
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్ సాన్ సూకీ(77)కి మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో, వివిధ అభియోగాలపై ఇప్పటి వరకు ఆమెకు కోర్టులు విధించిన జైలు శిక్షల మొత్తం సమయం 33 ఏళ్లకు పెరిగింది. ఆమెపై మోపిన ఐదు అభియోగాలపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ హెలికాప్టర్‌ను మంత్రి ఒకరికి అద్దెకు ఇవ్వడంలో ఆమె నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
2021 ఫిబ్రవరిలో సూకీ సారథ్యంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి, సూకీ సహా వేలాది మందిని మిలటరీ పాలకులు దిగ్బంధించిన విషయం తెలిసిందే. కోర్టులు ఆమెపై మోపిన ఆరోపణలపై రహ స్యంగా విచారణలు జరిపి, శిక్షలు ప్రకటిస్తున్నా యి. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ వట్టివేనంటూ సూకీ కొట్టిపారేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని వెంటనే విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత వారం సైనిక పాలకులను కోరింది.