ఎకానమీ స్పీడ్‌ 6.4 శాతమే.. | India Economy to Grow at 6. 4 Percent in 2024-25: Slowest in 4 Years | Sakshi
Sakshi News home page

ఎకానమీ స్పీడ్‌ 6.4 శాతమే..

Published Wed, Jan 8 2025 12:36 AM | Last Updated on Wed, Jan 8 2025 8:00 AM

India Economy to Grow at 6. 4 Percent in 2024-25: Slowest in 4 Years

2024–25 ఆర్థిక సంవత్సరంపై ప్రభుత్వ గణాంకాల అంచనా

ఇదే జరిగితే ఈ రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి

తయారీ, సేవల పేలవ పనితీరు ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ)  ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది. ముఖ్యంగా తయారీ, సేవల రంగాల పనితీరు బలహీనంగా ఉండడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2020–21లో కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే.

అటు తర్వాత 6.4 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది.  బేస్‌ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది.  2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి. 2024–25పై జాతీయ గణాంకాల కా ర్యాలయం తాజా అంచనాలు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డిసెంబర్‌ 2024లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వశాఖ తొలి అంచనా 7 శాతంకన్నా కూడా ఈ అంచానలు తక్కువగా ఉండడం గమనార్హం. 

ఆర్‌బీఐ పాలసీ అంచనాలు ఇవీ.. 
ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్‌బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష  క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని, 2025–26 మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్‌–సెపె్టంబర్‌) వరుసగా 6.9 శాతం, 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్‌లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయి లో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.

కీలక రంగాలపై అంచనాలు..
తయారీ రంగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.3 శాతంగా అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ విభాగం 9.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది.  
సేవల రంగం: ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం వృద్ధి అంచనా 5.8 శాతం. 2023–24లో ఈ రేటు 6.4 శాతం. 
వ్యవసాయం: కొంత మెరుగైన ఫలితం వెలువడనుంది. 3.8 శాతం వృద్ధి నమోదవుతుందని గణాంకాలు అంచనా వేస్తున్నాయి.  2023–24లో 1.4 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి కావడం గమనార్హం.  

ఎకానమీ లెక్కలు ఇలా... 
2024–25లో ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్‌ డాలర్లు (డాలర్‌ మారకంలో రూపాయి విలువ రూ.85.71 ప్రాతిపదికన) 
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం 2024–25లో జీడీపీ విలువ అంచనా రూ. 324.11 లక్షల కోట్లు, 2023–24లో ఈ విలువ రూ. 295.36 లక్షల కోట్లు. అంటే వృద్ధి 9.7 శాతం.  
  ప్రైవేట్‌ తుది  వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.3 శాతం. గత సంవత్సరంలో ఈ రేటు 4 శాతం. 

ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ): 2024–25లో 4.1 శాతం వృద్ధి,  2023–24లో ఈ రేటు 2.5 శాతం. 
తలసరి ఆదాయం: ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా 2024–25లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం   8.7 శాతం పెరిగి రూ. 2,00,162కు చేరుకునే అవకాశం ఉంది. 2023–24లో ఈ విలువ రూ. 1,84,205.  

ముందస్తు గణాంకాల ప్రాధాన్యత!
ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా తాజా ముందస్తు అంచనాలు ఉపయోగపడతాయి.  

తగిన అంచనాలు... 
2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు సమంజసంగానే ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు అధిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకానమీపై కూడా అంతర్జాతీయ అనిశ్చితిలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అంశాలు పరిగనణలోకి తీసుకుంటూ 2025–25లో జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా మేము అంచనా వేస్తున్నాం.  – అదితి నాయర్, ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌

మూలధన వ్యయ తగ్గుదల ప్రభావం 
కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ పురోగతిలో ప్రభుత్వ మూలధన వ్యయాలు కీలకంగా మారాయి. వీటి తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఇక పట్టణ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం అలాగే రుణ వృద్ధి మందగమనం సవాళ్లను ఎదుర్కొంటోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. పట్టణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే రిటైల్‌ క్రెడిట్‌ వృద్ధి మందగించింది.     – ధర్మకీర్తి జోషి, క్రిసిల్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌

వృద్ధి 6.2 శాతానికి పరిమితం: హెచ్‌ఎస్‌బీసీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతమేనని విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ– హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది. అధికారిక అంచనాతో పోలిస్తే ఇది మరింత  తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పెరుగుతుందని నివేదిక విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై –సెప్టెంబర్‌) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదుకావడం నిరాశాజనకంగా ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది.  

క్యూ2 తర్వాత పరిస్థితులు మెరుగు... 
‘‘మేము విశ్లేíÙంచే 100 సూచికల ప్రకారం సెప్టెంబర్‌ తరువాత వృద్ధి సూచికలు మెరుగుపడ్డాయి.  అయితే జూన్‌ త్రైమాసికంతో ఇంకా బలహీనంగానే ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది.  జూలై–సెపె్టంబర్‌ కాలంలో 55 శాతం సూచికలు సానుకూలంగా వృద్ధి చెందగా, డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది 65 శాతానికి పెరిగిందని తెలిపింది.  వ్యవసాయం, ఎగుమతులు, నిర్మాణ రంగాల్లో మెరుగుదల అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇటీవల వారంలో చాలా చర్చనీయాంశంగా మారిన పట్టణ వినియోగంలో కూడా డిసెంబర్‌ త్రైమాసికంలో కొంత మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.

అయితే, వినియోగ విద్యుత్‌ సేవలు, ప్రైవేటు పెట్టుబడుల సూచికలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది.  జూన్‌ త్రైమాసికంలో 75 శాతం సూచికలు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదని నివేదిక వెల్లడించింది. 2024–25లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుందని, 2025–26లో ఇది 4.4 శాతానికి నివేదిక పేర్కొంది.  నవంబరులో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.3 శాతానికి, జనవరిలో 5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.  

అరశాతం రెపో రేటు కోత అంచనా... 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య పరపతి విధానం  ఫిబ్రవరి,  ఏప్రిల్‌ విధాన సమీక్షలలో 0.25 శాతం చొప్పున రెండు రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వృద్ధే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ ప్రస్తుత 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొన్న నివేదిక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండడమే దీనికి కారణంగా వివరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement