కామెంట్
దేశ రాజకీయాలను అనుసరించేవాళ్లకు న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ అనగానే అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అని గుర్తొస్తుంది.అయితే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అక్కడ కార్యకలాపాలు నెరిపిన అనంతరం ఆ పార్టీ అక్కడినుంచి కొత్త చిరునామాకు మారడంతో ఇది వార్తల్లో నిలిచింది. కానీ దానికంటే ముందు ఆ చిరునామాను ‘బర్మా హౌజ్’ అనేవారని చాలామందికి తెలియదు. అప్పుడు అది భారత్‌లో బర్మా (మయన్మార్) రాయబారి ఇల్లుగా ఉండేది. ఆమె భర్త సాక్షాత్తూ బర్మా జాతిపిత; ఆమె కూతురు తర్వాత్తర్వాత ఆ దేశ గొప్ప నాయకురాలిగా ఎదిగిన ఆంగ్ సూన్ సూ కీ. అందుకే ఆ ఇంట్లో బర్మా వాతావరణం, వాళ్ల ఆత్మీయతలు వెల్లివిరిసేవి.
న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ చిరునామా గురించి మీకు తెలుసా? సుమారుగా యాభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉండేది. ఈ మధ్యే మారిపోయిందనుకోండి! అంతకంటే ముందు దీని పేరు ‘బర్మా హౌజ్’. బర్మా (తర్వాత మయన్మార్‌గా పేరు మారింది) దేశపు రాయబారి నివాస స్థానం అది. ‘24, అక్బర్ రోడ్’ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కాక మునుపు ఈ ఇంట్లో ‘డా ఖిన్ కీ’ ఉండే వారు. ఆమె బర్మా స్వాతంత్య్ర సమర యోధుడు ఆంగ్ సాన్ (బర్మా జాతిపితగా పిలుస్తారు) పత్ని. భర్త హత్యకు గురైన తరువాత ఆ దేశపు మంత్రిగానూ ఆమె పనిచేశారు. 1960లో ఇండియాకు బర్మా రాయబారిగా నియమితులయ్యారు. ఢిల్లీకి వచ్చి, ఏడేళ్ల పాటు ‘24, అక్బర్ రోడ్’లో నివసించారు.
డా ఖిన్ కీ నా తల్లిదండ్రులకు స్నేహితురాలైతే... ఆమె కూతురు ఆంగ్ సాన్ సూ కీ (మయన్మార్ ప్రతిపక్ష నేత; నోబెల్ శాంతి బహు మతి గ్రహీత) మా అక్క కిరణ్‌కు ఫ్రెండ్. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆంగ్ సాన్ సూ కీ, కిరణ్ కలిసి చదువుకున్నారు. 1964లో మా అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగ రీత్యా కాబూల్(అఫ్గానిస్తాన్ రాజధాని)కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, తన చివరి ఏడాది చదువు ఇంకా మిగిలి ఉండటంతో కిరణ్ ఆరు నెలల పాటు ‘24, అక్బర్ రోడ్’లో ఉండింది.
డా ఖిన్ కీ పెద్ద పొడగరి ఏమీ కాదు. పైగా కొంచెం లావుగా ఉండేది. బర్మీస్ మహిళల్లో అధికుల మాదిరి లుంగీ కట్టుకునేది. వెంట్రుకలన్నీ పూలతో అలంకరించిన బన్‌లో ఒద్దికగా ఇమిడి పోయేవి. ఆమె ముఖంలో ఒక రకమైన దయ వ్యక్తమయ్యేది. ఎల్ల ప్పుడూ చిరునవ్వుతో కళకళలాడే మోము. మృదుభాషి!
మొదటిసారి ఆమెను కలిసినప్పుడు నాకు ఆరేళ్లు ఉంటా యేమో! కొడుకు దగ్గర లేని కారణంగా ఆమె నన్ను తల్లిలా చూసుకునేది. డైనింగ్ రూమ్‌లో బోలెడంత ‘ఖో సూయి’ (చికెన్ నూడుల్స్) తినడం ఇప్పటికీ గుర్తుంది. అయితే నా ఫేవరెట్ మాత్రం ‘బ్లాక్ రైస్ పుడ్డింగ్’. బర్మీస్ ఇళ్లల్లో దీన్ని బాగా చేస్తారు. మిగతావాళ్ల మాటేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టమీ వంటకం. పిసరంత వదలకుండా తినే వాడినేమో... మిగిలిన వాళ్లు రుచి చూసేందుకు కూడా ఉండేది కాదనుకుంటా! అప్పట్లో చాలా బొద్దుగా ఉండేవాడిని. అందుకే సూ కీ నన్ను ‘రోలీ – పోలీ’ అని ఆటపట్టిస్తూండేది.
చాలామంది దౌత్యవేత్తల మాదిరిగానే బర్మా రాయబారికి మెర్సిడెస్ కారు ఉండేది. వాళ్ల డ్రైవర్ పేరు ‘విల్సన్ ’. వారాంతాల్లో కుతుబ్ మీనార్ దాటుకుని అవతల ఉండే బౌద్ధారామాలకు ఆమె వెళ్లేది. అక్కడి భిక్షువులకు ఆహారం అందించేది. చాలాసార్లు నేనూ ఆమెతో వెళ్లేవాడిని. ఎప్పుడు మళ్లీ ‘24, అక్బర్ రోడ్’కు వస్తామా అని ఎదురుచూసేవాడిని. ఎందుకంటే... తిరిగి వచ్చిన తరువాతే భోజ నాల వడ్డన జరిగేది.
ఆంగ్ సాన్ సూ కీ సుమారు ఏడేళ్లు భారత్‌లో ఉంది. ముందు జీసస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో, ఆ తరువాత లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదివింది. యుక్త వయసులో ఉండగానే రాజకీయాల్లో చేరాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకో గలనన్న నమ్మకం కూడా తనలో ఉండేది. సుమారు 18 ఏళ్ల వయసు ఉండేదేమో అప్పుడు. ఒకరోజు కిరణ్ పెన్సిల్ డ్రాయింగ్ గీసింది. దాని కింద, ‘కిరణ్ థాపర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్మా రావొచ్చు’అని రాసింది.
దశాబ్దాల తరువాత నేను ‘డా ఖిన్ కీ’ని లండన్ లో కలిశాను. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో కూతురు ఆంగ్ సాన్ సూ కీతో కలిసి నివసిస్తూండేది. అప్పుడామె వయస్సు ఎనభైల్లో ఉంది. నేను ముప్ఫైలలో ఉన్నాను. నన్ను చూడగానే... అనారోగ్యం, తన వయసు ఏదీ గుర్తు రాలేదు. బోసినవ్వుతో భళ్లున నవ్వుతూ, ‘వీడు సన్న బడ్డాడు’ అంది. కళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. నవ్వుతో ముఖమంతా నిండిపోయింది.
‘‘ఇంత సన్నబడతాడని అనుకోనే లేదు’’ అంది. ‘‘ఖో–సూయి అంటే ఇప్పటికీ బాగా ఇష్టమట. వచ్చి నప్పుడల్లా కావాలని అడుగుతూంటాడు’’ అని చెప్పింది ఆంగ్ సాన్ సూ కీ. ఆక్స్‌ఫర్డ్‌లో ఉండగా సూ కీ ఎప్పుడూ బ్లాక్ రైస్ పుడ్డింగ్ చేసేది కాదు. అందుకేనేమో... నాకు అది ఎలా ఉంటుందో లీలగా గుర్తుంది కానీ, రుచి ఎలా ఉంటుందన్నది మాత్రం గుర్తు లేకుండా పోయింది. కొబ్బరి తురుముతో కప్పిన నల్ల బియ్యంతో చేసే తీపి పదార్థం అది.
నేను మళ్లీ 2015లో రంగూన్ లో ఆంగ్ సాన్ సూ కీని కలిశాను. ‘24, అక్బర్ రోడ్’ నాటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని చూడగానే అర్థమైంది. ‘‘నా మరో ఇంటికి స్వాగతం. 24, అక్బర్ రోడ్ గురించి నీకు తెలుసు కదా... ఇది అమ్మ మరో ఇల్లు’’ అంది. ఢిల్లీ ఇంట్లో ఓ భారీ పియానో ఉండేది. సూ కీ పియానో వాయించేది కూడా!
గత వారం ‘24, అక్బర్ రోడ్’కు సంబంధించి పత్రికలు బోలెడన్ని వార్తలు రాశాయి. అప్పుడే నాకూ గుర్తుకొచ్చింది... ఆ ఇంటి గురించి నాకు ముందే తెలుసు అని! రాజకీయ పార్టీ కేంద్రం కాక మునుపు ఆ ఇంటి పొడవాటి నడవాలో ప్రేమ, ఆప్యాయతలు అల్లుకునిపోయి ఉండేవి. అది లూట్యెన్స్ ఢిల్లీలో భాగమని అస్సలు అనిపించేది కాదు. అది ‘డా ఖిన్ కీ’ ఇల్లు అన్నది మాత్రమే నాకు లెక్క. ఎప్పుడైనా వెళ్లగలిగే... ప్రేమ ఆప్యాయతలు అందుకోగల ఇల్లు!
డా ఖిన్ కీ, ఆంగ్ సాన్ సూ కీ భారత్‌లో గడిపిన రోజులు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోనూ సూ కీ తరచూ ఆ రోజులను గుర్తు చేసుకునేది. దీన్ని బట్టే వాళ్లు ‘24, అక్బర్ రోడ్’లో చాలా సంతోషంగా ఉండేవారు అనిపించేది. ఆ భవనం గోడలిప్పుడు మాట్లాడగలిగితే ఆ రోజుల ఊసులు ఇంకెన్ని చెప్పేవో... ప్చ్!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment