లండన్ : మయన్మార్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభ నేపథ్యంలో ఆక్స్‌ఫోర్డ్ కాలేజీ ఆ దేశ సలహాదారు, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూచీ పెయింటింగ్‌ను ప్రజల సందర్శన నుంచి తీసేసింది. ప్రధాన ద్వారం వద్దనున్న నోబెల్ గ్రహీత సూచీ పెయింటింగ్‌ను తొలగిస్తున్నట్టు సెయింట్ హు కాలేజీ గవర్నింగ్ బాడీ గురువారం నిర్ణయించింది. కొత్త విద్యార్థులు రాబోతున్న క్రమంలో ఆమె పెయింటింగ్‌ను ప్రధాన ద్వారం నుంచి కాలేజీ తీసేసింది. 1999 నుంచి కాలేజీ ప్రధాన ద్వారంలో ఆమె పెయింటింగ్ చాలా ప్రాచుర్యం సంపాదించుకుంది. ఆంగ్ సాన్ సూచీ ఆ కాలేజీ నుంచే అండర్ గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. 2012లో ఆంగ్ సాన్ సూచీ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 1964 నుంచి 1967 మధ్యలో రాజకీయ, తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రాలను ఆ కాలేజీలోనే అభ్యసించారు. తన 67వ జన్మదిన వేడుకలను కూడా సూచీ అక్కడే చేసుకున్నారు.
కానీ ఇటీవల రోహింగ్యా మైనార్టీల విషయంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు విమర్శనాత్మకంగా మారింది. మయన్మార్ మిలటరీ దళాల నుంచి రోహింగ్యాలు తీవ్ర దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ నెల మొదట్లో తమకు కొత్త పేయింటింగ్ గిఫ్ట్‌గా వచ్చిందని, ఈ క్రమంలో ఆంగ్ సాన్ సూచీ పెయింటింగ్‌ను స్టోరేజ్‌లోకి తరలిస్తున్నట్టు సెయింట్ హు కాలేజీ తెలిపింది. అయితే కాలేజీ ఈ కారణం చెబుతున్నప్పటికీ, సరియైన కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఆమె పెయింటింగ్‌ను తొలగించే నిర్ణయం తీసుకునే గవర్నింగ్ బాడీలో కళాశాల సభ్యులు, ప్రిన్సిపాల్ ఉన్నారు. 1991లో ఆంగ్‌సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమానం వచ్చింది.