామ్‌జీ కృష్ణవర్మ. లండన్‌లోనే హైగేట్ ప్రాంతంలో ఉండేది. నిరంతరం పోలీసు నిఘా కూడా ఉండేది. అక్కడే ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపించారు సావర్కర్. ఇండియా హౌస్‌లో ప్రతి ఆదివారం సమావేశాలు జరిగేవి. పండుగలు, దేశభక్తుల ఉత్సవాలు నిర్వహించేవారు. ఇక రాజకీయ చర్చలు సరేసరి. 1909లో ‘ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్’ అచ్చయింది. దీనిని వెంటనే నిషేధించారు. 1906లో ఒక హిందూ పండుగ సందర్భంలోనే గాంధీజీని ఇండియా హౌస్‌కు ఆహ్వానించారు. అక్కడే సావర్కర్ గాంధీజీని తొలిసారి కలుసుకున్నారు. 1907లో ప్రథమ స్వాతంత్య్ర సమరం యాభయ్ ఏళ్ల సందర్భాన్ని సావర్కర్ ఇంగ్లండ్‌లో నిర్వహించారు. భారతీయ విద్యార్థులు ‘ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుల గౌరవార్ధం’ అని రాసిన బాడ్జీలను జేబులకు తగిలించుకున్నారు. ఏదో కారణంగా ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చారు. ఘర్షణకు కారణం శ్యామ్‌జీ కృష్ణవర్మ అన్న అనుమానంతో అరెస్టు చేయాలని చూశారు. ఆయన పారిస్ పారిపోయారు. దీనితో ఇండియా హౌస్ నిర్వహణ బాధ్యత సావర్కర్ మీద పడింది. అదే సమయంలో పూనాలో అభినవ్ భారత్ సభ్యుడు అనంత్ లక్ష్మణ్ కన్హారే ఆ జిల్లా కలెక్టర్ ఏఎంటీæ జాక్సన్‌ను ఒక నాటకశాలలో చంపాడు. ఎందుకంటే అతడు అభినవ్ భారత్‌ను అణచివేయడమే ధ్యేయంగా ఆ సంస్థ సభ్యుల మీద తీవ్రమైన అణచివేత చర్యలు చేపట్టాడు. పంజాబ్ నుంచి ఇండియా హౌస్‌కు వచ్చి, సావర్కర్ ప్రభావం పడినవాడు మదన్‌లాల్ థింగ్రా. ఇతడు కర్జన్‌ను చంపాలనుకుని కర్జన్వైలీని హత్య చేశాడు. థింగ్రాకు మరణశిక్ష విధించారు. అక్కడ ఉన్న భారతీయులు కూడా థింగ్రా చర్యను ఖండించారు. కానీ సావర్కర్ సమర్థించాడు. తరువాత సావర్కర్‌కు కూడా లండన్‌లో ఉండడం సమస్యగా మారింది. దీనితో ఆయన కూడా 1910 జనవరిలో పారిస్ వెళ్లిపోయారు. అక్కడ మేడమ్ కామా ఆశ్రయంలో ఉన్నారు. బారెట్లా పూర్తయింది. కానీ ఆ లా కాలేజీ పట్టా ఇవ్వడానికి అంగీకరించలేదు. కారణం– సావర్కర్ బ్రిటిష్ వ్యతిరేకత. రాజకీయోద్యమాలకు దూరంగా ఉంటానని రాసి ఇస్తే పట్టా ఇస్తామని అధికారులు చెప్పారు. సావర్కర్ తిరస్కరించారు. అప్పుడే భారత్‌లో వైస్రాయ్‌ని చంపడానికి బాంబుదాడి జరిగింది. ఇందులో సావర్కర్ సోదరుడు నారాయణ్‌ను అరెస్టు చేశారు. అలాగే లండన్‌లో ఉన్న సావర్కర్‌ను వెంటనే అరెస్టు చేయవలసిందని టెలిగ్రామ్ ఆదేశాలు వెళ్లాయి. లండన్‌లో సావర్కర్ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 1910 మార్చిలో ఆయన ఇంగ్లండ్ రాగానే పోలీసులు అరెస్టు చేసి బ్రిక్స్టన్ జైలుకు తరలించారు. కొంత తర్జనభర్జన తరువాత ఆయనను భారతదేశంలోనే విచారించాలని భావించారు. దీనితో ఎస్ఎస్ మోరియా అన్న నౌకలో జూలై 1న ఎక్కించారు. ఆ నౌక మార్సెల్స్ రాగానే సావర్కర్ తప్పించుకుని ఫ్రెంచ్ భూభాగం మీద అడుగు పెట్టారు. అయినా ఇంగ్లండ్ పోలీసులు మళ్లీ పట్టుకుని తీసుకుపోయారు. ఈ చర్యను సావర్కర్ అభిమానులు అంతర్జాతీయ కోర్టులో సవాలు చేశారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో బొంబాయి తీసుకువచ్చారు. విచారణలో రెండు జీవితకాలాల శిక్ష పడింది. పైగా ప్రవాసం. ఇది అప్పట్లో అంతర్జాతీయ వార్త అయింది. ఒక మనిషికి యాభై ఏళ్లు శిక్ష ఏమిటన్నదే ప్రశ్న. అండమాన్‌జైలులో 1911 నుంచి 1921 వరకు ఉన్నారు. కఠిన కారాగార శిక్ష అనుభవించారు. నూనె గానుగను కూడా తిప్పించారు. అలాంటి దారుణమైన శిక్షలు అక్కడ ఉన్న అనేక మంది స్వాతంత్య్రం సమరయోధులు అనుభవించారు. అండమాన్‌లో ఉండగానే ‘హిందూయిజం’ పుస్తకం రాశారు. విఠల్‌భాయి పటేల్, గాంధీ వినతి మేరకు సావర్కర్‌ను బొంబాయి ప్రెసిడెన్సీకి తీసుకువచ్చారు. 1924 వరకు రత్నగిరి, యరవాడ జైళ్లలో ఉంచిన తరువాత విడుదల చేశారు. అయితే ఆయన రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదన్న షరతుతోనే ఇది జరిగింది. అలాగే రత్నగిరి జిల్లా దాటి బయటకు రాకూడదు. కానీ ఆయన తనను విడుదల చేయవలసిందిగా నాలుగు సార్లు బ్రిటిష్ అధికారులకు విన్నవించాడు. అందులో క్షమాపణలు కోరారు. కానీ ఆ విన్నపాలు ఆయనకు ఉపయోగపడలేదు. రత్నగిరికే పరిమితమై స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా సావర్కర్ సంఘ సంస్కరణోద్యమాన్ని చేపట్టారు. అంటరానివారికి ఆలయ ప్రవేశం చేయించారాయన. అంటరానితనం మీద పోరాడారు. అందుకే సావర్కర్ వి«ధానాలను కొన్నింటిని వ్యతిరేకిస్తూనే, ఆయన సంస్కరణోద్యమానికి చేసిన సేవను అంబేడ్కర్ కూడా శ్లాఘించారు. స్వాతంత్య్రం పోరాటంలో గాంధీజీ మార్గాన్ని సావర్కర్ పూర్తిగా వ్యతిరేకించారు. హిందుత్వ ప్రాతిపదికగా ఉద్యమాలు, రాజకీయాలు నడవాలని ఆశించారు. అసలు హిందువులు సైన్యంలో చేరి సైనిక శిక్షణ తీసుకుని బ్రిటిష్ జాతి మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రబోధించారు. ఆయనను 1937లో హిందూ మహాసభకు అధ్యక్షుడిని చేశారు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లిం లీగ్, కమ్యూనిస్టులతో పాటు సావర్కర్ కూడా వ్యతిరేకించారు. సావర్కర్ రచయితగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయనకు ఆదర్శం మేజినీ. అందుకే మేజినీ జీవితచరిత్ర సావర్కర్ రాశారు. ఆయన అటు చరిత్ర రచనతో పాటు, సృజనాత్మక రచనలు కూడా చేశారు. ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ పుస్తకం అజరామరమైనది. ఇది 1909లో అచ్చయింది. కానీ ఈ రచనకు కావలసిన సమాచారమంతా అంతకు ఏడేళ్ల క్రితమే సేకరించి పెట్టుకున్నారు. అంటే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగిన దాదాపు అరవై ఏళ్ల తరువాత. అప్పటికి ఆ మహా సంగ్రామాన్ని చూసినవారు కొందరు బతికి ఉన్నారు. ఆ ప్రదేశాలు తిరిగి, అలాంటి వారితో మాట్లాడి సావర్కర్ ఈ పుస్తకం రచించారు. ఆయన మరాఠీలో రచించగా, ఐసీఎస్ చదవడానికి ఇంగ్లండ్ వచ్చిన కొంతమంది యువకులు ఆంగ్లంలోకి అనువదించారు. ఆ పుస్తకాన్ని మేడం కామా అచ్చు వేయించారు. కానీ వెంటనే నిషేధానికి గురైంది. దీనితో చాలా జాగ్రత్తగా భారత్‌కు చేర్చారు. ఇది కాకుండా హింద్ పద్పద షాహి మరొక పుస్తకం. ఇందులో మరాఠీ ఔన్నత్యం గురించి ఎక్కువగా వర్ణించారాయన. సావర్కర్ మీద దు్రçష్పచారం చేసినట్టుగా ఆయన కాలాన్ని వెనక్కి తిప్పాలని తపన పడినవాడు కాదు. లొంగిపోవడం ఆయన నైజం కాదు. అదొక వ్యూహమనిపిస్తుంది.. కారాగారం నుంచి వచ్చాక రత్నగిరి జిల్లాలో సావర్కర్ చేసిన సామాజిక ఉద్యమం ఇందుకు నిదర్శనం.ఆయన హిందుత్వను నమ్మడం నిజం. కానీ భారత రాజకీయాలు, ఉద్యమాలు భారతీయ విలువల ఆధారంగా జరగాలని ఆయన కోరుకున్నారు. కానీ అవసరమైనప్పుడు ముస్లిం లీగ్‌తో కలసి కూడా పనిచేశారు. సంస్కర్తగా ఆయన జీవితం ఉత్తేజకరమైనది. అభినవ భారత్ సంస్థ తరఫున ఆయన రష్యా, ఐర్లాండ్, ఈజిప్ట్, చైనా విప్లవకారులతో సంప్రతింపులు కూడా జరిపారు. ఆనాడు విశ్వవ్యాప్తంగా విప్లవ సిద్ధాంతంతో ప్రభావితమైన వారిలో సావర్కర్ ఒకరు. వీరందరికీ ఆదర్శం మేజని. సావర్కర్ జీవిత చరమాంకం విస్తుగొలుపుతుంది. 1948లో గాడ్సే గాంధీని హత్య చేస్తే ఆ హత్య కుట్రలో సావర్కర్ భాగస్వామి అని భారత ప్రభుత్వం ఆయనను బోను ఎక్కించింది. ఎందుకంటే గాడ్సే హిందూ మహాసభ సభ్యుడు. కానీ ఆ కేసులో సావర్కర్‌ను నిర్దోషిగా తేల్చారు. వీర్ సావర్కర్ తన మరణాన్ని ముందుకు తెచ్చుకున్నారు. 1963లో ఆయన భార్య యమున మరణించారు. 1966 ఫిబ్రవరిలో ఆయన ఒక్కసారిగా మందులు, ఆహారం, నీరు కూడా ఆపేశారు. ఆత్మార్పణ చేసుకున్నారు. - డా. గోపరాజు నారాయణరావు -
మిస్ టర్కీకి జైలుశిక్ష!
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ని అవమానించినందుకు ఆ దేశ మోడల్, మాజీ మిస్ టర్కీకి స్థానిక కోర్టు 14 నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం నిలుపుదల చేసింది. మెర్వ్ బుయ్క్సరక్ అనే ఈ 27 ఏళ్ల మోడల్ అధ్యక్షుడిని అవమానించేలా ఒక కావ్యాన్ని పోస్ట్ చేశారు. -
పోలీస్ కస్టడీకి భరత్
బంజారాహిల్స్: మద్యం సేవించిన మత్తులో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ యువతి మరణానికి కారకుడై జైలు శిక్ష అనుభవిస్తున్న సామ భరత్‌సింహారెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గురువారం భరత్‌సింహారెడ్డిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సమీపంలోని హుడా కాలనీలో కారు ప్రమాదంలో దేవి అనే యువతి మరణానికి కారకుడైన భరత్‌సింహారెడ్డిని 304 పార్ట్-2 సెక్షన్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మరింత సమాచారం రాబట్టే నిమిత్తం భరత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీ కోరుతూ ఐదు రోజులు కస్టడీకి అనుమతించింది. విచారణ అనంతరం సోమవారం ఉదయం ఆయనను తిరిగి జైలులో అప్పగించాల్సి ఉంటుంది. ఆ రోజు జరిగిన ఘటన వివరాలు, ఎవరెవరున్నారు, ఎప్పుడు బయల్దేరింది, డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా? ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునే నిమిత్తం పోలీసులు కస్టడీ కోరారు. -
ఆరుగురు పోకిరీలకు జైలు
సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై, మార్కెట్లో, సెల్‌ఫోన్ ద్వారా మహిళలు, యువతుల్ని వేధిస్తూ నగర షీ-టీమ్స్‌కు చిక్కిన ఆరుగురు పోకిరీలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా గురువారం తెలిపారు. వీటి లో కొన్ని ఉదంతాల్లో కేసు నమోదుకు బాధితులు వెనుకాడినా పెట్టీ కేసులు నమోదు చేయడంతో పాటు సరైన ఆధారాలతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని ఆమె పేర్కొన్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముసీయుద్దీన్ ఆన్లైన్ వ్యాపార సంస్థకు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఓ మహిళ వస్తువులు డెలివరీ చేస్తున్న సమయంలో ఆమె ఫోన్ నెంబర్ నమోదు చేసుకున్నాడు. ఆపై చాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ తనతో స్నేహం చేయాల్సిందిగా వెంటపడ్డాడు. బాధితురాలు వాట్సాప్ ద్వారా షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రెండు రోజుల జైలు పడింది. ఆజంపురకు చెందిన కె.నరేంద్ర మద్యం తాగి ఫలక్‌నుమ రైతు బజార్ వద్ద ఓ మహిళ వెంటపడి వేధిస్తున్నాడు. అక్కడే డెకాయ్ ఆపరేషన్‌లో ఉన్న షీ-టీమ్స్ ఈ తతంగాన్ని వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు బాధితురాలి నుంచి వాం గ్మూలం రికార్డు చేశారు. వీటి ఆధారంగా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రెండు రోజుల జైలు, జరిమానా విధిం చారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌తో పాటు మరో వ్యక్తికి ఓ యువతితో స్నేహం ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకున్న ఇరువురూ కొన్ని ఫొటోలు, వీడియోల ఆధారంగా బెదిరిం పులకు దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన షీ-టీమ్స్ ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలించగా... ఒకరికి మూడు, మరొకరికి రెండు రోజుల శిక్ష పడింది. ఛత్రినాకకు చెందిన అరుణ్‌కుమార్ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడి కుమార్తె వెంటపడటం ప్రారంభిం చాడు. స్థానిక పోలీసుస్టేషన్లో కౌన్సిలింగ్ చేసినా, ఇరువురి పెద్దలూ మందలించినా తన పంథా మార్చుకోలేదు. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి షీ-టీమ్స్‌కు ఫిర్యా దు చేయడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఇతడికి రెండు రోజుల జైలు, జరిమానా విధించారు. గోల్నాక ప్రాంతానికి చెందిన రవికాంత్ గతంలో ఓ యువతితో స్నేహం చేశాడు. ఆమె తండ్రి చదువుపై దృష్టిపెట్టమని మందలించడంతో రవికి దూరంగా ఉంటోంది. దీంతో యువతిపై కక్షపెంచుకున్న నింది తుడు ఆమె తన ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో ఆమె సోదరికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఫోన్‌ను తన మాజీ స్నేహితురాలికి ఇవ్వమని బెదిరిం పులకు దిగాడు. ఫేస్బుక్ ద్వారానూ బెదిరింపులు ప్రారంభించడంతో విష యం షీ-టీమ్స్‌కు చేరి అరెస్టయ్యాడు. న్యాయస్థానం రవికి రెండు రోజుల జైలు, జరిమానా విధించింది. ఈ ఆరుగురు పోకిరీలను డీఎస్పీ డి.కవిత నేతృత్వంలోని షీ-టీమ్స్ బృందాలు పట్టుకున్నామని స్వాతిలక్రా పేర్కొన్నారు. -
జైలు నుంచి వచ్చిన రెండు రోజులకే...
కుల్కచర్ల : అదనపు కట్నం కేసులో ఆరునెలలు జైలు శిక్ష అనుభవించి రెండు రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం చాకల్‌పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దబావి శేఖర్ (24)కు గండేడ్ మండలం దేశాయిపల్లికి చెందిన రాణికి గతేడాది వివాహం జరిగింది. అదనపు కట్నం వేధింపుల కారణంగా వివాహం జరిగిన మూడు నెలలకే రాణి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్యకు భర్త శేఖర్, అత్తమామలే కారణమని మృతురాలి తండ్రి నారాయణ అప్పట్లో పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శేఖర్‌తో పాటు అతడి తండ్రి యాదయ్య, తల్లి మంగమ్మలను రిమాండ్‌కు పంపారు. తల్లిదండ్రులకు నెల రోజుల కిందట, శేఖర్‌కు ఏప్రిల్ 30న బెయిల్ రావడంతో గ్రామానికి వచ్చి రెండు రోజులున్నాడు. భార్య మృతి చెందడం.. తల్లిదండ్రులు జైలుకు పోవడం.. భార్య ఇంటి నుంచి బెదిరింపులు రావడంతో మనస్తాపం చెందిన శేఖర్ సోమవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగాడు. విషయాన్ని గమనిం చిన కుటుంబ సభ్యులు శేఖర్‌ను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. -
‘నా భ ర్తను విడిపించండి’
చేయని తప్పునకు అబుదాబిలో జైలు శిక్ష పోలీసులకు విన్నవించిన మహిళ మెట్పల్లి : చేయని తప్పుకు అబుదాబి జైలులో రెండేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న తన భర్తను విడిపించాలని కోరుట్ల మండలం యూసుఫ్న గర్‌కు చెందిన గుగ్గిళ్ల రమాదేవి బుధవారం పోలీసులను అశ్రయించింది. ఆమె కథనం ప్రకారం.. పట్టణంలోని యూసుఫ్‌నగర్‌కు చెందిన గుగిళ్ల నరేష్‌కు అబుదాబిలో ఉండే అతని మిత్రుడు, ఇబ్రహీంపట్నం మండలం డబ్బాకు చెందిన తోకల జాన్ రెండేళ్ల క్రితం విజిట్ వీసా పంపాడు. అబుదాబికి వచ్చేటప్పుడు జాఫర్ అనేవ్యక్తి మందుల ప్యాకెట్ ఇస్తాడని, తీసుకుని రమ్మన్నాడు. అబుదాబి ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసులు ప్యాకెట్‌ను పరిశీలించి మోతాదుకు మించి మత్తు ఉందన్న కారణంతో నరేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఉపాధి చూపుతానని పిలిచి తన భర్తను కటకటాల పాల్జేసిన జాన్ స్వగ్రామానికి వచ్చాడని పేర్కొంది. తన భర్తను విడిపించి జాన్‌తోపాటు, జాఫర్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. -
సీఎం జాప్యం.. అధికారులకు శాపం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకానికి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల(ఏఎస్ఓ) సీనియారిటీ జాబితాను ఆమోదించడంలో ముఖ్యమంత్రికి గతేడాది నవంబర్ నుంచి తీరిక లేకుండా పోయింది. ఫలితంగా కోర్టు ధిక్కార నేరంగా పరిగణిస్తూ హైకోర్టు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు పీవీ రమేశ్, లింగరాజు పాణిగ్రాహికి రూ.2,000 చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాను నాలుగు వారాల్లోగా చెల్లించాలని, లేదంటే వారం రోజులపాటు జైలు శిక్ష విధిస్తామని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. సచివాలయంలో పనిచేసే డెరైక్ట్ రిక్రూట్మెంట్ ఏఎస్ఓల సీనియారిటీ జాబితాను ఆమోదించడంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సచివాలయంలో పనిచేసే 141 మంది ఏఎస్ఓల సీనియారిటీ జాబితా ప్రకారం వారికి పదోన్నతులు కల్పించాలని 2012లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏఎస్ఓలు రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కోర్టు ధిక్కార నేరం కింద పరిగణిస్తూ హైకోర్టు ఈ నెల 12న తీర్పునిచ్చింది. ఇందుకుగాను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ముఖ్య కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహికి రూ.2,000 చొప్పున జరిమానా విధించింది. వాస్తవానికి లింగరాజు పాణిగ్రాహి గతేడాది అక్టోబర్‌లోనే ఏఎస్ఓల సీనియారిటీ జాబితాను రూపొందించారు. సీఎం ఆమోదం కోసం నవంబర్‌లో పంపించారు. చంద్రబాబు సంబంధిత ఫైలును చూడకుండా పక్కన పెట్టారు. అప్పుడే స్పందించి ఉంటే ఐఏఎస్‌లకు శిక్ష తప్పేది. -
ఎవరు ఆ ఐఏఎస్ అధికారి!
ఆవిన్ పాల కల్తీ వ్యవహారం ఉన్నత స్థాయి అధికారుల మెడకు బిగిసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఓ ఐఏఎస్ అధికారి నిర్బంధం, అవినీతితో కల్తీ సాగుతున్నట్టుగా ఆ కేసులో పట్టుబడ్డ అన్నాడీఎంకే మాజీ నాయకుడు వైద్యనాథన్ ఆరోపించారు. తమ పార్టీ అధినేత్రి జయలలితకు ఆ ఐఏఎస్ అధికారి బండారాన్ని వివరిస్తూ వైద్యనాథన్ లేఖరాసి ఉండడంతో ఆ అధికారి ఎవరన్న చర్చ బయలుదేరి ఉన్నది. సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆవిన్ పాల ప్యాకెట్లలో సాగుతున్న కల్తీ గుట్టు గత ఏడాది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పాల ట్యాంకర్ల ఒప్పందదారుడు, అన్నాడీఎంకే నాయకుడు వైద్యనాథన్ అరెస్టు అయ్యారు. ఆయన అరెస్టుతో పార్టీ నుంచి ఆయనకు ఉద్వాసన పలుకుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చర్యలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ రాకెట్ వెనుక ఉన్న ఏ ఒక్కర్నీ ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే విధంగా విచారణ సాగుతూ వస్తోంది. ఈకేసులో నాలుగు నెలలకుపైగా కారాగార వాసాన్ని అనుభవిస్తూ వస్తున్న వైద్యనాథన్ బెయిల్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారని, ఉన్నత స్థాయిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి, ఆయన అల్లుడు నిర్బంధ, అవినీతితోనే పాల కల్తీ సాగుతూ వస్తోందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వైద్యనాథన్ లేఖ రాసి ఉన్నారు. కడలూరు జైలు నుంచి ఆయన ఈ లేఖను పంపించడం గమనార్హం. ఎవరు ఆ అధికారి ఆవిన్‌కల్తీలో కీలక పాత్రదారుడిగా ప్రచారంలో ఉన్న ఆ ఐఏఎస్ అధికారి ఎవరన్న చర్చ బయలు దేరింది. వైద్యనాథన్‌ను శుక్రవారం విల్లుపురం కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. రిమాండ్ పొడిగింపు ఆదేశాలతో జైలుకు వెళ్తూ, తాను రాసిన లేఖ గురించి మీడియా ముందు కుండబద్దలు కొట్టి వెళ్లారు. ఆవిన్ పాల సరఫరాకు సంబంధించి 70 రకాల ఆంక్షలు అమల్లో ఉండేవని, తాను, కొందరు ఒప్పందదారులు కలిసి కోర్టుకు వెళ్లడంతో కొన్ని సవరించడం జరిగిందన్నారు. గతంలో ఉత్తరాదికి చెందిన ఒకే వ్యక్తికి ఒప్పందాలు దక్కేవని, అయితే, ప్రస్తుతం 47 మంది మధ్యవర్తులతో కలిసి తాను సరఫరా ఒప్పందాలు దక్కించుకున్నట్టు వివరించారు. గతంలో సాగిన కల్తీ వ్యవహారాన్ని ఆ ఐఏఎస్ అధికారి కొనసాగించే విధంగా నిర్బంధించారని ఆరోపించారు. ఆ ఐఏఎస్ ఎవరన్న విషయాన్ని జయలలితకు రాసిన లేఖలో తెలియజేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో నేరం నిరూపితమయితే తనకు మహా అంటే ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని, ఈ కేసులో అరెస్టయిన వారికి 60 రోజుల్లో బెయిల్ రావాల్సి ఉందన్నారు. అయితే, 130 రోజులైనా తనకు బెయిల్ రావడం లేదని, తనకు బెయిల్రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, తనకు న్యాయం చేయాలని జయలలితకు రాసిన లేఖలో వైద్యనాథన్ విజ్ఞప్తిచేసి ఉన్నారు. -
యాసిడ్ దాడి కేసులో... మహిళకు ఐదేళ్ల జైలు
ఖమ్మం లీగల్: యాసిడ్ దాడి కేసులో ఓ మహిళకు కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను పై కోర్టు ఖరారు చేసింది. దీనికి సంబంధించి, ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం... ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిళ్ళగూడెంలోని అపార్ట్మెంట్లో లక్ష్మీమాధురి నివసిస్తోంది. ఆమె వద్దకు బంధువైన కొదుమూరి లక్ష్మీఅనూష వచ్చింది. తాను చేసుకోవాలనుకున్న వ్యక్తికి లక్ష్మీమాధురి భార్య కాబోతోందన్న సమాచారాన్ని లక్ష్మీఅనూష తట్టుకోలేకపోయింది. ఆమె హత్యకు పథకం రూపొందించింది. 2011 జూన్ 20వ తేదీ అర్ధరాత్రి లక్ష్మీమాధురిపై ముఖంపై యాసిడ్ పోసింది. ఈ దాడిలో లక్ష్మీమాధురి తీవ్రంగా గాయపడింది. ఆమె ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు లక్ష్మీఅనూషను అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన అప్పటి ఖమ్మం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సుశీల్‌కుమార్ పాత్రుడు.. నిందితురాలైన లక్ష్మీఅనూషకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రెండువేల రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో నిందితురాలు అప్పీలు దాఖలు చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి ఐ.రమేష్.. కింది కోర్టు విధించిన శిక్షను ధ్రువీకరిస్తూ గురువారం తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.నాగేశ్వరరావు వాదించారు. ఆయనకు లైజన్ ఆఫీసర్లు రాజారావు, మోహన్‌రావు, హోంగార్డు యూసుఫ్ సహకరించారు. -
‘రోకో’ అంటే ఇక జైలే
బిల్లుకు పంజాబ్ కేబినెట్ ఆమోదం, వచ్చే వారమే అసెంబ్లీకి చండీగఢ్: ఆందోళనల పేరుతో రైళ్లను, రోడ్లపై వాహనాలను అడ్డుకుంటే ఇకపై జైలుశిక్ష, జరిమానా తప్పదని పంజాబ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రైళ్లను, రోడ్లపై వాహనాలను అడ్డుకుని ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే, ఏడాది వరకూ జైలుశిక్ష, రూ. లక్ష వరకూ జరిమానా విధించేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుంది. ‘ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంస నివారణ బిల్లు-2014‘ పేరుతో ఈ బిల్లును రూపొందించారు. పేలుడు పదార్థాలతో విధ్వంసానికి, నష్టానికి పాల్పడితే రెండేళ్లవరకూ జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధించాలని, బెయిల్‌కు అవకాశంలేని కేసుగా పరిగణించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇటీవల పెరిగిన అరాచక సంఘటనలను అరికట్టేందుకు ఈ బిల్లును రూపొందించామని బాదల్ ప్రభుత్వం చెబుతుండగా, ‘ఇది నిరంకుశమని, పూర్తి ప్రజావ్యతిరేకమ‘ని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజల నిరసనలు, ఆందోళనల అణచివేతకే ఈ చట్టం తెస్తున్నారని విమర్శించింది.