![Beer industry brought in Rs 92,324 cr to GDP in 2023](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/GDP-BEER.jpg.webp?itok=mBKeaxpE)
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో బీర్ పరిశ్రమ వాటా 2023లో 0.3 శాతానికి చేరుకుంది. రూ.92,324 కోట్లు సమకూరినట్టు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన అధ్యయనాన్ని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా బీర్ పరిశ్రమ పరిమాణం 2023లో రూ.76.45 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆక్స్‌ఫర్డ్ నివేదిక పేర్కొంది.
దేశ జీడీపీకి బీర్ పరిశ్రమ నుంచి నేరుగా రూ.40,050 కోట్లు వస్తుండగా, అనుబంధ వ్యాల్యూ చైన్ (లాజిస్టిక్స్, రెస్టారెంట్‌లు, రిటైలర్లు) ద్వారా మరో రూ.52,239 కోట్లు సమకూరుతోంది. ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపంలో రూ.51,376 కోట్ల ఆదాయం 2023లో ప్రభుత్వ ఖజానాలకు చేరినట్టు పేర్కొంది. మొత్తం పన్నుల ఆదాయంలో 1.8 శాతానికి సమామని తెలిపింది. బీర్ పరిశ్రమ, వ్యాల్యూ చైన్ సంయుక్తంగా 13 లక్షల మందికి ఉపాధి కలి్పస్తున్నట్టు.. ఇందులో బీర్ పరిశ్రమ ఒక్కటే 5.4 లక్షల మందికి ఉపాధినిస్తున్నట్టు వివరించింది.
‘‘బీర్ అన్నది పూర్తిగా స్థానిక తయారీ ఉత్పత్తి. అధిక పరిమాణంతో కూడినది. స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఇది ఎన్నో అంచల ప్రభావం చూపిస్తుంటుంది. స్థానిక రైతుల నుంచి బార్లీ కొనుగోలు చేస్తుంది. స్థానిక సరఫరాదారుల నుంచి ప్యాకేజింగ్ మెటీరియల్ సమకూర్చుకుంటుంది. హ్యాండ్లింగ్‌లో ఎక్కువ మంది పాలు పంచుకుంటారు. పెద్ద స్థాయి గోదాములు, ఉత్పత్తుల రవాణాకు పెద్ద ఎత్తున రవాణా సదుపాయాలను వినియోగించుకుంటుంది’’ అని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment