న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2021 వృద్ధి విషయంలో తొలి అంచనాలకు కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ వరుసలో ప్రపంచ దిగ్గజ ఆర్థిక విశ్లేషణ సంస్థ-ఆక్స్‌ఫర్డ్ ఎకానమీస్ చేరింది. 2021లో భారత్ స్థూల దేశీయోత్పత్తి 10.2 శాతానికి పరిమితం అవుతుందని తన తాజా నివేదికలో పేర్కొంది. క్రితం అంచనాలు 11.8 శాతాన్ని ఈ మేరకు దిగువముఖంగా సవరిస్తున్నట్లు తెలిపింది.
కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో దేశంలో పెరిగిన వైద్య సంబంధ సవాళ్లు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరగకపోవడం, మహమ్మారి కరోనా నియంత్రణలో ప్రభుత్వ వ్యూహంలో లోపాలు తమ తాజా అంచనాల సవరణకు కారణమని వివరించింది. ఆక్స్‌ఫర్డ్ ఎకానమీస్ పేర్కొన్న మరిన్ని విశేషాలు చూస్తే... భారత్ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్‌లేని పరిస్థితి నెలకొంది. స్వల్ప కాలంలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి పది రోజులకూ మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది.
మరి కొన్ని సంస్థల అంచనాలు...
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 2021లో భారత్ వృద్ధిని 12.5 శాతం వరకూ అంచనావేస్తోంది. ఏప్రిల్ నుంచీ ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా 10.5 శాతంగా ఉంది. 2020–21 ఎకనమిక్ సర్వే 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 11 శాతంగా పేర్కొంది. సెకండ్‌వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆయా అంచనాల వృద్ధి సవరణ కూడా చోటుచేసుకునే వీలుంది.
10 శాతంలోపే వృద్ధి!
కోవిడ్ 19 తాజా కేసుల పెరుగుదల, ఫలితంగా స్థానిక లాక్డౌన్ల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 10 శాతం దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వ చర్యలు, ప్రజల ప్రతిస్పందనల ఆధారంగా వ్యవస్థలో డిమాండ్, సరఫరాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది. 2020 దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పోలి్చతే రాష్ట్రాల తాజా ఆంక్షల వల్ల వ్యవసాయం, మైనింగ్, తయారీ, యుటిలిటీ, నిర్మాణ రంగాలపై కొంత తక్కువ ప్రభావమే ఉండే వీలుంది.
- ఎస్‌సీ గార్గ్, మాజీ ఫైనాన్స్ కార్యదర్శి
నెల లాక్‌డౌన్‌తో జీడీపీకి 2 శాతం నష్టం
స్థానిక లాక్డౌన్ల వల్ల మహమ్మారి కరోనా కట్టడి అనుకున్నంత స్థాయిలో జరక్కపోవచ్చు. సెకండ్‌వేవ్ కట్టడికి భారత్ నెలపాటు లాక్‌డౌన్ విధిస్తే, ఎకానమీకి 100 నుంచి 200 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఎకానమీకి భారీ నష్టం వాటిల్లే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కఠిన లాక్‌డౌన్లు విధించకపోవచ్చు. కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం మే, జూన్ నెలల్లో ఉచిత ఆహార ధాన్యాల సరఫరా వంటి సహాయక చర్యలను ముమ్మరం చేసే వీలుంది.
- ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆస్థా గడ్వానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్-భారత్ ఆర్థికవేత్తలు
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment