అంగ్‌ సాన్‌ సూకీ  ఇంటి కథ  | Aung San Suu Kyi mansion flops for third time | Sakshi
Sakshi News home page

అంగ్‌ సాన్‌ సూకీ  ఇంటి కథ 

Published Fri, Feb 7 2025 5:48 AM | Last Updated on Fri, Feb 7 2025 5:48 AM

Aung San Suu Kyi mansion flops for third time

ఎంతగా ప్రయత్నించినా వేలంపాటలో ఎవరూ ముందుకురాని వైనం 

యాంగూన్‌: తమ దేశంలో ప్రజాస్వామ్యం, పౌర ప్రభుత్వం సాధన కోసం పోరాడి ఏళ్లకు ఏళ్లు గృహనిర్బంధంలో గడిపిన మయన్మార్‌ నాయకురాలు అంగ్‌ సాన్‌ సూకీకి చెందిన నివాసం మూడోసారి వేలంలో వెళ్లింది. అయినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 

గత వేలంపాటతో పోలిస్తే ఆసారి కాస్తంత తక్కువగా రూ.1,231 కోట్లకు ఎవరైనా దీనిని కొనుగోలు చేయొచ్చని కామాయుత్‌ జిల్లా కోర్టు అధికారిణి వేలంపాటను మొదలెట్టినా ఎవ్వరూ ముందుకు రాలేదు. మూడేళ్లుగా సైనిక ప్రభుత్వం దిగ్భందంలో దేశం కల్లోలితంగా మారిన కారణంగా అనిశ్చితిలో ఇంతటి డబ్బు కుమ్మరించేందుకు ఎవరూ సాహసించట్లేరని మీడియాలో వార్తలొచ్చాయి.

ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం 
యాంగూన్‌ సిటీలోని బహాన్‌ టౌన్‌షిప్‌లో ఇన్యా సరస్సు ఒడ్డున చుట్టూ పచ్చికతో తెలుపు వర్ణంలో హుందాగా కనిపించే ఈ ‘54 యూనివర్సిటీ అవెన్యూ’భవనానికి ఘన చరిత్రే ఉంది. 1953లో ఆంగ్‌ సాంగ్‌ సూకీ తన సోదరులు, తల్లితో కలిసి ఈ విల్లాలోకి మకాం మార్చారు. అప్పట్నుంచీ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ఇంట్లో ఎవరూ లేరు. సైనిక పాలన అంతానికి పోరాటం ఇక్కడే మొదలెట్టారు. 

అహింసా ఉద్యమానికి ఇక్కడి నుంచే ఎన్నో వ్యూహరచనలు చేశారు. తదనంతర కాలంలో సైనిక ప్రభుత్వం సూకీని ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచింది. ఏకంగా 15 సంవత్సరాలకుపైగా ఆమె ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉండిపోయారు. తర్వాత సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి సాధారణ ఎన్నికలు నిర్వహించాక అంగ్‌ సాన్‌ ఘన విజయం సాధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. 

సూకీ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగినప్పుడూ ఈ ఇంట్లోనే ఉన్నారు. బరాక్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్‌సహా ఎందరో ప్రపంచ నేతలు అంగ్‌సాన్‌ను ఈ ఇంట్లోనే భేటీ అయ్యారు. నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించినప్పుడూ ఆమె ఈ ఇంట్లోనే ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిౖకైన అంగ్‌ ప్రభుత్వాన్ని జుంటా సైన్యం 2021 ఫిబ్రవరిలో కూలదోసింది. ఆంగ్‌ ప్రభుత్వ పాలనలో పలు రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఈమెపై ఎన్నో రకాల కేసులు నమోదుచేసి ఏకంగా 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం తెల్సిందే.

కోర్టులో వారసత్వ పోరు
రెండెకరాల స్థలంలో నిర్మించిన ఈ విల్లాపై వారసత్వంగా తనకూ హక్కు ఉంటుందని అంగ్‌సాన్‌ సూకీ అన్నయ్య అంగ్‌ సాన్‌ హో 2000 సంవత్సరంలో కోర్టుకెక్కారు. తన వాటా దక్కేలా చేయాలని యాంగూన్‌ హైకోర్టులో దావా వేశారు. అయితే ఈ దావా వెనుక జుంటా సైనికపాలకుల కుట్ర దాగుందని మీడియాలో వార్తలొచ్చాయి.

 హో ద్వారా సగం వాటా కొనేసి తర్వాత పూర్తి హక్కును దక్కించుకుని చిట్టచివరకు సూకీ జ్ఞాపకాలు జనం మదిలో లేకుండా దీనిని కూల్చేయాలని సైన్యం కుట్ర పన్నిందని అమెరికా మీడియాలో అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఈ భవనాన్ని జాతీయ స్మారకంగా మార్చాలని విపక్ష ‘నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌ ఆఫ్‌ మయన్మార్‌’ డిమాండ్‌ చేసింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. చట్టప్రకారం అన్నా చెల్లెళ్లకు సమాన వాటా ఉంటుందని ఇంటిని వేలంవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో గత ఏడాది మార్చి 20న తొలిసారి, ఆగస్ట్‌ 15న రెండోసారి వేలంవేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement