
బ్యాంకాక్: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మయన్మార్ మాజీ ప్రధాని ఆంగ్‌సాన్ సూకీకి మిలటరీ ప్రభుత్వం సోమవారం విచారణ ఆరంభించింది. ఇప్పటికే సూకీపై పలు ఆరోపణలతో ప్రభుత్వం ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2020 ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి మంచి మెజార్టీ వచ్చింది. అయితే ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మిలటరీ జుంటా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటినుంచి ఆమె జైల్లోనే ఉన్నారు.
మిలటరీ చర్యను దేశీయంగా పలువురు వ్యతిరేకించారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి సూకీపై జుంటా పలు కేసులు పెడతూనే ఉంది. అయితే ఇవన్నీ నిరాధారాలని ఆమె పార్టీ కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా ఉండేందుకే జుంటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. తాజా కేసులో సూకీతో పాటు మాజీ అధ్యక్షుడు విన్ మైఇంట్, మాజీ మంత్రి మిన్ తు సహ నిందితులుగా ఉన్నారు. కేసులో ఆరోపణలు రుజువైతే సూకీ పార్టీ రద్దు చేసేందుకు అవకాశాలున్నాయి.