Aung San Suu Kyi
-
అంగ్ సాన్ సూకీ ఇంటి కథ
యాంగూన్: తమ దేశంలో ప్రజాస్వామ్యం, పౌర ప్రభుత్వం సాధన కోసం పోరాడి ఏళ్లకు ఏళ్లు గృహనిర్బంధంలో గడిపిన మయన్మార్ నాయకురాలు అంగ్ సాన్ సూకీకి చెందిన నివాసం మూడోసారి వేలంలో వెళ్లింది. అయినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత వేలంపాటతో పోలిస్తే ఆసారి కాస్తంత తక్కువగా రూ.1,231 కోట్లకు ఎవరైనా దీనిని కొనుగోలు చేయొచ్చని కామాయుత్ జిల్లా కోర్టు అధికారిణి వేలంపాటను మొదలెట్టినా ఎవ్వరూ ముందుకు రాలేదు. మూడేళ్లుగా సైనిక ప్రభుత్వం దిగ్భందంలో దేశం కల్లోలితంగా మారిన కారణంగా అనిశ్చితిలో ఇంతటి డబ్బు కుమ్మరించేందుకు ఎవరూ సాహసించట్లేరని మీడియాలో వార్తలొచ్చాయి.ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం యాంగూన్ సిటీలోని బహాన్ టౌన్షిప్లో ఇన్యా సరస్సు ఒడ్డున చుట్టూ పచ్చికతో తెలుపు వర్ణంలో హుందాగా కనిపించే ఈ ‘54 యూనివర్సిటీ అవెన్యూ’భవనానికి ఘన చరిత్రే ఉంది. 1953లో ఆంగ్ సాంగ్ సూకీ తన సోదరులు, తల్లితో కలిసి ఈ విల్లాలోకి మకాం మార్చారు. అప్పట్నుంచీ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ఇంట్లో ఎవరూ లేరు. సైనిక పాలన అంతానికి పోరాటం ఇక్కడే మొదలెట్టారు. అహింసా ఉద్యమానికి ఇక్కడి నుంచే ఎన్నో వ్యూహరచనలు చేశారు. తదనంతర కాలంలో సైనిక ప్రభుత్వం సూకీని ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచింది. ఏకంగా 15 సంవత్సరాలకుపైగా ఆమె ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉండిపోయారు. తర్వాత సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి సాధారణ ఎన్నికలు నిర్వహించాక అంగ్ సాన్ ఘన విజయం సాధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. సూకీ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగినప్పుడూ ఈ ఇంట్లోనే ఉన్నారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్సహా ఎందరో ప్రపంచ నేతలు అంగ్‌సాన్‌ను ఈ ఇంట్లోనే భేటీ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడూ ఆమె ఈ ఇంట్లోనే ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిౖకైన అంగ్ ప్రభుత్వాన్ని జుంటా సైన్యం 2021 ఫిబ్రవరిలో కూలదోసింది. ఆంగ్ ప్రభుత్వ పాలనలో పలు రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఈమెపై ఎన్నో రకాల కేసులు నమోదుచేసి ఏకంగా 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం తెల్సిందే.కోర్టులో వారసత్వ పోరురెండెకరాల స్థలంలో నిర్మించిన ఈ విల్లాపై వారసత్వంగా తనకూ హక్కు ఉంటుందని అంగ్‌సాన్ సూకీ అన్నయ్య అంగ్ సాన్ హో 2000 సంవత్సరంలో కోర్టుకెక్కారు. తన వాటా దక్కేలా చేయాలని యాంగూన్ హైకోర్టులో దావా వేశారు. అయితే ఈ దావా వెనుక జుంటా సైనికపాలకుల కుట్ర దాగుందని మీడియాలో వార్తలొచ్చాయి. హో ద్వారా సగం వాటా కొనేసి తర్వాత పూర్తి హక్కును దక్కించుకుని చిట్టచివరకు సూకీ జ్ఞాపకాలు జనం మదిలో లేకుండా దీనిని కూల్చేయాలని సైన్యం కుట్ర పన్నిందని అమెరికా మీడియాలో అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఈ భవనాన్ని జాతీయ స్మారకంగా మార్చాలని విపక్ష ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఆఫ్ మయన్మార్’ డిమాండ్ చేసింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. చట్టప్రకారం అన్నా చెల్లెళ్లకు సమాన వాటా ఉంటుందని ఇంటిని వేలంవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో గత ఏడాది మార్చి 20న తొలిసారి, ఆగస్ట్ 15న రెండోసారి వేలంవేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. -
ఆత్మీయతను పంచిన బర్మా హౌజ్!
దేశ రాజకీయాలను అనుసరించేవాళ్లకు న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ అనగానే అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అని గుర్తొస్తుంది.అయితే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అక్కడ కార్యకలాపాలు నెరిపిన అనంతరం ఆ పార్టీ అక్కడినుంచి కొత్త చిరునామాకు మారడంతో ఇది వార్తల్లో నిలిచింది. కానీ దానికంటే ముందు ఆ చిరునామాను ‘బర్మా హౌజ్’ అనేవారని చాలామందికి తెలియదు. అప్పుడు అది భారత్‌లో బర్మా (మయన్మార్) రాయబారి ఇల్లుగా ఉండేది. ఆమె భర్త సాక్షాత్తూ బర్మా జాతిపిత; ఆమె కూతురు తర్వాత్తర్వాత ఆ దేశ గొప్ప నాయకురాలిగా ఎదిగిన ఆంగ్ సూన్ సూ కీ. అందుకే ఆ ఇంట్లో బర్మా వాతావరణం, వాళ్ల ఆత్మీయతలు వెల్లివిరిసేవి.న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ చిరునామా గురించి మీకు తెలుసా? సుమారుగా యాభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉండేది. ఈ మధ్యే మారిపోయిందనుకోండి! అంతకంటే ముందు దీని పేరు ‘బర్మా హౌజ్’. బర్మా (తర్వాత మయన్మార్‌గా పేరు మారింది) దేశపు రాయబారి నివాస స్థానం అది. ‘24, అక్బర్ రోడ్’ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కాక మునుపు ఈ ఇంట్లో ‘డా ఖిన్ కీ’ ఉండే వారు. ఆమె బర్మా స్వాతంత్య్ర సమర యోధుడు ఆంగ్ సాన్ (బర్మా జాతిపితగా పిలుస్తారు) పత్ని. భర్త హత్యకు గురైన తరువాత ఆ దేశపు మంత్రిగానూ ఆమె పనిచేశారు. 1960లో ఇండియాకు బర్మా రాయబారిగా నియమితులయ్యారు. ఢిల్లీకి వచ్చి, ఏడేళ్ల పాటు ‘24, అక్బర్ రోడ్’లో నివసించారు. డా ఖిన్ కీ నా తల్లిదండ్రులకు స్నేహితురాలైతే... ఆమె కూతురు ఆంగ్ సాన్ సూ కీ (మయన్మార్ ప్రతిపక్ష నేత; నోబెల్ శాంతి బహు మతి గ్రహీత) మా అక్క కిరణ్‌కు ఫ్రెండ్. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆంగ్ సాన్ సూ కీ, కిరణ్ కలిసి చదువుకున్నారు. 1964లో మా అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగ రీత్యా కాబూల్(అఫ్గానిస్తాన్ రాజధాని)కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, తన చివరి ఏడాది చదువు ఇంకా మిగిలి ఉండటంతో కిరణ్ ఆరు నెలల పాటు ‘24, అక్బర్ రోడ్’లో ఉండింది. డా ఖిన్ కీ పెద్ద పొడగరి ఏమీ కాదు. పైగా కొంచెం లావుగా ఉండేది. బర్మీస్ మహిళల్లో అధికుల మాదిరి లుంగీ కట్టుకునేది. వెంట్రుకలన్నీ పూలతో అలంకరించిన బన్‌లో ఒద్దికగా ఇమిడి పోయేవి. ఆమె ముఖంలో ఒక రకమైన దయ వ్యక్తమయ్యేది. ఎల్ల ప్పుడూ చిరునవ్వుతో కళకళలాడే మోము. మృదుభాషి!మొదటిసారి ఆమెను కలిసినప్పుడు నాకు ఆరేళ్లు ఉంటా యేమో! కొడుకు దగ్గర లేని కారణంగా ఆమె నన్ను తల్లిలా చూసుకునేది. డైనింగ్ రూమ్‌లో బోలెడంత ‘ఖో సూయి’ (చికెన్ నూడుల్స్) తినడం ఇప్పటికీ గుర్తుంది. అయితే నా ఫేవరెట్ మాత్రం ‘బ్లాక్ రైస్ పుడ్డింగ్’. బర్మీస్ ఇళ్లల్లో దీన్ని బాగా చేస్తారు. మిగతావాళ్ల మాటేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టమీ వంటకం. పిసరంత వదలకుండా తినే వాడినేమో... మిగిలిన వాళ్లు రుచి చూసేందుకు కూడా ఉండేది కాదనుకుంటా! అప్పట్లో చాలా బొద్దుగా ఉండేవాడిని. అందుకే సూ కీ నన్ను ‘రోలీ – పోలీ’ అని ఆటపట్టిస్తూండేది. చాలామంది దౌత్యవేత్తల మాదిరిగానే బర్మా రాయబారికి మెర్సిడెస్ కారు ఉండేది. వాళ్ల డ్రైవర్ పేరు ‘విల్సన్ ’. వారాంతాల్లో కుతుబ్ మీనార్ దాటుకుని అవతల ఉండే బౌద్ధారామాలకు ఆమె వెళ్లేది. అక్కడి భిక్షువులకు ఆహారం అందించేది. చాలాసార్లు నేనూ ఆమెతో వెళ్లేవాడిని. ఎప్పుడు మళ్లీ ‘24, అక్బర్ రోడ్’కు వస్తామా అని ఎదురుచూసేవాడిని. ఎందుకంటే... తిరిగి వచ్చిన తరువాతే భోజ నాల వడ్డన జరిగేది.ఆంగ్ సాన్ సూ కీ సుమారు ఏడేళ్లు భారత్‌లో ఉంది. ముందు జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లో, ఆ తరువాత లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదివింది. యుక్త వయసులో ఉండగానే రాజకీయాల్లో చేరాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకో గలనన్న నమ్మకం కూడా తనలో ఉండేది. సుమారు 18 ఏళ్ల వయసు ఉండేదేమో అప్పుడు. ఒకరోజు కిరణ్ పెన్సిల్ డ్రాయింగ్ గీసింది. దాని కింద, ‘కిరణ్ థాపర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్మా రావొచ్చు’అని రాసింది.దశాబ్దాల తరువాత నేను ‘డా ఖిన్ కీ’ని లండన్ లో కలిశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూతురు ఆంగ్ సాన్ సూ కీతో కలిసి నివసిస్తూండేది. అప్పుడామె వయస్సు ఎనభైల్లో ఉంది. నేను ముప్ఫైలలో ఉన్నాను. నన్ను చూడగానే... అనారోగ్యం, తన వయసు ఏదీ గుర్తు రాలేదు. బోసినవ్వుతో భళ్లున నవ్వుతూ, ‘వీడు సన్న బడ్డాడు’ అంది. కళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. నవ్వుతో ముఖమంతా నిండిపోయింది. ‘‘ఇంత సన్నబడతాడని అనుకోనే లేదు’’ అంది. ‘‘ఖో–సూయి అంటే ఇప్పటికీ బాగా ఇష్టమట. వచ్చి నప్పుడల్లా కావాలని అడుగుతూంటాడు’’ అని చెప్పింది ఆంగ్ సాన్ సూ కీ. ఆక్స్‌ఫర్డ్‌లో ఉండగా సూ కీ ఎప్పుడూ బ్లాక్ రైస్ పుడ్డింగ్ చేసేది కాదు. అందుకేనేమో... నాకు అది ఎలా ఉంటుందో లీలగా గుర్తుంది కానీ, రుచి ఎలా ఉంటుందన్నది మాత్రం గుర్తు లేకుండా పోయింది. కొబ్బరి తురుముతో కప్పిన నల్ల బియ్యంతో చేసే తీపి పదార్థం అది.నేను మళ్లీ 2015లో రంగూన్ లో ఆంగ్ సాన్ సూ కీని కలిశాను. ‘24, అక్బర్ రోడ్’ నాటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని చూడగానే అర్థమైంది. ‘‘నా మరో ఇంటికి స్వాగతం. 24, అక్బర్ రోడ్ గురించి నీకు తెలుసు కదా... ఇది అమ్మ మరో ఇల్లు’’ అంది. ఢిల్లీ ఇంట్లో ఓ భారీ పియానో ఉండేది. సూ కీ పియానో వాయించేది కూడా! గత వారం ‘24, అక్బర్ రోడ్’కు సంబంధించి పత్రికలు బోలెడన్ని వార్తలు రాశాయి. అప్పుడే నాకూ గుర్తుకొచ్చింది... ఆ ఇంటి గురించి నాకు ముందే తెలుసు అని! రాజకీయ పార్టీ కేంద్రం కాక మునుపు ఆ ఇంటి పొడవాటి నడవాలో ప్రేమ, ఆప్యాయతలు అల్లుకునిపోయి ఉండేవి. అది లూట్యెన్స్ ఢిల్లీలో భాగమని అస్సలు అనిపించేది కాదు. అది ‘డా ఖిన్ కీ’ ఇల్లు అన్నది మాత్రమే నాకు లెక్క. ఎప్పుడైనా వెళ్లగలిగే... ప్రేమ ఆప్యాయతలు అందుకోగల ఇల్లు!డా ఖిన్ కీ, ఆంగ్ సాన్ సూ కీ భారత్‌లో గడిపిన రోజులు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ సూ కీ తరచూ ఆ రోజులను గుర్తు చేసుకునేది. దీన్ని బట్టే వాళ్లు ‘24, అక్బర్ రోడ్’లో చాలా సంతోషంగా ఉండేవారు అనిపించేది. ఆ భవనం గోడలిప్పుడు మాట్లాడగలిగితే ఆ రోజుల ఊసులు ఇంకెన్ని చెప్పేవో... ప్చ్!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అంగ్ సాన్ సూకీ జైలు శిక్ష తగ్గింపు
బ్యాంకాక్: పదవీచ్యుతురాలైన అంగ్ సాన్ సూకీ(78) జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైనిక పాలకులు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం సూకీపై 19 నేరారోపణలు మోపారు. వీటిలో కొన్నిటిపై విచారణ జరిపిన సైనిక కోర్టులు సూకీకి 33 ఏళ్ల జైలు శిక్షలు విధించాయి. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో మంగళవారం ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మింట్ ఉన్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపాలి. -
Aung San Suu Kyi: ఎన్ఎల్డీ పార్టీ గుర్తింపు రద్దు
మయన్మార్ జుంటా గవర్నమెంట్ (మిలిటరీ ప్రభుత్వం) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ ప్రభుత్వ పర్యవేక్షణలోని ఎన్నిక సంఘం ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీకి భారీ షాక్ ఇచ్చింది. సూకీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’(NLD) పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మయన్మార్ ఈసీ. కొత్త సైనిక-ముసాయిదా ఎన్నికల చట్టానికి అనుగుణంగా.. ఎన్ఎల్డీ పార్టీ తన రిజిస్ట్రేషన్‌ను తిరిగి నమోదు చేసుకోవడంలో విఫలమైందని, అందుకే గుర్తింపు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మయన్మార్‌లో కఠిన ఎన్నికల చట్టం తీసుకొచ్చింది జుంటా మిలిటరీ ప్రభుత్వం. దాని ప్రకారం.. కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు, అజ్ఞాతంలో ఉన్నవాళ్లు, ఇంకా పలు నిబంధంనల కింద.. రాజకీయ పార్టీలను అధికారికంగా నమోదు చేయడానికి వీల్లేదు. తద్వారా ప్రత్యర్థి పార్టీల అడ్డుతొలగించుకునేందుకు మిలిటరీ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈ క్రమంలో.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నప్పటికీ, విపక్షాల నుంచి విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఈ ఏడాది జనవరి నుంచి పార్టీల రీ రిజిస్ట్రేషన్లకు రెండు నెలల గడువు ఇచ్చింది. ఆ దేశంలోని మొత్తం 90 పార్టీలకుగానూ 50 పార్టీలు మాత్రమే రీ రిజిస్ట్రేషన్ ద్వారా అర్హత సాధించుకున్నాయి. ఇక మిగతా పార్టీల గుర్తింపు(సూకీ ఎన్ఎల్డీ సహా) బుధవారం(నేటి) నుంచి రద్దు కానున్నాయి. మయన్మార్ ఉద్యమ నేత అయిన ఆంగ్ సాన్ సూకీ 1988లో ఎన్‌ఎల్‌డీని స్థాపించారు. 1990 ఎన్నికలలో ఘనవిజయం సాధించగా.. అప్పటి జుంటా(మిలిటరీ) ఆ ఎన్నికను రద్దు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె మిలిటరీ భాగస్వామ్య పార్టీలను మట్టికరిపించి కూటమి పార్టీల సాయంతో ఘన విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. 2020లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. కానీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో జుంటా మిలిటరీ నేతలు తిరుగుబాటుకి దిగారు. ఆపై సూకీని జైలు పాలు చేయడంతో పాటు పలు నేరాల కింద ఆమెకు శిక్షలు విధిస్తూ వెళ్తున్నారు. వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష ఇప్పటిదాకా మొత్తం 33 ఏళ్లకు చేరుకుంది. ఒకవైపు ఆమెపై కేసులు, వాటి విచారణ పరంపర కొనసాగుతోంది. అందులో అవినీతి, రహస్య సమాచార లీకేజీ తదితర ఆరోపణలు ఉండడం గమనార్హం. మరోవైపు మిలిటరీ నేతల పాలనలో మయన్మార్ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంకోవైపు సూకీని రిలీజ్ చేయాలని ఇటీవల యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ఓ ప్రకటనలో కోరింది. -
సూకీకి మరో ఏడేళ్ల జైలు
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్ సాన్ సూకీ(77)కి మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో, వివిధ అభియోగాలపై ఇప్పటి వరకు ఆమెకు కోర్టులు విధించిన జైలు శిక్షల మొత్తం సమయం 33 ఏళ్లకు పెరిగింది. ఆమెపై మోపిన ఐదు అభియోగాలపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ హెలికాప్టర్‌ను మంత్రి ఒకరికి అద్దెకు ఇవ్వడంలో ఆమె నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఫిబ్రవరిలో సూకీ సారథ్యంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి, సూకీ సహా వేలాది మందిని మిలటరీ పాలకులు దిగ్బంధించిన విషయం తెలిసిందే. కోర్టులు ఆమెపై మోపిన ఆరోపణలపై రహ స్యంగా విచారణలు జరిపి, శిక్షలు ప్రకటిస్తున్నా యి. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ వట్టివేనంటూ సూకీ కొట్టిపారేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని వెంటనే విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత వారం సైనిక పాలకులను కోరింది. -
సూకీకి మరో ఆరేళ్ల జైలు శిక్ష
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీకి అక్కడి న్యాయస్థానం వివిధ అవినీతి కేసుల్లో మరో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం చేపట్టిన కోర్టు రహస్య విచారణకు మీడియాను, ప్రజలను అనుమతించలేదు. విచారణకు సంబంధించిన వివరాలను బహిర్గత పరచరాదని ఆమె తరఫు లాయర్లకు కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. తాజా అభియోగాల్లో అధికార దుర్వినియోగం, మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి. ఈ నేరాలకు గాను మొత్తం ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ ఆరోపణలన్నిటినీ సూకీ కొట్టిపారేశారు. తాజా తీర్పును ఆమె ఎగువ కోర్టులో సవాల్ చేయనున్నారు. 77 ఏళ్ల సూకీ సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన మయన్మార్ సైనిక పాలకులు 2021 ఫిబ్రవరిలో ఆమెను నిర్బంధంలో ఉంచారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలు శిక్ష పడింది -
ఆంగ్‌సాన్ సూకీకి గృహ నిర్బంధం నుంచి జైలు నిర్బంధం
బ్యాంకాక్: గతేడాది తిరుబాటు చేసిని ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధం నుంచి సైనిక నిర్మిత జైలు కాంపౌండ్‌లోకి తరలించినట్లు మయన్మార్ జుంటా అధికార ప్రతినిధి తెలిపారు. క్రిమినల్ చట్టాల ప్రకారం ఆంగ్ సాన్ సూకీని రాజధాని నైపిడావ్లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జా మిన్ తున్ పేర్కొన్నారు. ఐతే ఆమె తిరుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను కోర్టులో విచారణకు హజరుపరచడం కోసం ఈ ప్రాంతం నుంచి తరలించారు. పైగా ఆమెకి 150 ఏళ్లకు పైనే శిక్ష విధించారు. అంతేకాదు సూకీ తరుఫున న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించారు. జర్నలిస్టులు సైతం ఆమెతో మాట్లాడేందుకు వీల్లేదు. ఇంతకుముందు కూడా ఆమె మయాన్మార్లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంటిలోనే చాలాఏళ్లు గృహనిర్బంధంలో ఉంది. ఆమె అవినీతి, మిలటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు, కోవిడ్-19 ప్రోటోకాల్, టెలికమ్యూనికేషన్స్ చట్టం ఉల్లంఘన తదితర ఆరోపణలతో ఆమెను దోషిగా నిర్థారించారు. పైగా కోర్టు సూకీకి ఇప్పటివరకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్) -
Aung San Suu Kyi: మయన్మార్‌లో సంచలనం.. సూకీకి జైలు శిక్ష
Aung San Suu Kyi: భారత్ పొరుగు దేశం మయన్మార్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, సైనిక ప్రభుత్వం.. సూకిపై 11 అవినీతి కేసులను మోపింది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం.. జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్లను నగదు, 11.4 కిలోల బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు కావడం విశేషం. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే.. ఆమె మరింత శిక్షపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్‌గా ఉన్న ప్రజానేత ఆంగ్ సాన్ సూకీ.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేసింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. A court in military-ruled #Myanmar sentenced deposed leader Aung San Suu Kyi to five years in jail after finding her guilty in the first of 11 corruption cases against her, according to a source with knowledge of proceedings. pic.twitter.com/IhkfM6Jmrt — Alpha7News (@Alpha7News) April 27, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్ -
ఆంగ్‌సాన్ సూకీపై విచారణ ఆరంభం
బ్యాంకాక్: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మయన్మార్ మాజీ ప్రధాని ఆంగ్‌సాన్ సూకీకి మిలటరీ ప్రభుత్వం సోమవారం విచారణ ఆరంభించింది. ఇప్పటికే సూకీపై పలు ఆరోపణలతో ప్రభుత్వం ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2020 ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి మంచి మెజార్టీ వచ్చింది. అయితే ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మిలటరీ జుంటా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటినుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. మిలటరీ చర్యను దేశీయంగా పలువురు వ్యతిరేకించారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి సూకీపై జుంటా పలు కేసులు పెడతూనే ఉంది. అయితే ఇవన్నీ నిరాధారాలని ఆమె పార్టీ కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా ఉండేందుకే జుంటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. తాజా కేసులో సూకీతో పాటు మాజీ అధ్యక్షుడు విన్ మైఇంట్, మాజీ మంత్రి మిన్ తు సహ నిందితులుగా ఉన్నారు. కేసులో ఆరోపణలు రుజువైతే సూకీ పార్టీ రద్దు చేసేందుకు అవకాశాలున్నాయి. -
తిరుగుబాటుకు ఏడాది పూర్తి.. వేల మంది బలిదానం!
అనూహ్యంగా మొదలైన సైన్యం తిరుగుబాటు పరిణామాలతో.. ఏడాదిగా పౌరుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ నిరసనల్లో చెలరేగిన హింసతో వేలమంది బలికాగా.. కొన్ని వేలమందిని నిర్భంధానికే పరిమితం చేసింది సైన్యం. ఇక ఈ పరిస్థితులు కొనసాగుతుండగా.. మయన్మార్ సంక్షోభం గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం అధికారికంగా ఒక నివేదిక విడుదల చేసింది. ఏడాదిపాటుగా మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఐరాస మంగళవారం అధికారికంగా స్పందించింది. ఈ ఏడాది కాలంలో పదిహేను వందల మంది బలికాగా.. 11, 782 మందిని చట్టాన్ని అతిక్రమించి సైన్యం నిర్భంధించిందని, వీళ్లలో 8,792 మంది ఇంకా నిర్భంధంలోనే ఉన్నారని ఐరాస మానవ హక్కుల విభాగం ప్రతినిధి రవీనా శమ్దాసానీ తెలిపారు. అయితే మయన్మార్‌లో పాలక జుంటా సైన్యం.. హక్కుల సంఘాలు విడుదల చేసిన మరణాల సంఖ్యను ఖండించిన విషయం తెలిసిందే. జెనీవాలోని జరిగిన యూఎన్ సమావేశంలో ఏకపక్ష నిర్బంధాల గణాంకాలపై శమ్సదానీ వివరణ ఇచ్చారు. ఏడాది కాలంగా సైన్యానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న నిరసన ఇది. శాంతియుత ప్రదర్శనలు, ఆన్లైన్ ద్వారా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. కానీ, ప్రాణ నష్టం తప్పలేదు. చంపబడ్డ 1,500 మందిని మేం డాక్యుమెంట్ చేశాం. అయితే ఇది నిరసనల సందర్భంలో మాత్రమే’’ అని శామ్సదానీ వివరించారు. వీళ్లలో 200 మంది మిలిటరీ కస్టడీలో వేధింపుల ద్వారానే చనిపోయారు అని ఆమె ధృవీకరించారు. ఈ 1,500 మందిలో సాయుధ పోరాటం కారణంగా మరణించిన వ్యక్తులను చేర్చలేదు! ఎందుకంటే మరణించిన వాళ్లు వేలల్లో ఉన్నారని మేము అర్థం చేసుకోగలం’ ఆమె భావోద్వేగంగా ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో ఉవ్వెత్తున ఎగిసిన మయన్మార్ సైన్య దురాగతాలు.. వేలమంది పౌరులను బలిగొనడంతో పాటు ఆంక్షలతో, కఠిన నిర్భంధాలతో ఇబ్బందులు పెడుతూ వస్తోంది. మరోవైపు గత పాలకులపైనా సైన్యం ప్రతీకారం కొనసాగుతూ వస్తోంది. ఆంగ్‌సాన్ సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి సైన్యం పలు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. -
అంగ్‌సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు
బ్యాంకాక్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీ(76)కి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ మయన్మార్‌లోని ఓ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా మిలటరీ పాలకులు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించారు. సూకీకి చెందిన నేషనల్ లీగ్ఫర్ డెమోక్రసీ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తరుణంలో గత ఫిబ్రవరిలో మిలటరీ.. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి పలు అభియోగాలు మోపింది. అవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
మయన్మార్ నియంతల ఆగడం
నిరంతర అప్రమత్తత కొరవడితే ప్రజాస్వామ్యం క్రమేపీ కొడిగట్టడం ఖాయమని గ్రహించనిచోట చివరకు నియంతలదే పైచేయి అవుతుంది. వర్తమాన మయన్మార్ ప్రపంచానికి చాటిచెబుతున్న పాఠం అదే. తన జీవితంలో ఇప్పటికే పదిహేనేళ్లపాటు చెరసాలలో గడిపిన సీనియర్ నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై రెండు నాసిరకం ఆరోపణల ఆధారంగా నడిచిన కేసులో సైనిక న్యాయస్థానం సోమవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన వైనం అక్కడి సైనిక పాలకుల పోకడలు తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించలేదు. తీర్పు వెలువడిన వెంటనే ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్టు సైన్యం ఉదారత ప్రకటించడం దాని నయవంచనకు నిదర్శనం. ఆమెపై మరో తొమ్మిది అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ‘విచారణ’ పూర్తయితే ఆమెకు మొత్తం 102 ఏళ్ల వరకూ శిక్ష పడుతుందంటున్నారు! సూకీని గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించడం, ప్రత్యేక కోర్టు విచారణకు వేరెవరినీ అనుమతించకపోవడం, కేసు గురించి ఆమె న్యాయవాది బయటెక్కడా మాట్లాడకూడదని ఆంక్ష పెట్టడం సైనిక ముఠా దుర్మార్గానికి నిదర్శనం. ఆరు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన సైనిక దుశ్శాసనులు అప్పుడప్పుడు తగ్గి నట్టు నటించడం, అదునుచూసి తమ వికృత రూపాన్ని ప్రదర్శించడం రివాజే. నిరుడు నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేష నల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) విజయం సాధించడాన్ని చూసి కడుపుమండిన సైనిక ముఠా... మొన్న ఫిబ్రవరిలో ఉన్నట్టుండి ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అధికారాన్ని హస్త గతం చేసుకుంది. వాస్తవానికి ఇదంతా లాంఛనమే. అధికార పీఠాన్ని సైన్యం ఎప్పుడూ వదిలింది లేదు. పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థకు చోటిచ్చినట్టు కనబడినా తన హవా నడిచేందుకు అనువైన రాజ్యాంగాన్ని సైన్యం ముందే రాసిపెట్టుకుంది. పార్లమెంటులో తనకు 25 శాతం స్థానాలు రిజర్వ్ చేసుకుంది. ఆ స్థానాలకు ప్రతినిధులను తానే నామినేట్ చేస్తుంది. మిగిలిన 75 శాతం స్థానాలకు జరిగే ఎన్నికల్లో సైతం కీలుబొమ్మ పార్టీలను నించోబెట్టి తమ పలుకుపడికి ప్రమాదం రాకుండా చూసుకోవడం మొదటినుంచీ సైనిక పాలకులకు అలవాటైన విద్య. కానీ 2020 ఎన్నికల్లో కీలుబొమ్మ పార్టీ అయిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎన్డీపీ)కి కేవలం 25 స్థానాలే లభించేసరికి సైన్యానికి దిక్కుతోచలేదు. ఈ మెజారిటీతో సూకీ రాజ్యాంగాన్ని మార్చేస్తారని రూఢీ చేసుకుని మళ్లీ అది పంజా విసిరింది. సైనిక ముఠా రూపొందించిన రాజ్యాంగమంతటా కంతలే. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అధ్యక్ష పీఠం అధిష్టించడానికి అనర్హులవుతారని అందులో ఉన్న ఒక నిబంధన కేవలం సూకీని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అయితే 2015లో అధికారంలోకొచ్చిన తర్వాత సూకీ ఈ దొంగల రాజ్యాంగంపై పోరాడవలసింది. సైన్యం దురాలోచనను ఎండగట్టవలసింది. కానీ ఆమె రాజీపడ్డారు. దేశాధ్యక్ష పదవి దక్కకపోయినా సరిపెట్టుకుని వెనకుండి పాలనను పర్యవేక్షించారు. కీలకమైన ఆంతరంగిక భద్రత, రక్షణ శాఖలను సైన్యం తన చేతుల్లో పెట్టుకున్నా అదేమని ప్రశ్నిం చిన పాపాన పోలేదు. సైన్యం ఆగడాలు అంతకంతకు మితిమీరుతున్నా చూసీచూడనట్టు మిన్న కుండిపోయారు. చివరకు దేశ పౌరుల్లో భాగమైన రోహింగ్యాలపై జాత్యహంకార బుద్ధిస్టులతో ఏకమై సైన్యం దమనకాండకు దిగినా ఖండించడానికి సూకీ ముందుకు రాలేదు. సైనిక నియంత లపై నిలకడగా, నిబ్బరంగా శాంతియుత పోరాటాన్ని కొనసాగించి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న ధీరవనిత ఇలా మూగనోము పట్టడమేకాదు... ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై వారిని సమర్థిస్తూ మాట్లాడిన తీరుకు ప్రపంచ ప్రజానీకం విస్తుపోయింది. నిజానికి ఆమె ఇంటా బయటా కూడా ఒంటరి కాదు. ఆమెకు దేశ ప్రజానీకంలోనూ మద్దతుంది. విదేశాల్లోనూ ఆదరణ ఉంది. కానీ ఆమె దాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రజాస్వామ్యం కోసం జనం సాగించిన పోరాటం కేవలం సూకీని అధికార పీఠంపై ప్రతిష్టించడానికి కాదు... వ్యవస్థలన్నిటినీ చెరబట్టిన సైనిక ముఠాను గద్దెదించి, మానవ, పౌరహక్కులనూ సాధించుకోవడానికి. సకలరంగాల్లోనూ ప్రజా స్వామ్య సంస్కృతిని పునఃప్రతిష్టించడానికి. వాటి సాధనకై ఉద్యమానికి నాయకత్వం వహించ డంలో, ప్రజలను చైతన్యవంతం చేయడంలో అధికారంలోకొచ్చాక సూకీ విఫలమయ్యారు. తాను రాజీపడితే సైన్యం కూడా ఒక మెట్టు దిగుతుందనుకున్నారు. అది అడియాసే అయింది. చెప్పుకోదగ్గ నాయకత్వం లేకున్నా మయన్మార్ విద్యార్థులు, యువజనులు మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. వివిధ సందర్భాల్లో గత ఎనిమిది నెలలుగా 1,300మంది ప్రాణాలు తీసినా వారు వెనక్కు తగ్గటంలేదు. ఐక్యరాజ్యసమితివంటి అంతర్జాతీయ సంస్థలు, అమెరికా తదితర దేశాలు మాటల్లో సైనిక పాలకులను ఖండిస్తున్నా చేతల్లో చూపిస్తున్నదేమీ లేదు. చైనా సరేసరి. దానికి లాభార్జన మినహా ఏదీ పట్టదు. అక్కడి పాలకులను వ్యతిరేకిస్తే ఈశాన్య భారత్‌లో తిరుగుబాటు దార్ల ఆటకట్టించడం అసాధ్యమవుతుందని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రజానీకం మయన్మార్‌కు నైతిక మద్దతునీయాలి. అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమానికి చేయూతనందించాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అప్పుడు మాత్రమే మయన్మార్ పాలకులు దిగివస్తారు. -
ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు.. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో?
యాంగోన్: ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చెలాయిస్తున్న మయన్మార్ సైనిక ప్రభుత్వం వారి నిర్బంధంలో ఉన్న కీలక నేతలను జైలుకు పంపే చర్యలను తీవ్రం చేసింది. ఇప్పటికే ఎన్నికల్లో కుట్ర, అవినీతి ఆరోపణలపై బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీపై కేసులు పెట్టి విచారిస్తుండగా.. తాజాగా రెండు అభియోగాలపై అక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కోవిడ్ కాలంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, కరోనావైరస్ నియంత్రణలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఫేస్బుక్ పేజీలో ప్రజల్ని రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని, అలాగే గత నవంబర్ ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా వేలాది మందితో ర్యాలీ నిర్వహించారని సైన్యం ఆరోపించింది. (చదవండి: Time Traveller Prediction On 2021: డిసెంబర్ 25న ప్రపంచానికి భారీ షాక్.. మారనున్న జీవితాలు’) కాగా, గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ రెండో దఫా కూడా ఘన విజయం సాధించగా.. సైన్యం, దాని మిత్ర పక్షాలు పార్టీలు ఘోర ఓటమిపాలయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన సైన్యం ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు నిరసనలతో హోరెత్తుతుండగా ఆంగ్ సాన్‌కి జైలు శిక్ష విధించడం మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) -
మయన్మార్‌లో ఆగని అరాచకం.. 550 మంది మృతి
యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. నిరసనకారుల్ని అణిచివేయడానికి సైన్యం ప్రతీ రోజూ కాల్పులకు దిగుతోంది. శనివారం సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు బలయ్యారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందులో కొంతమంది తల నుంచి రక్తం ధారగా కారుతున్న ఒక యువకుడిని తీసుకొని పరుగుల తీస్తున్న దృశ్యంతో పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫిబ్రవరి 1న అంగసాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన తర్వాత మిలటరీ కాల్పుల్లో ఇప్పటివరకు 550 మంది ప్రాణాలు పోయాయని స్థానిక హక్కుల సంస్థ వెల్లడించింది. మరణించిన వారిలో 46 మంది చిన్నారులు ఉండడం తీవ్రంగా కలకలం రేపే అంశం. మయన్మార్ అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2,751 మందిని సైన్యం అదుపులోనికి తీసుకొని జైలు పాలు చేసింది. మిలటరీ ప్రజా ఉద్యమాన్ని ఎంతలా అణగదొక్కాలనుకుంటుందో అంతే బలంగా అది పైకి లేస్తోంది. మిలటరీ తూటాలకు భయపడేది లేదంటున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. అందరిపైనా తుపాకీ గురి పెడుతున్నారు ఇల్లు దాటి బయటకి వచ్చిన ప్రతీ ఒక్కరిపైనా మయన్మార్ సైనికులు తుపాకీ గురి పెడుతున్నట్టుగా సీఎన్ఎన్ చానెల్‌కి కొందరు నిరసనకారులు చెప్పారు. ‘‘దుకాణాలకి వెళ్లినా, రోడ్డుపై నడిచి వెళుతున్నా సైనికులు పిస్టల్ని గురి పెట్టి బెదిరిస్తున్నారు. ఎవరైనా సాయం కోరినా అందించే పరిస్థితి లేదు’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా మిలటరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మైనార్టీ రెబెల్ గ్రూపు కరేన్ నేషనల్ యూనియన్ తమకు పట్టున్న గ్రామాలపై మిలటరీ నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపిస్తోందని తెలిపింది. చదవండి: తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి -
కదిలించే ఫోటో: ‘వారికి బదులు నన్ను చంపండి’
యాంగాన్: మయన్మార్‌లో అధికారం సైన్యం చేతిల్లోకి వెళ్లింది. అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకిని సైన్యం నిర్భంధించి.. అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిలటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ప్రజల నిరసనని అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సైన్యం అరాచకాలను కళ్లకు కట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది. కచిన్ రాష్ట్రంలో మైత్‌క్వీనా నగరంలో సోమవారం నాడు తీసిన ఫోటో ఇది. ఆ వివరాలు... కచిన్ రాష్ట్రంలో సోమవారం కొందరు బయటకు వచ్చి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమే వారి లక్ష్యం. పోలీసులను చూసి అక్కడి యువకులు పరుగులు పెడుతున్నారు. అప్పటికే అధికారులు తుపాకులకు పని చెప్పడంతో ఓ యువకుడు మరణించాడు. మరి కొందరి ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఈ విపత్కర పరిస్థితిని గ్రహించిన ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అధికారులకు అడ్డు నిలబడింది. తెల్లటి దుస్తులు ధరించి శాంతికి మారుపేరుగా ఉన్న ఆ నన్ పోలీసులకు ఎదురెళ్లింది. నిగ్రహం పాటించండి అంటూ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మాట వినలేదు. దాంతో ఆమె వెంటనే మోకాళ్లపై కూర్చొని ‘ఆందోళనకారులను ఏమీ చేయొద్దు.. కావాలంటే నా ప్రాణం తీసుకోండి’ అంటూ వేడుకుంది. ఆమెలోని తెగువ, మానవత్వానికి చలించిన అధికారులు ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మైత్‌క్వీనాలో సోమవారం నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు నచ్చజెప్పేందుకు సిస్టర్ అన్న్ రోజ్ ను తవాంగ్ ప్రయత్నించారు. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్తున్న పోలీసులను అడ్డుగా నిలిచారు. వారినేమీ చేయొద్దంటూ మోకాలిపై నిలబడి వేడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది. ఇద్దరు పోలీసులు సైతం ఆమెకు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది. ఫిబ్రవరి 28న సైతం నిరసనకారులపై ప్రతాపం చూపేందుకు వచ్చిన పోలీసులను ఇలానే అడ్డుకున్నారు సిస్టర్ తవాంగ్. ఈ ఘటనపై సిస్టర్ తవాంగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మయన్మార్ దుఃఖంలో ఉంది. నా కళ్ల ముందు ప్రజలకు ఏమైనా జరిగితే తట్టుకోలేను. చూస్తూ ఊరుకోలేను. ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. వారి కోసం చావడానికి నేను భయపడను’’ అన్నారు. చదవండి: ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు! బయటికొస్తే అరెస్ట్ చేస్తాం... -
మయన్మార్‌లో సైన్యం ఆగడం
గత నెల 1న మయన్మార్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం హస్తగతం చేసుకున్న సైనిక ముఠా రోజూ వీధుల్లో ఎగిసిపడుతున్న జన కెరటాలను చూసి బెంబేలెత్తుతోంది. ఉద్యమకారులను నియంత్రించే పేరుతో చాలా తరచుగా భద్రతా బలగాలు సాగిస్తున్న కాల్పులు ఆ ముఠా బలాన్ని కాక బలహీనతను పట్టిచూపుతున్నాయి. వివిధ నగరాల్లో కేవలం బుధవారం రోజున 38 మంది పౌరుల్ని భద్రతా బలగాలు పొట్టనబెట్టుకున్న తీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచింది. సరిగ్గా అంతకు మూడు రోజుల ముందు ఆదివారం వేర్వేరు నగరాల్లో కాల్పులు జరిపి 25 మంది ప్రాణాలు తీశారు. సైనిక నియంతల నేర చరిత్ర తిరగేస్తే ఈ దమనకాండ వున్నకొద్దీ పెరుగుతుంది తప్ప ఇప్పట్లో తగ్గదని అర్థమవుతుంది. నిరసనల్లో ముందున్నవారిని ఈడ్చుకొచ్చి కాల్చిచంపటం, ఉద్యమకారుల్ని వేటకుక్కల్లా తరుముతూ ప్రాణాలు తీయటం, రోజూ ఇళ్లపై దాడులు చేస్తూ వందలమందిని నిర్బంధించటం సామాజిక మాధ్యమాల్లో కనబడుతున్నాయి. ఇళ్లల్లో వున్నవారిని గురిచూసి కాల్చటం, హఠాత్తుగా లోపలికి చొరబడి పౌరుల్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించటం వంటి ఉదంతాలు నిత్యకృత్యమయ్యాయి. ఆఖరికి గాయపడిన ఉద్యమకారులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సైతం అరెస్టు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ లేరు. వివిధ రాజకీయ పక్షాల నేతలనూ, ప్రభుత్వ వ్యతిరేక దృక్పథం వున్న పాత్రికేయులనూ సైనిక ముఠా జైళ్లపాలు చేసింది. అయినా నిరసనల తీవ్రత తగ్గుతున్న దాఖలాలు లేవు. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కీలక నేత ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) 83 శాతం స్థానాలను గెల్చుకోగా, తమ ఏజెంటుగా వున్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ)కి కేవలం 7శాతం స్థానాలు రావటం సైనిక ముఠా జీర్ణించుకోలేకపోయింది. అడ్డగోలు నిబంధనలతో నింపిన రాజ్యాంగం సైతం ఈసారి పార్లమెంటులో తమకు అక్కరకొచ్చే స్థితి లేకపోవటంతో ఎటూ పాలుబోలేదు. ఆ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం సైన్యానికుండే అధికారాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుందని సూకీ చెప్పారు. ఎన్ఎల్డీ మెజారిటీ పెరగటంతో తాము దశాబ్దాలుగా అనుభవిస్తున్న పెత్తనం అంతరిస్తుందన్న భయం సైన్యాన్ని పీడించింది. పర్యవ సానంగా సైనిక కుట్రకు పాల్పడింది. సూకీతో సహా ప్రధాన నాయకులందరినీ గుర్తు తెలియని ప్రాంతాల్లో నిర్బంధించింది. అయితే జనాన్ని తక్కువ అంచనా వేసింది. విద్యార్థులు, ఉపా ధ్యాయులు, వైద్యులు, బ్యాంకర్లు, కార్మికులు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. పైగా వీరంతా రోహింగ్యా ముస్లింలపైనా, ఇతర మైనారిటీలపైనా సైన్యం అమలు చేస్తున్న అణచివేతను ప్రశ్నిస్తున్నారు. వారి ఆందోళనకు కూడా మద్దతిస్తున్నారు. నాలుగైదేళ్లక్రితం దేశంలో మతతత్వాన్ని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టి రోహింగ్యాలను తుడిచి పెట్టేందుకు సైన్యం మారణహోమాలకు పాల్పడింది. ఊళ్లకు ఊళ్లు తగలబెడుతూ, వేలాదిమందిని ఊచకోత కోసింది. ఇందుకు ప్రైవేటు ముఠాల సాయం కూడా తీసుకుంది. దురదృష్టమేమంటే అప్పుడు తమ పార్టీ ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహిస్తున్న సూకీ సైన్యం ఆగడాల గురించి నోరెత్తలేదు. పైగా అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందు హాజరై వారిని వెనకేసుకొచ్చారు. కనీసం రోహింగ్యాల పేరెత్తడానికి కూడా ఆమె సిద్ధపడలేదు. తనను రోహింగ్యాల ఏజెంటుగా ప్రచారం చేస్తున్న బౌద్ధ మిలిటెంటు గ్రూపుల ప్రచార హోరును చూసి, సైన్యం ఆగ్రహానికి గురికావలసివస్తుందని భయపడి ఆమె చూసీచూడనట్టు వూరుకున్నారు. కానీ ఇప్పుడు వీధుల్లో కొచ్చిన ఉద్యమకారులు అలాంటి వివక్ష పాటించటం లేదు. తమపై ఇప్పుడు సాగుతున్న సైనిక అకృత్యాలు రోహింగ్యాలపై అమలైన అణచివేతకు కొనసాగింపుగానే చూస్తున్నారు. ఇది సైనిక పాలకులకు మాత్రమే కాదు... మళ్లీ వారి చెరలో పడిన సూకీకి సైతం ఊహించని పరిణామం. పదిహేనేళ్లు ఆమె నిర్బంధంలో వున్నప్పుడు ప్రజానీకం ఆమెకు అండదండలందించారు. ప్రజా స్వామ్యం కోసం, ప్రత్యేకించి ఆమె కోసం రోడ్లపైకొచ్చి నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు వారి ఏకైక ఎజెండా ప్రజాస్వామ్య పునరుద్ధరణే. ఈ క్రమంలో సైనిక పాలకులు కల్పిస్తున్న అన్ని అడ్డంకులనూ ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా మయన్మార్ పోరాటానికి మద్దతునిస్తున్నవారికి ఇప్పుడొక ధర్మసంకటం ఏర్పడింది. రోహింగ్యాల ఊచకోత సమయంలో ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహిస్తూ, సైన్యాన్ని వెనకేసుకొచ్చిన సూకీని దూరం పెడుతూ... ఉద్యమానికి మద్దతునీయటం ఎలాగన్నది వారిని వేధి స్తున్న ప్రశ్న. మయన్మార్‌లో భారీయెత్తున పెట్టుబడులు పెట్టిన చైనా, ఆ దేశంతో మరింత సాన్నిహిత్యం కోసం ఉవ్విళ్లూరుతున్న రష్యా స్వప్రయోజనాల కోసం సైనిక పాలకుల ఆగడాలను గుడ్లప్పగించి చూస్తున్నాయి. వారి చర్యలను ఖండించే భద్రతా మండలి తీర్మానాన్ని నీరుగార్చటంతో పాటు మానవహక్కుల మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకున్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతుగా నిలిచేందుకు ఎక్కడికక్కడ తమ ప్రభుత్వాలపై ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే సైనిక పాలకులు దారికొస్తారు. -
బయటికొస్తే అరెస్ట్ చేస్తాం...
బయటికొస్తే అరెస్ట్ చేస్తాం. ‘ఎవడాడు ఆ మాటన్నది?!’ పన్నులు కట్టకుంటే ముక్కులు పిండుతాం.‘ఎవడాడు ఆ మాటన్నది?!’శాసనాన్ని ధిక్కరిస్తే జైలే. ‘ఎవడాడు ఆ మాటన్నది?! ఆ మాటన్నది ఎవరైనా.. ‘ఎవడాడు’ అన్నది మాత్రం మహిళే! మహిళా సైన్యం అంటాం కానీ.. మహిళే ఒక సైన్యం! ప్రతి శాసనోల్లంఘనలో ముందుంది మహిళే. ముందుకు నడిపించిందీ మహిళే. రేపు సోమవారానికి వారం మయన్మార్‌లో ప్రభుత్వం పడిపోయి. పార్లమెంటులో మెజారిటీ తగ్గి పడిపోవడం కాదు. సైన్యం ట్యాంకులతో వెళ్లి ప్రభుత్వాన్ని కూల్చేసింది. దేశాన్ని ప్రెసిడెంట్ చేతుల్లోంచి లాగేసుకుంది. పాలకపక్ష కీలక నేత ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచింది. కరోనా సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాకీ టాకీని ఫారిన్ నుంచి దిగుమతి చేసుకోవడం.. ఇవీ ఆమెపై సైన్యం మోపిన నేరారోపణలు! దీన్ని బట్టే తెలుస్తోంది. పాలనను హస్తగతం చేసుకోడానికి సైన్యం పన్నిన కుట్ర ఇదంతా అని! దేశంలో ఎవరైనా తిరగబడితే సైన్యం దిగుతుంది. సైన్యమే తిరగబడితే ఎదురు తిరిగేవాళ్లెవరు? సైన్యం పేల్చిన నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మయన్మార్ వీధులపై నెమ్మదిగా దొర్లుకుంటూ వెళుతున్న చెయిన్ చక్రాల కరకరలు విన్నవారికి తెలుస్తుంది. అయితే ఆ కరకరల మధ్య.. బుధవారం నాటికి ఒక కొత్త ధ్వని వినిపించడం మొదలైంది. ఆ ధ్వని.. సైన్యాన్ని ధిక్కరించి ఇళ్లలోంచి బయటికి వచ్చిన మహిళల ‘డిజ్ఒబీడియన్స్’! అవిధేయ గర్జన. ‘వియ్ డోంట్ వాట్ దిస్ మిలిటరీకూ’.. అన్నది ఆ మహిళల నినాదం. సైనిక కుట్రకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ప్రదర్శన జరుపుతున్న మయన్మార్ మహిళా టీచర్లు సైన్యం శాసించింది. ఆ శాసనాన్ని మయన్మార్ మహిళావని ఉల్లంఘించింది. మొదట సోమవారమే కాలేజీ అమ్మాయిలు మగపిల్లల వైపు చూశారు. ‘వేచి చూద్దాం’ అన్నట్లు చూశారు మగపిల్లలు. యూనివర్శిటీలలో మహిళా ప్రొఫెసర్ లు.. ‘ఏంటిది! ఊరుకోవడమేనా?’ అన్నట్లు మేల్ కొలీగ్స్‌తో మంతనాలు జరిపారు. ‘ప్లాన్ చేద్దాం’ అన్నారు వాళ్లు. మెల్లిగా ప్రభుత్వ శాఖల సిబ్బంది పని పక్కన పడేయడం మొదలైంది. బుధవారం నాటికి లెక్చరర్లు బయటికి వచ్చారు. మహిళా లెక్చరర్లు! వెంట సహోద్యోగులు. యాంగన్ యూనివర్శిటీ ప్రాంగణం బయటికి వచ్చి ఎర్ర రిబ్బన్లతో సైన్యానికి తమ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటికి టీచర్లు, హెల్త్ వర్కర్లు కూడా పోరుకు సిద్ధమై వీధుల్లోకి వచ్చారు. ప్రజలు ఎన్నుకున్న పాలనను ఉల్లంఘించి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. సైన్యాన్ని ధిక్కరించి మయన్మార్ మహిళలు బర్మాను రక్షించుకోవాలనుకున్నారు. తమ మహిళా నేత ఆంగ్ సాగ్ సూకీ వారిలో నింపిన స్ఫూర్తే ఇప్పుడు వారిని సైనిక కుట్రకు వ్యతిరేకం గా కదం తొక్కిస్తోంది. మయన్మార్‌ను సైన్యం నుంచి విడిపించుకునేందుకు నడుం బిగిస్తోంది. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చట్ట వ్యతిరేకంగా కూలదోస్తే చూస్తూ ఊరుకోం’’అని న్వే తాజిన్ అనే మహిళా లెక్చరర్ పిడికిలి బిగించారు. ∙∙ మహిళల ముందడుగుతో మొదలైన శాసనోల్లంఘనలు చరిత్రలో ఇంకా అనేకం ఉన్నాయి! 1930 – 1934 మధ్య గాంధీజీ నాయకత్వం వహించిన మూడు ప్రధాన శాసనోల్లంఘనలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళల చేయూత, చొరవ, చేవ అండగా ఉన్నాయి. గాంధీజీ తొలి శాసనోల్లంఘన చంపారన్ (బిహార్)లో, రెండో శాసనోల్లంఘన అహ్మదాబాద్‌లో, మూడో శాసనోల్లంఘన దండి (సూరత్ సమీపాన) జరిగాయి. దండి ఉల్లంఘనలో దేవి ప్రసాద్ రాయ్ చౌదరి, మితూబెన్ ఆయన వెనుక ఉన్నారు. చంపారన్ శాసనోల్లంఘనలో నీలిమందు పండించే పేద రైతుల కుటుంబాల్లోని మహిళలు కొంగు బిగించి దోపిడీ శాసనాలపైకి కొడవలి లేపారు. అహ్మదాబాద్ జౌళి కార్మికుల ఉపవాస దీక్షలో, గుజరాత్‌లోనే ఖేడా జిల్లాలో పేద రైతుల పన్నుల నిరాకరణ ఉద్యమంలో మహిళలు సహ చోదకశక్తులయ్యారు. గాంధీజీనే కాదు.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జేమ్స్ బెవెల్, రోసా పార్క్స్ వంటి అవిధేయ యోధులు అమెరికాలో నడిపిన 1950–1960 ల నాటి శాసనోల్లంఘన ఉద్యమాలన్నిటి ఆరంభంలో జ్వాలకు తొలి నిప్పుకణంలా మహిళా శక్తి ఉంది. రోసా పార్క్ అయితే స్వయంగా ఒక పెద్ద పౌరహక్కుల ఉద్యమాన్నే నడిపించారు. యాక్టివిస్టు ఆమె. ‘ది ఫస్ట్ లేడీ ఆఫ్ సివిల్ రైట్స్’ అని ఆమెకు పేరు. ∙∙ అన్యాయాన్ని బాహాటం ధిక్కరించే గుణం పురుషుల కన్నా స్త్రీలకే అధికం అని జీవ శాస్త్రవేత్తలు అంటారు. అందుకు కారణం కూడా కనిపెట్టారు. పురుషుడు బుద్ధితోనూ, స్త్రీ హృదయంతోనూ స్పందిస్తారట. అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని, మోసపూరిత శాసనాన్ని ప్రశ్నించడానికి బుద్ధి ఆలోచిస్తూ ఉండగనే, హృదయం భగ్గుమని ఉద్యమిస్తుందట. ఈ సంగతి తాజాగా ఢిల్లీలోని రైతు ఉద్యమంలోనూ రుజువవుతోంది. అయితే అక్కడింకా శాసనోల్లంఘన వరకు పరిస్థితి రాలేదు. ఒకవేళ వచ్చిందంటే తొలి ధిక్కారం, తొలి ఉల్లంఘన సహజంగానే మహిళలదే అయివుండే అవకాశం ఉంది. -
సూకీపై కొత్తగా అక్రమ వాకీటాకీల కేసు
యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీపై పోలీసులు కొత్త ఆరోపణలు ప్రారంభించారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయని, ఈ కేసులో ఆమెను ఫిబ్రవరి 15దాకా నిర్బంధంలో ఉంచుతామన్నారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ కాని వాకీటాకీలను సూకీ భద్రతా సిబ్బంది వాడారని పేర్కొన్నారు. మయన్మార్‌లో సోమవారం కొత్త ప్రభుత్వాన్ని కూలదోసి, సైన్యం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆంగ్ సాన్ సూకీని, ఆమె పార్టీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వాకీటాకీల దిగుమతి కేసులో సూకీకి గరిష్టంగా రెండేళ్ల దాకా జైలుశిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
మయన్మార్‌లో సైన్యం ఆగడం
అరకొరగానైనా ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నట్టు నటించటం మొదలుబెట్టి నిండా ఆరేళ్లు కాకుం డానే మయన్మార్ సైన్యం అప్పుడే తన ప్రతాపం చూపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కీలక నేత ఆంగ్‌సాన్ సూకీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని సోమవారం కూల్చి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించింది. మయన్మార్‌లో గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించినప్పుడే మయన్మార్ సైన్యం ఎలాంటి అడుగులు వేస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో సైన్యం ప్రాభవం పూర్తిగా అడుగం టింది. ప్రజలు ఎన్నుకోవటానికి కేటాయించిన 476 స్థానాల్లో సూకీ పార్టీ 396 (83 శాతం) గెల్చుకుని ఘన విజయం సాధించింది. సైన్యం కనుసన్నల్లో నడిచే యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) కేవలం 33 స్థానాలకే (7శాతం) పరిమితమైంది. సైన్యానికి తోకలావుండే మరికొన్ని చిన్న పార్టీలు అంతకన్నా చాలా తక్కువ స్థానాలకు పరిమితమయ్యాయి. పార్లమెంటులో సైన్యం ముందుజాగ్రత్త చర్యగా తనకు తాను కేటాయించుకున్న 166 సీట్ల(25శాతం) కోటా వుండనే వుంది. ఇంతచేసినా పార్లమెంటులో సైన్యం కోసం గొంతెత్తే వారు 32 శాతం మించిలేరు. 2015లో చాన్నాళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించినప్పుడు పరిస్థితి వేరు. ఎన్ఎల్డీ అప్పుడు కూడా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నా సైన్యం పలుకుబడి తగ్గలేదు. తనను కాదని చట్టాలు చేసే పరిస్థితి ఎన్ఎల్డీ ప్రభుత్వానికి లేదు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పైగా సైన్యం అధికారాలను కత్తిరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్న దన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదంతా మింగుడు పడని సైన్యం పథక రచన చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. సైనిక కుట్ర జరగొచ్చునన్న కథనాల్లో నిజం లేదని, తాము ఆ మాదిరి చర్యకు పాల్పడబోమని సైన్యం చెబుతూ వచ్చింది. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించి తన నైజాన్ని వెల్లడించుకుంది. ఇంచుమించు మనతోపాటే బ్రిటిష్ వలసపాలకులపై పోరాడి మయన్మార్ స్వాతంత్య్రాన్ని సాధించుకోగా స్వల్పకాలంలోనే అది సైనిక నియంతల ఏలుబడిలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి అడపా దడపా సైనిక నియంతలు ఎన్నికల తతంగాన్ని నడిపిస్తూనే వున్నారు. 1990లో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్డీ 80 శాతం స్థానాలు గెల్చుకోగా అప్పుడు కూడా సైన్యానికి మింగుడుపడక వాటిని రద్దు చేసింది. యధాప్రకారం మరికొన్నాళ్లు సైనిక పాలన కొనసాగింది. ఈలోగా అంతర్జాతీ యంగా ఒత్తిళ్లు పెరగటంతో 2010లో మరోసారి తప్పనిసరై ఎన్నికలు నిర్వహించారు. అందులో 80 శాతం ప్రజానీకం సైన్యం ప్రాపకం వున్న పార్టీలకే అధికారం కట్టబెట్టారని ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేశారు. కానీ ఎవరూ ఆ కపట నాటకాన్ని ఆమోదించడానికి సిద్ధపడలేదు. దాంతో 2015లో ఎన్నికల నిర్వహణ తప్పలేదు. చాన్నాళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ పర్యవేక్షణలో ఆ ఎన్నికలు జరగటం, అందులో ఎన్ఎల్డీ ఘన విజయం సాధించటంతో ఇష్టం లేకున్నా సైనిక పాలకులు ఆ పార్టీకి అధికారం అప్పగించారు. అప్పట్లో ఇలా అధికారం అప్పగించటానికి రెండు కారణాలు న్నాయి. అందులో మొదటిది–పాలనపై తమ పట్టు పూర్తిగా సడలకపోవటం. రెండోది ఆంగ్ సాన్ సూకీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ సైనిక నియంతలు రాజ్యాంగం రాసుకున్నారు. సూకీకి అధికార యోగం లేకుండా చేశామని సంబరపడ్డారు. ఆ సమయంలోనే పార్లమెంటునుంచి అట్టడుగు ప్రజాస్వామ్య వ్యవస్థలవరకూ అన్నిచోట్లా తమ కోసం 25 శాతం సీట్లు దఖలు పరచుకున్నారు. తమకు ఇష్టమైనవారిని చట్టసభల్లో కూర్చోబెట్టుకుని, ఎన్నికైన ప్రభుత్వం హద్దుమీరకుండా చూశారు. ఎందుకైనా మంచిదని వీటో అధికారాలు సైతం పెట్టుకున్నారు. అందుకే గత అయిదేళ్లుగా ఎన్ఎల్డీ ప్రభుత్వం సైన్యం నిర్దేశించిన హద్దుల్లోనే పాలించింది. మైనారిటీ వర్గమైన రోహింగ్యా ముస్లింలను సైనిక దళాలు కళ్లముందే ఊచకోత కోసినా సూకీ పట్టనట్టే వ్యవహరించారు. పైగా సైన్యాన్నే సమర్థించారు. అందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొ న్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సైనికుల ఆగడాలను సమర్థించటం దారుణమని అనేకులు దుమ్మెత్తిపోశారు. కానీ సూకీని విశ్వసించటానికి సైన్యం సిద్ధంగా లేదని తాజా పరిణా మాలు తేటతెల్లం చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవచ్చునన్న రాజ్యాంగ నిబంధనకు అను గుణంగానే ఈ పని చేశామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ చెల్లదు. అలాగే ఏడాదిపాటు మాత్రమే పాలిస్తామని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ ప్రజా పాలకులకు అధికారం కట్టబెడతామని చెబుతున్న మాట కూడా బూటకమే. నవంబర్ ఎన్నికల్లో తాము సమర్థించినవారు చిత్తుగా ఓడారన్న దుగ్ధతో, తమకు సర్వాధికారాలు కట్టబెడుతున్న రాజ్యాంగాన్ని ఇప్పుడొచ్చిన మెజారిటీతో ఎన్ఎల్డీ సర్కారు మారుస్తుందనే భయంతో సైన్యం ఈ దారుణానికి తెగించిందని ప్రపంచానికి అర్థమైంది. ఇప్పుడు ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మియింత్ల ఆచూకీ తెలియకుండా పోయింది. వారిని ఎక్కడ నిర్బంధించారో, జరుగుతున్నదేమిటో వెల్లడించాల్సిన బాధ్యత సైనిక పాలకులది. ఈ కుట్రలో చైనా పాత్ర ఏమేరకుందో ఆ దేశం జవాబివ్వాలి. ఒకటైతే నిజం... ఇతర దేశాల మాదిరి సైనిక తిరుగుబా టును ఆ దేశం ఖండించలేదు. విభేదాలను రాజ్యాంగం పరిధిలో అన్ని పక్షాలూ పరిష్కరించు కోవాలని సలహా ఇచ్చింది. ఇది సరికాదు. ప్రపంచ దేశాలన్నీ సైన్యంపై ఒత్తిడి తెస్తేనే... అక్కడి ప్రజ లకు నైతిక మద్దతునిస్తేనే ప్రజాస్వామ్యం మళ్లీ చివురిస్తుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. -
ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు!
జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తికి ఎంతటి ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల్లో ఘన విజయం సాధించినా మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. ఆ పవర్ లేనందు వల్లనే మయన్మార్ సైన్యం తాజాగా మరొకసారి దేశంలోని ‘ప్రజా పాలన’ను∙చేజిక్కించుకుంది. సూకీని నిర్బంధించింది. సూకీకి అప్పుడు 43 ఏళ్లు 8–8–88. ఆగస్టు 8, 1988. రంగూన్లో ప్రజలు ఎక్కడికక్కడ గుమికూడుతున్నారు. పిడికిళ్లు ఎక్కడివక్కడ బిగుసుకుంటున్నాయి. నలు దిక్కులా ప్రజాస్వామ్యం కోసం నినాదాలు! విశ్వవిద్యాలయాల విద్యార్థులు, బౌద్ధ భిక్షువులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, యువకులు, గృహిణులు, చిన్నపిల్లలు... ‘విప్లవం వర్థిల్లాలి’ అంటూ ఇళ్ల నుంచి, మఠాల నుంచి, పాఠశాలల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి పరుగులు తీస్తూ బయటికి వస్తున్నారు. ఉద్యమ ప్రకంపనలు దేశంలో ప్రతిచోటా ప్రతిధ్వనించడం మొదలైంది. వక్తలు ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. బుద్ధుడిని, మార్క్స్‌ని కలిపి బర్మాను సోవియెట్ యూనియన్‌లా మార్చేందుకు ‘కమ్యూనిస్టు నియంత’ నెవిన్ చేసిన ప్రయోగాలు వికటించి బర్మాకు తిండి కరువైంది. చివరికి తిరుగుబాటు ఒక్కటే ప్రజలకు మిగిలిన తిండీబట్టా అయింది. ఆ తిరుగుబాటు కు నాయకత్వం వహించడానికి సూకీ బయటికి వచ్చారు. ఆ తర్వాత బర్మా సైనిక పాలకులు ఆమెను దాదాపు పదిహేనేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆరేళ్ల వయసులో (1951) సూకీ సూకీ వయసిప్పుడు 75 ఏళ్లు 2020 నవంబర్ 8. మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్.ఎల్.డి.) ఘన విజయం సాధించింది. సూకీ అధ్యక్షురాలు అవ్వాలి. కానీ కాలేరు! అయ్యేపనైతే అంతకుముందు 2015లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించినప్పుడే కావలసింది. ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకు మిలటరీ ఒప్పుకోవాలి. మిలటరీ ఒప్పుకునే పనైతే మొన్న సోమవారం సూకీని, మయన్మార్ దేశ అధ్యక్షుడిని, మరికొంతమంది ఎన్.ఎల్.డి. నేతల్ని సైన్యం నిర్బంధించి, దేశాన్ని తన అధీనంలోకి తీసుకునే వరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మొన్నటి నవంబర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కనుక, ఏడాది ఆగి సక్రమ ఎన్నికలు జరిపిస్తామని సైన్యం అంటోంది. అంతవరకు సూకీ నిర్బంధంలోనే ఉండే అవకాశం అయితే ఉంది. 88కి ముందు సూకీ ఎక్కడున్నారు? పెద్ద చదువులు చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్ వచ్చిన ఏడాదే ఉద్యమ శక్తిగా అవతరించారు సూకీ. ‘ఆ శక్తి నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. ఆమె తండ్రి దేశభక్త విప్లవకాý‡ుడు. అసలు ఆంగ్ సాన్ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్ సాన్’ అన్నది ఆమె తండ్రి పేరు. ‘సూ’ అన్నది తాతగారి (నాన్న నాన్న) పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు. సూకీ రంగూన్లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్ పౌరుడు మైఖేల్ ఆరిస్ ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు. తర్వాత మయన్మార్ వచ్చి ఉద్యమం బాట పట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2015 పార్లమెంటు ఎన్నికల్లో, తిరిగి మొన్నటి 2020 ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గారు. తొలి ఎన్నికలు (2015) ఆమె సాధించిన నోబెల్ శాంతి బహుమతి కంటే గొప్ప విజయంగా చెబుతారు అక్కడి ప్రజలు. ఇక ఏం జరగబోతోంది? కుట్రపూరితంగా తిరుగుబాటు చేసి ఈ సోమవారం (ఫిబ్రవరి 1) మయన్మార్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న సైన్యం ఏడాది లోపే తిరిగి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతవరకు సూకీ సహా ముఖ్య నేతలందరూ నిర్బంధంలోనే ఉండొచ్చు. అయితే సూకీ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా బాగుండటం లేదని వార్తలు అందుతున్నాయి. 2003 లోనే.. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు.. ఆమెకు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యకు అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత 2013లో పాదానికి, 2016 లో కంటికి శస్త్ర చికిత్సలు జరిగాయి. సూకీని నిరంతరం పర్యవేక్షిస్తుండే డాక్టర్ టిన్ మియో విన్ ఆమె మరీ 48 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, రక్త పీడనం కూడా బాగా తక్కువగా ఉంది కనుక తేలికగా ఆమె బలహీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అప్పట్లోనే జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతానికి సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు. సూకీ భర్త 1999 లో 53 ఏళ్ల వయసులో మరణించారు. కొడుకులిద్దరూ బ్రిటన్ నుంచి వచ్చి పోతుంటారు. -
మయన్మార్‌లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ
సాక్షి,న్యూఢిల్లీ: మయన్మార్‌లో అనూహ్య పరిణామాలు ప్రకంపనలు పుట్టించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం పాటు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం తన సొంత టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రకటించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న ఆ దేశంలో తిరిగి సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు దేశమంతటా ఇంటర్నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది. దీంతో అనేక మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడంలేదు. సోమవారం సైనిక చర్య అనంతరం అంగ్ సాన్ సూకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని ఆర్మీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతల రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి అంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.. గత నవంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇప్పటికే సూకీ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు అయితే మిలటరీ చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని, ఎన్నికల ఫలితాలను గౌరవించాలని మయన్మార్ సైన్యాన్ని కోరింది. దేశంపై నియంత్రణ కోసం మిలటరీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
మళ్లీ మయన్మార్ సూకీదే
మయన్మార్‌లో ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) విజయం సాధించింది. పార్లమెంటులోని మొత్తం 664 స్థానాల్లో ప్రజలు ఎన్నుకోవడానికి కేటాయించినవి 476. అందులో ఎన్ఎల్డీ 346 గెల్చుకుందంటే సూకీపై ప్రజా విశ్వాసం చెక్కుచెదరలేదని అర్థం. అయిదు దశాబ్దాల సైనిక నియంతృత్వానికి ముగింపు పలుకుతూ అయిదేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో ఆమెకు ఇదే స్థాయిలో సీట్లు లభించాయి. ప్రభుత్వం ఏర్పర్చడానికి కావలసిన కనీస మెజారిటీ 322. పార్లమెంటులోని మిగిలిన స్థానాలకు సైనిక ప్రతినిధులుంటారు. సైన్యం వత్తాసువున్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ)కి 25 స్థానాలు మాత్రమే లభించాయి. ఈసారి దానికి కూడా ప్రభుత్వంలో చోటివ్వబోతున్నారు. పేరుకు మయన్మార్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ వున్నట్టు కనబడు తున్నా అది పూర్తిగా సైన్యంనీడలోనే మనుగడ సాగించాలి. ఏమాత్రం తేడా వున్నట్టు కనబడినా సైన్యం పంజా విసురుతుంది. ఎన్ఎల్డీ సాగించిన గత అయిదేళ్ల పాలన అంత సంతృప్తికరంగా ఏమీ లేదు. అందుకు ఆ ప్రభుత్వానికున్న పరిమితులే కారణం. అధ్యక్షుడు విన్ మింట్, ఉపాధ్యక్షుడు హెన్రీ వాన్ షియోలే చేతుల మీదుగా పాలన సాగినా వారు స్టేట్ కౌన్సెలర్‌గా వ్యవహరించే సూకీ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తున్నారు. ఆమె పూర్తి స్థాయిలో అధ్యక్షురాలైతే పాలనపై తమ పట్టు జారుతుందన్న భయంతో సైన్యం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. విదేశీయుల్ని పెళ్లాడినా, విదే శాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ 2008లో రూపొందిం చిన రాజ్యాంగంలో నిబంధన విధించారు. ఆ తర్వాతే 2015లో సైనిక పాలకులు ఎన్నికలకు సిద్ధపడ్డారు. అలాగే పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగేలా, మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్ చేసేవారు సభ్యుల య్యేలా మరో నిబంధన పొందుపరిచారు. ఈ 25 శాతం స్థానాలకూ ఎన్నికలు జరగవు. రాజ్యాంగంలో మరో చిత్రమైన నిబంధన కూడా వుంది. హోంమంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, సరిహద్దు వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై పూర్తి పెత్తనం సైన్యానిదే. ఈ నిబంధనల చక్ర బంధంలో ఏ ప్రభుత్వమైనా సవ్యంగా పాలన సాగించగలదా? గత అయిదేళ్లుగా ఎన్ఎల్డీ ప్రభుత్వం ఒకరకంగా అయోమయావస్థను ఎదుర్కొంది. అయితే ఇందుకు సూకీని కూడా తప్పుబట్టాలి. పరిస్థితులు సక్రమంగా లేవనుకున్నప్పుడు వాటిని మార్చడానికి పోరాడాలి. అందరినీ కూడగట్టి విజయం సాధించాలి. వాస్తవానికి సూకీ నేపథ్యం అటువంటిదే. బ్రిటిష్ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్‌లో స్థిరపడిన సూకీ అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్ వెళ్లినప్పుడు అక్కడి నిర్బంధ పరిస్థితులను నేరుగా చూశారు. పౌరజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న సైనిక పాలకులపై పోరాడేందుకు సిద్ధపడ్డారు. ఆమె నాయకత్వంలో సాగిన ప్రజాందోళనకు తలొగ్గి 1990లో సైనిక పాలకులు తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. వారు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఆమె నాయకత్వంలోని ఎన్ఎల్డీ 80 శాతం స్థానాలు చేజిక్కించుకుంది. ఫలితాలు వెలువడిన వెంటనే సైనిక పాలకులు ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమెను అరెస్టు చేశారు. మధ్యలో ఒకటి రెండుసార్లు విడుదల చేసినా ఆమెకు వస్తున్న మద్దతు చూసి బెంబేలెత్తి మళ్లీ మళ్లీ అరెస్టు చేసేవారు. అయిదేళ్ల జైలు జీవితం తర్వాత పదిహేనేళ్లపాటు ఆమె గృహ నిర్బంధంలో మగ్గారు. మధ్యలో అస్వస్థుడిగా వున్న తన భర్తను చూడటానికి బ్రిటన్ వెళ్తానన్నా ఆమెను అనుమతించలేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నదని వార్తలు వెలువడ్డాక అంతర్జాతీయంగా వచ్చిన వత్తిళ్ల పర్యవసానంగా తప్పనిసరై 2010లో ఆమెను విడుదల చేశారు. ఇలా సైన్యంపై ఇరవైయ్యేళ్లపాటు పోరాడి సైన్యం మెడలు వంచిన సూకీ... అధికారంలో కొచ్చాక మెతకగా వ్యవహరించడం మొదలెట్టారు. మైనారిటీలైన రోహింగ్యాలపై దారుణమైన హింసాకాండ అమలు చేస్తున్నా అదేమని ఖండించలేదు. వారి ఇళ్లు తగలబెట్టి, నరమేథం సాగిస్తున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, రోహింగ్యాలు ప్రాణభయంతో దేశం విడిచివెళ్లేలా చేస్తున్నా ఆమె మౌనం వహించారు. పైగా రోహింగ్యాలదే తప్పన్నట్టు మాట్లాడారు. రోహింగ్యాలు, ఇతర మైనారిటీ వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలైన రఖినే, కచిన్, కయిన్, బగోలను ‘ఘర్షణ ప్రాంతాలు’గా ముద్రేసి ఎన్నికలు నిలిపివేసినా ఆమె ప్రశ్నించలేదు. ఆ సంగతలావుంచి తాను అధ్య క్షురాలు కాకుండా అడ్డుపడుతున్న నిబంధనపైగానీ... కీలకమైన హోంశాఖ, రక్షణ శాఖ తదితరాలు సైన్యం చేతుల్లో ఉండటంపై గానీ ఆమె పోరాడ లేకపోయారు. ఒక్కమాటలో సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఒకనాటి సూకీలో ఇంత మార్పేమిటని ప్రపంచ ప్రజానీకం విస్తుపోయే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. మయన్మార్ సైన్యం దుర్మార్గాల పర్యవసానంగా దేశం విడిచిన రోహింగ్యాల్లో మన దేశానికి 40,000 మంది, బంగ్లాదేశ్‌కు 10 లక్షలమంది వచ్చారు. ఇప్పటికీ దేశంలో 600 మంది రాజకీయ ఖైదీలున్నారు. పరస్పరం సంఘర్షించుకుంటున్న భిన్న తెగల మధ్య సఖ్యత తీసుకురావడానికి, వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎన్ఎల్డీ ప్రభుత్వం చెప్పుకోదగ్గ కృషి చేసింది. సైన్యం అకృత్యాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నదన్న విమర్శలున్నా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాయి. అక్కడ మన దేశం పెట్టుబ డులు కూడా గణనీయంగానే వున్నాయి. యధాప్రకారం అక్కడ పాగావేయాలని చైనా చూస్తోంది. ఈ విషయంలో మనం అప్రమత్తంగా వుండక తప్పదు. -
స్వేచ్ఛ కోసం బందీ అయిన యోధురాలు!
మయన్మార్ నాయకురాలు, ప్రస్తుత స్టేట్ కౌన్సెలర్ (ప్రధాని పదవికి సమానమైన హోదా) ఆంగ్‌సాన్ సూకీని ఏనాటికీ దేశాధ్యక్షురాలు కానివ్వకుండా అక్కడి విపక్షాలు జాగ్రత్త పడుతున్నాయి. ఆమెకు దేశాధ్యక్షురాలు అయ్యే అవకాశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన బుధవారం నాటి తాజా రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మయన్మార్ పార్లమెంటులోని మెజారిటీ సభ్యుల ఆమోదం లభించలేదు. మయన్మార్ స్వేచ్ఛకోసం బందీ అయిన యోధురాలు ఆంగ్ సాన్ సూకీ. 1989 జూలై 20 నుంచి 2010 నవంబర్ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకుల నిర్బంధంలో గడిపారు. నిర్బంధం నుంచి సూకీ విడుదలయ్యాక మయన్మార్‌లో జరిగిన ఒక కీలక పరిణామం... ఉప ఎన్నికలు. సూకీ విడుదలవడానికి సరిగ్గా ఆరు రోజుల ముందు 2010లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత్తర్వాత ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఈ ఉపఎన్నికలు అవసరమయ్యాయి. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్.ఎల్.డి.) పాల్గొనేందుకు వీలు లేకపోవడంతో ఉప ఎన్నికలకు ఎన్.ఎల్.డి. సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సూకీ... కాము టౌన్షిప్ నియోజకవర్గం నుంచి దిగువసభకు పోటీ చేశారు. అధికార ‘యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ అభ్యర్థిపై మంచి మెజారిటీతో గెలిచారు. ఈ ఒక్క సీటే కాదు, ఖాళీ అయిన అన్ని సీట్లను దాదాపుగా ఎన్.ఎల్.డి.నే గెలుచుకుంది. ఉప ఎన్నికల ప్రచారంలో సూకీ ప్రధానంగా అవినీతి, నిరుద్యోగ నిర్మూలన అనే అంశాలపైనే దృష్టి సారించారు. అలాగే ‘2008 రాజ్యాంగం’ లోని లోపాలను సవరించి, సంస్కరించడం ద్వారా మయన్మార్‌లో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు, స్వయంప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ ఏర్పాటుకు ఎన్.ఎల్.డి. కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పర్యవసానమే సూకీ ఘన విజయం. ఫలితాలు వెల్లడవగానే ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తరమెరికా, దక్షిణమెరికా, ఇజ్రాయిల్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియాల నుంచి సూకీకి అభినందలను వెల్లువెత్తాయి. ‘‘మయన్మార్‌కి మంచి భవిష్యత్తు ఉంది. అది మీ వల్లే సాధ్యమౌతుంది’’ కొందరు దేశాధినేతలు సూకీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి 2015 ఎన్నికల్లోనూ సూకీ ఘన విజయం సాధించారు. ఈ ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. ఆ సవరణ తెచ్చేందుకే బుధవారం పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడితే.. రెండింట మూడొంతుల మద్దతు లభించక అదే ఆమోదం పొందలేదు. సూకీ భర్త, ఇద్దరు కొడుకులు బ్రిటన్ జాతీయులు. ఆమె భర్త 1999లో చనిపోయారు. -
తగునా ఇది సూకీ!
ఉన్నట్టుండి పాత్రలు తారుమారైతే, స్వరం మారిపోతే దిగ్భ్రాంతిపడటం... కలో నిజమో తెలియక కంగారుపడటం ఎలాంటివారికైనా తప్పదు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందు హాజరుకావడం, ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన మానవ హననమని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసించిన క్రౌర్యాన్ని కప్పెట్టే యత్నం చేయడం కళ్లారా చూసినవారికి అలాగే అనిపించింది. ఆంగ్‌సాన్ సూకీ సాధారణ మహిళ కాదు. పదిహేనేళ్లపాటు మయన్మార్ సైనిక దుశ్శాసకుల ఉక్కు నిర్బంధంలో మగ్గినా ఆమె మొక్కవోని పోరాట దీక్ష ప్రదర్శించారు. అలాంటి నాయకురాలు గత వారం ఐసీజే ముందు దాదాపు 30 నిమిషాలపాటు సైనిక పాలకులను సమర్థిస్తూ మాట్లాడటం ఎవరూ ఊహించలేరు. 2017లో మయన్మార్‌లో సైన్యం రోహింగ్యా తెగవారిపై విరుచుకుపడి గ్రామాలకు గ్రామాలు తగలబెట్టి, వేలాదిమందిని ఊచకోత కోసిన ఉదంతంపై దర్యాప్తు జరిపించి కారకులైనవారిని కఠినంగా దండించాలని ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం గాంబియా ఐసీజేలో దాఖలు చేసిన ఫిర్యాదుపై జరిగిన విచారణకు ఆమె హాజరయ్యారు. మయన్మార్ సైన్యంపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరమని ఆమె గట్టిగా వాదించారు. తరచు సైనికులపైనా, పౌరులపైనా సాయుధ దాడులకు పాల్పడుతున్న ఆరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(అర్సా) సంస్థను అదుపు చేసేందుకు సైన్యం తీసుకున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 2017 ఆగస్టు 25న వేలాదిమంది అర్సా సాయుధులు 30 పోలీసు పోస్టులపైనా, గ్రామాలపైనా, రఖైన్‌లోని సైనిక స్థావరంపైనా దాడులు జరిపినప్పుడు సైన్యం వాటిని తిప్పికొట్టిందేతప్ప పౌరులను ఊచకోత కోసిందనడం అబద్ధమని సూకీ సెలవిచ్చారు. బాలికలపైనా, మహిళలపైనా అత్యాచారాలు జరిపిన సైనికులు, ఇళ్లల్లో చిన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా విసిరేశారని న్యాయమూర్తుల ముందు మహిళలు వాంగ్మూలం ఇస్తుండగా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయిన సూకీ, ఆ మర్నాడు సైన్యాన్ని గట్టిగా వెనకేసుకొస్తూ ప్రసంగించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. దాదాపు అరవైయ్యేళ్లుగా సాగుతున్న సైనిక నియంతృత్వంనుంచి 2015లో మయన్మార్ విముక్తమైనట్టు కనిపించినా ఆ దేశంలో ఇప్పటికీ సైన్యానిదే ఆధిపత్యం. ఆంగ్‌సాన్ సూకీని విడుదల చేసి ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి సైనికాధిపతులు అనుమతించినా, దేశాధినేత కాకుండా నిబంధనలు పెట్టారు. కనుక ప్రధాని పదవితో సమానమైన స్టేట్ కౌన్సిలర్ హోదాలో మాత్రమే ఆమె కొనసాగుతున్నారు. ఇప్పుడు రోహింగ్యాల విషయంలో వారి అభీష్టాన్ని కాదంటే ఆ పదవి కూడా ఉండదన్న ఆందోళనతో సైనిక పాలకులకు సూకీ వంతపాడుతున్నారు. మయన్మార్ సైన్యం తమ దురాగతాలకు సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం గ్రామాలకు గ్రామాలను కాల్చి బూడిద చేసింది. కొందరు ఆరోపిస్తున్నట్టు తమ సైనికులు అత్యాచారాలకు పాల్పడలేదని, పౌరుల్ని కాల్చి చంపలేదని వాదించడానికి అసలు రోహింగ్యాలు చెబుతున్నచోట గ్రామాలే లేవని బుకాయించడం కోసమే దీన్నంతటినీ సాగించారు. అయితే ఉపగ్రహ ఛాయా చిత్రాలు జరిగిందేమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఇదే ఊచకోత మయన్మార్‌లో కాక మరోచోట జరిగుంటే అగ్రరాజ్యాలు తెగ ఆవేశపడేవి. ఆ దేశానికి సైన్యాన్ని తరలించేవి. పాలకుల్ని బెదిరించేవి. కానీ మయన్మార్ విషయంలో అది చెల్లుబాటు కాదు. దురాక్రమణకు ప్రయత్నిస్తే పొరుగునున్న చైనా దాన్నంతటినీ చూస్తూ ఊరుకోదు. ఆ దేశ పాలకులకు వత్తాసుగా ముందుకొస్తుంది. అందుకు సిద్ధపడదామనుకున్నా అదేమంత లాభసాటి కాదు. భూగోళంపై ఏమూల సహజవనరులున్నా వాలిపోయే తమ దేశంలోని కార్పొరేట్లకు రోహింగ్యాల గడ్డ రఖైన్ ఏమాత్రం పనికొచ్చే భూమి కాదు. అక్కడున్న సహజ వనరులు అతి స్వల్పం. కొద్దిమంది పౌరులకు పనికల్పించేందుకు కూడా ఆ వనరులు పనికి రావు. ఇక లాభాల మాటే లేదు. ప్రపంచంలో ముస్లింలకు తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే దేశాలు చాలావున్నాయి. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియావంటి సంపన్న దేశాలున్నాయి. కండబలం ప్రదర్శించడానికి వెనకాడని టర్కీ ఉంది. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ) వంటివున్నాయి. ఎవరికీ రోహింగ్యాల వెతలు పట్టలేదు. కళ్లముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి లేదా కనీసం అది తప్పని చెప్పడానికి దండిగా డబ్బు, కండబలం ఉండక్కర్లేదు. కాస్తంత నైతికబలం ఉంటే చాలు. కనీసం ఆఫ్రికా ఖండంలో ఎక్కడుందో ఎవరికీ తెలియని గాంబియా చేసింది ఆ పనే. అది మయన్మార్‌కు 11,265 కిలోమీటర్ల దూరానుంది. అయినా స్పందించింది. కడవలకొద్దీ కన్నీళ్లు కార్చడం తప్ప, రోహింగ్యాల కోసం ఏమీ చేయని బడా దేశాలు సిగ్గుపడేలా ఈ దారుణాన్ని ఐసీజే దృష్టికి తీసుకురావాలని అది నిర్ణయించింది. ఇప్పుడు ఐసీజేలో సైనిక దురాగతాలను వెనకేసుకొచ్చిన సూకీ వారి బాటలోనే కనీసం రోహింగ్యాల పేరెత్తడానికి కూడా ఇష్టపడలేదు. ఒకే ఒక్క సందర్భంలో... అది కూడా ‘అర్సా’ గురించి చెప్పవలసి వచ్చిన సందర్భంలో ఆ పేరు ప్రస్తావించారు. కనీస అవసరాలైన తిండి, బట్ట, ఆవాసం, వైద్యం వంటివి లేక తరతరాలుగా రోహింగ్యాలు ఇబ్బందులు పడుతున్నారు. సైన్యం ఆగడాలతో పొరుగునున్న బంగ్లాదేశ్‌కు పోయి అత్యంత దైన్యస్థితిలో శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు జరిగింది ఐసీజే విచారణ మాత్రమే. ఇందులో దోషులెవరో తేల్చడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. బంగ్లాదేశ్‌లో ఉన్న రోహింగ్యాలను వెనక్కి తీసుకొచ్చి, అంతా సవ్యంగా ఉందని చెప్పడం కోసం 2017 నవంబర్‌లో మయన్మార్ ఆ దేశంతో అవగాహనకొచ్చింది. అయితే కనీస హక్కులకు గ్యారెంటీ ఇస్తే తప్ప వెనక్కి వెళ్లేందుకు వారు సుముఖంగా లేరు. ఐక్యరాజ్యసమితి సంస్థల ద్వారా వారికి అండదండలందించి, వారు మనుషులుగా బతకడానికి సాయపడటం ప్రపంచ దేశాల కర్తవ్యం. -
స్త్రీలోక సంచారం
బర్మా రాజకీయ నాయకురాలు, తిరుగుబాటు యోధురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూచీకి 2009లో ఇచ్చిన ‘ది అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ అవార్డు’ను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉపసంహరించుకుంది. మానవహక్కుల కోసం ఒకప్పుడు బర్మా నియంత ప్రభుత్వంతో అలుపెరగక పోరాడిన సూచీ.. బర్మాలో రొహింగ్యా ముస్లింల ఊచకోత జరుగుతుంటే.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయారనీ, ఆ ధోరణి.. ఒకప్పుడు ఆమె పాటించిన విలువలకు వెన్నుపోటు పొడవడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. అయితే అవార్డును వెనక్కు తీసుకోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదని సూచీ తిరుగు సమాధానం ఇచ్చారు. భారత ఎన్నికల సంఘం తొలిసారిగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో అందరూ మహిళలే ఉండే ఐదు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. స్థానిక భాషలో ‘స్నేహితురాలు’ అనే అర్థం వచ్చే ‘సంఘ్వారీ’ అనే పేరును ఈ ప్రత్యేక మహిళా పోలింగ్ బూత్‌లకు పెట్టింది. మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే ఈ బూత్‌లలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది.. అంతా మహిళలే కావడంతో.. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలైనప్పటికీ మహిళలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి బూత్‌లనే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, తెలంగాణల ఎన్నికల్లో కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. హవాయి రాష్ట్రం నుంచి అమెరికన్ ‘కాంగ్రెస్’కు నాలుగుసార్లు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ (37) వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (2020) పోటీ చేయబోతున్నట్లు లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఒక సదస్సులో ఇండియన్ అమెరికన్ సంపత్ శివాంగి ప్రకటించారు. తులసి తల్లిదండ్రులకు భారతదేశంతో ఏవిధమైన అనువంశిక సంబంధాలూ లేనప్పటికీ ఆమె తల్లి.. హైందవ ధర్మాలను, ఆచారాలను పాటించడంతో తులసి కూడా తన పద్దెనిమిదవ ఏట నుంచీ హిందుత్వానికి ఆకర్షితురాలై, భారతీయురాలిగా పరిగణన పొందుతున్నారు. కాగా, తను అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్లు డాక్టర్ సంపత్ చేసిన ప్రకటనను తులసి ఖండించడం గానీ, నిర్ధారించడం గానీ చేయలేదు. -
మయన్మార్ చరిత్రలో చీకటిరోజు
నోపిడా : మయన్మార్ చరిత్రలో ఈ రోజును చీకటి రోజుగా ఆ దేశ పత్రిక సెవెన్ డైలీ (7డైలీ) వర్ణించింది. దేశంలో వాక్ స్వాతంత్య్ర లేదని, మీడియాపై ప్రభుత్వం కుట్రపూరీతంగా వ్యవహరిస్తోందని దేశంలో అతిపెద్ద ప్రచురణగల సెవెన్ డైలీ మొదటి పేజీలో ప్రచురించింది. అంతేకాకుండా మొదటి పేజీలో కొంత భాగాన్ని పూర్తిగా నల్లరంగుతో ప్రచురించి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మయన్మార్‌లో ఇటీవల జరిగిన రోహింగ్యాల ఊచకోతపై ఇద్దరు జర్నలిస్టులు ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా కథనాలు రాశారన్న ఆరోపణలతో.. ప్రభుత్వం వారిపై అక్రమ కేసులను పెట్టింది. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్లు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన పత్రికలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రజాప్రభుత్వం పేరుతో 2015లో బాధ్యతలు స్వీకరించిన అంగ్‌సాన్ సూకీ కూడా గతంలో దుర్మర్గాలకు పాల్పడిన సైన్యం అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సెవెన్ డైలీ వ్యాఖ్యానించింది. పత్రికలపై సెన్సార్షిప్ విధిస్తూ 2012 సైన్యం చట్టం చేసిందని.. ఆ చట్టం పేరుతో సూకీ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని తీవ్రంగా మండిపడింది. -
స్త్రీలోక సంచారం
వచ్చే ఏడాది మార్చిలో ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో, సమాఖ్యేత దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలలో భాగంగా ఆఫ్రికా ఖండంలో మూడు దేశాల పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. దక్షిణాఫ్రికా పట్టణం కేప్ టౌన్‌లోని ఏద్ ఎంకిజే హైస్కూల్‌ను సందర్శించినప్పుడు, ఆ పాఠశాల పిల్లలతో కలిసి చేసిన నృత్యంపై సోషల్ మీడియాలో వెక్కిరింపులు, విపరీత వ్యాఖ్యలు మొదలయ్యాయి. 61 ఏళ్ల థెరిసా మే.. మనిషి మొత్తం బిగదీసుకుపోయి కాళ్లు, చేతులు మాత్రమే కదుపుతూ రోబోలా డ్యాన్స్ చేశారని, ఓ ఆత్మ నిద్రలోంచి లేచి వచ్చినట్లుందనీ, ఆమె అసలు డ్యాన్స్ చేయకుండా ఉండినా బాగుండేదని ఆమెపై విమర్శలే ఎక్కువగా రాగా, అతి కొద్దిమంది మాత్రం.. పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా ఉత్సాహం రావడం సహజమే కాబట్టి, థెరిసా మే నృత్యాన్ని సహజమైనదిగా, పసి మనసంత అందమైనదిగా చూడాలని కామెంట్లు పోస్ట్ చేశారు. ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఈ ఏడాది మే 19న పెళ్లి రోజు ధరించిన వెడ్డింగ్ గౌన్‌ను అక్టోబర్ 26 నుంచి జనవరి 6 వరకు బెర్క్‌షైర్‌లోని విండ్సర్ పట్టణంలో ఉన్న విండ్సర్ క్యాజిల్‌లో, వచ్చే జూన్ 14 నుంచి అక్టోబర్ 6 వరకు స్కాట్లాండ్లోని హోలీరూడ్ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వజ్రాలు పొదిగిన ఆ తెల్లటి గౌనుతో పాటు.. పెళ్లికి ప్రిన్స్ హ్యారీ ధరించిన దుస్తులను కూడా పౌరవీక్షణకు ఉంచుతున్నారు. ఒక హాస్యభరిత కార్యక్రమంలో (స్కిట్) మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సతీమణి కొరెట్టా స్కాట్ పాత్రను పోషించి, మార్టిన్‌పై జోకులు వేసినందుకు తను ఎంతగానో చింతిస్తున్నట్లు అమెరికన్ పాప్ గాయని కార్డీ బీ.. మార్టిన్ కుమార్తెకు క్షమాపణలు చెప్పుకున్నారు. ‘రియల్ హౌస్‌వైఫ్స్’ అనే నాలుగు నిమిషాల నిడివి గల ఆ స్కిట్లో 24 ఏళ్ల కార్డీ.. పౌరహక్కుల నాయకుడైన మార్టిన్‌కు అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నట్లు, అణకువ గల భార్యగా కొరెట్టా స్కాట్ ఆయన్ని సహనంగా భరించినట్లు కథ అల్లడంతో విమర్శలు మొదలై, విషయం అపాలజీ వరకు వెళ్లింది. మయన్మార్ సైన్యం ముస్లిం రోహింగ్యాలపై మారణహోమం జరిపిందని ఐక్యరాజ్య సమితి దర్యాప్తు బృందాలు నివేదిక ఇచ్చినందున.. అందుకు ప్రాయశ్చిత్తంగా ప్రస్తుత మయన్మార్ కౌన్సిలర్, విదేశీ వ్యవహారాల మంత్రి అయిన ఆంగ్ సాన్ సూచీకి తాము 1991లో ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కు తీసుకుంటామని వస్తున్న వార్తల్లో నిజం లేదని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ ప్రైజ్ అన్నది.. అది ఫిజిక్స్‌లో గానీ, ‘పీస్’లో గానీ ఒక వ్యక్తి జరిపిన కృషికి ఇచ్చేదే కానీ.. తిరిగి వెనక్కు తీసుకునేది కాదని, కమిటీలో అలాంటి నియమ నిబంధనలు కూడా ఏమీ లేవని నోబెల్ కమిటీ సెక్రెటరీ ఓలవ్ ఎన్జోల్స్టాండ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో ‘ఆనంద’ అనే ఓ ప్రైవేటు టీవీ చానెల్లో పనిచేస్తున్న సుబర్ణ అఖ్తర్ నోడీ అనే 32 ఏళ్ల మహిళా జర్నలిస్టును.. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో నరికి చంపేశారు. తొమ్మిదేళ్ల కూతురుతో ఉంటున్న నోడీ, తన భర్త ఉండి విడాకుల కోసం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తూ ఉన్న క్రమంలో మంగళవారం రాత్రి పదిన్నర, పదకొండు గంటల సమయంలో కాలింగ్ బెల్ నొక్కి, ఆమె తలుపు తియ్యగానే లోనికి ప్రవేశించిన దుండగులు కత్తితో ఆమెను నరికి చంపేయడం వెనుక ఆమె భర్త హస్తం ఉండివుండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆమ్స్టర్డ్యామ్లో కొత్తగా తెర చిన ఒక బేకరీకి ‘యాన్ అండ్ ఫ్రాంక్’ అనే పేరు పెట్టడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ వెంటనే ఆ పేరును మార్చాలని ఒత్తిడి తేవడంతో.. ఆశ్చర్యానికి లోనైన రోబెర్టో అనే ఆ బేకరీ యజమాని.. ‘‘యాన్ ఫ్రాంక్ నివసించిన ఇంటికి సమీపంలో మా షాపు ఉంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాను. ఇందులో తప్పేమిటో నాకు అర్థం కాలేదు కనుక నా బేకరీ పేరును మార్చాలని నేను అనుకోవడం లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల చేత చిక్కి, నిర్బంధ శిబిరంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన సాహస బాలిక ప్రపంచంలోనే ఎంతోమందికి అభిమాన కథానాయిక.. అలాగే నాక్కూడా’’ అని రోబెర్టో కరాఖండిగా చెప్పేశారు. కరుణానిధి భార్య.. 80 ఏళ్ల దయాళు అమ్మాళ్ చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గోపాలపురం నివాసంలో ఉంటున్న అమ్మాళ్కు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించిన అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసిన వైద్యులు.. అమె ఆరోగ్య స్థితి ఎలా ఉందన్న విషయంపై మాత్రం స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. 86 ఏళ్ల వయసులో 2005 అక్టోబర్ 31న మరణించిన నవలా రచయిత్రి, కవయిత్రి, ప్రముఖ వ్యాసకర్త అయిన అమృతాప్రీతమ్ జయంతి నేడు. 1919 ఆగస్టు 31న ఢిల్లీలో జన్మించి, తొలి పంజాబీ కవయిత్రిగా ప్రసిద్ధురాలైన అమృత.. జ్ఞానపీuŠ‡తో పాటు, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ, పద్మ విభూషణ్, శతాబ్ది సమ్మాన్ అవార్డులను పొందారు. -
అవార్డు విషయంలో అంగ్‌సాన్ సూకీకి ఊరట
యంగూన్ : నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనక్కి తీసుకునే విషయంలో అంగ్ సాన్ సూకీకి ఊరట లభించింది. సూకీకి ప్రదానం చేసిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోబోవడం లేదంటూ నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రకటించింది. ఈ విషయం గురించి నార్వే నోబెల్ కమిటీ కార్యదర్శి ఓలావ్ నోజెలాడ్స్.. ఒక్కసారి ఎవరికైనా నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తే దాన్ని రద్దు చేయడం.. వెనక్కి తీసుకోవడం వంటివి కుదరవని తెలిపారు.అలా చేయడం నోబెల్ అవార్డుల నియమ నిబంధనలకు వ్యతిరేకమని వివరించారు. అంతేకాక స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకోసం అంగ్ సాన్ సూకీ చేసిన కృషికిగాను 1991లో ఆమెకి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవడం కుదరదని ఓలావ్ నోజెలాడ్స్ తెల్చి చెప్పారు. రోహింగ్యా ముస్లిం పట్ల మయన్మార్ అవలంబిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్‌గా ఉన్న అంగ్ సాన్ సూకీ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి కూడా అంగ్ సాన్ సూకీ తీరును తప్పుపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రపంచ దేశాలు గతంలో సూకీకి ప్రదానం చేసిన గౌరవ పురస్కారాలని వెనక్కి తీసుకుంటున్నాయి. ఫలితంగా 1997లో అందుకున్న ‘ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్’ గౌరవ పురస్కారాన్ని సూకీ కోల్పోయారు. ఈ క్రమంలోనే 1991లో అంగ్‌సాన్ సూకీకి ప్రదానం చేసిన ‘నోబెల్ శాంతి పురస్కారా’న్ని కూడా వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనలు వచ్చాయి. -
మయన్మార్ అధ్యక్షుడి రాజీనామా
మయన్మార్ : తమ అధ్యక్షుడు హితిన్ క్యా రాజీనామా చేసినట్లు మయన్మార్ అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత బాధ్యతలు, విధుల నుంచి విశ్రాంతి తీసుకునేందుకు ఆయన రాజీనామా చేశారని ఫేస్బుక్లో పోస్ట్ చేశాయి. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షులు అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అప్పటి నుంచి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మింట్ స్వీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. హితేన్ నామమాత్రమే... 2016లో జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ విజయం సాధించింది. అప్పుడు అంగ్‌సాన్ సూకీనే అధ్యక్షురాలు అవుతుందని అందరూ భావించారు. కానీ ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. విదేశీయుడిని పెళ్లి చేసుకున్న కారణంగా ఆమె అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆమె స్థానంలో తనకు అత్యంత విధేయుడైన హితేన్కు పట్టం కట్టి సలహాదారుగా వ్యవహరించారు. ప్రధాని హోదాకు సమానమైన స్టేట్ కౌన్సిలర్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశ పాలనలో తనదైన ముద్ర వేశారు. కానీ రోహింగ్యాల విషయంలో అంగ్‌సాన్ సూకీ, హితేన్ ఇతర దేశాల నుంచి వ్యతిరరేకత ఎదుర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్లే.. 71 ఏళ్ల హితేన్ అనారోగ్య కారణంగానే అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి అంగ్ షిన్ తెలిపారు. పార్టీకి చెందిన మరో వ్యక్తి ఏడు రోజుల్లోగా అధ్యక్షునిగా ఎన్నికవుతారని, రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. -
సూకీ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
యంగూన్: మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్ అంగ్ సాన్ సూకీ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఝా హెచ్టయ్ గురువారం అధికారంగా ప్రకటించారు. గుర్తుతెలియని దుండగులు సూకీని లక్ష్యంగా చేసుకుని.. ఇంటి ఆవరణలో బాంబు విసిరారని ఆయన స్పష్టం చేశారు. కానీ ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ పెట్రోల్ బాంబు దాడి ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
రోహింగ్యా.. రోదన: సూచీకి షాక్..
లండన్: మయన్మార్‌లో రోహింగ్యాల ఆక్రందన కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న మయన్మార్ అనధికార ప్రభుత్వాధినేత ఆంగ్‌సాన్ సూచీకి ఆక్స్ఫర్డ్ సిటీ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఆమెకు గౌరవసూచకంగా ప్రదానం చేసిన 'ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్' బిరుదును వెనుకకు తీసుకుంది. మయన్మార్ నియంత పాలనలో ప్రజాస్వామ్యం కోసం పోరాడినందుకు 1997లో ఆక్స్ఫర్డ్ కౌన్సిల్ ఆమెకు ఈ గౌరవాన్ని ప్రకటించింది. మంగళవారం భేటీ అయిన కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఆమెకు ప్రకటించిన గౌరవ బిరుదును వెనుకకు తీసుకుంది. ఆమె ఈ గౌరవానికి ఇక ఎంతమాత్రం అర్హురాలు కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సిటీ కౌన్సిల్ చరిత్రలో ఇది అసాధారణ చర్య అని కౌన్సిల్ లీడర్ బాబ్ ప్రైస్ తెలిపారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన సూచీకి ఆక్స్ఫర్డ్ నగరంతో మంచి అనుబంధం ఉంది. 1964-67 మధ్య ఇక్కడే సెయింట్ హ్యుగ్ కాలేజీలో చదివిన ఆమె.. కొంతకాలం ఇక్కడ కుటుంబంతో కలిసి నివసించారు కూడా. ఇటీవల సెయింట్ హ్యూగ్ కాలేజీ ప్రవేశమార్గంలో ఉన్న ఆమె చిత్రాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలోనే సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలైన రోహింగ్యాల దుస్థితి కొనసాగుతోంది. ఇక్కడ తలపెట్టిన ఆర్మీ ప్రేరేపిత హింస, సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే 50వేలకుపైగా మంది రోహింగ్యాలు నిరాశ్రయులయ్యారు. శరణార్థులుగా పొరుగు దేశాలకు వలస పోతున్నారు. -
ఆమె పెయింటింగ్‌ను ఆక్స్‌ఫోర్డ్ తీసేసింది
లండన్ : మయన్మార్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభ నేపథ్యంలో ఆక్స్‌ఫోర్డ్ కాలేజీ ఆ దేశ సలహాదారు, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూచీ పెయింటింగ్‌ను ప్రజల సందర్శన నుంచి తీసేసింది. ప్రధాన ద్వారం వద్దనున్న నోబెల్ గ్రహీత సూచీ పెయింటింగ్‌ను తొలగిస్తున్నట్టు సెయింట్ హు కాలేజీ గవర్నింగ్ బాడీ గురువారం నిర్ణయించింది. కొత్త విద్యార్థులు రాబోతున్న క్రమంలో ఆమె పెయింటింగ్‌ను ప్రధాన ద్వారం నుంచి కాలేజీ తీసేసింది. 1999 నుంచి కాలేజీ ప్రధాన ద్వారంలో ఆమె పెయింటింగ్ చాలా ప్రాచుర్యం సంపాదించుకుంది. ఆంగ్ సాన్ సూచీ ఆ కాలేజీ నుంచే అండర్ గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. 2012లో ఆంగ్ సాన్ సూచీ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 1964 నుంచి 1967 మధ్యలో రాజకీయ, తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రాలను ఆ కాలేజీలోనే అభ్యసించారు. తన 67వ జన్మదిన వేడుకలను కూడా సూచీ అక్కడే చేసుకున్నారు. కానీ ఇటీవల రోహింగ్యా మైనార్టీల విషయంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు విమర్శనాత్మకంగా మారింది. మయన్మార్ మిలటరీ దళాల నుంచి రోహింగ్యాలు తీవ్ర దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ నెల మొదట్లో తమకు కొత్త పేయింటింగ్ గిఫ్ట్‌గా వచ్చిందని, ఈ క్రమంలో ఆంగ్ సాన్ సూచీ పెయింటింగ్‌ను స్టోరేజ్‌లోకి తరలిస్తున్నట్టు సెయింట్ హు కాలేజీ తెలిపింది. అయితే కాలేజీ ఈ కారణం చెబుతున్నప్పటికీ, సరియైన కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఆమె పెయింటింగ్‌ను తొలగించే నిర్ణయం తీసుకునే గవర్నింగ్ బాడీలో కళాశాల సభ్యులు, ప్రిన్సిపాల్ ఉన్నారు. 1991లో ఆంగ్‌సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమానం వచ్చింది. -
రోహింగ్యాలకు ఆహ్వానం..!
-
రోహింగ్యాలకు ఆహ్వానం..!
తొలిసారి స్పందించిన మయన్మార్ ప్రభుత్వం రఖైనా ఘటనలపై విచారం వ్యక్తం చేసిన సూకీ అంతర్జాతీయ పరిశీలకులు ఎవరైనా రావచ్చు శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆంగ్సాన్సూకీ యాంగాన్ : వలసవెళ్లిన శరణార్థులు తిరిగి దేశానికి రావచ్చని.. మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీ మంగళవారం ప్రకటించారు. రోహింగ్యా ముస్లింలపై ఆగస్టు 25న జరిగిన దాడి తరువాత తొలిసారిగా ఆ దేశం స్పందించింది. ఉత్తర మయన్మార్‌లోని రఖైనా రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండ తరువాత 4 లక్షల 10 వేల మంది రోహింగ్యాలు సరిహద్దు దాటి ఇతర దేశాలకు వలస వెళ్లారు. దీనిపై తొలిసారి మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలు తిరిగి దేశానికి రావచ్చు.. అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలతోనే చేపడతామని ఆమె స్పష్టం చేశారు. జాతినుద్దేశించిన సూకీ మాట్లాడుతూ.. మతపరమైన అంశాలతో మయన్మార్‌ను విభిజించాలని, ఒక జాతిని నిర్మూలించాలన్న లక్ష్యంతోనూ ప్రభుత్వం పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా శాంతి, సౌఖ్యాలతో జీవించేందుకు ప్రభుత్వం అన్నిసౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. రోహింగ్యాలపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. దీనిపై ఎంతో మథనపడ్డానని చెప్పారు. ఇది మంచిది కాదు మయన్మార్‌లో జరిగిన మానవహక్కుల ఉల్లంఘన, హింసాత్మక పరిణామాలను సూకీ తీవ్రంగా ఖండించారు. మయన్మార్‌లో మళ్లీ శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు సూకీ వెల్లడించారు. పరిస్థితులపై ఆరా రోహింగ్యాలకు, ఇతర జాతులకు ఎందుకు విభేధాలు వచ్చాయి? రఖైనా రాష్ట్రంలో ఎందుకంత హింస చెలరేగింది? అంటి అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు తెలుసుకుంటామని సూకీ వెల్లడించారు. రఖైనా రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యాల్లో మెజారిటీ ప్రజలు దేశం కోసం త్యాగాలు చేశారని సూకీ గుర్తు చేశారు. అందరిదీ..! మయన్మార్ అనేది ఏ ఒక్క మతానికి, జాతికో చెందిన దేశం కాదని.. అందరిదీ అని సూకీ చెప్పారు. బర్మా అనే దేశం ఏ అంతర్జాతీయ సమాజానికో, విచారణలకో భయపడదని సూకీ తెలిపారు. ఎవరైనా రావచ్చు.. పరిశీలించవచ్చు! మయన్మార్‌కు అంతర్జాతీయ పరిశీలకుడు, సంస్థలు రావచ్చని.. ఇక్కడి పరిస్థితులలు తెలుసుకోవచ్చని ప్రకటించారు. సూకీ ప్రసంగంలో ముఖ్యాంశాలు -మయన్మార్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడి 18 నెలలు. ఇన్నేళ్లుగా దేశంలో పేరుకుపోయిన అనేక సమస్యలను, సవాళ్లను మేం ఎదుర్కొంటున్నాం. చాలావాటిని పరిష్కరించగలిగాం. ప్రపంచమంతా రఖైనా రాష్ట్రంమీద దృష్టి పెట్టింది. మేం ధైర్యంగా చెబుతున్నాం. ఏవరైనా.. ఏ సంస్థ అయినా ఇక్కడకు వచ్చి పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవచ్చు. మయన్మార్‌లో శాంతిని పునరుద్దరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రోహింగ్యాలపై జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. ప్రభుత్వం రఖైనా రాష్ట్రంలో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం. -
రోహింగ్యాలు: మాకు అతిపెద్ద సవాల్!
నేపితా: మయన్మార్‌లో ముదురుతున్న రోహింగ్యాల సంక్షోభంపై ఆ దేశ ప్రభుత్వ కౌన్సిలర్ ఆంగ్‌సాన్ సూచీ స్పందించారు. 'ఇది మాకు అతిపెద్ద సవాలు..కేవలం ప్రభుత్వంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఈ సవాలును మేం పరిష్కరించాలనడం సహేతుకం కాదు' అని ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు. 'రఖైన్ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా.. సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలనకు ముందునుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోహింగ్యా ముస్లింలలో ఉగ్రవాదులెవరో, సామన్యులెవరో మేం గుర్తించాల్సి ఉంది. ఈ సమస్య గురించి భారత్‌కు బాగా తెలుసు' అని ఆమె అన్నారు. 'మా పౌరులను కాపాడటం మా కర్తవ్యం. అందుకు మేం తీవ్రంగా కృషిచేస్తున్నాం. కానీ మాకు తగినంతగా వనరులు అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన రక్షణ లభించేలా మేం చూడాలనుకుంటున్నాం' అని సూచి అన్నారు. ప్రధాని మోదీ తాజాగా మయన్మార్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో రోహింగ్యాల సంక్షోభంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సవాళ్లతో ఇబ్బందిపడుతున్న మయన్మార్‌కు భారత్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో అతివాద హింస నేపథ్యంలో ఆ దేశ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుందన్నారు. మయన్మార్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో ప్రధాని విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్ సైన్యం దాడులతో దాదాపు 1.25 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలసవెళ్లిన నేపథ్యంలో ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రఖైన్ రాష్ట్రంలో అమాయకులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అతివాద హింసపై మయన్మార్ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుంది. మయన్మార్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కోసం సంబంధిత పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి’ అని మోదీ సూచించారు. -
సమష్టి చర్చలే ‘రోహింగ్యా’కు పరిష్కారం
-
వారి ఆందోళనల్ని అర్థం చేసుకున్నాం
♦ సమష్టి చర్చలే ‘రోహింగ్యా’కు పరిష్కారం: ప్రధాని మోదీ ♦ 11 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు ♦ ఉగ్రవాదంపై పోరు, ♦ భద్రతా సహకారం పటిష్టానికి అంగీకారం మయన్మార్‌కు అండగా.. నేపితా: మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సవాళ్లతో ఇబ్బందిపడుతున్న మయన్మార్‌కు భారత్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో అతివాద హింస నేపథ్యంలో ఆ దేశ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుందన్నారు. మయన్మార్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో ప్రధాని విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్ సైన్యం దాడులతో దాదాపు 1.25 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలసవెళ్లిన నేపథ్యంలో ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల అనంతరం మోదీ, సూచీలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేశారు. మయన్మార్ ఎదుర్కొంటున్న సమస్యల్ని భారత్ అర్థం చేసుకుందని మోదీ పేర్కొన్నారు. ‘రఖైన్ రాష్ట్రంలో అమాయకులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అతివాద హింసపై మయన్మార్ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుంది. మయన్మార్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కోసం సంబంధిత పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి’ అని సూచించారు. భారత్‌లో పర్యటించాలనుకునే మయన్మార్ పౌరులకు ఎలాంటి రుసుం లేకుండా వీసాల జారీకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మయన్మార్‌లో భారత్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని భేటీలో ఆయన ప్రస్తావించగా.. మరింత సాయం చేయాలని సూచీ కోరారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మయన్మార్‌కు సరైంది: మోదీ ‘ఇరు దేశాలు భద్రతా సహకారాన్ని పెంచాల్సిన అవసరముంది. రెండు దేశాల్లో ఒకే విధమైన భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మయన్మార్‌కు సరైందని నేను నమ్ముతున్నా.. అందుకే మయన్మార్ కార్యనిర్వాహక వ్యవస్థ, చట్ట సభలు, ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్, ఇతర సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యం పెంచేందుకు భారత్ పెద్ద ఎత్తున మద్దతు కొనసాగిస్తోంది. పలేట్వా దేశీయ జల రవాణా వ్యవస్థ, సిట్వే పోర్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. నాణ్యమైన విద్య, ఆరోగ్య రంగం, పరిశోధన రంగాల్లో సాయం కొనసాగిస్తున్నాం’ అని మోదీ అన్నారు. మోదీ–సూచీ మధ్య చర్చల అనంతరం.. 11 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సముద్ర రవాణా, మయన్మార్‌లో ప్రభుత్వ సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాలతో పాటు, ఇరు దేశాల ఎన్నికల సంఘాలు, ప్రెస్ కౌన్సిల్స్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఉత్పత్తుల నియంత్రణ, మయన్మార్ మహిళా పోలీసులకు శిక్షణపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. సూచీకి ప్రత్యేక కానుక... సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ(ఐఐఏఎస్)లో ఫెలోషిప్ కోసం 1986లో సూచీ సమర్పించిన పరిశోధన పత్రాల అసలు కాపీల్ని ప్రధాని మోదీ సూచీకి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్నిట్విటర్‌లో ప్రధాని వెల్లడించారు. సూచీ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. మయన్మార్ పర్యటనలో భాగంగా మోదీ బుధవారం బగన్ నగరంలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆనంద ఆలయాన్ని సందర్శించారు. -
ఆంగ్ సాన్ సూకీతో ప్రధాని మోదీ భేటీ!
నేపిథా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో భేటీ అయ్యారు. భారత్-మయన్మార్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 'విలువైన స్నేహితుడితో భేటీ కొనసాగుతోంది. సూకీతో మోదీ భేటీ అయ్యారు' అని భారత విదేశాంగశా అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. రఖినె రాష్ట్రంలోని రోహింగ్యా తెగ ముస్లింల మహావలస కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మయన్మార్ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మయన్మార్‌లో మెజారిటీ ప్రజలైన బౌద్ధులు రోహింగ్యాలపై హింసాత్మక దాడులకు దిగుతున్న నేపథ్యంలో రోహింగ్యాలు ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగుదేశాలకు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. సూకీతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ రోహింగ్యాల వలస అంశాన్ని లేవనెత్తే అవకాశముందని భావిస్తున్నారు. దేశంలోకి పెద్ద ఎత్తున సాగుతున్న రోహింగ్యాల వలసలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40వేల మంది రోహింగ్యాలను స్వదేశానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది. భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు మయన్మార్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. సూకీతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మయన్మార్ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. భారత్‌ను సందర్శించాలనుకునే మయన్మార్ వాసులకు ఉచితంగా వీసాలు ఇస్తామని తెలిపారు. భారత్‌లోని జైళ్లలో మగ్గుతున్న 40 మంది మయన్మార్ పౌరులను విడుదల చేస్తామని ప్రకటించారు. -
సూచీ..ఏంటిది ?
-
ఆ ఆక్రందన వినబడదా?
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూచీ మార్గదర్శకత్వంలో మయన్మార్‌లో రెండేళ్ల క్రితం ఏర్పడ్డ పౌర ప్రజాస్వామ్య ప్రభుత్వం విశ్వసనీయత నేడు ప్రశ్నార్థకంగా మారింది. వాయవ్య రాష్ట్రమైన రఖీన్ ఉత్తర భాగంలో సైన్యం సాగిస్తున్న జాతి విద్వేష మారణకాండ ఫలితంగా పెద్ద ఎత్తున రోహింగియాలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్ తదితర పొరుగు దేశాలకు పారి పోతున్నారు. 1978 నుంచి దఫదఫాలుగా చెలరేగుతున్న ఈ హింసాకాండ ఫలితంగా ఒక్క బంగ్లాదేశ్‌లోనే మూడు లక్షల మంది రోహింగియాలు ఆశ్రయం పొందుతున్నారు. తాజా హింసాకాండతో మరో 30 వేల మంది శరణార్థులు వచ్చి పడటంతో బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేసింది. మరింత మంది శరణార్థులను స్వీకరించే స్థితిలో బంగ్లాదేశ్లేక పోయినా గత్యంతరం లేదని, వారిని చిత్రహింసలకు, మారణకాండకు బలిచేయడమే అవుతుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ స్థానిక అధిపతి జాన్ మెక్ కిస్సిక్ నిస్సహాయతను వ్యక్తం చేశారు. సముద్రం మీదుగా ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్‌లకు చేరుకోవాలని చిన్న పడవలలో పయనిస్తున్న వేలాది మంది రోహింగియాలలో పలువురు జల సమాధి అయిపోతున్నారు. సిరియా, యెమెన్‌లలోని మానవతావాద సంక్షోభ స్థాయికి విస్తరి స్తున్న ఈ సంక్షోభం అంతర్జాతీయ ప్రపంచానికి అంతగా పట్టకపోవడం విచార కరం. తరతరాలుగా రఖీన్లో నివసిస్తున్న రోహింగియాలకు పూర్తి స్థాయి పౌర సత్వ హక్కులను ఇవ్వకపోతే మయన్మార్ తాను కోరుకుంటున్న దేశంగా అవతరిం చలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా పౌర ప్రభుత్వం కూడా సైనిక పాలకులలాగే రోహింగియాలను ‘బయటి నుంచి వచ్చినవారు’ ‘చట్టవిరుద్ధంగా వలసవచ్చినవారు’ ‘విదేశీయులు’ ‘బెంగా లీలు’ ‘ఇస్లామిక్ ఉగ్రవాదులు’ అని వాదిస్తుండటం విభ్రాంతికరం. 1784లో అటు నుంచి బెంగాల్ నవాబులు, 1785లో ఇటు నుంచి బమార్ బౌద్ధ రాజుల ఆక్రమణకు గురికావడానికి ముందు.. నేటి మయన్మార్‌లోని రఖీన్ నుంచి బంగ్లాదేశ్‌లోని చిటగాంగ్ ప్రాంతం వరకు అరఖాన్ రాజ్యం విస్తరించి ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతంలో ఇస్లాంగానీ, బౌద్ధంగానీ లేవు. రోహింగియాలు అంటే అరఖాన్ వాసులు, అరఖాన్ భాష మాట్లాడేవారు. అరఖాన్కు ముస్లింలు పెట్టిన పేరు రోహింగా. బెంగాల్‌లోని రోహింగియాలు కాలక్రమేణా అక్కడి పౌరు లుగా, నేడు బంగ్లాదేశీలుగా విలీనంకాగా, మయన్మార్‌లోని రోహింగియాలకు 1960ల నుంచి ‘విదేశీయుల’ ముద్ర వేయడం ప్రారంభమైంది. రఖీన్ ప్రజలు ఏ మతస్తులైనా వారు మాట్లాడే అరఖానీకి బెంగాలీ, అరబ్బీ, బర్మీలతో పోలికే ఉండదు. చిట్టగాంగ్ ఆదివాసుల భాషతో దానికి మాండలిక భేదాలే కనిపిస్తాయి. మయన్మార్‌ను దశాబ్దాల తరబడి పాలించిన సైనిక పాలకులు బహుజాతుల నిల యమైన దేశంలో జనాభాలో 60 శాతంగా ఉన్న బమర్ జాత్యహంకారాన్ని, బౌద్ధ మతోన్మాదాన్ని పెంచి పోషించారు. 1962 నుంచి బర్మాలో దఫదఫాలుగా జాతి విద్వేష జ్వాలలను రగిల్చి లబ్ధి పొందారు. వాయవ్యాన ముస్లిం రోహింగియా లపైనా, తూర్పున కచిన్, కరెన్ తదితర క్రైస్తవ జాతులపైన సాగిన దాడుల ఫలి తంగా వివిధ జాతుల ప్రజలు పెద్ద ఎత్తున పొరుగు దేశాలకు తరలిపోయారు. 2012లో సైన్యం రోహింగియాలపై సాగించిన మారణకాండ సందర్భంగా పలు హక్కుల సంఘాలు ఈ పరిస్థితి ఇస్లామిక్ మిలిటెన్సీకి దారితీయవచ్చని హెచ్చరించాయి. అక్టోబర్ రెండవ వారంలో బంగ్లా సరిహద్దుల్లో గుర్తు తెలియని దుండగులు తొమ్మిది మంది పోలీసు అధికారులను కాల్చి చంపారు. అది రోహిం గియా మిలిటెంట్ల పనే అని ప్రభుత్వ వాదన. అది సాకుగా సైన్యం ఉత్తర రఖీన్ అంతటా బీభత్సకాండను తీవ్రతరం చేసింది. సైన్యం, బౌద్ధ మిలీషియాలూ రోహింగియాల ఆస్తులను దగ్ధం చేసి, సామూహిక హత్యలు, మానభంగాలకు పాల్పడుతున్నట్టుగా హక్కుల సంస్థల కథనం. రఖీన్లోని నాజీ కాన్సెంట్రెషన్ క్యాంపులలాంటి సైనిక శిబిరాల్లోకి రోహింగియాలను తరలిస్తున్నారు. అలా బందీ లుగా ఉన్న 1,50,000 మంది రోహింగియాలు ఆహారం, వైద్యం కోసం అలమ టిస్తున్నారని, 3,000 మంది పసిపిల్లలు మృత్యువు అంచుల్లో నిలిచారని ఐరాస ఆందోళన వ్యక్తం చేసిందంటేనే పరిస్థితి తీవ్రత అర్థమౌతుంది. ఇంటర్నేషనల్ స్టేట్ క్రైమ్ ఇనిషియేటివ్ ఈ మారణకాండను సంఘటిత జాతి నిర్మూలనగా అభి వర్ణించింది. రోహింగియాలను భౌతికంగా నిర్మూలించాలని, దేశం నుంచి తరిమే యాలని సైన్యం ప్రయత్నిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. అంతర్జాతీయ హక్కుల సంస్థలను, మీడియాను రఖీన్లోకి అనుమతించక పోవడంతో అవి రోహింగి యాలపై మారణకాండ పేరిట కట్టుకథలను వ్యాపింప జేస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. పత్రికలపైన సైతం సైనిక పాలన తరహా నిర్బంధం అమలవుతోంది. రఖీన్ మానవతావాద సంక్షోభంపై కథనాన్ని వెలువరించిన ఒక విలేకరిని ఉద్యోగం నుంచి తొలగించినా ఒక ప్రధాన ఆంగ్ల దినపత్రిక ప్రచురణ నిలిచిపోక తప్పింది కాదు. కాగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం కోసం రోహింగియాలు తమ గ్రామాలను తామే తగులబెట్టుకున్నారని సూచీ అధికారిక ప్రతినిధి జాటే ప్రకటించారు. దీంతో ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని కొందరు భావిస్తు న్నారు. మరోవంక ప్రభుత్వం రోహింగియాల వేటకు ప్రైవేటు మిలీషియాల ఏర్పా టుకు పచ్చజెండా చూపింది. పౌర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం, అదుపూలేని సైన్యాన్ని కట్టడి చేయడానికి సూచీ ఏం చేస్తారోనని ప్రపంచం ఆమె వైపే చూస్తోంది. ఏది ఏమైనా రోహింగియాల సమస్య మానవతావాద మహా విపత్తుగా మారకముందే అంతర్జాతీయ సమాజం మేల్కొనకపోతే మయన్మార్ మరో రువాండాగా మారే ప్రమాదం ఉంది. ‘‘ప్రపంచం మాకు సహాయం చేయలేకపోతే పోనీ, ఓ బాంబేసి ఒక్కసారే చంపేయరాదా?’’ అని ఆక్రందిస్తున్న రోహింగియా తల్లుల ఆవేదనను అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా పట్టించుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. -
మయన్మార్‌కు అండగా ఉంటాం
సూచీకి భారత్ రెండో ఇల్లు: ప్రధాని మోదీ మోదీ, సూచీల మధ్య విస్తృత ద్వైపాక్షిక చర్చలు భద్రత, వాణిజ్య రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయం విద్యుత్, బ్యాంకింగ్, బీమా రంగాల్లో మూడు ఒప్పందాలు న్యూఢిల్లీ: మయన్మార్ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భారత్ హామీనిచ్చింది. మయన్మార్ విదేశాంగమంత్రి అంగ్‌సాన్ సూచీ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రత, వాణిజ్యం వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. విద్యుత్, బ్యాంకింగ్, బీమా రంగాల్లో పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముడిచమురు, సహజవాయువు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య పరిరక్షణలో సహకరించుకోవాలని తీర్మానించాయి. మయన్మార్‌లో నేషనల్ లీగ్ అధికారం చేజిక్కించుకున్నాక సూచీ భారత్‌లో మొదటిసారి పర్యటించారు. మీరు భారత్‌కు కొత్త కాదు: ప్రధాని భేటీ సందర్భంగా సూచీని ఆహ్వానిస్తూ... భారత్ ఆమెకు రెండో ఇల్లని అభివర్ణించారు. ‘మయన్మార్‌తో భారత్ స్నేహపూర్వక సంబంధాలు పూర్తి సహకారం, సంఘీభావంతో కొనసాగుతాయి. మీరు భారత ప్రజలకు కొత్త కాదు. ఢిల్లీలో ప్రదేశాలు, వాతావరణం అన్నీ బాగా తెలుసు. మీ రెండో ఇల్లైన భారత్‌కు మరోసారి ఆహ్వానం పలుకుతున్నాం’ అంటూ ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురి మధ్య చర్చల సారాంశాన్ని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సూచీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సన్నిహిత, పొరుగు దేశాలు కావడంతో భారత్, మయన్మార్ల భద్రతా ప్రయోజనాలు పరస్పరం ఆధారపడ్డాయని ప్రధాని పేర్కొన్నారు. ‘సరిహద్దు వెంట భద్రత పర్యవేక్షణలో సన్నిహిత సహకారం అందించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. వ్యూహాత్మక అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా నిర్ణయించాయి. ‘అది ఇరు దేశాలకు మంచి చేస్తుంది. వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ రంగాల్లో వ్యాపారాల్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాం’ అని ప్రధాని తెలిపారు. మన వనరులు, నైపుణ్యం మయన్మార్‌తో పంచుకుంటాం సూచీ స్పష్టమైన దూరదృష్టి, పరిణతిగల నాయకత్వం, మయన్మార్‌లో ప్రజాస్వామ్యం నెలకొనేందుకు చేసిన పోరాటం, విజయం ప్రపంచంలోని ప్రజలందరినీ ఉత్తేజితం చేసిందంటూ మోదీ కొనియాడారు. ‘సూచీ భారత్‌కు రావడం గౌరవంగా భావిస్తున్నాం, బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు’ అని ప్రధాని తెలిపారు. మయన్మార్‌లోని కొత్త ప్రభుత్వం దక్షిణాసియాను, నైరుతి ఆసియాతో అనుసంధానం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని మోదీ చెప్పారు. ఆ దేశానికి దాదాపు రూ.11,900 కోట్ల అభివృద్ధి సాయం చేస్తున్నట్లు తెలిపారు. కాలాదాన్, మూడు దేశాల గుండా సాగే హైవేతో పాటు, మానవ వనరుల అభివృద్ధి రంగం, ఆహార పరిరక్షణ, శిక్షణ, నైపుణ్యం పెంపు ప్రాజెక్టుల్లో భారత్ వనరులు, నైపుణ్యాన్ని మయన్మార్‌తో పంచుకుంటామన్నారు. మణిపూర్‌లోని మోరెహ్ నుంచి మయన్మార్‌లోని టముకు విద్యుత్ సరఫరాకు హామీనిచ్చామని, అలాగే ఎల్ఈడీ విద్యుదీకరణ ప్రాజెక్టుకు కూడా సాయం చేస్తామని మోదీ వెల్లడించారు. పప్పుదినుసుల వ్యాపారంలో పరస్పర ప్రయోజన విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ఇటీవల భూకంపంతో దెబ్బతిన్న పగోడాల మరమ్మతుకు సాయం చేస్తామని కూడా హామీనిచ్చారు. ప్రజాస్వామ్య విస్తరణలో భారత్ సాయం: సూచీ మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమం మహాత్మాగాంధీ, నెహ్రూల నుంచి పొందిందని సూచీ పేర్కొన్నారు. భారత్‌లోని భిన్నత్వం, బహుళత్వాన్ని కొనియాడారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తృతి కోసం మోదీ, తాను విస్తృత చర్చలు జరిపామన్నారు. ‘ నా పర్యటన ఇరు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహబంధాన్ని, నమ్మకాన్ని స్పష్టం చేసింది. భారత్ పర్యటన ఆనందాన్ని, పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఒకరిపై ఒకరు ఆధారపడి మరింత సన్నిహితంగా కలసి ముందుకు సాగాలనేది ఇరు దేశాల అభిమతం. మయన్మార్‌లో కింది స్థాయి వరకూ ప్రజాస్వామ్య సంస్కృతిని తీసుకెళ్లే ప్రయత్నంలో భారత్ సాయం చేస్తుందని నమ్ముతున్నాం. నిర్మాణ రంగం, ఇంధనం, సంస్కృతి, విద్యా రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకోనున్నాయి. నమ్మకంతో మయన్మార్‌లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలను కోరాను.అభివృద్ధి, రాజకీయాల విషయంలో భారత్ కంటే మయన్మార్ వెనుకబడింది. కొన్ని దశాబ్దాల క్రితం మయన్మార్ చాలా దక్షిణాసియా దేశాల కంటే ముందంజలోనే ఉండేది. మంచి స్నేహితుల సాయం, నిబద్ధతతో మళ్లీ కోలుకుంటామన్న నమ్మకంతో ఉన్నాం. మయన్మార్‌లో శాంతి, స్థిరత్వం తీసుకురావడమే తన లక్ష్యం’ అని సూచీ చెప్పారు. భారత్‌లోని భిన్నత్వం, సమాఖ్య వ్యవస్థ మయన్మార్‌కు స్ఫూర్తిగా పేర్కొన్నారు. -
భారత్‌పై వ్యతిరేకతకు చోటివ్వం
నేపిడా (మయన్మార్): భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మయన్మార్ నేతలు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత్ నుంచి తొలిసారిగా అత్యున్నత స్థాయి బృందం సోమవారం మయన్మార్‌లో పర్యటించింది. దీనిలో భాగంగా అధ్యక్షుడు యు హిటిన్ క్యాతో పాటు స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్ సూచీతో సుష్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చొరబాట్లు, సీమాంతర వ్యవహారాలు వంటి ద్వైపాక్షిక అంశాలపై కీలకమైన చర్చలు జరిపారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నామని అధ్యక్షుడు హిటిన్ తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకపాలు నిర్వహించే చొరబాటుదారులకు తమ భూ భాగంలో చోటిచ్చేదిలేదన్నారు. ప్రజాస్వామ్య విలువ విషయంలో భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల మిలిటరీ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య పాలన తీసుకువచ్చినందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సూచీకి శుభాకాంక్షలు తెలిపారు. -
సూచీ కోసం కొత్త పోస్టు సృష్టి
నేపిడా: ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూచీ కోసం కొత్త పోస్టును సృష్టించింది మయన్మార్ పార్లమెంటు. ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆ దేశ దిగువ సభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లును గత వారం ఎగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, వ్యక్తులను సలహాదారుగా సూచీ కలవవచ్చు. -
మయన్మార్ అధ్యక్షునిగా టిన్ క్వా ప్రమాణం
విదేశాంగ మంత్రిగా సూచీ నేపితా: మయన్మార్ కొత్త అధ్యక్షునిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు టిన్ క్వా(60) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. క్వా ప్రమాణ స్వీకారంతో 50 ఏళ్ల మిలిటరీ పాలన తర్వాత సూచీ ప్రజాస్వామ్య ఉద్యమంతో మయన్మార్‌లో కొత్త శకానికి పునాది పడినట్లయ్యింది. మరోవైపు సూచీ.. క్వా కేబినెట్లో విదేశాంగ శాఖతో పాటు విద్య, ఇంధన, అధ్యక్ష కార్యాలయ శాఖల బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. మాజీ జనరల్ థీన్ సేన్ స్థానంలో టిన్ క్వా కొత్త అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. క్వా.. సూచీకి స్కూల్ స్నేహితుడు. అలాగే నమ్మకమైన వ్యక్తి. ఆర్మీ తెచ్చిన కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం సూచీ కోల్పోయినా.. క్వా ద్వారా ఆమె పరోక్షంగా దేశాన్ని నడిపించనున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించడం తెలిసిందే. కాగా, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త శకానికి స్వాగతమని, దేశ రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తానని క్వా తెలిపారు. గణతంత్ర మయన్మార్ ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానన్నారు. -
విదేశాంగ మంత్రిగా సూచీ
నేపిడా: మయన్మార్ విదేశాంగ శాఖ మంత్రిగా ఆంగ్ సాన్ సూచీ బాధ్యతలు చేపట్టనున్నారు. అధ్యక్ష పదవి చేపట్టకుండా ఆర్మీ రూపొందించిన కొత్త రాజ్యాంగం అడ్డుకోవడంతో విదేశాంగ శాఖను సూచీ చేపడతారని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చేవారం టిన్ క్వా మయన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ సమయంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి వివరాలను పార్లమెంట్ స్పీకర్ వెల్లడించారు. సూచీ ఏ శాఖ నిర్వహిస్తారన్నది మాత్రం చెప్పలేదు. సూచీ విదేశాంగ శాఖతో పాటు విద్య, విద్యుత్, అధ్యక్ష కార్యాలయ శాఖల్నీ నిర్వహిస్తారని భావిస్తున్నారు. -
సూచీకి కీలక బాధ్యతలు
యంగోన్: ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా.. సైన్యం మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల మయన్మార్ అధ్యక్ష పదవికి అనర్హురాలైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూచీ కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మంత్రి పదవి చేపట్టరాదని సూచీ భావించినా, ఆమెకు కీలక శాఖలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా .. పార్లమెంట్‌కు పంపిన 18 మంది కొత్త మంత్రుల జాబితాలో ఆమె పేరు ఉంది. సూచీకి విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఇంధన, విద్యాశాఖలను కేటాయించే అవకాశముంది. టిన్ క్వా కేబినెట్లో సూచీ మినహా మరో మహిళ పేరు లేదు. నవంబర్ నాటి పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సైన్యం గతంలో మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకొని ఉండరాదు. అలాగే ఆ వ్యక్తికి విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ బ్రిటిషర్ కావడం, ఆమె ఇద్దరు పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో అధ్యక్షురాలయ్యేందుకు అనర్హురాలయ్యారు. -
అధినేత్రి ఏ మంత్రిత్వశాఖ తీసుకుంటారు..?
నేపిదా: దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు మయన్మార్ లో తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అయితే సైనిక రాజ్యాంగం నిబంధనల వల్ల ఆంగ్ సాన్ సూచీ అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారన్న విషయం తెలిసిందే. 1962 తర్వాత మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి, ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ నూతన ప్రభుత్వంలో ఏ పదవి స్వీకరిస్తారన్న దానిపై అక్కడ చర్చ జరగుతుంది. ఆమె విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి జా మింట్ మాంగ్ పేర్కొన్నారు. ఆరుగురు క్యాబినెట్ సభ్యుల పేర్లను స్పీకర్ ఎదుట ప్రకటించారు. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో చెప్పలేము, కానీ ఆమెకు విదేశాంగశాఖ అప్పగిస్తే ఇతర మంత్రులతో కలిసి బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఆంగ్ సాన్ సూచీ ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారో తెలుస్తుంది. -
సూచీ విధేయుడికే అందలం
మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా టిన్ క్వా ఎన్నిక ♦ 1962 తర్వాత అధ్యక్ష పీఠంపై తొలిసారి సాధారణ పౌరుడు నేపిదా: మయన్మార్‌లో చరిత్రాత్మక అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు తెరపడింది. 1962 తర్వాత దేశ తొలి పౌర అధ్యక్షుడిని పార్లమెంటు (దిగువసభ) ఎన్నుకుంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. పోలైన 652 ఓట్లలో క్వా 360 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సైనిక మద్దతుగల రిటైర్డ్ జనరల్ మింత్ స్వే(213 ఓట్లు), చిన్ ప్రాంత ఎంపీ హెన్రీ వాన్ థియో (79 ఓట్లు) సంయుక్తంగా దేశ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఫలితంపై ఎంపీలంతా పెద్దపెట్టున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం క్వా మీడియాతో మాట్లాడుతూ ‘ఇది సోదరి ఆంగ్ సాన్ సూచీ విజయం’’అని అన్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఆర్మీ కొత్త రాజ్యాగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోయిన సూచీ.. క్వా ఎన్నికతో పరోక్షంగా ఆ బాధ్యతల్ని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. నవంబర్‌నాటి పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించిది. అయితే సైన్యం గతంలో మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకొని ఉండరాదు. అలాగే ఆ వ్యక్తికి విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ బ్రిటిషర్ కావడం, ఆమె ఇద్దరు పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో అధ్యక్షురాలయ్యేందుకు అనర్హురాలయ్యారు. తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని దేశాధ్యక్ష పీఠంపై కోర్చోబెట్టి అతని ద్వారా పరోక్షంగా పాలన సాగిస్తానని సూచీ గతంలోనే ప్రకటించారు. క్వాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
మయన్మార్ అధ్యక్షుడిగా మాజీ కారు డ్రైవర్
నేపిదా: మయన్మార్ అధ్యక్షుడిగా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ మాజీ డ్రైవర్, ప్రధాన అనుచరుడు టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. మంగళవారం మయన్మార్ పార్లమెంట్ అధ్యక్షుడిగా టిన్ క్వాను ఎన్నుకుంది. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల సూచీ అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోవడంతో టిన్ క్వాను అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. టిన్, సూచీతో కలిసి చదువుకున్నారు. చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ భారీ విజయం సాధించింది. -
మయన్మార్ అధ్యక్ష రేసులో సూచీ డ్రైవర్
నేపిదా(మయన్మార్): అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ తన మాజీ డ్రైవర్, ప్రధాన అనుచరుడు టిన్ క్వా(69)ను మయన్మార్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోయిన సూచీ పరోక్షంగా ఆ బాధ్యతలు చూసుకోనున్నారు. టిన్, సూచీ కలిసి చదువుకోవడమేకాక, చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని ఎన్ఎల్డీ భారీ విజయం సాధించింది. తాత్కాలిక అధ్యక్షుడు యుతియిన్ పదవీకాలం మార్చి 30తో ముగుస్తుంది. ఆర్మీ రాజ్యాంగంతో అధ్యక్ష పదవికి దూరం సూచీ అధ్యక్షురాలు అవకుండా అడ్డుకునే లక్ష్యంతో ఆర్మీ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. దీని ప్రకారం... అత్యున్నత పదవి చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకోకూడదు. విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ అరిస్ బ్రిటిషర్. వీరి పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. దాంతో సూచీ అధ్యక్షురాలయ్యేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే సూచీ ఎలాగైనా అధ్యక్ష పదవి చేపడుతుందనే ఆలోచనతో ఉన్న చాలామందికి నిరాశ తప్పలేదు. న్యాయపరమైన అడ్డంకుల్ని తొలగించేందుకు సైన్యంతో కొన్ని నెలలుగా సాగుతున్న చర్చలు విఫలమయ్యాయి. -
ఆమె డ్రైవరే దేశాధ్యక్షుడు!
నెపిడా: మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా హితిన్ చా పేరును ప్రకటించారు. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ తమ అధినేతగా ఆంగ్ సాన్ సూచీ చిన్ననాటి స్నేహితుడు, సన్నిహితుడైన హితిన్ చా ను ఎన్నుకున్నారు. ఆయన గతంలో డ్రైవర్ గా విధులు నిర్వహించడం గమనార్హం. సూచీ ఉద్యమం చేస్తున్న సమయంలో ఆమెకు డ్రైవర్ గా పని చేశారు. ప్రస్తుతం ఆంగ్ సాన్ సూచీ చారిటీ ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, మిలిటరీ ఆధిపత్యాన్ని తప్పించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముగిశాయి. అందుకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వారసత్వాన్ని హితిన్ కు కట్టబెట్టాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో ఆంగ్ సాన్ సూచీ వెల్లడించారు. ఇక్కడ మన్మోహన్.. అక్కడ హితిన్ చా గతంలో యూపీఏ ప్రభుత్వం గెలిచినప్పటికీ విదేశీ అనే ఆరోపణలు వచ్చి వ్యతిరేకత రావడంతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని పగ్గాలను విశ్వాసపాత్రుడైన మన్మోహన్ సింగ్ కు అప్పగించారు. ఇప్పుడు మయన్మార్ లో అదే సీన్ రిపీట్ అయింది. నిబంధనల వల్ల సూచీ విదేశీ కావడంతో పాలన పగ్గాలను సన్నిహితుడు, మిత్రుడు హితిన్ చా చేతిలో పెట్టారు. నిర్ణయాలు మాత్రం సూచీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అధ్యక్ష పదవి కంటే పెద్ద స్థానంలోనే సూచీ ఉందని నేతలు పేర్కొంటున్నారు. అధ్యక్షుడి ఎన్నికపై సూచీ సొంత పార్టీ ఎన్ఎల్డీ లో కూడా కాస్త వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఎగువ సభలో మరో అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మెజార్టీ పార్టీ ఆంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఓట్లతో హితిన్ చా కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడి భార్య అధికార పార్టీ ఎన్ఎల్డీ ఎంపీ. ఆమె పేరు సు సు లిన్. గతంలో ఆమె తండ్రి ఎన్ఎల్డీ పార్టీ అధికారప్రతినిధిగా పనిచేశారు. సూచీని అడ్డుకున్న రాజ్యాంగం! గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ఉద్యమ కారిణి ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. వీరికి ఇద్దరు పిల్లలు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రాజ్య నియమాలకు కట్టుబడి అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపలేదు. -
ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి?
నెపిడా: మయన్మార్ ప్రజస్వామిక ప్రతీక అంగ్ సాన్ సూకి మయన్మార్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందడుగు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ ఆమెకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు రెండు వార్తా చానెళ్లు తెలిపిన కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అంగ్ సాన్ సూకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాజ్యాంగ పరంగా ఉన్న అడ్డంకిని తొలగించేందుకు అటు సూకి, ఆ దేశ మిలటరీ వర్గాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు ఆ చానెళ్లు తెలిపాయి. గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో సూకి పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి (ఎన్ఎల్డీ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త ఓ బ్రిటన్ దేశానికి చెందిన వాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో సూకిది కీలక పాత్ర. ఆమెను ఓ గొప్ప వ్యక్తిగా ఆ దేశ ప్రజలు భావిస్తారు. కానీ, అలాంటి వ్యక్తికి తమను పాలించే అవకాశం లేకపోవడం కూడా అక్కడి ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉన్నత మిలటరీ విభాగంతో గత కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, రాజ్యాంగంలోని ఆ ఆర్టికల్ ను తొలగించేందుకు యోచన చేస్తున్నారని తెలిసింది. అయితే, సూకి అధ్యక్ష బాధ్యతల అంశంపై ఇప్పుడే అధికారికంగా ప్రకటన చేయడం తొందరపాటు చర్య అవుతుందని అక్కడి ఓ న్యాయ ప్రముఖుడు అన్నారు. -
మయన్మార్‌లో కొలువుదీరిన కొత్త సభ
నాపిటా: మయన్మార్‌లో కొత్తగా ఎన్నికైన వందలాది మంది ప్రజాప్రతినిధులతో పార్లమెంటు కొలువుదీరింది. ప్రజాస్వామిక ఉద్యమ కారిణి ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ సభ్యులే అత్యధికంగా ఉన్న ఈ పార్లమెంటు.. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఏళ్ల తరబడి సైనిక పాలనలో మగ్గిన ఈ దేశంలో.. 50 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు కావటం ఇదే తొలిసారి కానుంది. -
రెక్కవిప్పిన స్వేచ్ఛా పతాక
కొత్త కోణం ఏర్పడబోయే పౌర ప్రజాస్వామిక ప్రభుత్వం సైనిక పాలకులు విధించే పలు పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఒక సంపూర్ణ, స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మయన్మార్ ఆవిర్భవించడానికి ప్రస్తుత విజయం తొలిమెట్టు మాత్రమే. ఏర్పడబోయే పౌర ప్రభుత్వం సైన్యంతో రాజీలకు సిద్ధపడుతూనే అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. జీవితాన్నే పోరాటంగా నిర్వచించుకున్న సూచీ ఈ కత్తి మీద సామును నిబ్బరంగా నిర్వహిస్తూ నూతన ప్రభుత్వాన్ని నడిపించగలరని ఆశించవచ్చు. ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజాపోరాటాలకు తోడు నిరంతరం కొనసాగే నిలకడ గలిగిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని తుదకంటా కొనసాగించగల నిఖార్సైన నాయకత్వం ఉంటే ఏ ఉద్యమం అయినా విజయం సాధిస్తుందనడానికి మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమమే రుజువు. మయన్మార్ ప్రజాస్వామిక ఆకాంక్షలకు నిలువెత్తు ప్రతిబింబం ఓ బక్కపలుచని స్త్రీ. దశాబ్దాల నిరంకుశ సైనిక పాలనను, నిర్బంధాన్ని ఎదురొడ్డి నిలిచిన ఆమె పేరే ఆంగ్‌సాన్ సూచీ. అత్యంత శాంతియుతంగా, అంతులేని విశ్వాసంతో ఆమె నడిపిన అలుపెరు గని పోరాటం ఈ రోజు మయన్మార్ ప్రజల ప్రజాస్వామిక కాంక్షకు తుది రూపం ఇచ్చింది. ఒకప్పుడు బర్మాగా పిలిచిన మయన్మార్ 1948లో బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని పొందింది. అయితే 1962 సైనిక తిరుగుబాటుతో నియంతృత్వ పాలన మొదలైంది. సైనిక ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలన్నింటినీ నిషేధించి, ప్రజలను, ప్రజాస్వామ్య పౌరహక్కులను అత్యంత పాశవికంగా అణచివేసింది. సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, విద్యార్థులు, బౌద్ధమత సంఘాలు ఉద్యమించాయి. నియంతృత్వ ప్రభుత్వం నిర్బంధంతో ఆ ఉద్యమాలను అణచడానికి ప్రయత్నించింది. దీంతో అది సుప్రసిద్ధమైన ‘నాలుగు ఎనిమిదుల’ ఉద్యమంగా మారింది. అది మయన్మార్ ప్రజల ప్రజా స్వామిక పోరాటానికి నిర్మాణ రూపమిచ్చిన 1988 ఆగస్టు 8. యాంగాన్, మండాలే నగరాలలో విద్యార్థులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి సైనిక ప్రభుత్వా నికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రతిఘటనా పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ దశలోనే మయన్మార్ జాతిపితగా పరిగణించే ఆంగ్‌సాన్ కూతురు ఆంగ్‌సాన్ సూచీ ఈ ప్రజాస్వామ్య పోరాటంలోకి అడుగుపెట్టారు. అచంచల విశ్వాసంతోనే విజయం సెప్టెంబర్ 27, 1988న నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అనే పార్టీని స్థాపించారు. బుద్ధుడి బోధనలు, గాంధీ అహింసా సిద్ధాంతం తనకు ఆదర్శ మని ఆమె ప్రకటించుకున్నారు. సూచీ నాయకత్వంలోని ప్రజాస్వామ్య పోరా టాలకు భయపడిన ప్రభుత్వం 1989న ఆమెకు గృహ నిర్బంధం విధించింది. అది మొదలు ఆమె జీవితం జైళ్లు, గృహనిర్బంధాల్లోనే చాలాకాలం సాగింది. మరోవంక సైనిక నియంతృత్వ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ప్రజాస్వామ్యం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసమే సూచీని ఉద్యమం వైపు నడిపించింది. ఆమెను గృహనిర్బంధంలోనే ఉంచి 1990లో సైనిక ప్రభుత్వం సాధారణ ఎన్నికలు నిర్వహించింది. అయినా ఆమె నాయకత్వంలోని ఎన్ఎల్డీకి 59 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 80 శాతం సీట్లు వచ్చే అవకాశం ఉండింది. సూచీ ప్రధాన మంత్రి కావలసింది. కానీ సైనిక ప్రభుత్వం ఆ ఎన్నికలను గుర్తించలేదు. ఫలితాలను ప్రకటించకుండా ఆపివేసింది. రెండోసారి సూచీని గృహ నిర్బంధానికి పంపారు. ఆ సమ యంలోనే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. దాన్ని ఆమె తరఫున ఆమె కొడుకులు అందుకోవాల్సి వచ్చింది. 1995 జూలైలో సూచీని గృహ నిర్బంధం నుంచి విడుదల చే శారు. కానీ 1996లో 200 మంది సాయుధులు ఆమె కాన్వాయ్‌పై దాడిచేసి ఆమెను హతమార్చే యత్నం చేశారు. దీన్ని సాకుగా చూపి సైనిక ప్రభుత్వం మళ్ళీ సూచీని గృహ నిర్బంధానికి పంపింది. అయినా ఆమె మాత్రం చెక్కు చెదరలేదు. ఆమె విశ్వాసం ఇసుమంతైనా తగ్గుముఖం పట్టలేదు. ప్రజా ఉద్యమాల వెల్లువకు తోడు, అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గి సైనిక ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్కరణలను ప్రారంభించింది. 2010 నవంబర్ 13న బర్మా ప్రభుత్వం మరొకసారి ఆంగ్‌సాన్ సూచీని గృహ నిర్బంధం నుంచి విడుదల చేసింది. అయితే పౌర ప్రభుత్వం సైనిక ఆధి పత్యం కొనసాగేలా 2008లో తయారు చేసిన రాజ్యాంగాన్ని మార్చడానికి మాత్రం అంగీకరించలేదు. 2012 ఉప ఎన్నికల్లో పాల్గొన్న ఎన్ఎల్డీ 45 స్థానాలకు 43 స్థానాలను గెలుచుకుంది. సూచీ మొదటిసారిగా పార్లమెంటు లోకి అడుగుపెట్టింది. ఐరాస సహా ప్రపంచ దేశాలు స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని సైనిక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఫలితంగానే తాజా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎన్ఎల్డీ ఘన విజయాన్ని సాధించడంతో సైన్యం కనుసన్నల్లోని ప్రభుత్వం నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధికారం బదలాయించాల్సివస్తోంది. పరిమితులు, సవాళ్లు సూచీకి, ఎన్ఎల్డీకి అనుకూలంగా ప్రజలు తిరుగులేని విధంగా తీర్పు చెప్పినా, ఏర్పడబోయే ప్రజాస్వామిక ప్రభుత్వం అనేక పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కరణలకు ముందే సైనిక నేతలు తమకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించి 2010 నుంచి అమల్లోకి తెచ్చారు. ప్రత్యేకించి ఆర్టికల్ 20 (బి), (ఇ), (ఎఫ్) రక్షణ వ్యవహారాలపై, సైన్యంపై పౌర ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేని స్వతంత్ర ప్రతి పత్తిని ఇచ్చాయి. సైన్యం కోరుకుంటే ఏ అంశాన్నయినా ‘రక్షణ వ్యవహారాల’ పరిధిలోకి తేగలుగుతుంది. అంతేకాదు, రాజ్యాంగాన్ని, ప్రత్యేకించి ఆర్టికల్ 20కి చెప్పే భాష్యాన్ని పరిరక్షించే కర్తవ్యాన్ని ఆ రాజ్యాంగం సైన్యం చేతుల్లోనే ఉంచింది. పౌర ప్రజాస్వామిక ప్రభుత్వం సైనిక పాలకులు విధించే పలు షరతులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు, పార్లమెంటులో ఏ ఎన్నికా లేకుండా సైన్యం నియమించే 25 శాతం మంది సభ్యుల ‘ప్రతిపక్షం’ విసిరే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవంక అంతర్జాతీయ స్థాయి మానవతావాద సంక్షోభంగా మారిన రోహింగియా ముస్లింల పట్ల వివక్ష, అణచివేత సమస్య కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. బౌద్ధ మత నేతలు తమకు వ్యతిరేకం కాకుండా ఉండటం కోసం సూచీ ఒక ఎన్నికల ఎత్తుగడగా ఒక్క ముస్లింను కూడా అభ్యర్థిగా నిలపలేదు. ఎన్నికల తర్వాత కూడా ఆమె, కొత్త ప్రభుత్వం తమ ఆకాంక్షలకు అనుగు ణంగా నడుచుకుంటారని వారు ఆశిస్తున్నారు. కాబట్టి రొహింగియాలు సహా దేశంలో రగులుతున్న అనేక జాతుల సమస్యల పరిష్కారం దిశగా ప్రజా స్వామ్య ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ వారి నుంచి సవాళ్లు తప్పవు. విదేశస్తుడ్ని పెళ్లి చేసుకున్న కారణంగా సూచీ రాజ్యంగ రీత్యా అధ్యక్ష పదవికి అనర్హురాలు. అయినా ఆమె ప్రభుత్వంలో నిర్ణాయక శక్తిగా ఉంటారు. ఒక సంపూర్ణ, స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మయన్మార్ ఆవిర్భవించడానికి ప్రస్తుత విజయం తొలిమెట్టు మాత్రమే. ఏర్పడబోయే పౌర ప్రభుత్వం పలు పరిమితులు, రాజీలతోనే అన్నివర్గాల ప్రజల అభీష్టాలను సంతృప్తిపరచాల్సి వస్తుంది. జీవితాన్నే పోరాటంగా నిర్వచించుకున్న సూచీ ఈ కత్తి మీద సామును నిబ్బరంగా నిర్వహించగలరని ఆశించవచ్చు. రాజకీయ ప్రజాస్వామ్యం చాలదు గత రెండువందల ఏళ్ళకుపైగా ప్రపంచ ప్రజలు జరుపుతున్న ప్రజాస్వామ్య పోరాటాలలో మయన్మార్ కూడా ఒక భాగం. అమెరికన్ ప్రొఫెసర్ హంటింగ్ టన్ నేటి పోరాటాలను మూడవ దశ ప్రజాస్వామ్య ఉప్పెనగా పేర్కొన్నారు. మొదటిదశ ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం 1820లో అమెరికాలో ప్రారంభమై 1926 వరకు కొనసాగింది. రెండవ దశ, రెండవ ప్రపంచ యుద్ధానంతరం మొదలై 1962 వరకు సాగింది. కాగా 1990 నుంచి ఇంకా సాగుతున్న మూడవ దశ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మనం చూస్తు న్నాం. లాటిన్ అమెరికా, మధ్య ఆసియా తూర్పు ఆఫ్రికా దేశాలలో సాగిన, సాగుతున్న ఉద్యమాలు దీనిలో భాగమే. బ్రెజిల్, వెనిజులా, బొలీవియా, పెరుగ్వే, అర్జెంటీనా, చిలీ, ఈక్వెడార్, నికరాగ్వా, ఉరుగ్వే లాంటి లాటిన్ అమెరికన్ దేశాలు నియంతృత్వాల నుంచి బయటపడి ప్రజాస్వామ్యం బాట పట్టాయి. మధ్య ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, లిబియా లాంటి దేశాలు ప్రజాస్వామ్య పోరాటాల్లోకి అడుగు పెట్టాయి. 167 దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థల తీరుతెన్నులపై 2014లో ‘ది ఎకనామిస్ట్’ పత్రిక నిర్వహించిన అధ్యయనం వీటిని నాలుగు రకాలుగా విభజించింది. వాటిలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలు 24 మాత్రమే నని, 27వదిగా ఉన్న భారత్‌లో పూర్తిస్థాయి ప్రజాస్వామ్యవ్యవస్థ లేదని ఆ అధ్యయనం తెలిపింది. లోపాలతో కూడిన ప్రజాస్వామ్యాలు 52 కాగా, అస్థిరంగా ఉన్నవి 39 అని పేర్కొంది. కాగా ఇప్పటికీ రాచరిక, సైనిక, కార్మిక వర్గ నియంతృత్వాల కిందనే ఉన్నాయి. ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమికమైనదే. కానీ అది పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం కాదు. రాజకీయ రంగంతో పాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం అమలైతేనే అది సమగ్రమవుతుంది. ప్రజాస్వామ్యం వైపు తొలి అడుగులు వేస్తూనే మయన్మార్ ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందనేది చారిత్రక సత్యం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు : మల్లెపల్లి లక్ష్మయ్య, మొబైల్: 97055 66213 -
సుదీర్ఘ కౌంటింగ్‌లో సూచీకి 880 స్థానాలు
సుదీర్ఘంగా జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మయన్మార్ ఆశాకిరణం ఆంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ 77.3 శాతం స్థానాలను గెలుచుకుంది. 1,139 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ 880 స్థానాలను గెలుచుకోగా అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ పది శాతం సీట్లతో 115 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన స్థానాలను వేరు వేరు చిన్న పార్టీల వారు గెలుచుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మయన్మార్ పార్లమెంట్ సభ్యులలో 75 శాతం సభ్యులను ఈ ఎన్నికల ద్వారా భర్తీ చేయనుండగా మిగిలిన 25 శాతం మందిని నేరుగా మయన్మార్ మిలిటరీ నామినేట్ చేస్తుంది. మయన్మార్ పార్లమెంట్ తొలి సమావేశాలు జనవరిలో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం మార్చిలో కొలువుదీరనుంది. మార్చి చివరిలో ప్రస్తుత అధికార ప్రభుత్వం రద్దుకానుంది. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి సూచీ విజయం ఎప్పుడో ఖరారైనా, అక్కడి ఎన్నికల కౌటింగ్ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతన, అధికార పాలకుల ఉద్దేశపూర్వక కాలయాపన ఫలితంగా ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తుంది. -
సూచీదే మయన్మార్ పీఠం
ఎన్ఎల్డీకి మెజారిటీ యంగూన్: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ఉద్యమనేత, ప్రతిపక్ష ఎన్ఎల్డీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ అధికారికంగా విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటినుంచి సూచీ విజయం ఖాయమని తెలిసినా.. ఫలితాలు వెలువడిన తర్వాత అధికారికంగా ఆమె విజయం ఖరారైంది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం.. ఇంకా చాలా స్థానాల్లో ఫలితాలు వెలవడాల్సి ఉన్నప్పటికీ.. సూచీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ ఫిగర్ (348 సీట్లు)ను సాధించారు. వెల్లడైన ఫలితాల్లో 80 శాతం స్థానాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల మిలటరీ పాలనతో మోడువారిన మయన్మార్‌కు కొత్త వెలుగులు అందించేందుకు మరో అడుగు ముందుకు పడింది. అధికార యూఎస్డీపీ దారుణంగా ఓడినా ప్రభుత్వ విషయాల్లో సైనిక అధికారాలు ఏమాత్రం తగ్గలేదు. ఆర్మీ జోక్యంతో తయారైన రాజ్యాంగం ద్వారానే సూచీ అధ్యక్షపీఠం ఎక్కే అవకాశం కోల్పోయారు. అయినా.. అంతకన్నా పెద్ద అధికారాలతో ప్రభుత్వాన్ని, పాలనను శాసిస్తానని సూచీ చెబుతున్నారు. కాగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా సంస్కరణలు తెచ్చిన మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్‌ను ప్రపంచం ప్రశంసించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు , కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సూచీని అభినందించారు. -
సూచీకి సోనియా అభినందనలు
యాంగోన్: మయన్మార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్రజాస్వామ్య ఉద్యమనేత, ప్రతిపక్ష ఎన్ఎల్డీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అభినందించారు. భారత్‌తో సూచీకి ప్రత్యేక అనుబంధముందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దిగువ సభ, ఎగువ సభ కలిపి 664 సీట్లున్న మయన్మార్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 329 మెజార్టీ మార్క్‌ను ఎన్ఎల్డీ దాటింది. మెజార్టీకి అదనంగా మరో 21 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. -
మెజార్టీ మార్క్ దాటి క్లీన్ స్వీప్ దిశగా..
యాంగోన్: మయన్మార్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్డీ పార్టీ పూర్తి మెజార్జీని సాధించింది. దిగువ సభ, ఎగువ సభ కలిపి 664 సీట్లున్న మయన్మార్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 329 మెజార్టీ మార్క్‌ను దాటింది. ఎన్ఎల్డీ మెజార్టీకి అదనంగా మరో 21 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. శుక్రవారం వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఎన్ఎల్డీ దిగువ సభలో 238, ఎగువ సభలో 112 సీట్లను సాధించింది. ఇక రాష్ట్రాల్లో 401 సీట్లు గెల్చుకుంది. అధికార యూఎస్డీపీ మొత్తమ్మీద 102 సీట్లనే మాత్రమే నెగ్గింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడాల్సివుంది. దశాబ్దాల సైనిక పాలనకు చరమగీతం పలికిన మయన్మార్ ప్రజలు సూచీకి ఏకపక్షంగా మెజారిటీ కట్టబెడుతున్నారు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో 75 శాతం సీట్లకే ఎన్నికలు నిర్వహిస్తారు. మరో 25 శాతం స్థానాలకు ఎన్నికలు లేకుండా మిలటరీ ఎంపిక చేస్తుంది. -
అంగ్‌సాన్ సూచీకి మోదీ శుభాకాంక్షలు
-
మయన్మార్‌లో సూచీ క్లీన్‌స్వీప్!
ఎన్ఎల్డీకి భారీ మెజారిటీ యాంగోన్: మయన్మార్ చారిత్రక ఎన్నికల్లో.. ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్డీ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయం అయిపోయింది. దశాబ్దాల సైనిక పాలనకు చరమగీతం పలికిన మయన్మార్ ప్రజలు సూచీకి ఏకపక్షంగా మెజారిటీ కట్టబెడుతున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల ప్రకారం.. ఎన్ఎల్డీ అధికారానికి కేవలం మూడు సీట్ల దూరంలో ఉంది. జాతీయ పార్లమెంటు సభలతో పాటు.. రాష్ట్రాల పార్లమెంట్లకు కలిపి 627 సీట్ల ఫలితాలు వెల్లడించగా.. ఎన్ఎల్డీ 536 సీట్లు (ఎగువ సభలో 83, దిగువ సభలో 243, రాష్ట్రాల్లో 280) గెలుచుకుంది. అధికార ఎన్ఎల్డీపీకి 51 సీట్లే దక్కాయి. మరోవైపు, మయన్మార్ అధ్యక్షుడు థీన్ సేన్, ఆర్మీ చీఫ్ ఆంగ్ హ్లెయింగ్.. ఫలితాల్లో ఎన్ఎల్డీ జోరుతో.. సూచీని అభినందించారు. ప్రజామోదం పొందిన సూచీ విజయానికి అర్హురాలన్నారు. త్వరలో ఏర్పాటుకానున్న ప్రభుత్వానికి సైనికపరంగా పూర్తి సహకారం ఉంటుందని ఆర్మీ చీఫ్ అన్నారు. కాగా, ఫలితాలు ఎన్ఎల్డీ విజయాన్ని స్పష్టం చేస్తుండటంతో.. ఆర్మీ చీఫ్‌తో, అధ్యక్షుడితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సూచీ ప్రకటించారు. అయితే.. ఫలితాలు పూర్తిగా వెలువడ్డాకే చర్చల ప్రక్రియ మొదలవుతుందని థీన్ సీన్ తెలిపారు. 1990లో సూచీ పార్టీ ఎన్నికల్లో 59 శాతం సీట్లు గెలుచుకుని విజయం సాధించినా.. మిలటరీ ప్రభుత్వం అధికారాన్ని అప్పగించేందుకు విముఖత చూపడం తెలిసిందే. మోదీ, ఒబామా శుభాకాంక్షలు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతున్న సూచీకి భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అధికారం చేపట్టాక భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. సూచీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా అభినందనలు తెలిపారు. -
అంగ్‌సాన్ సూచీకి మోదీ శుభాకాంక్షలు
మయన్మార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అంగ్‌సాన్ సూచీకి భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. యూకే పర్యటనకు వెళుతున్న సమయంలో అంగ్‌సాన్ సూచీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి, భారత్ రావాలని ఆహ్వానించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ట్విట్ చేశారు. మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల పార్టీ 'నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ)' ఘన విజయం సాధించింన విషయం తెలిసిందే. గత ఆదివారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న మయన్మార్ ప్రజలు.. ఎన్ఎల్డీకి తిరగులేని మెజారిటీ అందించారు. ఈ ఎన్నికల్లో ఎన్ఎల్డీ 536 పార్లమెంట్ సీట్లను గెలుపొందింది. Diplomacy aboard Air India 1! PM called Daw Aung San Suu Kyi, congratulated her on her electoral victory and invited her to visit India — Vikas Swarup (@MEAIndia) November 12, 2015 -
ఆమే ఒక సైన్యం
-
చీకట్లో వెలుగురేఖ.. సూచీ
♦ ఢిల్లీలోనే సూచీ ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం ♦ గాంధీ అహింస, బుద్ధుని బోధనలే స్ఫూర్తి ♦ 15ఏళ్ల పాటు గృహ నిర్బంధం.. అయినా ప్రజాస్వామ్యమే లక్ష్యం సాక్షి, సెంట్రల్ డెస్క్: అంగ్‌సాన్ సూచీ.. మయన్మార్(నాటి బర్మా) ప్రజలకు దశాబ్దాల చీకటి పాలనకు అంతం పలికే వెలుగురేఖ. దాదాపు అర్ధ శతాబ్దం దేశంలో నియంతృత్వ పాలన సాగించిన మిలటరీ పాలకులకు సింహస్వప్నం. దేశాన్ని ప్రజాస్వామ్య పాలన దిశగా తీసుకువెళ్లే మార్గదర్శి. మయన్మార్‌లో సంపూర్ణ ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అంగ్‌సాన్ సూ చీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ ఈ ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో.. మయన్మార్ ప్రజల అమ్మ ‘మా చీ’పై కథనం. అంగ్‌సాన్ సూ చీ 1949 జూన్ 19న జన్మించారు. ఆమె తండ్రి అంగ్‌సాన్ స్వాతంత్య్ర సమర యోధుడు. బ్రిటిష్ వలస పాలన నుంచి బర్మా స్వాతంత్య్రం పొందేందుకు ప్రధాన కారకుడైన అంగ్‌సాన్‌ను బర్మా ప్రజలు జాతిపితగా భావిస్తారు. అయితే, దేశ స్వాతంత్య్రానికి కొద్ది నెలల ముందే ఆయన ప్రత్యర్థుల కాల్పుల్లో మరణించారు. అంగ్‌సాన్ సూచీ తల్లి ఖిన్ చీ భారత్, నేపాల్‌లలో బర్మా రాయబారిగా పనిచేశారు. దాంతో సూచీ ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ పాఠశాలలో, కళాశాల చదువు ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో సాగింది. అనంతరం యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్ చదివారు. ఆ తరువాత న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో మూడేళ్లు పనిచేశారు. 1972లో భూటాన్‌లో నివసించే బ్రిటిషర్ అయిన మైఖేల్ ఏరిస్‌ను వివాహం చేసుకున్నారు. వారికి అలెగ్జాండర్, కిమ్ అనే ఇద్దరు పిల్లలు. 1999లో మైఖేల్ కేన్సర్‌తో చనిపోయారు. 1988లో సూచీ అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకునేందుకు మయన్మార్ వెళ్లారు. అప్పుడే మయన్మార్‌లోని ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో పాలుపంచుకోవడం ప్రారంభించారు. సూచీ మయన్మార్ వచ్చిన 1988వ సంవత్సరంలోనే అప్పటి సైనిక పాలకుడు నె విన్ పదవి నుంచి వైదొలగారు. ఆ రోజైన 8-8-88న దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలు జరిగాయి. అది 8888 తిరుగుబాటుగా ప్రసిద్ధి గాంచింది. ఆగస్ట్ 26న దాదాపు 5 లక్షలమంది ప్రజాస్వామ్య ఉద్యమకారులనుద్దేశించి ఆగస్ట్ 26న అంగ్‌సాన్ సూచీ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. అయితే, ఆ తిరుగుబాటును మిలటరీ పాలకులు అణచేశారు. అనంతరం కొత్త సైనిక ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజాస్వామ్య మయన్మార్ లక్ష్యంగా.. గాంధీ అహింస, బుద్ధుని బోధనలతో స్ఫూర్తి పొందిన సూచీ అదే మార్గంలో దేశానికి సైనిక పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రతిన బూనారు. ప్రజాస్వామ్య మయన్మార్ లక్ష్యంగా 1988 సెప్టెంబర్ 27న ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. దాంతో సూచీని 1989 జూలైలో సైనిక పాలకులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమెపై నిర్బంధాన్ని సైనిక పాలకులు తీవ్రం చేశారు. కేన్సర్‌తో బాధ పడ్తున్న ఆమె భర్త మైఖేల్ మయన్మార్ రావడానికి అనుమతి సైతం ఇవ్వలేదు. 2010 వరకు 15 ఏళ్ల పాటు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అప్పుడప్పుడు ఐరాస, అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లతో ఆమెను విడుదల చేసి.. మళ్లీ ఏదో ఒక కారణంతో మళ్లీ నిర్బంధంలోకి తీసుకునేవారు. ఆమె 1989 నుంచి 1995 వరకు, 2000 నుంచి 2002 వరకు, 2003 నుంచి 2010 వరకు నిర్బంధంలో ఉన్నారు. 1990లో మిలటరీ ప్రభుత్వం సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ఎన్నికల్లో సూచీ పార్టీ ఎన్ఎల్డీ 59% ఓట్లు, 80%పైగా సీట్లను గెలుచుకుంది. కానీ అధికారాన్ని అప్పగించేందుకు సైనిక పాలకులు అంగీకరించలేదు. ఆ తర్వాత నిర్బంధం మధ్యే ఆమె పార్టీ వ్యవహారాలను నిర్వహించారు. 1996లోనూ, ఆ తర్వాత 2003లోనూ ఆమెపై దాడులు జరిగాయి. వాటి నుంచి ఆమె సాహసోపేతంగా తప్పించుకున్నారు. అనంతరం అగ్ర రాజ్యాలు సహా అంతర్జాతీయ ఒత్తిడి మేరకు మిలటరీ పాలకులు రాజకీయ వ్యవస్థలో సంస్కరణలను ప్రారంభించారు. ముఖ్యంగా 2011లో కొత్త ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఆ దిశగా ముందడుగేశారు. 2012లో 46 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సూ చీ పార్టీ 43 సీట్లు గెలుచుకుంది. సూ చీ ఎంపీ అయ్యారు. తాజాగా ఈ ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్డీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. సూచీ పార్టీదే ‘మయన్మార్’ యాంగూన్: మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ)’ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న మయన్మార్ ప్రజలు.. ఎన్ఎల్డీకి తిరగులేని మెజారిటీ అందించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దిగువ సభకు సంబంధించి 88 స్థానాల ఫలితాలను ప్రకటించగా, వాటిలో 78 సీట్లను ఎన్ఎల్డీ కొల్లగొట్టింది. కేంద్ర పార్లమెంట్లో 75% సీట్లను సాధిస్తామని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచీ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మా పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఎన్ఎల్డీ గెలిచింది. ఇది ఈ దేశ దౌర్భాగ్యం. ఏదేమైనా, వారికి మా శుభాకాంక్షలు’ అని అధికార యూఎస్డీపీ సీనియర్ నేత, మాజీ సైన్యాధికారి క్యు విన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఇదీ మయన్మార్ పార్లమెంట్ భారత్‌లో మాదిరిగానే మయన్మార్ పార్లమెంటులోనూ ఉభయ సభలు ఉంటాయి. పార్లమెంటును కేంద్ర సభ (అసెంబ్లీ ఆఫ్ యూనియన్) లేదా ప్యిడాంగ్షు హ్లుట్టాగా వ్యవహరిస్తారు. జాతీయ రాజ్యాంగం ప్రకారం 2008లో కొత్త పార్లమెంటును ఏర్పాటు చేశారు. ప్రతి 14 పెద్ద పాలనా ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు ఒకటి చొప్పున స్థానిక హ్లుట్టా (ప్రాంతీయ అసెంబ్లీ) లేదా రాష్ట్ర హ్లుట్టా ఉంటుంది. మయన్మార్ పార్లమెంటు ప్యిడాంగ్షు హ్లుట్టాలోని ఉభయ సభల్లో మొత్తం 664 మంది సభ్యులు ఉంటారు. మిగిలిన 25 శాతం (166) మందిని సైన్యాధ్యక్షుడు ఎంపిక చేస్తారు. అమ్యోతా హ్లుట్టా (ఎగువ సభ) వీటిలో మొత్తం 224 సీట్లు ఉండగా, 168 మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు. 56 సీట్లను సైన్యం భర్తీ చేస్తుంది. ప్యీథూ హ్లుట్టా (దిగువసభ) ఇందులో మొత్తం 440 సీట్లు ఉంటాయి. 330 మందిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, 110 మందిని సైన్యం భర్తీ చేస్తుంది. -
సూచీ శకం ప్రారంభం!
-
సూచీ శకం ప్రారంభం!
♦ మయన్మార్ ఎన్నికల్లో ఆమె పార్టీకి పూర్తి మెజారిటీ! ♦ అధికార సైనిక కూటమికి చుక్కెదురు యాంగూన్: మయన్మార్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) చరిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తోంది. మొదటి విడత సీట్లలో యాంగూన్‌లోని 57 పార్లమెంట్ స్థానాలకు గానూ 56 సీట్లను ఎన్ఎల్డీ గెలుచుకుంది. 44 దిగువ సభ స్థానాలను, 12 ఎగువ సభ స్థానాలను గెలుచుకున్నట్లు ఎన్ఎల్డీ ప్రకటించింది. ఒక పార్లమెంటు సీటును యూఎస్డీపీ గెలుచుకుంది. యాంగూన్ ప్రాంతీయ పార్లమెంటులోని 90 స్థానాలకు గానూ అత్యధికంగా 87 సీట్లలో ఎన్ఎల్డీ విజయం సాధించింది. మయన్మార్‌లో ప్రధాన ఎన్నికలతో పాటు ప్రాంతీయ పార్లమెంట్‌లకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. పూర్తిస్థాయి ఓట్ల లెక్కింపుకు 10 రోజుల సమయం పడ్తుందని ఆదివారం పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఫలితాల సరళి నేపథ్యంలో ఎన్ఎల్డీ పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎర్ర చొక్కాలతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దశాబ్దాల ప్రత్యక్ష, పరోక్ష సైనిక పాలన నుంచి స్వేచ్ఛ పొందబోతోందన్న ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 70% పైగా సీట్లను సాధించనున్నామని ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి విన్ టీన్, 90% పైగా గెలుస్తామని మరో అధికార ప్రతినిధి న్యాన్ విన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టేందుకు అందుబాటులో ఉన్న పార్లమెంటు సీట్లలో కనీసం 67% సీట్లను ఎన్ఎల్డీ గెల్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ అధికారం కోల్పోకుండా ఉండే ఉద్దేశంతో 25% సీట్లను అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ)కి కట్టబెడ్తూ రాజ్యాంగంలో రాసుకున్నారు. అందువల్ల మొత్తం 664 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 67% సీట్లను ఎన్ఎల్డీ సాధించగలిగితేనే.. అధికార యూఎస్డీపీ, దాని సైనిక మిత్రపక్షాలను ఓడించగలుగుతుంది. గెలిచినా సూచీ అధ్యక్షురాలు కాలేరు ఈ ఎన్నికల్లో ఎన్ఎల్డీ గెలిచినా పార్టీ అధినేత అంగ్‌సాన్ సూచీ (70) దేశాధ్యక్షురాలు కాలేరు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం జీవిత భాగస్వామి విదేశీయులైనా, విదేశీ పౌరసత్వం గల పిల్లలున్నా.. ఆ వ్యక్తి దేశానికి అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు కావడానికి వీల్లేదు. సూచీ దివంగత భర్త బ్రిటన్‌కు చెందిన వారు. ఆమె పిల్లలిద్దరికీ బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఎన్నికల్లో ఎన్ఎల్డీ గెలిస్తే.. అధ్యక్షురాలిగా కాకున్నా.. దేశ అత్యున్నత నాయకురాలిగా దిశానిర్దేశం చేస్తానని సూచీ స్పష్టం చేశారు. -
మయన్మార్‌లో ప్రశాంతంగా పోలింగ్..
యాంగాన్: పాతికేళ్ల సైనిక పాలన నుంచి పరిపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా పయనిస్తోన్న మయన్మార్ లో ఎన్నికల ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనసందడి కనిపించింది. ఈ ఎన్నికల్లో మయన్మార్ లో ప్రజాస్వామిక వ్యవస్థ కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్న అంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీదే గెలుపనే భావన సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం ఆ దేశంలో యూనియన్ సాలిడారిటీ డెవలప్ మెంట్ (యూఎస్ డీపీ) అధికారంలో ఉన్నప్పటికీ దానిని నడిపించేది మాత్రం సైనికశక్తే కావటం గమనార్హం. రాజధాని నగరంలో తమ నివాసానికి దగ్గర్లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సూచీకి ఓటర్లు ఘనస్వాగతం పలికారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన పార్టీకి అదికార పగ్గాలిచ్చి తప్పుకుంటానని ప్రస్తుత అధ్యక్షుడు థేన్ సియాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు మూడు కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొంటున్నారు. వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నవారి సంఖ్యే ఎక్కువ. 90 పార్టీలకు చెందిన 6 వేలమంది అభ్యర్థులు బరిలో తలపడుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సోమవారం ఉదయానికి విజేత ఎవరనేది తేలుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు. -
జనస్వామ్యం దిశగా...
అర్ధ శతాబ్దికి పైగా సైనిక దుశ్శాసనమే పాలనగా చలామణి అవుతున్న మయన్మార్‌లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఉక్కు తెరల వెనక తాము రాసిందే రాజ్యాంగంగా...చెప్పిందే ప్రజాస్వామ్యంగా ఇష్టానుసారం అమలు చేస్తున్న పాలకులు తప్పనిసరై ఈ ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఎన్నో ఆంక్షల్లో, మరెన్నో పరిమితులతో జరగబోతున్న ఈ ఎన్నికల్లో ఉద్యమ పుత్రిక ఆంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ)... యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ)ప్రధానంగా తలపడబోతున్నాయి. తమలో కొంతమందిచేత రాజీనామా చేయించి సైనిక పెద్దలే నెలకొల్పిన పార్టీ యూఎన్డీపీ. ఇంకా రంగంలో 91 పార్టీలున్నాయి. ఎన్‌ఎల్‌డీని ఓడించడానికి సైన్యం పరోక్షంగా పుట్టించిన పార్టీలే వీటిల్లో ఎక్కువ. ఈ ఎన్నికల తర్వాత ఏమవుతుంది? మయన్మార్‌లో ప్రజాస్వామ్యం వికసిస్తుందా? అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలనూ, సిద్ధాంతాలనూ ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందా? ఇందులో ఏం జరిగినా, జరగకున్నా ఆంగ్‌సాన్ సూచీ దేశాధ్యక్షురాలు కావడం మాత్రం అసాధ్యం. ఆమె అధ్యక్ష పీఠం అధిరోహించకుండా చేసే నిబంధనలన్నిటినీ రాజ్యాంగంలో పొందుపరిచాకే ఈ ప్రజాస్వామ్య నాటకానికి సైనిక పాలకులు తెరలేపారు. ఎందుకంటే 1962లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక తొలిసారి 1990లో పార్లమెంటు ఎన్నికలు జరిపినప్పుడు సూచీ తిరుగులేని మెజారిటీ సాధించారు. అయితే, ఆ ఫలితాలను తాము గుర్తించబోమని సైనిక పాలకులు ప్రకటించి ఆమెను 20 ఏళ్లపాటు ఖైదు చేశారు. మళ్లీ ఆ పరిస్థితి రావచ్చునన్న భయంతోనే సూచీకి తలుపులు మూసేవిధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. 2008లో రిఫరెండం పేరిట అమల్లోకి తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రకారం... దంపతుల్లో ఎవరైనా విదేశీయులైన పక్షంలో అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు వారు అనర్హులవుతారు. ఆఖరికి పిల్లలు విదేశాల్లో పుట్టి ఉన్నా తల్లిదండ్రులిద్దరూ అనర్హులే. ఈ నిబంధనలు సూచీని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. మరణించిన ఆమె భర్త బ్రిటన్ జాతీయుడు. పిల్లలిద్దరూ అక్కడ పుట్టినవారే. కనుకనే ఆమె అధ్యక్ష పీఠం అధిరోహించడం వీలుపడదు. అందుకే సమర్ధతగల వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామని సూచీ ఎన్నికల సభల్లో చెబుతున్నారు. అధ్యక్ష పదవికంటే తాను ఉన్నతురాలిగా ఉంటానని అంటున్నారు. ఎన్నికల తర్వాత నిశ్చయంగా జరగబోయేది ఒకే ఒక్కటి-యూఎన్డీపీ నెగ్గినా, ఓడినా సైన్యం ఎప్పటిలానే శక్తిమంతంగా ఉంటుంది. దేశాన్ని శాసిస్తుంది. ఈ ఎన్నికలు ఎన్ని పరిమితుల్లో జరుగుతున్నాయో గమనిస్తే మయన్మార్‌లో ఉన్నది ప్రజాస్వామ్యమేనా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. హ్లుతా గా పిలిచే మయన్మార్ పార్లమెంటులో 440మంది సభ్యులుండే ప్రతినిధుల సభ, 224మంది సభ్యులుండే వివిధ జాతుల సభ ఉంటాయి. ఈ 664 స్థానాల్లో 75 శాతం స్థానాలకు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతినిధుల సభలోని 330 స్థానాలకూ...జాతుల సభలోని 168 స్థానాలకూ ప్రజలు ఓట్లేయవలసి ఉంటుంది. మిగిలిన 25 శాతం స్థానాలూ(166) సైన్యానివే. పైగా పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణను ఆమోదించినా దాన్ని వీటో చేసే అధికారం సైనిక ప్రతినిధులకుంటుంది. ఈ రెండు సభలూ చెరొక అభ్యర్థినీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తాయి. సైనిక ప్రతినిధులు విడిగా తమ అభ్యర్థిని ప్రకటిస్తారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఈ ముగ్గురిపైనా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో విజేత దేశాధ్యక్షుడవుతారు. ఓడిన ఇద్దరూ ఉపాధ్యక్షులవుతారు. అధ్యక్ష ఎన్నికే ఇంత కంగాళీగా ఉన్నదనుకుంటే ...ఓటర్ల జాబితాలు మరింత అయోమయంగా ఉన్నాయి. హింసాత్మక ప్రాంతాలుగా ప్రకటించినచోట జాబితాలూ లేవు...ఎన్నిక లూ లేవు. అలాగే పది లక్షలమంది రోహింగ్యా ముస్లింలను రాజ్యరహిత పౌరులుగా ప్రకటించి వారినసలు జాబితాల్లోనే చేర్చలేదు. ఈ ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని చేపట్టబోయే ప్రభుత్వానికి తలకు మించిన సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. తమ ఆశల్ని, ఆకాంక్షల్ని వ్యక్తం చేయడానికి అనువైన ప్రజాస్వామిక వేదిక లేకపోవడంతో దాదాపు అన్ని జాతులూ తమ ప్రయోజనాల సాధనకు ఘర్షణ మార్గాన్నే ఎంచుకున్నాయి. ఆ ఘర్షణ ప్రభుత్వంతో మాత్రమే కాదు...తమ ప్రయోజనాలను కొల్లగొట్టే అవకాశమున్నదని భావించే వేరొక తెగపై కూడా! సాయుధ పోరాట బాటపట్టిన 15 ముఖ్యమైన జాతుల్లో ఏడెనిమిదింటితో ప్రస్తుత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందానికి వెలుపల ఉండిపోయినవాటిలో రెండు సంస్థలు కీలకమైనవి... భవిష్యత్తు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చేవి. నోబెల్ శాంతి బహుమతి కూడా పొందిన ఆంగ్‌సాన్ సూచీ ఈ జాతుల సమస్యల గురించిగానీ...బౌద్ధ మిలిటెంట్ గ్రూపుల చేతుల్లో దారుణమైన హింసను చవిచూసి, ప్రభుత్వ తిరస్కారానికి గురై దుర్భరమైన స్థితిలో శిబిరాల్లో గడుపుతున్న రోహింగ్యా ముస్లింల గురించిగానీ నోరెత్తలేదు. తమ ప్రభుత్వం వస్తే అన్నీ పరిష్కరిస్తామనడమే తప్ప రోహింగ్యాలను పౌరులుగా గుర్తించి, వారికి గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని కూడా ఆమె అడగలేదు. అయినప్పటికీ ఆమెను రోహింగ్యాల ఏజెంటుగా బౌద్ధ మిలిటెంట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆ ప్రజల గురించి ప్రస్తావించకపోవడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. ఇన్ని అవరోధాలమధ్యా, ఇన్ని అవాంతరాలమధ్యా ఆమె పార్టీకి 1990లో వచ్చినట్టుగా ఈసారి అఖండ మెజారిటీ రావడం అంత సులభం కాకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ సూచీయే దేశంలో జనాకర్షణ గల ఏకైక నేత. మౌలిక సదుపాయాల లేమితో, ఆర్ధికంగా అంతంతమాత్రంగా ఉన్న మయన్మార్ నిలదొక్కుకోవాలన్నా, ఎంతో కొంత అభివృద్ధిని సాధించాలన్నా ఏదో రూపంలో ప్రజాస్వామ్యం ఉండటం తప్పనిసరని సైనిక పాలకులు గుర్తించారు. కనుకనే ఇప్పుడీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మన పొరుగు దేశం గనుకా... మనతో ఈశాన్య ప్రాంతంలో 1,600 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది కనుకా మయన్మార్‌లో సుస్థిరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడటం మన భద్రతకూ, క్షేమానికీ ముఖ్యం. అందుకే మయన్మార్ ప్రజల వినూత్న ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించాలి. -
సుపరిపాలన అందిస్తాం: సూచీ
రోహింగ్యాలపై వివాదాన్ని పెద్దగా చేయొద్దని వినతి యాంగోన్: మయన్మార్ ఎన్నికల్లో తమ నేషనల్ లీగ్ డెమొక్రసీ పార్టీ గెలిస్తే ప్రజలకు సుపరిపాలన అందిస్తామని ఆంగ్ సాన్ సూచీ తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మిలటరీ పాలనలో నడుస్తోందని, తాముప్రజాస్వామ్యయుతమైన పాలన అందిస్తామని ఆమె తెలిపారు. ఆదివారం జరగనున్న ఎన్నికల్లో గెలిచాక ఎన్ఎల్డీ ఆదేశాలతో పనిచేసే వ్యక్తిని అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టి మరీ.. మయన్మార్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని సూచీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం ఏ నేత పిల్లలైనా విదేశాల్లో పుడితే ఆ నేత అధ్యక్ష పదవిలో కూర్చునేందుకు అర్హత లేదు. అయితే సూచీ ఇద్దరు పిల్లలకు బ్రిటీష్ పౌరసత్వం ఉన్నందున సూచీ అధ్యక్ష పదవిని అధిరోహించలేరు. మయన్మార్‌లోని మైనారిటీ వర్గమైన రోహింగ్యాల (ముస్లింలు)పై జరుగుతున్న అన్యాయాలను అనవసరంగా పెద్ద వివాదంగా మలచొద్దని సూచీ సూచించారు. ‘ఇదేం చిన్న సమస్య కాదు. అయితే ఇప్పుడు దీనిపై అనవసరంగా వివాదం చేయకండి. మేం గెలిచాక మతాలకు అతీతంగా అందరి హక్కులను కాపాడతాం’ అని తెలిపారు. ప్రజాస్వామ్య నినాదంతో ప్రచారం చేస్తున్న సూచీ మైనారిటీ వర్గమైన రోహింగ్యాల గురించి మాట్లాడక పోవటంపై విమర్శలు వస్తున్నాయి. -
ఆంగ్ సాన్ సూకీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందా?
నవంబర్ లో జరగునున్న మయన్మార్ స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ ప్రెసిడెంట్ ఆయ్యే అవకాశం లేదా? ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయాన్ని సాధించినా అధ్యక్షపదవిని దక్కించుకునే అవకాశాలు తక్కువే అని రాజకీయ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 59 ఎఫ్ ప్రకారం.. సూకీ ఓ విదేశీ వ్యక్తిని పెళ్ళాడి, చట్టబద్ధంగా పిల్లలు ఉండటంతో ఆమెను అనర్హురాలుగా ప్రకటించవచ్చు. అంతేకాక ఆమె ఇద్దరు కుమారులైన.. కిమ్, అలెగ్జాండర్లు బ్రిటిష్ పాస్ పోర్టు కలిగి ఉండటం కూడ ఆమె పదవిని దక్కించుకునేందుకు అవకాశాలు లేవు. సూకీ.. ఎన్నికల్లో భారీ విజయాన్ని వరించినా... ఆర్టికల్ లోని నిబంధనల ఆధారంగా ఆమె అధ్యక్షపదవికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ ప్రతినిధులు ఏదైనా ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకుంటే తప్పించి సూకీ.. ప్రెసిడెంట్ అయ్యే మార్గమే లేనట్టు ప్రస్తుత పరిస్థితులు చెప్తున్నాయి. ఒకవేళ సూకీ ప్రెసిడెంట్ కాకపోతే? మరి ఎవరు అవుతారన్నది మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఒకవేళ ఎన్ ఎల్డీ మద్దతును కనుక పొందగల్గితే స్పీకర్ హట్టా యు షూ మన్ అధ్యక్షుడుగా మారవచ్చు. అయితే ఇది ఆంగ్ సాన్ సూకీకి, సైనికులకు మధ్య అంతరాన్నితగ్గించి.. వారితో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగితే మాత్రమే జరిగుతుంది. అంతేకాదు రాజ్యాంగ మార్పుకోసం కూడ వారివద్ద హామీ తీసుకోవాల్సి కూడ ఉంటుంది. అయితే ఆగస్టు నెలలో జరిపిన తిరుగుబాటు లో అతన్ని యూఎస్పీడీ అధిపతి పదవినుంచీ తొలగించడంతో సూకీ సైన్యం మద్దతును ఇప్పటికే కోల్పోయింది. సైనిక మద్దతు లేకుండా సూకీ పదవిని పొందే అవకాశం ఎట్టిపరిస్థితిలోనూ లేనట్లే కనిపిస్తుంది. మరి అప్పుడు ఎవరు అధ్యక్ష పదవిని పొందుతారు? అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగానే ఉంది. ఈనెల మొదట్లో ఓ భారతీయ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఎన్ ఎల్డీ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంలో సూకీ... తానొక పౌరురాలు కావడంతోనే ఈ అవకాశం వచ్చినట్లు భావిస్తున్నానని చెప్పింది. అదే ఆత్మ విశ్వాసంతో ఆమె నేటికీ సమర్థవంతంగా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోగలననే ధీమాతో...ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మాజీ కమాండర్ ఇన్ ఛీఫ్.. టిన్ ఊ, మాజీ సైనిక అధికారి విన్ హెటిన్ వంటి వారిని సన్నిహిత అంతరంగికులుగా ఉంచుకోవడం, అతి దగ్గరకు తీయడం కూడ ఆమెకు అవకాశాలను జారవిడుచుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే షూ మన్ కూ...సూకీకి ఇప్పటికే డీల్ కుదిరిపోయిందని కొన్ని పుకార్లు కూడ షికార్లు చేస్తున్నాయి. అదే జరిగితే.. రెండేళ్ళ తర్వాత అతడు రాజ్యాంగ మార్పులను చేసి ఆమెకు అవవాశం కల్పించేట్లు ఒప్పందం కుదిరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నవంబర్ 8 న ఓటర్లు చెప్పే జాతకాలను బట్టే సూకీ అధ్యక్ష పదవిపై చిక్కు ముడి వీడుతుంది. -
ఇటు ఉక్కు సంకల్పం.. అటు సైనిక బలం!
నేపీడా: దాదాపు 50 ఏళ్లపాటు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉక్కుమనిషి ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ, అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) హోరాహోరీగా తలపడుతున్నాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారి స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు కావడంతో.. ఈ పోలింగ్‌పై కేవలం ఆ ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూఎస్డీపీకి సైనిక మద్దతు పుష్కలంగా ఉండగా, సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ మళ్లీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నది. ఇరు పార్టీలూ గెలుపు మీద ధీమాతో ఉన్నాయి. అధికార యూఎస్డీపీకి గతంలో నియంతృత్వం చెలాయించిన సైనిక పెద్దల నుంచి మద్దతు ఉన్నది. స్థానికంగా మీడియా వెన్నుదన్ను ఉంది. అక్రమాలతో కూడిన 2010 ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీకి పెద్దసంఖ్యలో అనుచరులు ఉన్నారు. ఈ ఐదేళ్ల హయాంలో యూఎస్డీపీ సర్కారు కొన్ని చర్యలతో ప్రజలను మెప్పించగలిగింది. దేశంలోని పలు వేర్పాటువాద గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇవే తమ ప్రధాన ప్రచారాంశాలుగా చేసుకున్న యూఎస్డీపీ తాము 75 శాతం ఓట్లతో గెలుస్తామని ధీమాగా చెప్తున్నది. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడు, యూఎస్డీపీ అధినేత థీన్ సీన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు చాలామంది సైనిక అధికారులు తమ పదవులు విడిచిపెట్టి యూఎస్డీపీ తరఫున ఎన్నికల గోదాలో దిగారు. మరోవైపు తిరుగులేని ప్రజాదరణ కలిగిన నాయకురాలైన ఆంగ్‌సాన్ సూకీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ కనుసన్నలో ఉన్న మయన్మార్ మీడియా పెద్దగా మద్దతు తెలుపకపోయినా.. ఆమె నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రస్తుత ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగితే మరోసారి ఆంగ్‌సాంగ్ సూకీ విజయం సాధించే అవకాశముందని అంతర్జాతీయ పరిశీలకులు చెప్తున్నారు. స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరిగేనా? అనేక ఏళ్లు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో ఇటీవలికాలంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. 2011 ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటీకి సైనిక మద్దతు ఉన్న యూఎస్డీపీ అప్పట్లో అధికారం చేపట్టింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో నవంబర్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ అనేక అక్రమాలు, దౌర్జ్యనాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రతిపక్ష ఎన్ఎల్డీ అభ్యర్థులపై, శ్రేణులపై దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలోనూ అవకతవకలున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు అతివాద బౌద్ధులు దేశమంతటా పర్యటించి.. ముస్లింలు ఓటువేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ముస్లిం వ్యతిరేక వైఖరి తీసుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ఎన్నికలు ఎంతమేరకు అక్రమాలకు తావులేకుండా శాంతియుతంగా జరుగుతాయనే దానిపై కొంత ఆందోళన నెలకొంది. అయితే 1990లో జరిగిన ఎన్నికల్లో ఇంతకంటే తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయి. అయినా ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్డీ అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అనేక సంవత్సరాలు సైనిక పాలకులు ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు. అయినా చెక్కుచెదరని ఉక్కుసంకల్పంతో మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు సూకీ. ఎన్నికల్లో అక్రమాల మాట ఎలాఉన్నా.. పోలింగ్ నాడు ప్రజలతో ముందుకొచ్చి ఓటు వేస్తే.. ఆమె విజయం తథ్యమని, 67శాతం ఓట్లతో ఆమె నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్డీ విజయం సాధించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. -
భారత్ నా రెండవ పుట్టినిల్లు: ఆంగ్‌సాన్ సూకీ
నేపితా: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకర్త, ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆంగ్‌సాన్ సూకీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇక్కడ తొలిసారి సమావేశమయ్యారు. భారత్-ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొనే సందర్భంగా మోదీ ఆమెతో సమావేశమయ్యారు. భారత్ తనకు రెండో పుట్టిల్లు అంటూ ఈ భేటీలో మోదీకి సూకీ చెప్పినట్లు భారత విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ 'ట్వీట్' చేశారు. భారత్‌లో మయన్మార్ రాయబారిగా పనిచేసిన తన తల్లి దాఖిన్ యీ తో కలసి సూకీ తన చిన్నతనంలో భారత్‌లో నివసించడం తెలిసిందే. ఆమె ఢిల్లీ, సిమ్లాలలో చదువుకున్నారు. ** -
ప్రజాస్వామ్య తీరం చేరేదెన్నడు?
2008 సైనిక రాజ్యాంగాన్ని సవరించడానికి మయన్మార్ సైనిక జుంటా నిరాకరించింది. దీంతో సూచీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పినట్టయింది. అక్కడి ‘క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్యాని’కి మురుస్తున్న ప్రపంచ నేతలకు ఇప్పుడు ఆమె పట్టదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత్రి ఆంగ్‌సాన్ సూచీ బహుశా తన రాజకీయ జీవితంలోకెల్లా అతి పెద్ద సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టున్నారు. సైనిక పాలన నుంచి విముక్తిని, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించి దాదాపు పదిహేనేళ్ల గృహ నిర్బంధం పాలైన ఆమె 2010లో విడుదలయ్యారు. సూచీ ఆశిస్తున్నట్టుగా వచ్చే ఏడాది దేశాధ్యక్ష పదవి ఆమెను వరిస్తుందా? లేక తిరిగి నిర్బంధం చవి చూడాల్సి వస్తుందా? 2015 చివర్లో జరిగే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే సూచ నప్రాయంగానైనా తేలవచ్చు. ఇప్పటికైతే అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఆమె అనర్హులని రాజ్యాంగ సవరణల పార్లమెంటరీ కమిటీ తేల్చేసింది. 1962 నుంచి కొనసాగుతున్న సైనిక నేతల పాలన పదిలంగా ఉండేలా 2008 ‘ప్రజాస్వామ్య’ రాజ్యాంగం తయారైంది. ప్రత్యేకించి సూచీ పీడ విరగడ చేసుకోవడం కోసమే విదేశీయులను వివాహమాడిన పౌరులను అధ్యక్ష పదవికి అనర్హులను చేస్తూ 59 (ఎఫ్) అధికరణాన్ని చేర్చారు. బ్రిటిష్ జాతీయుని పెళ్లాడిన సూచీ శాశ్వతంగా అధ్యక్ష పదవికి అనర్హురాలు. సూచీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ లీగ్ (ఎన్ఎల్డీ) అందించిన 168 సవరణల జాబితాను పార్లమెంటరీ కమిటీ 31-5 ఓట్ల తేడాతో గత వారం తిరస్కరించింది. అంతకు ముందే, గత ఏడాది నవంబర్‌లో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల కమిషన్ చైర్మన్ టిన్ ఆయె... ఎన్నికలు 2010లో జరిగినట్టే జరుగుతాయని ప్రకటించారు. అంతేకాదు, 2012లో జరిగిన ఉప ఎన్నికలను ఎన్ఎల్డీ ‘తిరుగుబాటు’లాగా నిర్వహించిందనీ, అది ‘88 తిరుగుబాటు’ను (1988లో నెత్తురోడిన విద్యార్థి, యువజన ప్రజాస్వామ్య ఉద్యమం) గుర్తుకు తెచ్చిందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి అభ్యర్థులు వారి వారి పార్లమెంటు నియోజకవర్గాలలోనే తప్ప ఇతర ప్రాంతాల్లో ప్రచారం సాగించరాదని కొత్త నిబంధనను విధించనున్నట్టు తెలిపారు. 2012 ఉప ఎన్నికల్లో సూచీ సహా ఎన్ఎల్డీ పార్లమెంటు ఉభయ సభల్లోని 44 స్థానాలకు పోటీచేసి 42 స్థానాలను గెలుచుకుంది. 2008 రాజ్యాంగం పార్లమెంటులో సైన్యం నియమించే ప్రతినిధులకు 25 శాతం స్థానాలను కేటాయించి, రాజ్యాంగ సవరణకు 75 శాతం సభ్యుల ఆమోదం తప్పనిసరి చేసింది. తద్వారా సైన్యానికి ఆచరణలో చట్టసభ నిర్ణయాలపై వీటో అధికారం లభించింది. అందుకే ఆ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ప్రమాణ స్వీకారం చేసేది లేదని అప్పట్లో సూచీ పట్టుబట్టారు. ‘మరింత ప్రజాసామ్యీకరణ’కు సైనిక దుస్తులు విడిచిన సైనిక దేశాధ్యక్షుడు థీన్ సీన్ శుష్క వాగ్దానంతో మెట్టు దిగారు. ఏడాదికిపైగా ఒకప్పటి ప్రత్యర్థులైన సైనిక నేతలను, వారి ప్రతినిధులను రాజ్యాంగ సంస్కరణలకు ఒప్పించడానికి ఆమె విఫల యత్నం చేశారు. సంస్కరణల పట్ల సానుభూతి కలిగినవారనుకున్న స్పీకర్ ష్వా మాన్ మొండి చెయ్యి చూపారు. థీన్ సీన్ చేసిన కీలక వాగ్దానం... సైనిక జనరల్స్‌తో సూచీ ‘శిఖరాగ్ర సమావేశం’ సైతం నీటి మూటే అయింది. కమాం డర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హయాంగ్ను కలవడం కోసం గత రెండేళ్లుగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. సైనిక జుంటాకుగానీ, దాని కీలుబొమ్మ అధికార యూఎస్డీపీకిగానీ ఆమెపై నమ్మకం కుదరడం లేదు. అదే అసలు సమస్య. ‘రాజ్యాంగ (2008) పరిరక్షణే సైన్యం ప్రధాన విధి’ అని జనరల్ హయాంగ్ ఇటీవలే మరో మారు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పటికైతే సూచీకి అధికారం అప్పగించడానికి సైనిక నేతలు విముఖంగా ఉన్నారు. అయితే ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. సైన్యాన్ని బుజ్జగించే ప్రయత్నాలు విఫలం కావడంతో సూచీ, ఎన్ఎల్డీలు వ్యూహాన్ని మార్చాయి. రాజ్యాంగ సవరణల కోసం ప్రచారం, ప్రదర్శనలు, సభలు సాగిస్తున్నారు. గత నవంబర్‌లో యాంగూన్ తదితర నగరాల్లో భారీ ప్రదర్శనలను నిర్వహించారు. మయన్మార్ ప్రజలు సైనిక పాలనే కొనసాగుతున్నదని భావిస్తే ఎవరికి కావాలి? సూచీ పార్లమెంటు ప్రవేశంతోనే మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్ధారకులైన ప్రపంచ నేతల పని ముగిసింది. అక్కడి సంస్కరణవాద ‘క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్యాని’కి మురిసి, ఆంక్షలను ఎత్తేసి, వాణిజ్య ఒప్పందాల కోసం పోటీలు పడుతున్నారు. ఇక సూచీ రాజ్యాంగ సంస్కరణల ఘోష ఎవరు వినాలి? మయన్మార్ ప్రజలు వింటున్నారు. 2015లోగా రాజ్యాంగ సవరణలు జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఆమె ఇటీవలి కాలంలో చేస్తున్న ఉద్రేకపూరిత ఉపన్యాసాలు వారికి పాత సూచీని గుర్తుకు తెస్తున్నాయి. సైన్యంతో పరిమితమైన సంఘర్షణాత్మక వైఖరి అనే సూచీ కొత్త ఎత్తుగడ పారుతుందా? బెడిసికొడుతుందా? - ఎస్. కమలాకర్